“లలనా శతకము” – పరిశీలన
“Lalana Satakam” – A Study
డా.కె.సుధారాణి.
Volume – 1, October 2026, issue – 7,
సమర్పణ (D.O.S): 10-09 – 2026 ఎంపిక (D.O.A): 20 – 09 – 2026 ప్రచురణ (D.O.P) : 01-10-2026
వ్యాస సంగ్రహం:
తెలుగు శతక సాహిత్యంలో నీతి శతకాలకు విశిష్టమైన స్థానం ఉంది. సమకాలీన సామాజిక జీవనాన్ని, నైతిక విలువలను, కుటుంబ సంబంధాలను, స్త్రీ పురుషుల ప్రవర్తనా విధానాలను శతక కవులు తమ రచనల ద్వారా ప్రతిబింబించారు. ఈ నేపథ్యంలో వింజమూరి చిన్న సుబ్బారావు రచించిన లలనా శతకం స్త్రీల జీవితం, విద్య, కుటుంబ బాధ్యతలు, వివాహం, పాతివ్రత్యం, గృహ నిర్వహణ, అత్తమామలతో సంబంధాలు, ఆరోగ్యం, ధైర్యం, పరోపకారం, నైతిక విలువలు వంటి అనేక అంశాలను ప్రతిపాదించిన ముఖ్యమైన నీతి శతకంగా గుర్తించవచ్చు. 1914లో ప్రచురితమైన ఈ శతకంలో 101 పద్యాలు ఉండగా, ‘లలనా’ అనే మకుటం ప్రతి పద్యానికి భావ ఐక్యతను కల్పిస్తుంది.
స్త్రీల ప్రయోజనార్థం రచించిన ఈ శతకంలో మొత్తం ఇరవై నాలుగు విభాగాల ద్వారా స్త్రీల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కవి వివరించారు. ముఖ్యంగా స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ విద్య స్త్రీలకు వినయం, జ్ఞానం, కీర్తిని అందిస్తుందని పేర్కొన్నారు. గణితం, గృహ నిర్వహణ, కుట్టుపని వంటి విద్యలను స్త్రీలు నేర్చుకోవాలని సూచించినప్పటికీ, ఆ సూచనల్లో ఆనాటి పితృస్వామ్య సామాజిక దృక్పథం కూడా ప్రతిఫలిస్తుంది. పాతివ్రత్యం, భర్త పట్ల విధేయత, అత్తమామల పట్ల బాధ్యత వంటి అంశాల్లో సంప్రదాయ స్త్రీధర్మాన్ని ప్రతిపాదించిన కవి, అదే సమయంలో స్త్రీ విద్య, వివాహంలో ఆర్థిక ఆడంబరాలకు వ్యతిరేకత, సంతృప్తి, ఆరోగ్యం, పరోపకారం, మంచి పుస్తక పఠనం వంటి అభ్యుదయ భావాలను కూడా వ్యక్తం చేశారు.
వివాహ వ్యవస్థలో అధిక ధనవ్యయాన్ని నిరసించడం, ఆడపిల్లలకు విద్యనందించాల్సిన అవసరాన్ని గుర్తించడం, ధనానికి మించి విద్య, వినయం, ఆరోగ్యం, యోగ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు శతకంలోని సామాజిక దృక్పథాన్ని తెలియజేస్తాయి. స్త్రీలు తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా, ధైర్యంగా, నైతిక విలువలతో జీవించాలని కవి సూచించారు. ఈ విధంగా లలనా శతకంలో సంప్రదాయ స్త్రీధర్మ భావనలతో పాటు స్త్రీ విద్య, సామాజిక బాధ్యత, కుటుంబ ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత లభించింది. ఈ వ్యాసం లలనా శతకంలోని స్త్రీ జీవన చిత్రణను, సంప్రదాయ–అభ్యుదయ భావాల సమన్వయాన్ని విశ్లేషిస్తుంది.
