
దివి సీమ వాగ్గేయకారులు – వివరణ
Vaggeyakaras of Diviseema – An Overview
Volume – 1, October 2026, issue – 7,
సమర్పణ (D.O.S): 12-09 – 2026 ఎంపిక (D.O.A): 23– 09 – 2026 ప్రచురణ (D.O.P) : 01-10-2026
కొల్లూరు అనుపమ ,
తెలుగు ఉపాధ్యాయురాలు,
హైదరాబాద్ .
వ్యాస సంగ్రహం:
కృష్ణా డెల్టా ప్రాంతంలో విశిష్టమైన భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన ప్రాంతం దివిసీమ. ఈ ప్రాంతం సాహిత్యం, సంగీతం, నాట్యం, భక్తి సంప్రదాయాల అభివృద్ధికి విశేషంగా దోహదపడింది. సాహిత్యాన్ని సంగీతంతో సమన్వయపరచి, గేయరూపంలో ప్రజలకు అందించిన సాహిత్య–సంగీత స్రష్టలను వాగ్గేయకారులుగా వ్యవహరిస్తారు. దివిసీమతో సంబంధం కలిగిన వాగ్గేయకారులలో సిద్ధేంద్రయోగి, లీలాశుకుడు, శ్రీ నారాయణ తీర్థులు, క్షేత్రయ్య, పువ్వాడ శ్రీరామదాసు ప్రముఖులు.
ఈ వ్యాసంలో దివిసీమ ప్రాంతంతో సంబంధం ఉన్న ఈ వాగ్గేయకారుల జీవితం, సాహిత్య–సంగీత కృషి, భక్తి భావన, రచనా విశిష్టతలను పరిశీలించడం జరిగింది. సిద్ధేంద్రయోగి రచించిన భామాకలాపం ద్వారా మధురభక్తి, అద్వైత భావనలను నాట్యరూపంలో ప్రతిపాదించిన తీరును, లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతంలో వ్యక్తమైన కృష్ణభక్తి, మాధుర్యభావనలను పరిశీలించబడింది. శ్రీ నారాయణ తీర్థుల శ్రీకృష్ణలీలా తరంగిణి కూచిపూడి నృత్యంలోని తరంగం సంప్రదాయానికి అందించిన సాహిత్య–సంగీత ఆధారాన్ని విశ్లేషించడం జరిగింది. క్షేత్రయ్య పదాలలోని శృంగారభావన, మాధుర్యభక్తి, నాయికా–నాయక భావనలను, పువ్వాడ శ్రీరామదాసు కీర్తనల్లోని భక్తి, శరణాగతి, పదసౌష్టవాన్ని పరిశీలించడం జరిగింది.
Abstract :
Diviseema is a region in the Krishna Delta with a distinctive geographical, historical, and cultural background. The region has made a significant contribution to the development of literature, music, dance, and devotional traditions. Literary and musical creators who composed literature and integrated it with music, presenting it in a lyrical form, are known as Vaggeyakaras. Among the prominent Vaggeyakaras associated with Diviseema are Siddhendra Yogi, Lilashuka, Sri Narayana Teertha, Kshetrayya, and Puvvada Sri Ramadasu.
This paper examines the lives, literary and musical contributions, devotional perspectives, and distinctive features of the works of these Vaggeyakaras associated with the Diviseema region. It examines the manner in which Siddhendra Yogi presented Madhura Bhakti and Advaita philosophy through his dance-drama Bhamakalapam, as well as the Krishna devotion and Madhura Bhava expressed in Lilashuka’s Sri Krishna Karnamritam. The paper also analyses the literary and musical foundation provided by Sri Narayana Teertha’s Sri Krishna Leela Tarangini to the Tarangam tradition of Kuchipudi dance. Furthermore, it examines the elements of Sringara Bhava, Madhura Bhakti, and Nayaka–Nayika Bhava found in the Padams of Kshetrayya, along with the devotion, surrender, and literary excellence expressed in the Kirtanas of Puvvada Sri Ramadasu.
