sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

అడివి బాపిరాజు నవలల్లో జాతీయతా భావజాలం – డా.ఆర్.శ్రీనివాసరావు

 

 అడివి బాపిరాజు నవలల్లో జాతీయతా భావజాలం

Nationalist Ideology in the Novels of Adivi Bapiraju
Volume – 1,                                            October 2026,                                          issue – 7,

సమర్పణ (D.O.S): 04-09 – 2026               ఎంపిక (D.O.A): 15– 09 – 2026          ప్రచురణ (D.O.P) :  01-10-2026  

-డా.ఆర్.శ్రీనివాసరావు

తెలుగు అధ్యాపకులు మారిన్ స్టెల్లా కళాశాల,

విజయవాడ, ఎన్.టి.ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్.

వ్యాస సంగ్రహం: (Abstract)

జాతీయోద్యమ కాలంలో తెలుగు సాహిత్యం కేవలం వినోదం సాధనంగా కాక, సమాజాన్ని చైతన్య పరిచే ఒక సాయుధ కరదీపికగా పనిచేసింది. అట్టి యుగంలో జీవించి, గాంధేయ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై, స్వయంగా సహాయనిరాకరణోద్యమంలో జైలు శిక్ష అనుభవించిన మహోన్నత సృజనశీలి అడివి బాపిరాజు. ఆయన నవలా ప్రస్థానంలో చారిత్రిక నవలలకు ఒక విశిష్టమైన సా&ధంనం ఉంది. బ్రిటిష్ వారి వలస పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోతున్న భారతీయులలో స్వరక్షణ, దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని రగల్చడానికి బాపిరాజుగారు చరిత్రను అద్భుతమైన ఆయుధంగా మలుచుకున్నారు. ఆయన రాసిన నవలల్లో చారిత్రక, దేశభక్తి, జాతీయ చైతన్యాన్ని, స్వాతంత్ర్యం పట్ల బాపిరాజుగారికి ఉన్న భావజాలం ఎంతో ఉన్నతంగా కనిపిస్తుంది.

Abstract :

During the period of the Indian national movement, Telugu literature functioned not merely as a means of entertainment, but also as a powerful instrument for awakening social consciousness and national awareness. Adivi Bapiraju, a distinguished creative writer who lived during this era, was deeply influenced by Gandhian ideals and personally participated in the Non-Cooperation Movement, for which he underwent imprisonment.

Historical novels occupy a significant place in Bapiraju’s literary career. Under British colonial rule, when Indians were gradually losing their self-confidence and sense of national identity, Bapiraju transformed history into a powerful literary weapon to inspire self-respect, patriotism, and national consciousness among the people. His novels vividly reflect historical awareness, patriotism, and a strong sense of nationalism. They also reveal the lofty ideals and profound commitment that Bapiraju held towards the cause of Indian independence.

కీలకవదములు: (Keywords)

అడివి బాపిరాజు, చారిత్రక నవల, దేశభక్తి, జాతీయ చైతన్యం, జాతీయ భావజాలం, వలసవాద నిరసన, సాంస్కృతిక అస్థిత్వం, ముగింపు.

Keywords:

Adivi Bapiraju, Historical Novel, Patriotism, National Consciousness, National Ideology, Anti-Colonial Resistance, Cultural Identity, Conclusion.

ప్రవేశిక:

వలస పాలన కాలంలో జాతీయతా భావాన్ని పెంపొందించడానికి చరిత్రను పునర్నిర్మించటం అనేది ప్రపంచ వ్యాప్తంగా సాహితీవేత్తలు అవలంబించిన ఒక వ్యూహం. కవులు, చిత్రకారులు, కళాకారులు గతాన్ని ఉదాత్రీకరించడం ద్వారా వర్తమానంలోని బానిసత్వ సంకెళ్ళను తెంచుకునే మానసిక స్థైర్యాన్ని ప్రజలకు అందించారు. అలా అనాటి కాలంలో తెలుగు నేలలో ప్రజలలో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపిన గొప్ప కవి, చిత్రకారుడు. అడివి బాపిరాజుగారు ఒకరు. బాపిరాజుగారు కవిగానే కాక, తన చిత్రకళా నైపుణ్యంతో కేవలం రాజుల వంశావళిని, ఆనాటి జాతి వైభవాన్ని రక్షణ వ్యవస్థను సంస్కృతిని సజీవ దృశ్యాలుగా తమ నవలల్లో ఆవిష్కరించారు. బాపిరాజుగారి చారిత్రక నవలల వెనక ఉన్న రాజకీయ. జాతీయ ఆకాంక్షలను, ఆ భావజాలాన్ని చక్కగా వివరించారు.