Abstract :
Ethical (Nīti) poetry occupies a significant place in Telugu Sataka literature. Through their works, Sataka poets reflected contemporary social life, moral values, family relationships, and the behavioural patterns of men and women. In this context, Lalana Satakam, authored by Vinjamuri Chinna Subbarao, may be regarded as an important ethical Satakam that addresses various aspects of women’s lives, including education, family responsibilities, marriage, chastity, household management, relationships with parents-in-law, health, courage, charity, and moral values. Published in 1914, the Satakam consists of 101 verses, with the refrain “Lalana” providing thematic unity to the verses.
Written for the benefit of women, the Satakam presents various aspects of women’s personal, familial, and social lives through twenty-four sections. The poet gives particular importance to women’s education, stating that education provides women with humility, knowledge, and recognition. Although he encourages women to learn subjects and skills such as arithmetic, household management, and sewing, these suggestions also reflect the patriarchal social outlook of the period. While advocating traditional concepts of womanly virtue, obedience to the husband, and responsibilities towards parents-in-law, the poet simultaneously expresses progressive ideas concerning women’s education, opposition to financial extravagance in marriage, contentment, health, charity, and the reading of good books.
The Satakam’s social perspective is evident in its criticism of excessive expenditure on marriage, its recognition of the need to educate girls, and its emphasis on education, humility, health, and merit rather than wealth in matters of marriage. The poet advises women to make effective use of the opportunities available to them and to lead their lives responsibly, courageously, and in accordance with ethical values. Thus, Lalana Satakam gives importance not only to traditional concepts of woma
కీలక పదాలు :
శతకం, మకుటం, లలనా శతకం, ఛందస్సు, నీతి, స్నేహము, వివాహము, బంధాలు, పరోపకారం, సత్యం, బాలశిక్ష, , విద్య , పాఠశాల, లలనా శతకం, వింజమూరి చిన్న సుబ్బారావు, శతక సాహిత్యం, నీతి శతకం, స్త్రీ జీవితం, స్త్రీ విద్య, స్త్రీధర్మం, పితృస్వామ్య వ్యవస్థ, వివాహం, గృహ నిర్వహణ, అభ్యుదయ భావాలు.
Keywords:
Satakam, Makutam (Refrain), Lalana Satakam, Prosody, Ethics, Friendship, Marriage, Relationships, Altruism, Truth, Moral Instruction for Children, Education, Schooling, Vinjamuri Chinna Subbarao, Sataka Literature, Ethical Satakam, Women’s Life, Women’s Education, Womanly Virtue, Patriarchal System, Household Management, Progressive Ideas.
పరిచయం :
తెలుగు సాహిత్య ప్రక్రియల్లో శతకానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ‘శతకం’ అనే పదం ‘శత’ అనే పదం నుంచి ఏర్పడింది. సాధారణంగా వంద పద్యాలు కలిగిన కావ్యాన్ని శతకంగా వ్యవహరిస్తారు. అయితే కొన్ని శతకాల్లో పద్యాల సంఖ్య వందకు కొద్దిగా ఎక్కువగానో, తక్కువగానో కనిపిస్తుంది. శతక పద్యాలు సాధారణంగా స్వతంత్ర భావవ్యక్తీకరణను కలిగి ఉండటంతోపాటు, ఒకే మకుటం లేదా భావసూత్రం ద్వారా పరస్పరం అనుసంధానమై ఉంటాయి.
“శతకములు భావ గీతములు “ – అని వంగూరి సుబ్బారావు అభిప్రాయం.శతక కవుల చరిత్ర , పుట -8 )
“మకుటాత్మకమగు శతముక్తక సముచ్చయమే శతకం “ అని గోపాల కృష్ణా రావు అభిప్రాయం.(ఆంధ్ర శతక సాహిత్య వికాసం – డా.కె.గిపాల కృష్ణారావు ,పుట-6 )
తెలుగు శతక సాహిత్యానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. నీతిశతకాలు, భక్తి శతకాలు, తాత్త్విక శతకాలు, సామాజిక శతకాలు, హాస్య శతకాలు, శృంగార శతకాలు మొదలైన అనేక రకాల శతకాలు తెలుగు సాహిత్యంలో వెలువడ్డాయి. శతక కవులు తమ కాలంలోని సామాజిక పరిస్థితులు, మత విశ్వాసాలు, నైతిక విలువలు, మానవ సంబంధాలు, జీవన సత్యాలు, భక్తి భావనలను సరళమైన భాషలో ప్రజలకు అందించారు.