కీలకపదాలు :
దివిసీమ, వాగ్గేయకారులు, సిద్ధేంద్రయోగి, భామాకలాపం, లీలాశుకుడు, శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థులు, శ్రీకృష్ణలీలా తరంగిణి, క్షేత్రయ్య, పదసాహిత్యం, పువ్వాడ శ్రీరామదాసు, భక్తి, మాధుర్యభక్తి, కూచిపూడి, సంగీతం, నృత్యం.
Keywords:
Diviseema, Vaggeyakaras, Siddhendra Yogi, Bhamakalapam, Lilashuka, Sri Krishna Karnamritam, Narayana Teertha, Sri Krishna Leela Tarangini, Kshetrayya, Padam Literature, Puvvada Sri Ramadasu, Bhakti, Madhura Bhakti, Kuchipudi, Music, Dance.
పరిచయం:
దివిసీమ కృష్ణా డెల్టాలోని ప్రాంతం. అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, మొవ్వ మండలాలు దివిసీమ పరిధిలోకి వస్తాయి. భౌగోళికంగా ఆలోచించినప్పుడు ది. ఎసీమ హద్దులు, వైశాల్యం, నదులు, మండలాలు, గ్రామాలు, పంటలు, విద్య మున్నగు అంశాలు చర్చకు వస్తాయి.
హద్దులు: కృష్ణానదికి ప్రధానమైన రెండు పాయలకు, అటు బంగాళాఖాతానికి మధ్యనున్న భూమిని నేడు ‘దివిసీమ’గా వ్యవహరిస్తారు.
కానీ దివిసీమ అంటే పూర్వపు దివిసీమను అనగా పూర్వపు దివి తాలూకాను ప్రధానంగా తీసుకోవాలి. అపుడు అటు గన్నవరం తాలూకా, ఇటు బందరు తాలూకాల మధ్య కలిగిన భూభాగమంతా దివిసీమే.
కృష్ణానదికి ఒకప్పుడు నేటి విజయవాడనుండి మచిలీపట్నం వెళ్లే రహదారి హద్దు. కానీ నేడు కృష్ణానది ‘తోట్ల వల్లూరు’ దగ్గరనుండి పూర్తిగా దక్షిణానికి మరలింది. ఇప్పటి నదీ ప్రవాహం నుండి, పామర్రు మీదుగా ప్రవహిస్తున్న బందరు కాలువ (నాగులేరు) ఈ రెంటి మధ్యనున్న భూభాగమంతా దివిసీమే. మచిలీపట్నానికి పడమర నైఋతి దిశలో వ్యాపించియున్న బందరు తాలూకా భూభాగం సరిహద్దు పడమర కృష్ణానది. ఉత్తరాన గుడివాడ తాలూకా, తూర్పు, దక్షిణాలలో బంగాళాఖాతం హద్దులు.
కృష్ణానది శ్రీకాకుళం గ్రామం వద్ద దివితాలూకాలో ప్రవేశించి తాలూకాకు పడమటి అంచున దక్షిణాభి ముఖంగా గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి, రేపల్లె తాలూకాలకు దివితాలూకాకు సరిహద్దుగా ప్రవహిస్తుంది. ఒకప్పుడు తెనాలి, రేపల్లె కూడా కృష్ణా మండలంలో అంతర్భాగంగా ఉండేవి. పూర్వపు చరిత్ర తీసుకున్నప్పుడు వాటిని కూడా దివితాలూకా కృష్ణా మండలంగానే పరిగణించేవారు.