బాపిరాజు గారు నిజంగా బహుముఖ ప్రజ్ఞావంతులు, కవిత్వం, నవల, వ్యాసం, శిల్పం, చిత్రకళ, గానం, నాట్యం మొదలైన కళలలో పరిణతమైన పాండిత్య ప్రకర్షకలదు. ఆయన నారాయణరావు, హిమబిందు, తుఫాను, కోనంగి, గోనగన్నారెడ్డి, అడవి శాంతిశ్రీ, జాజిమల్లి, అంశుమతి మొదలైన ఎనిమిది నవలలు రాసారు. వాటిలోని కథా ఇతివృత్తం నిండా జాతీయత, దేశభక్తి, చారిత్రక విశేషాంశాలతోపాటు అనేక విషయాలు తెలియజేసారు.

జాతిపిత మహాత్మా గాంధీజీ భావజాలం:

అడివి బాపిరాజుగారు స్వయంగా జాతీయోద్యమ సత్యాగ్రహి కావడం వల్ల గాంధేయ భావజాలం ఆయన సాంఘిక నవలల్లోని పాత్రల జీవన విధానంలో అంతర్లీనంగా ప్రవహించింది.

నారాయణరావు నవలను 1934లో రాసారు. ఇది బాపిరాజుగారి నవలా ప్రస్థానంలోనే కాక తెలుగు నవలా సాహిత్యవినీలాకాశంలో కూడా అత్యున్నత మైలురాయిగా నిలిచిపోయింది. నాటి జాతీయ భావాలు, సంస్కృతి కళలపట్ల అనురక్తి కలిగిన నారాయణరావు అనే యువకుడి కథ ఇది. 1934లో ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నిర్వహించిన నవలల పోటీల్లో విశ్వనాథ సత్యనారాయణగారి ప్రసిద్ధ నవల ‘వేయిపడగలు’ నవలతోపాటు ఉమ్మడిగా ఉత్తమ నవల బహుమతిని పొందింది.

నారాయణరావు నాటి మద్రాసు నగరంలో ఉన్నతమైన పాశ్చాత్య విద్యను లా (బి.ఎల్)ను అభ్యసించినప్పటికీ ఆడంబరాలకు పోకుండా ఎల్లప్పుడూ ఖాదీ వస్త్రాలనే ధరిస్తాడు. గాంధీజీ వీలుపునిచ్చిన స్వదేశీ వ్రతాన్ని తన నిత్య జీవితంలో పాటిస్తూ, తోటి విద్యార్థులోను, మిత్రులలోను జాతీయ చైతన్యాన్ని రగిలిస్తాడు. నారాయణరావు పాత్ర దృష్టిలో దేశభక్తి అంటే కేవలం బ్రిటిష్ పాలకులను వ్యతిరేకించడం మాత్రమే కాదు. తన మాతృభూమి యొక్క శిల్పం, చిత్రకళ, సంగీతం మరియు వాజ్మయాలను ప్రేమించడం. పరాయి పాలన తెచ్చిన విదేశీ వ్యామోహంలో పడి కొట్టుకుపోకుండా భారతీయ సంస్కృతీ వారసత్వమే మన జాతీయతకు ప్రాణమని అతడు బలంగా నమ్ముతాడు. పట్టణాలలో సంపాదించి స్థిరవడాలనే స్వార్థం కాకుండా తన సొంత గ్రామమైన కొత్తపేట అభివృద్ధి కోసం, అక్కడి రైతులు మరియు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం నారాయణరావు తపన పడతాడు. గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్యం సిద్ధాంతానికి ఈ ఆలోచన అద్దంపడుతుంది.

నారాయణరావు తన మిత్రులైన పరమేశ్వరమూర్తి(కవి, చిత్రకారుడు), రాజారావు(వైద్యుడు), ఆలం సుల్తాన్(లా విద్యార్థి)లతో కలిసి చర్చలు జరుపుతూ, దేశంలో వస్తున్న జాతీయోద్యమ మార్పులను విశ్లేషిస్తుంటాడు. కులమతాలకు అతీతంగా భారతీయులంతా ఒక్కటే అనే జాతీయ సమైక్యతా భావాన్ని, తన స్నేహాల ద్వారా చాటుతాడు.

బాపిరాజుగారికి గాంధీజీ అంటే ప్రత్యేకమైన అభిమానం, ఆయన వ్యక్తిత్వం, జీవన విధానం హిమాలయ పర్వత శిఖరాలంత ఉన్నతమైనది. పవిత్రమైనది. అంతేకాదు లోకకళ్యాణం కోసం పరమశివుడు చేసే పవిత్ర నృత్యానికి వేదిక అయిన నటరాజ రంగస్థలం లాంటిది ఆయన జీవితం అంటారు. ‘హిమాలయోత్తుంగ శృంగం

నీ బ్రతుకు

ఉమాపతి నాట్యరంగం’ అని పొగుడుతారు.