తెలుగు శతక సాహిత్య వికాసంలో పాల్కురికి సోమనాథుడు, బద్దెన, వేమన, ధూర్జటి, కంచర్ల గోపన్న (రామదాసు) తదితర కవుల రచనలు ప్రముఖమైనవి. ముఖ్యంగా వేమన పద్యాలు సామాన్య ప్రజల జీవన అనుభవాలను, సామాజిక అసమానతలను, మానవతా విలువలను, మూఢనమ్మకాలను ప్రశ్నించే తాత్త్విక దృక్పథాన్ని వ్యక్తం చేశాయి. అందువల్ల శతకం కేవలం పద్య ప్రక్రియగా మాత్రమే కాకుండా, ప్రజల జీవితం, సమాజం, సంస్కృతి, నైతికతలకు అద్దం పట్టే సాహిత్య ప్రక్రియగా అభివృద్ధి చెందింది.
శతకాల్లోని పద్యాలు సులభమైన ఛందస్సు, సరళమైన భాష, స్పష్టమైన భావవ్యక్తీకరణ, జ్ఞాపకశక్తికి అనుకూలమైన నిర్మాణం వంటి లక్షణాలను కలిగి ఉండటం వల్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం పొందాయి. ముఖ్యంగా మకుటం శతకానికి ప్రత్యేక లక్షణంగా నిలుస్తుంది. ప్రతి పద్యం చివర పునరావృతమయ్యే మకుటం శతకంలోని పద్యాలను ఒక భావ ఐక్యతతో అనుసంధానిస్తుంది.
లలనా శతకకర్త వింజమూరి చిన్న సుబ్బారావు గారు. ఇది 1914లో ప్రచురితమైంది. శతకంలో 101 పద్యాలున్నాయి. శతకమకుటం “లలనా” ఛందన్సు కందం. సుబ్బారావుగారు ఈ శతకాన్ని తన మాతృమూర్తికి అంకితమిచ్చారు.
ఇందులో పుట్టినిల్లు, విద్య-పాఠశాల, పాతివ్రత్యము, నగలు, గృహ నిర్వాహకము, అత్తమామలు, ఆడుబిడ్డ, సంతుష్టి, ఈవి, శరీరారోగ్యము, పాటు, భోగము, వినయము, స్నేహము, బాలశిక్ష, వివాహము, కోడలు, ధైర్యము- పరోపకారము, సత్యము, కొండెము, పురుషప్రయత్నము, దైవభక్తి, వివిధ ధర్మములు. మొత్తం 24 విభాగాలున్నాయి.
విషయ వివరణ :
శతక ప్రారంభంలో కవి స్త్రీల ఉపయోగార్ధం ఈ పుస్తకం రచన చేసినట్టు పేర్కొన్నారు. “పొలతులయుపయోగార్ధము లలితములగునీతులను జెలంగెడిపద్య మ్ములనూరింటిని జెప్పం దలకొంటిని సులభమగు విధమ్ము నలలనా!” “( లలనా శతకము, వుట, 3, వింజమూరి చిన్న సుబ్బారావు.)
పుట్టినిల్లు:
“అనుదినమును నీ తల్లికిడి… (లలనా శతకము, వుట, 100 , వింజమూరి చిన్న సుబ్బారావు)
ఆడపిల్ల అత్తింట చేయవలసిన పనులు పుట్టింట్లో నేర్చుకెళ్ళాలన్నారు. ఆడపిల్ల పుట్టింట్లో పనిచెయ్యటానికి బద్దకిస్తే అత్తింట అవస్థలు పడవలసి వస్తుందన్నారు.