విషయ వివరణ :
భారతీయ సంగీత సంప్రదాయంలో సాహిత్యానికి, సంగీతానికి అవినాభావ సంబంధం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయంలో కవిత్వాన్ని సంగీతంతో సమన్వయపరిచి ప్రజలకు అందించిన మహనీయుల పాత్ర విశిష్టమైనది. పాటకు సంబంధించిన సాహిత్యాన్ని స్వయంగా రచించడమే కాకుండా, దానికి తగిన రాగభావం, స్వరరచనలను సమకూర్చిన సాహిత్య–సంగీత స్రష్టలను “వాగ్గేయకారులు” అని వ్యవహరిస్తారు. దివి సీమలో వాగ్గేయకారులుగా పేరుపొందిన వారు సిద్ధేంద్ర యోగి, లీలాశుకుడు, క్షేత్రయ్య, శ్రీ నారాయణ తీర్థులు , పువ్వాడ శ్రీ రామదాసు
సిద్దేంద్ర యోగి :
కూచిపూడి నాట్య సంప్రదాయానికి మూలపురుషుడు సిద్ధేంద్రయోగి. వేదపండితుడు, వేద వేదాంత చర్చలలో పరిజ్ఞానం కలిగినవాడు. “సిద్ధేంద్రుడు క్రీ॥శ 1089వ సంవత్సరంలో మకర సంక్రాంతి రోజున కూచిపూడి గ్రామంలో జన్మించాడు.” (కూచిపూడి నాట్య కౌముది , పసుమర్తి శ్రీనివాసశర్మ , పుట 156 )”. సూర్యభాస్కర నారాయణ, పార్వతి వీరి తల్లిదండ్రులు. ‘సిద్ధరామయ్య’ అనే పేరు తల్లిదండ్రులు పెట్టినది. సువాణం వంశోద్భవులు, వార్ధూలస గోత్రికులు.
ఐదు సంవత్సరాల వయస్సుకే చెవిపోగులు కుట్టించి, ఉపనయన సంస్కారాలు పూర్తి చేసారు తల్లిదండ్రులు. తండ్రివద్ద వేద విద్యతోపాటు, నాట్యవిద్యను నేర్చుకున్నారు. తల్లివద్ద పురాణేతిహాసాలతోపాటు యోగవిద్యను అభ్యసించాడు. తల్లివద్ద నేర్చుకున్న పరమేశ్వరతత్త్వంద్వారా శివదర్శనం పొందాలని కోరిక కలిగింది. శ్రీశైలం వెళ్లి శివ దర్శనం కోసం ఎంతగా వెదికిన ఫలితం లేకపోవడం చూసి నిరాశచెంది కొండపై నుండి దూకగా శిరస్సును పైకి ఎత్తి చూసినప్పుడు శివదర్శనం అయ్యిందని ఒక కథ ప్రచారంలో ఉంది.
మరొక కథలో సిద్ధేంధ్రును సిద్ధయ్య, సిద్ధప్ప అని వ్యవహరింప బడ్గేను. ఈతడి వంశం గురించి, తల్లిదండ్రులు గురించి అంతగా ఆధారాలు లేవు. సిద్దేంద్రుని బాల్యానికే కూచిపూడి భాగవతులు భరతవిద్యలో ప్రావీణ్యం సంపాదించారు. వారితో కలిసి తిరుగు చదువు సంధ్యలు లేక ఆకతాయిగా తయారయ్యను, సిద్ధయ్యకి యుక్తవయస్సు రాగానే వివాహం జరిపించారు తల్లిదండ్రులు. సిద్ధయ్య భార్య చదువు, సంస్కారము గల గృహిణి. అటు మిత్రులు అవహేళన, ఇటు అర్ధాంగి బాధ చూసిన సిద్ధయ్య మానసిక సంఘర్షణకి లోనయ్యాడు. ఒక రోజు ఇంటిలోవారికి ఎవ్వరికి తెలియజేయకుండా ఇల్లు వదలి వెళ్లిపోయాడు. ఎందరో ప్రముఖులను, విద్వాంసులను ఆశ్రయించి కావ్యాలు, శాస్త్రాలు అభ్యసించెను. గురువులవద్ద విద్యనభ్యసించి సిద్ధయ్య కాస్త సిద్ధేంధ్రుడిగా మారాడు. కృష్ణానది పరివాహక ప్రాంతానికి రాగానే కృష్ణానది ఉదృతంగా ప్రవహిస్తుంది. భార్యను చూడాలని అనే కోరికతో సిద్ధేంద్రుడు కృష్ణనది వేగానికి అడ్డుపడి ఈదడం ఆరంభించాడు. కొంత సమయం ఈదిన తరవాత సిద్దేంధ్రుడి శక్తి క్షీణించి కృష్ణ ప్రవాహానికి తట్టుకోనలేకపోయాడు. మరణం తప్పదని భయపడిన సిద్ధేంద్రుడు అప్పుడు సన్యాసం స్వీకరించాడు. వయస్సు రాకుండానే వానప్రస్థాశ్రమం స్వీకరించి సిద్ధేంధ్రుడు సిద్ధేంద్రయోగి అయ్యాడు. కృష్ణనది ఉదృతం తగ్గింది. సిద్దేంద్రయోగి కూచిపూడి గ్రామానికి చేరాడు.