విదేశీ దండయాత్రల నిరసన జాతీయ అస్తిత్వం:

బాపిరాజుగారు హిమబిందు నవలను 1944లో రాశారు. ఆ నవలలో బ్రిటిష్వారి వలస పాలన కింద ఉంది. 1922లో స్వాతంత్య్ర సమరంలో అరెష్ట్ అయిన జైలులో ఉన్న కాలంలో ఈ నవలను ప్రారంభించారు. ఈ నవల ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి వైభవాన్ని ప్రదర్శిస్తుంది.

వలసవాద ప్రతీకలుగా ఈ నవలలో యవనులు అయిన గ్రీకుల దండయాత్రలు, వారి కుతంత్రాలు నాటి బ్రిటిష్ పాలకుల సామ్రాజ్యవాద కాంక్షకు ప్రతీకలుగా నిలుస్తాయి. పరాయి పాలకుల చొరబాటును అడ్డుకోవడానికి స్వదేశీ రాజులు, శిల్పులు, సామాన్య ప్రజలు ఏకమవ్వడం, ద్వారా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగుతున్న సమైక్య జాతీయోద్యమాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభోదించారు.

సార్వభౌమాధికారవు ఆత్మార్పణ దేశభక్తి:

మాతృభూమిని రక్షణే పరమావధిగా భావించిన బాపిరాజుగారు గోన గన్నారెడ్డి అనే చారిత్రక నవలను 1945 లో రాసారు. ఇది కాకతీయుల కాలం నాటి వీరవనిత రాణి రుద్రమదేవి పరిపాలనను, ఆమెకు అండగా నిలిచిన సేనాదిపతి గోనగన్నారెడ్డి దేశభక్తి, వీరత్వాన్ని కళ్ళకు కట్టేలా మలిచిన అత్యంత ప్రజాదరణ పొందిన చారిత్రక నవలగా పేరొందింది. చారిత్రక నవలల్లో కెల్లా శిఖరాయమానమైనది గోనగన్నారెడ్డి నవల.

మాతృభూమి రక్షణే పరమావధిగా గోనగన్నారెడ్డి పాత్ర ద్వారా బాపిరాజుగారు దేశభక్తికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. తన సొంత లాభాలను, రాజభోగాలను త్యజించి, అడవులపాలు కావడానికి కూడా వెనుకాడకుండా మాతృభూమి సార్వభౌమత్వాన్ని కాపాడటమే దేశభక్తి అని నిరూపించారు. కాకతీయ సామ్రాజ్య రక్షణను కేవలం ఒక ప్రాంతీయ పోరాటంగాకాక, శత్రువుల దాడి నుండి స్వదేశీ సంస్కృతిని కాపాడుకునే జాతీయ బాధ్యతగా ఈ నవలలో చిత్రించారు. రాణి రుద్రమదేవి నాయకత్వాన్ని ఆమోదించడంలో నాటి ప్రజాస్వామ్య, జాతీయ చైతన్యపు ఆదర్శాలు కనిపిస్తాయి.

సాంస్కృతిక జాతీయత:

‘జాతీయత అంటే కేవలం భౌగోళిక సరిహద్దుల రక్షణ మాత్రమే కాదు, దేశీయ కళలు, జీవన విధానం, మత సామరస్యాల పరిరక్షణ కూడా అని బాపిరాజుగారు నమ్మారు. ఆయన అడవి శాంతిశ్రీ, అంశుమతి నవలల్లో ఈ సాంస్కృతిక జాతీయత ఎక్కువగా కనపడుతుంది.

అడవి శాంతిశ్రీ నవలను 1946లో రాసారు. అందులో ఇక్ష్వాకుల కాలం నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలను, నాటి మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా రాసారు. ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ, జైన, వైదిక మతాల మధ్య సంఘర్షణను చూపిస్తూనే అంతిమంగా సహనం ద్వారా శాంతి ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ప్రబోధించారు. ఇది గాంధీ ఈ ప్రతిపాదించిన సర్వమత సామరస్య సిద్ధాంతానికి అద్దం పడుతుంది.

అంశుమతి నవలను 1951లో రాసారు. ఇది విజయనగర సామ్రాజ్య కాలం నాటి కళా వైభవాన్ని సామాజిక వైభవాన్ని ఈ నవల ద్వారా ఆవిష్కరించారు. విజయనగర సామ్రాజ్య కాలం నాటి శిల్ప, చిత్ర, సంగీత కళల వైభవాన్ని వర్ణించడం ద్వారా భారతీయులలో తమ సాంస్కృతిక వారసత్వం పట్ల ఆత్మ గౌరవాన్ని పెంపొందించారు. పరాయి పాలనలో నశిస్తున్న స్వదేశీ కళలను రక్షించుకోవానలే జాతీయ ఆకాంక్ష కనిపిస్తుంది.