విద్య- పాఠశాల:
“విద్యయే వినయ మొసంగును విద్యయే మనుజులకుఁ గడువి వేకమునిచ్చున్ విద్యయే కీర్తిని దెచ్చును విద్యయే తఱుగెపుడు లేని పెన్నిధిలలనా” (లలనా శతకము, పద్యసంఖ్య: 4, పుట. 4, వింజమూరి చిన్న సుబ్బారావు)
అంటూ కవి విద్య యొక్క ప్రాధాన్యతను పై పద్యంలో వివరించారు.
“నెలఁతలు చదువుట తమభర్తల నెదిరించుటకుఁగాక ధరనుద్యోగ మ్ములు చేయుటకా? గ్రామ మ్ముల నేలుటకా? యటంద్రుమూర్ఖులులలనా!, (లలనా శతకము, పద్యసంఖ్య, వుట. 4, వింజమూరి చిన్న సుబ్బారావు) ఆడవాళ్ళ చదువు భర్తలనెదిరించడానికే గాని ఉద్యోగాలు చేయడానికా? ఊళ్ళేలడానికా? అని మూర్ఖులంటారని తెలియజేశారు.
“పురుషులు స్త్రీలను భేదం బరయక చదువొసఁగు జ్ఞానమందఱికిని; కొం దరికి వెలుంగును మఱికొం
దఱిడిం చీఁకటియు నిచ్చునా రవి లలనా?” ( లలనా శతకము, పద్యసంఖ్య 6, పుట. 4, వింజమూరి చిన్న సుబ్బారావు) విద్యను వెలుగుతో పోల్చారు. ఆ వెలుగు స్త్రీ పురుషులిద్దరికీ అవసరమన్నారు.
స్త్రీలు శ్రద్ధగా చదువుకోవాలని, తరగతిలో అల్లరి చేయకూడదని, సహాధ్యాయులతో తగవులాడకూడదని చెప్పారు.
స్త్రీలు ఏ విద్య నేర్చుకోవాలో ఈ క్రింది పద్యంలో తెలిపారు.
“నేరువ వలె గణితంబును… “( లలనా శతరము, పద్యనంఖ్య 12, వుట . వింజమూరి చిన్న సుబ్బారావు)
స్త్రీలు గణితం నేర్చుకోవాలన్నారు. స్త్రీల చదువు గృహ నిర్వహణకు పనికిరావాలన్నారు.
స్త్రీలు కుట్టటంలోనూ, గరిటె తిప్పడంలోనూ ప్రావీణ్యం సంపాదించాలన్నారు.
పాతివ్రత్యము:
భరియించు భర్త చేతను
భరియింపబడుట నీకు భార్యానామం
బరయగ తగియుండుట ని
ద్ధర భర్తయే దైవమనుచుఁ దలఁపుము” (లలనా శతకము, విద్యనంఖ్య 16, పుట -. 6. వింజమూరి చిన్న మద్బారావు) దమయంతి, సీత, చంద్రమతి, సావిత్రిల చరితలను ఆదర్శంగా తీసుకోమన్నారు. భర్త ఎప్పుడైనా కోపం చూపినా తిరిగి కోపగించక అతడిని శాంతింపజేయాలన్నారు. ధనవంతుడు కాదని భర్తను చులకన చేయొద్దన్నారు. పండుగలకు తల్లిదండ్రులు పుట్టింటికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళి భర్త పెట్టిన గడువు లోపల తిరిగి రమ్మన్నారు.
గృహనిర్వహకము:
“కలిగినయంతటిలోనే…., (లలనా శతకము, చద్యనంఖ్య 29, వుట.9, వింజమూరి చిన్న సుబ్బారావు)
భార్య ఉన్నంతలోనే సర్దుకోవాలని, ఇవి కావాలని కావాలని భర్తను పీడించకూడదని
తెలియజేశారు. భర్త, ఇంటికోసం తెచ్చిన వస్తువులు రహస్యంగా అమ్ముకోవడం మంచిది కాదని, ఆదాయానికి మించిన వ్యయం కూడదన్నారు. అప్పులు చేయుట పాపమని సెలవిచ్చారు.