ఇంటికి వచ్చిన సిద్ధేంద్రయోగి మార్గ మధ్యలో జరిగిన కథ అంతా తల్లిదండ్రులు, భార్యకు వివరించారు. యవ్వనంలో ఉండటం వలన సిద్దేంద్రమోగి ఇటు యోగశక్తి, అటు లౌకికశక్తి అనే సంఘర్షణ మొదలైంది. చివరికి యోగశక్తి జయించింది. తనకి మనోనిగ్రహం ప్రసాదించమని ఇష్టదైవమైన శ్రీకృష్ణ భగవానుని త్రికరణశుద్ధిగా ప్రార్ధించాడు.
ఈ ఆలోచనలనుండి పుట్టినదే భామాకలాపం. సిద్దేంద్రయోగి అపూర్వ సృష్టి భామాకలాపం. ఇది ఒక శృంగారకావ్యం.”స్వయం తీర్ణః పరం స్తారయతి “ అనునట్లు భామా కలాపము అను యోగావిద్యను రచించారు సిద్ధేంద్రయోగి “(తెలుగులో కూచిపూడి నాటక వికాసము , పుట – 62 ). దీనిలో మధుర భక్తిని ప్రతిపాదించాడు. అధ్వైతమును అందించాడు. జీవాత్మ పరమాత్మను పొందుటకు పడే ఆరాటమే సత్యభామ శ్రీకృష్ణుని పొందే విరహంగా చూపించాడు. ఈ విధంగా సిద్ధేంధ్రుడు తన విరహాన్ని లౌకిక దృష్టి నుండి అలౌకిక దృష్టికి మళ్లించుకున్నాడు. కూచిపూడి నాట్యానికే భామాకలాపం తలమానికం.
లీలాశుకుడు :
లీలాశుకుడు సంస్కృత భక్తి కవిత్వంలో శ్రీకృష్ణుని మాధుర్యాన్ని అత్యంత భావగర్భితంగా వర్ణించిన కవి. ఆయనకు ఆపాదించబడిన ప్రసిద్ధ గ్రంథం “శ్రీకృష్ణ కర్ణామృతం” కృష్ణుని బాల్యలీలలు, రూపమాధుర్యం, గోపికలతో ఆయన సంబంధం, భక్తుని–భగవంతుని అనుబంధం ఈ కావ్యంలో ప్రధానంగా కనిపిస్తాయి.
కర్ణామృతం అనే పదానికి సాధారణంగా “చెవులకు అమృతం” అనే భావం వస్తుంది. కృష్ణుని లీలలను వినడం, స్మరించడం ద్వారా భక్తునికి కలిగే ఆనందాన్ని కవి ఈ పేరుతో సూచించినట్లు భావిస్తారు.