బాపిరాజుగారి రచనల్లో దేశభక్తి ప్రత్యేకతలు:

7 బాపిరాజుగారి నవలల్లో చారిత్రకత ప్రత్యేకంగా కనిపిస్తుంది. తన నవలల్లో యుద్దాల వర్ణనలు ఉన్నప్పటికి హింసపై అనాసక్తతను చూపిస్తారు. దేశభక్తి ఎక్కడా కూడా ఉరకలెత్తే రక్తపాతాన్ని సమర్ధించడం కనిపించదు. శాంతి, ధర్మం మరియు ఆత్మత్యాగం ఆధారంగానే ఆయన దేశభక్తి కొనసాగుతుంది.

ఉదాత్తమైన స్త్రీ పాత్రలలో కూడా జాతీయత కనిపిస్తుంది. రుద్రమదేవి, హిమబిందు వంటి పాత్రల ద్వారా దేశ రక్షణలో మరియు జాతీయ చైతన్యంలో స్త్రీల పాత్ర పురుషులతో సమానమైనదని, ఉదాత్తమైనదని నిరూపించారు.

‘బాపిరాజుగారు తన గేయాలలో కూడా ప్రత్యేకంగా తన దేశభక్తిని ప్రదర్శించారు. వాటిల్లో చాలా ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. వలస పాలనలో బానిస భావనలతో కుంచించుకుపోతున్న భారతీయులలో ఆత్మగౌరవాన్ని మేల్కొల్పడానికి మన పూర్వీకులు శౌర్యాన్ని గేయ రూపంలో అందించారు. చారిత్రక స్ఫూర్తితో దేశభక్తిని రగిలించటం విశేషం.

‘లేవరా భర్తత పుత్రా లేవరా, దేవి నూత్న శక్తిమూర్తి భావి మూర్తి భరతమాత, లేవరా చేతులెత్తి మ్రొక్కరా’ అంటూ పాడారు.

పరాయి పాలన కింద నిద్రాణమై ఉన్న తెలుగు జాతిని, భారతదేశాన్ని మేల్కొల్పడానికి లేపాక్షి ఏకశిలానందిని ప్రతీకగా వాడుకుంటూ జాతి మేల్కొన్నాల్సిన సమయం ఆసన్నమైందని ప్రబోధిస్తూ రాసిన గొప్ప గేయం ఇది. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య కైలాస శిఖరిలా కదలి రావయ్య హుంకరించిన దెసలు ఊగిపోయేను ఖరముతో దువ్వి తేకుల గిరులెవణి కేను ఆకాశగంగకై అర్రెత్తి చూస్తేను

పొంగేటి పాల్కడలి గంగడోలాడేను’అ ంటూ కొనసాగిన గేయంలో లేపాక్షి దేవాలయంలోని ప్రసిద్ధి ఏకశిలా నందిని ఉద్దేశించి రాసిన గేయంగా కనిపిస్తున్నప్పటికి పూర్వ చారిత్రక వైభవాన్ని, జాతీయ భావాన్ని రగిలించారు.

ముగింపు:

అడివి బాపిరాజు గారి చారిత్రక నవలా సాహిత్యం కేవలం గతాన్ని స్మరించుకునే కాలక్షేప సాధనం కాదు. అది జాతీయోద్యమ కాలంలో భారతీయులను మేల్కొలిపిన ఒక సాంస్కృతిక ఉ ద్యమం. చరిత్రలోని వీరత్వాన్ని వర్తమాన స్వాతంత్ర్య పోరాటానికి ఇంధనంగా మార్చిన ఘనత ఆయనది. ఆయన నవలల్లో దేశభక్తి సంకుచితమైనది కాదు. అది మానవత్వంతో కళాత్మకతతో మేళవించిన ఉదాత్తమైన జాతీయ చైతన్యం. తెలుగు చారిత్రక నవలా వికాసంలో బాపిరాజుగారి జాతీయ దృక్పథం ఎప్పటికీ చిరస్మరణీయమైనది.

ఆధార గ్రంథాలు:

1. ఆచార్య జగన్నాథం, పేర్వారం, సంకలనం. సాహిత్యం- సమాజం-రాజకీయాలు;

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్,1997.

2. దివాకర్ల వెంకటావధాని, ఆంధ్ర వాఙ్మయ చరిత్రము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 2001.

3. బి. రాధాకృష్ణమూర్తి, తెలుగు చారిత్రక నవలలు, తెలుగు అకాడమీ, హైదరాబాద్, 1998,

4. సుబ్బారెడ్డి, మద్దూరి, డా.. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం,

రాగసుధా ప్రచురణలు, తిరుపతి,1982,

5. తెలుగు సాహిత్య చరిత్ర, డా. ద్వానాశాస్త్రి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్,2007.

 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top