“వీరికినివియున్నవి, మఱి……..( లలన శతకము, పద్యసంఖ్య 32, వుట 9, వింజమూరి చిన్న సుబ్బారావు)
ఇతరులకున్న వస్తువులు తనకు కావాలని భర్తను పీడించకుండా నేర్పుగా సంసారసాగరాన్ని దాటే మార్గాన్ని అనుసరించాలన్నారు.
అత్తమామలు :
“అమ్మా! నీ పతితోఁదు …. “( లలనా శతకము, పద్యసంఖ్య 33, వుట, 9,10, వింజమూరి చిన్న సుబ్బారావు)
భర్తతో సమానంగా అత్తమామలకు సేవ చెయ్యాలని ఇంటికోడలు అత్తింటివారు
తిట్టారని వారిపై కోపగించి భోజనం మానకూడదని, ఆ కోపాన్ని మనస్సులో ఉంచుకుని అకారణంగా పిల్లల్ని తిట్టటం, కొట్టటం చేయకూడదన్నారు. అత్తింట్లో అడుగుపెట్టడడమే తడవు, ఇంట్లో తగువులు పెట్టి, భర్తను ఇంటివారిని విడదీయకూడదన్నారు. అత్తింట్లో ఉండేవారందర్నీ సోదరులుగా భావించాలన్నారు.
“మన దేశములో నొకగృహ….,( లలనా శతకము, పద్యనంఖ్య: 39, పుట. 11. వింజమూరి చిన్న సుబ్బారావు) సాధ్వి తన సత్ప్రవర్తనతో ఒక ఇంట్లో రెండు కొప్పులు ఇమడవనే సామెతను అబద్ధం చేయాలన్నారు.
శరీరారోగ్యము :
దేవుడు అనుగ్రహించిన వరాల్లో దేహారోగ్యం ప్రధానమైంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మడని, ఆచారమని తడి వస్త్రాలనే ధరిస్తే ఆరోగ్యం చెడుతుందని తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలో ఈ క్రింది పద్యంలో సూచించారు కవి.
“అనయము శుభ్రంబగు జల మునెత్రాగిన, శుభ్రవస్త్రములనే ధరియిం చిన, శుభ్రవాయువునె పీ
ల్చిన, రోగములెపుడు దరికిఁ జేరవులలనా!”( లలనా శతకము, పద్యనంఖ్య: 50, పుట.13, వింజమూరి చిన్న సుబ్బారావు).
వివాహము :
కుమారుడి విద్య పూర్తయితే తప్ప వివాహం చేయొద్దన్నారు. తన భార్యకు తన స్వార్జితంతో ఒక తమలపాకైనా కొనిపెట్టలేడని వాడికి వివాహమెందుకని ప్రశ్నించారు.
“జనియించినదాదిగనీ… “(లలనా శతకము, వద్యనంఖ్య 68, పుట. 17, పంజమూరి చిన్న సుబ్బారావు)
పుట్టినప్పటి నుంచి పెళ్ళిమాట తలపెట్టక, మగపిల్లవాడిని చదివించినట్లే ఆడపిల్లను కూడా చదివించమన్నారు.
ఆడపిల్ల వివాహ విషయంలో ధనానికి ప్రాధాన్యత నివొద్దని విద్య, వినయం, యోగ్యత, కులం, ఆరోగ్యం చూడమన్నారు.
వివాహ విషయంలో “సమరంబును, పరిణయంబును సములకెశోభిల్లు” అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోమన్నారు. వివాహ విషయంలో శక్తికి మించి వ్యయం చేయడమే దేశ దారిద్ర్యానికి కారణమన్నారు.
“తలవంచుకయైదు దినం….”( లలనా శతకము, పద్యసంబ75, పుట. 16, వింజమూరి చిన్న సుబ్బారావు)
ఘనంగా ఐదు రోజుల పెళ్ళి జరిపించకపోతే బంధువుల ముందు తలవొంపులని
భావించవద్దని, ఆ పెళ్ళి సమయంలో తలవొంచుకుంటే, బ్రతికినంతకాలం అప్పుల బాధ లేకుండా బంధువులందరిలో తలెత్తుకు బతకొచ్చని హితవు పలికారు.