లీలాశుకుడిని బిల్వమంగళుడు, విల్వమంగళుడు అనే పేర్లతో కూడా వ్యవహరిస్తారు. “లీలాశుక” అనే పేరు కృష్ణలీలలను అత్యంత మాధుర్యంతో వర్ణించిన కవిగా ఆయనకు ఏర్పడినదని సంప్రదాయంలో చెప్పబడుతుంది. లీలాశుకుడి కాలం విషయంలో స్పష్టత లేదు. కొన్ని సంప్రదాయాలు ఆయనను 9వ శతాబ్దానికి చెందినవాడిగా భావిస్తే, మరికొన్ని ఆధారాలు 12–14వ శతాబ్దాల మధ్య కాలాన్ని సూచిస్తాయి. అందువల్ల పరిశోధనా రచనలో ఒక నిర్దిష్ట సంవత్సరాన్ని ఖచ్చితమైనదిగా పేర్కొనకుండా “కాలనిర్ణయం వివాదాస్పదంగా ఉంది” అని పేర్కొనడం శాస్త్రీయంగా సముచితం. కానీ “చాగంటి శేషయ్య గారు ఆంద్ర కవి తరంగిణి లో లీలాశుకుడు 13వ శతాబ్దిలో ఉన్నాడని వ్రాశారు. “(రజనీకాంతరావు బాలాంత్రపు – ఆంద్ర వాగ్గేయకార చరిత్రము ,పుట – 81 )
ఇక్కడ కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని సంప్రదాయాలు కేరళ ప్రాంతాన్ని ఆయన జన్మస్థలంగా పేర్కొంటాయి. మరోవైపు కొన్ని తెలుగు సాహిత్య పరిశోధనా సంప్రదాయాలు ఆయనను ఆంధ్రదేశానికి, ముఖ్యంగా కృష్ణాతీరంలోని శ్రీకాకుళం ప్రాంతానికి సంబంధించిన కవిగా పేర్కొంటాయి. .
శ్రీకృష్ణ కర్ణామృతం లీలాశుకుడి సాహిత్య ప్రతిభకు ప్రధాన ఆధారం “శ్రీకృష్ణ కర్ణామృతం”.
ఇందులో బాలకృష్ణుని సౌందర్యం, కృష్ణుని బాల్యలీలలు, యశోద–కృష్ణ సంబంధం, గోపికల భక్తి, రాధా–కృష్ణ మాధుర్యం, కృష్ణుని రూపవర్ణన, భక్తుని పరమాత్మతో అనుబంధం, మాధుర్యభక్తి ప్రధానంగా వ్యక్తమవుతాయి. ఇది సంస్కృత భక్తి కవిత్వంలో ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది.
లీలాశుకుడి కృష్ణకర్ణామృతం తరువాతి వైష్ణవ భక్తి సంప్రదాయంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా శ్రీచైతన్య మహాప్రభువు ఈ గ్రంథాన్ని దక్షిణ భారతదేశంలో పొందారని, దాని పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపారని వైష్ణవ సంప్రదాయ వృత్తాంతాలు పేర్కొంటాయి.
శ్రీ నారాయణ తీర్థులు :
శ్రీ నారాయణ తీర్థులు (సుమారు 1675–1745) సంస్కృత కవి, వాగ్గేయకారుడు, సంగీతజ్ఞుడు, అద్వైత సన్యాసి మరియు భక్తి సంప్రదాయంలోని ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడుతున్నారు. “1675 ప్రాంతంలో గుంటూరు కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో తల్లా వజ్ఘల నీలకంఠ శాస్త్రిగారి కుమారుడుగా జన్మించిన గోవింద శాస్త్రియే తరువాత నారాయణ తీర్దులాయినారు. వారు సిద్ధి పొందిన స్థలం తమిళ దేశంలోని తిరుప్పుదుంర్తియే “( ఆంద్ర వాగ్గేయకార చరిత్రము – బాలాంత్రపు రజనీకాంతరావు , పుట-259)
ఆయనకు అత్యంత ప్రసిద్ధిని తెచ్చిన రచన “శ్రీకృష్ణలీలా తరంగిణి”. కృష్ణుని జననం నుంచి రుక్మిణీ కల్యాణం వరకు కథను ఆధారంగా చేసుకుని సంస్కృతంలో రచించిన ఈ కావ్యం 12 తరంగాలతో రూపొందింది.
కూచిపూడి నృత్యంలో ప్రసిద్ధి చెందిన “తరంగం” సంప్రదాయానికి శ్రీకృష్ణలీలా తరంగిణి ప్రధాన సాహిత్య ఆధారాలలో ఒకటి. కూచిపూడిలో నర్తకి/నర్తకుడు ఇత్తడి పళ్లెంపై నిలబడి లయబద్ధంగా నృత్యం చేయడం తరంగం ప్రదర్శనలో ప్రత్యేకతగా అభివృద్ధి చెందింది.
శ్రీకృష్ణలీలా తరంగిణి ఈ రచనలో కృష్ణుని జీవితంలోని వివిధ ఘట్టాలను నారాయణ తీర్థులు సంగీతం, సాహిత్యం, భక్తి సమన్వయంతో చిత్రించారు.
ప్రధానంగా శ్రీకృష్ణ ప్రాదుర్భావం, బాలకృష్ణుని లీలలు , గోవత్సపాలన , కృష్ణ గోపాల వర్ణన, గోవర్ధనోద్ధరణ, గోపికలతో కృష్ణుని సమాగమం, రాసక్రీడ , మధురా ప్రవేశం , కంసవధ , ద్వారకా ప్రవేశం, రుక్మిణీ పరిణయం, రుక్మిణీ–కృష్ణ కల్యాణం వంటి ఘట్టాలు ఉన్నాయి.
ఇవి కేవలం చదవడానికి ఉద్దేశించిన సాహిత్య రచనలు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అభినయం, నాట్యప్రదర్శనకు అనువుగా ఉండే విధంగా నిర్మితమయ్యాయి. అందువల్ల తరంగిణి కూచిపూడి ప్రదర్శనా సంప్రదాయంలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
నారాయణ తీర్థుల తరంగాలలో “కృష్ణా నీ బేగనే బారో” వంటి ఇతర కృతులతో కలపకుండా, నారాయణ తీర్థుల స్వీయ రచనల్లో ప్రసిద్ధమైనవి “భజే వ్రజైక మండనం”, “గోవర్ధన గిరిధరం”, “ఆలోకయే శ్రీ బాలకృష్ణం”, “తాండవ కృష్ణం” మొదలైనవి.
క్షేత్రయ్య:
17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తెలుగు పదకవి, వాగ్గేయకారుడు, భక్తి కవిగా ప్రసిద్ధి చెందారు. సంప్రదాయంగా ఆయన అసలు పేరు వరదయ్య అని, కృష్ణాజిల్లాలోని మొవ్వ గ్రామం ఆయన జన్మస్థలమని పేర్కొంటారు. మొవ్వలోని మువ్వ గోపాలస్వామి ఆయన ఆరాధ్యదైవంగా చెప్పబడుతుంది. ఆయన పదాల్లో కనిపించే “మువ్వగోపాల” ముద్ర ఈ సంబంధానికి ముఖ్యమైన ఆధారంగా భావించబడుతుంది.