“ఒకవేళ మీరు ధనమిం.. (లలనా శతకము, పద్యనంఖ్య: 77, పుట. 18. పంజమూరి చిన్న సుబ్బారావు)
ధనం ఎక్కువ గలవారు పేదలకు, వికలాంగులకు ఇస్తే పుణ్యం కలుగుతుందన్నారు.
“పురుషులెటువంటి ఘనసం…. “( లలనా శతకము, పద్యసంఖ్య 78, పుట 19, వింజమూరి చిన్న సుబ్బారావు) పురుషులు పూనుకునే సంఘసంస్కరణకు స్త్రీ అభ్యంతరం వ్యక్తం చేస్తారనే అపవాదును పొందొద్దని తెలియజేశారు.
ధైర్యము-పరోపకారము:
మానవ జన్మ ఎత్తిన వారికి కష్టాలు తప్పవు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ‘ఉండాలన్నారు.
పరోపకారం చెయ్యాలనే ఆలోచన మనోవ్యాధికి గొప్పమందుగా కవి సూచించారు. తనకొచ్చిన ఆపదకు భగవంతుడిని కర్తను చేయడం తగదన్నారు.
“బ్రదుకంతయు నురుఁగును… (లలనా శతకము, పద్యనంఖ్య 84, పుట.20, వింజమూరి చిన్న సుబ్బారావు)
ఇతరుల ఆపదలందు దయను ప్రదర్శించడం, తన కాపద సంభవించినప్పుడు ధైర్యాన్ని విడనాడకుండుట బుద్భుదప్రాయమైన జీవితంలో స్థిరంగా ఉండేవి ఈ రెండేనని తెలియజేశారు.
వివిధ ధర్మములు:
స్త్రీలు సూర్యోదయానికి ముందే మేల్కొవాలి, లేనిచో నిద్దురపోతని అందరూ నిందిస్తారన్నారు. లేవగానే దైవనామస్మరణ చేసుకుని తర్వాత ఇంటిపనులు మొదలుపెట్టాలని తీరిక సమయాన్ని వృథా చేయక అభివృద్ధి కారకాలైన మంచి పుస్తకాలు పఠించాలన్నారు.
“మనదేశంబున నీతిక… (లలనా శతకము, పద్యనంఖ్య: 98, పుట.23, వింజమూరి చిన్న సుబ్బారావు)
మనదేశ నీతికి స్త్రీలే మూలమని పండితుల మాటను నిజం చెయ్యాలన్నారు.
“నీతిని విడనాడినచో
“కూతురు ప్రకటించు మాతగుణ” మనిలోకుల్
నీతల్లిని దూటిన యా
పాతక మంతయును నీవె పడయుదులలనా! (లలనా శతకము, విద్యనంఖ్య : 99, పుట.23, వింజమూరి చిన్న సుబ్బారావు)
అంటూ తల్లికి మంచి పేరు తెచ్చేలా మెలగాలని బోధించారు.
ఈ శతక కర్త పితృస్వామ్య వ్యవస్థ కనుగుణంగా స్త్రీని బతకమంటూనే, స్త్రీడి సంబంధించి కొన్ని ఆధునిక భావాలు వ్యక్తం చేశారు. స్త్రీకి విద్య అవసరమని, వివాహ విషయంలో ధనానికి ప్రాధాన్యత నివ్వకూడదని తెలియజేశారు.
స్త్రీ తీరిక సమయాలలో అభివృద్ధి కారకమైన పుస్తకాలని చదవాలని పేర్కొన్నారు.