సంప్రదాయ కథనం ప్రకారం క్షేత్రయ్య అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ, అక్కడి దేవాలయాలు, సంగీతం, నృత్యం, సాహిత్య వాతావరణంతో పరిచయం పెంచుకున్నారు. ఈ క్షేత్రయాత్రల కారణంగానే “క్షేత్రజ్ఞుడు/క్షేత్రయ్య” అనే పేరు ప్రసిద్ధి చెందిందని చెబుతారు. మొవ్వలోని గోపాలస్వామి ఆయన పదకవిత్వానికి కేంద్రబిందువుగా నిలిచాడు. అందువల్ల ఆయన పదాల్లో “మువ్వగోపాల” అనే ముద్ర విస్తృతంగా కనిపిస్తుంది. ఈ ముద్ర కేవలం కవి పేరు సూచించడమే కాకుండా ఆయన ఆరాధనా భావాన్ని, మొవ్వ క్షేత్రంతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
క్షేత్రయ్యకు సంప్రదాయంగా వేలాది పదాలు ఆపాదించబడ్డాయి. కొన్ని ఆధారాలు సుమారు 4,000–4,500 పదాలు ఉన్నట్లు పేర్కొంటాయి. అయితే ప్రస్తుతం లభ్యమవుతున్న పదాల సంఖ్య చాలా తక్కువ. నాలుగు వందలు మాత్రమే లభిస్తున్నాయి ”( తెలుగు సాహిత్య చరిత్ర – ద్వా.నా శాస్త్రి ,పుట – 182 )
క్షేత్రయ్య పదాల ప్రధాన లక్షణం మాధుర్యభక్తి. ఇందులో నాయకుడు – మువ్వగోపాలుడు / శ్రీకృష్ణుడు , నాయిక – భక్తురాలు లేదా విరహిణి విరహం, అనురాగం , అలక, కోపం, వేడుకోలు, కలయిక, వియోగం వంటి మానవ భావాలను ఉపయోగించి జీవాత్మ–పరమాత్మల అనుబంధాన్ని వ్యక్తీకరించే భక్తి దృష్టి కనిపిస్తుంది. అందువల్ల క్షేత్రయ్య పదాలను కేవలం శృంగార పదాలుగా చూడటం కంటే శృంగారాన్ని మాధుర్యభక్తికి వాహకంగా ఉపయోగించిన కవిత్వంగా కూడా అధ్యయనం చేయవచ్చు.
క్షేత్రయ్య పదాల్లో శృంగార రసం ప్రధానమైనది. నాయికా–నాయకుల మధ్య ప్రేమ, విరహం, అలక, కలయిక మొదలైన మానవ అనుభవాలను ఆయన అత్యంత సూక్ష్మంగా చిత్రించారు. క్షేత్రయ్య పదాలు సంగీతపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం కలిగినవి. ఆయన పదాల్లో రాగభావం, సాహిత్యభావం, నెమ్మదైన గమనశైలి, భావవ్యక్తీకరణకు అనువైన నిర్మాణం కనిపిస్తాయి.
క్షేత్రయ్య పదాల్లో ఆనందభైరవి, సహానా, నీలాంబరి, ఆహిరి, ఘంట, ముఖారి, హుసేని, సురటి వంటి రాగాలు వినియోగించబడినట్లు సంగీత పరిశోధనా ఆధారాలు పేర్కొంటున్నాయి.
పువ్వాడ శ్రీరామదాసు :
దివిసీమ – మొవ్వ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ వాగ్గేయకారుడు, భక్తి పదకవిగా స్థానిక సాహిత్య సంప్రదాయంలో గుర్తించబడుతున్నారు. ఆయనను మువ్వ గోపాలకృష్ణ పదదాసు అని కూడా పేర్కొంటారు. లభ్యమైన ఆధారాల ప్రకారం ఆయన కృష్ణా జిల్లా దివి తాలూకా, మొవ్వ క్షేత్రవాసి మరియు మువ్వగోపాలుని భక్తుడు.