స్త్రీ చదువు గురించి చెబుతూ-
“నేరువవలె గణితంబును
నేరువవలె నిత్యము గృహనిర్వాహకమున్
నేరువవలెఁ గుట్టుటయును
నేరువవలెఁ బావిద్య నిరతములలనా!”( లలనా శతకము, పద్యసంఖ్య 12, వుట.6, వింజమూరి చిన్న సుబ్బారావు) అన్నారు. దీనిని బట్టి స్త్రీ చదువు ఇంటిఖర్చులు చూసుకోవడానికి, కుట్టుపనికి, వంట చేయడానికి పనికి వచ్చేదిగా ఉండాలనేది కవి ఉద్దేశం. కోడళ్ళు అత్తింట ఎలా మెలగాలో వివరిస్తూనే అత్తలు కోడళ్ళను ఎలా చూసుకోవాలో కూడా చెప్పారు.పెళ్ళిళ్ళలో అధిక ధన వ్యయం కూడదన్నారు.
“పుట్టింటివారు తమితో…. “( లలనా శతకము, పద్యసంఖ్య 40, పుట.11, వింజమూరి చిన్న సుబ్బారావు)
పుట్టింటివారు ఇష్టంతో ఇచ్చిన తృణమైనా గ్రహించాలని, ఇది కావాలని అది కావాలని తల్లిదండ్రులను పీడించొద్దని తెలియజేశారు..
“ధనమున్న గలుగు సౌఖ్యం….”,( లలనా శతకము, పద్యనంఖ్య: 43, పుట. 12, వింజమూరి చిన్న సుబ్బారావు
ధనుమంటే సౌఖ్యముంటుందన్న మాట వట్టి భ్రమని ధనమున్నా సంతృప్తి లేకపోతే జీవితం దుఃఖభాజనమౌతుందని తెలియజేశారు.
ధనమున్నా ఎవరి పనులు వారే చేసుకోవటం ఆరోగ్యానికి, సంసారానికి మేలు చేస్తుందని, ఉన్న సంపదను అనుభవించాలని, ఇతరులకు దానం చెయ్యాలని ఈ రెండు చేయనివారు ఇహపరాలు రెండింటిని చెడిన వారౌతారన్నారు.’
“పనిచేయునపుడు దాసీ…..”( లలనా శతకము, పద్యసంఖ్య, 54, పుట 14, వింజమూరి చిన్న సుబ్బారావు,
పని చేసేటప్పుడు దాసీలా చెయ్యాలని, సౌఖ్యమనుభవించేటప్పుడు రాణీలా
‘సౌఖ్యమనుభవించాలన్నారు.
చెడు సహవాసం వల్ల చెడు బుద్ధులే వస్తాయని, కాబట్టి బిడ్డలను చెడు సహవాసానికి దూరంగా ఉంచాలని, బిడ్డలెప్పుడైన తప్పుచేసినా వారిని దండించకుండా, వారు చేసిన తప్పు వారికి తెలిసేలా చేయాలని చిన్నతనంలోనే పిల్లల్ని నీతిమార్గంలోకి మరల్చాలన్నారు.
“తల్లిదండ్రులు పిల్లలత… “( లలనా శతకము, పద్యనంఖ్య: 63, పుట 16, వింజమూరి చిన్న సుబ్బారావు)
తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పులను కప్పిపుచ్చినట్లయితే, ‘తోటకూర సామెత’లా దానికి తగిన ఫలితాన్ని అనుభవించక తప్పదన్నారు. పెద్దలు మాట పిల్లలు అనుకరిస్తారు కాబట్టి పిల్లలు ఎదుట పరుషంగా మాట్లాడ డూడదన్నారు.
అన్ని ఇతర స్త్రీ నీతి శతకాలు స్త్రీలను దాసీ స్థానంలో నిలబడితే ఈ శతక కర్త “వనిచేసేటప్పుడు దానిలా పనిచేయమంటూనే, అనుభవించేటప్పుడు రాణిలా అనుభవించమన్నారు”. స్త్రీని రాణిలా బతకమనటం ఆనాటి స్త్రీల స్థితిగతులతో పోలిస్తే అది గొప్ప విషయంగానే భావించాలి. స్త్రీ దృష్టిని చదువు వైపు మరల్చడమే అభ్యుదయంగా భావించవచ్చు.
ముగింపు:
వింజమూరి చిన్న సుబ్బారావు రచించిన లలనా శతకంను పరిశీలించినప్పుడు ఆనాటి స్త్రీ జీవితం, కుటుంబ వ్యవస్థ, సామాజిక విలువలు, స్త్రీల పట్ల సమాజం కలిగి ఉన్న అంచనాలు స్పష్టంగా అవగతమవుతాయి. స్త్రీలు పుట్టింటిలోనే గృహకార్యాలను నేర్చుకోవడం, అత్తింటి బాధ్యతలను స్వీకరించడం, భర్తకు విధేయంగా ఉండటం, అత్తమామలను గౌరవించడం వంటి అంశాలకు కవి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ భావనలు ఆనాటి పితృస్వామ్య కుటుంబ వ్యవస్థను ప్రతిబింబిస్తాయి.
అయితే లలనా శతకంను కేవలం సంప్రదాయ స్త్రీధర్మాన్ని బోధించే రచనగా మాత్రమే చూడటం సముచితం కాదు. స్త్రీలకు విద్య అవసరమని చెప్పడం, ఆడపిల్లను మగపిల్లవాడితో సమానంగా చదివించాలనే భావనను వ్యక్తం చేయడం, వివాహాల్లో అనవసరమైన ఆడంబరాలకు మరియు అధిక ధనవ్యయానికి వ్యతిరేకంగా చెప్పడం, ధనం కంటే విద్య, వినయం, ఆరోగ్యం, యోగ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు కవి ఆలోచనల్లోని మార్పును సూచిస్తాయి. స్త్రీలు మంచి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించడం కూడా ఆ కాలానికి సంబంధించిన అభ్యుదయ దృక్పథంగా పరిగణించవచ్చు.
అదేవిధంగా, గృహ నిర్వహణలో పొదుపు, ఆరోగ్య పరిరక్షణ, పిల్లల పెంపకం, తల్లిదండ్రుల బాధ్యత, పరోపకారం, ధైర్యం, సంతృప్తి వంటి అంశాలను ప్రస్తావించడం ద్వారా కవి స్త్రీని కుటుంబ జీవితానికి కేంద్రబిందువుగా చిత్రించారు. “పనిచేయునపుడు దాసీలా, సౌఖ్యమనుభవించేటప్పుడు రాణిలా” అనే భావనలో స్త్రీ కేవలం సేవకురాలిగా కాకుండా, తన జీవితంలో సౌఖ్యానుభూతికి కూడా అర్హురాలనే ఆలోచన వ్యక్తమవుతుంది.
అందువల్ల లలనా శతకంలో ఒకవైపు సంప్రదాయ పితృస్వామ్య విలువలు, మరోవైపు స్త్రీ విద్య, వ్యక్తిత్వ వికాసం, ఆర్థిక విచక్షణ, ఆరోగ్యం, సామాజిక బాధ్యత వంటి అభ్యుదయ భావాలు సమాంతరంగా కనిపిస్తాయి. ఈ రెండు ధోరణుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని, సమన్వయాన్ని గుర్తించినప్పుడే ఈ శతకంలోని స్త్రీ దృక్పథాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవచ్చు. ఆనాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశీలించినప్పుడు లలనా శతకం స్త్రీ జీవితానికి సంబంధించిన సంప్రదాయ భావజాలాన్ని మాత్రమే కాకుండా, మారుతున్న సామాజిక విలువలకు సంబంధించిన కొన్ని ఆధునిక ఆలోచనలను కూడా ప్రతిబింబించిన నీతి శతకంగా చెప్పవచ్చు.
ఆధార గ్రంధాలు :
చిన్న సుబ్బారావు వింజమూరి – లలనా శతకము
గోపాల కృష్ణా రావు.కె ఆంధ్ర శతక సాహిత్య వికాసం
నాగేశ్వర శాస్త్రి ద్వాదశ – తెలుగు సాహిత్య చరిత్ర
సుబ్బారావు వంగూరి – శతక కవుల చరిత్ర .
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