పువ్వాడ శ్రీరామదాసు రచనలు ప్రధానంగా భక్తి కీర్తనల రూపంలో ఉన్నాయి. ఆయన కీర్తనల్లో భక్తి పారవశ్యం, శరణాగతి, పదసౌష్టవం, కవితా స్వారస్యం ప్రధాన లక్షణాలుగా పేర్కొనబడ్డాయి. మొవ్వ–కూచిపూడి ప్రాంతాల సాంస్కృతిక సమీపత దృష్ట్యా, ఆయన కీర్తనలు సంగీతం, భక్తి, నృత్యాభినయానికి అనుకూలమైన పదసాహిత్యంగా పరిశీలించవచ్చు. పువ్వాడ రామదాసు గారి రచించి , గానం చేసి కీర్తనలు మొవ్వ వేణుగోపాలస్వామి కీర్తనలగాను, పువ్వాడ కీర్తనలు గాను ప్రాచుర్యం పొందాయి. దివి సీమ ఆలయ దర్శిని అనే గ్రంధంలో రచయిత డా.వేదాంతం రాజగోపాల చక్రవర్తిగారు పువ్వాడ శ్రీరామదాసు గారి మూడు కీర్తనలను అందులో ప్రచురించారు. పువ్వాడ శ్రీరామదాసు కీర్తనలలో ‘మువ్వగోపాల’,’మువ్వనివాస’,’రామదాస’ అనే ముద్రలు తప్పనిసరిగా కనిపిస్తాయి.
ముగింపు:
దివిసీమ భౌగోళికంగా కృష్ణా డెల్టా ప్రాంతంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటమే కాకుండా, సాహిత్య, సంగీత, నాట్య, భక్తి సంప్రదాయాలకు కూడా విశిష్టమైన కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతంతో సంబంధం కలిగిన వాగ్గేయకారుల రచనలను పరిశీలించినప్పుడు సాహిత్యం, సంగీతం, నృత్యం, భక్తి ఒకదానితో ఒకటి విడదీయలేని విధంగా అనుసంధానమై ఉన్నట్లు తెలుస్తుంది.
సిద్ధేంద్రయోగి భామాకలాపం ద్వారా కూచిపూడి నాట్యానికి సాహిత్య–నాట్య ప్రాతిపదికను బలపరిచారు. ఆయన రచనలో సత్యభామ విరహాన్ని మధురభక్తికి ప్రతీకగా మలచిన విధానం ప్రత్యేకమైనది. లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతంలో కృష్ణుని బాలలీలలు, రూపమాధుర్యం, భక్తి, మాధుర్యభావనలకు ప్రాధాన్యం లభించింది.
శ్రీ నారాయణ తీర్థుల శ్రీకృష్ణలీలా తరంగిణి సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయాలను సమన్వయపరిచిన విశిష్ట రచనగా నిలిచింది. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలోని తరంగం సంప్రదాయంతో దీనికి సన్నిహిత సంబంధం ఉంది. క్షేత్రయ్య పదాలలో శృంగారం, విరహం, అనురాగం, నాయికా–నాయక భావనల ద్వారా మాధుర్యభక్తి వ్యక్తమైంది. పువ్వాడ శ్రీరామదాసు కీర్తనల్లో భక్తి, శరణాగతి, పదసౌష్టవం ప్రధానంగా కనిపిస్తాయి.
అందువల్ల దివిసీమ వాగ్గేయకారుల సాహిత్యం కేవలం భక్తిగీతాలకే పరిమితం కాకుండా తెలుగు పదసాహిత్యం, కర్ణాటక సంగీతం, కూచిపూడి నాట్యం, అభినయ సంప్రదాయాల అభివృద్ధికి దోహదపడిన సమగ్ర సాంస్కృతిక వారసత్వంగా గుర్తించవచ్చు. వీరి రచనలను మరింతగా సేకరించి, ప్రామాణిక ఆధారాలతో పరిశోధించి, భావితరాలకు అందించడం అవసరం.
ఆధారా గ్రంధాలు :
రజనీకాంతరావు బాలాంత్రపు – ఆంద్ర వాగ్గేయకార చరిత్రము
రామలింగశాస్త్రి వేదాంతం – తెలుగులో కూచిపూడి నాటక వికాసం
శ్రీనివాసశర్మ పసుమర్తి – కూచిపూడి నాట్య కౌముది
నాగేశ్వర శాస్త్రి ద్వాదశి – తెలుగు సాహిత్య చరిత్ర ,
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~