
Volume – 1, July 2026, issue – 4,
సమర్పణ (D.O.S): 09-06 – 2026 ఎంపిక (D.O.A): 22– 06 – 2026 ప్రచురణ (D.O.P) : 01-07-2026
వ్యాస సంగ్రహం:
తెలుగు సాహిత్యంలో శతక సాహిత్యం ప్రజలకు నైతిక విలువలు, సామాజిక చైతన్యం, ఆచార వ్యవహారాలను సులభమైన భాషలో అందించిన ప్రముఖ ప్రక్రియ. ఈ శతకాలలో స్త్రీ జీవితం, ఆమె వ్యక్తిత్వ వికాసం, కుటుంబంలో ఆమె పాత్ర, సామాజిక బాధ్యతలు, నైతిక విలువలు వంటి అంశాలను ప్రతిబింబించిన శతకాలకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి స్త్రీ సంబంధిత శతకాలలో “కుమారీ శతకం” ప్రముఖమైనది. బాలికలను ఆదర్శవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో రచించబడిన ఈ శతకం, విద్య, వినయం, సంస్కారం, శీలం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ విలువలు, సమాజంలో స్త్రీ స్థానం వంటి అంశాలను బోధనాత్మక దృష్టితో వివరిస్తుంది. సంప్రదాయ విలువలను ప్రతిపాదించిన ఈ శతకం, ఒకవైపు స్త్రీ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడగా, మరోవైపు అప్పటి సామాజిక నిర్మాణం స్త్రీపై విధించిన పరిమితులను కూడా ప్రతిబింబిస్తుందని ఈ పరిశోధన విశ్లేషిస్తుంది.
ఈ వ్యాసంలో “కుమారీ శతకం” కేవలం నీతి బోధక గ్రంథమే కాకుండా, తెలుగు సమాజంలోని స్త్రీ జీవితాన్ని, విలువలను, సంస్కృతిని, సామాజిక దృక్పథాన్ని ప్రతిబింబించిన ముఖ్యమైన సాహిత్య ప్రక్రియగా నిలుస్తుందని నిర్ధారించబడుతుంది.
ముఖ్య పదాలు (Keywords):
కుమారీ శతకం, శతక సాహిత్యం, స్త్రీ సంబంధిత శతకాలు, తెలుగు సాహిత్యం, స్త్రీ విద్య, నైతిక విలువలు, స్త్రీ వ్యక్తిత్వం, సామాజిక దృక్పథం, స్త్రీవాద విశ్లేషణ, సంస్కృతి.
పరిచయం:
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రక్రియల్లో శతక సాహిత్యం ఒకటి. శతకకర్తలు విభిన్న అంశాలను వస్తువులుగా స్వీకరించి, శతక సాహితీవికాసానికి తోడ్పడ్డారు. సాహితీ పరిశోధకులు శతక సాహితీ అధ్యయనాన్ని సులభతరం చేయటానికి వస్తుపరంగా శతకాలను వర్గీకరించారు. శతకాన్ని గూర్చి ఆంద్ర శతక సాహిత్య కర్త కె.గోపాల కృష్ణారావు గారు
“మకుటాత్మకమగు ముక్తక సముచ్చయమే శతకము “(ఆంద్ర శతక సాహిత్య వికాసము , పుట -6,కె.గోపాల కృష్ణా రావు).
“శతకములు భావ గీతములు “అని తెలిపారు (శతక కవుల చరిత్ర , పుట -10 వంగూరు సుబ్బారావు ).
“శతకము సర్వ జనాదరణీయమైన శక్తివంతమైన సాహిత్య ప్రక్రియ “ అన్నారు (తెలుగు సాహిత్య సమీక్ష , 2 వ సంపుటం , పుట – 545 , జి. నాగయ్య )
శతక సాహిత్యంలో వస్తువనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేవి భక్తి శతకాలే. ఉదాహరణకు ‘శతక వాఙ్మయం’ అనే పుస్తకంలో కె. గోపాలకృష్ణరావుగారు శతకాలను విషయపరంగా భక్తిశతకాలు, నీతి శతకాలు, అధిక్షేప శతకాలు, శృంగార శతకాలు, హాస్యశతకాలు, తాత్విక శతకాలు, చారిత్రక శతకాలు, భాషా వ్యాకరణ నిఘంటు ప్రహేళికా శతకాలు ఇత్యాదిగా వర్గీకరించారు.
నా పరిశోధనా దృష్టి కోణం నుంచి శతకాలను పరిశీలించినప్పుడు శతకాలలో అక్కడక్కడ స్త్రీలకు సంబంధించిన అంశాలు చోటుచేసుకోవడంతోపాటు, ప్రత్యేకంగా స్త్రీల గురించి రాసిన శతకాలు కూడా లభ్యమవ్వడంవల్ల, పఠితల సౌలభ్యం కోసం నాకు లభించిన స్త్రీ సంబంధి శతకాలనన్నింటినీ ఈ అధ్యాయంలో పొందుపరచి చర్చించడమైంది.
స్త్రీలకు నీతులు బోధించిన శతకాలలో పేరెన్నికగన్న శతకం “కుమారీ శతకం” దీని కర్త “పక్కి వేంకట (నరసింహకవి) నరసయ్యగారు. ఇది క్రీ.శ. 1830లో రాసిన శతకం. ఈ శతకానికి రాసిన ముందుమాటలో కవిపేరు కాలాన్ని పేర్కొని ఇది స్త్రీలకు నీతిని బోధిస్తుందని, స్త్రీలకు అవశ్యపఠనీయమని రాశారు.
అరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం 10వ సంపుటంలో (కుంపుణీయగం- క్రీ.శ.1750-1850) “నూటయాభైమంది శతక కవులు” అనే శీర్షికలో ఈ శతక ప్రస్తావన ఉంది. “కుమారీ శతకం కొన్ని ప్రత్యేక చారిత్రక అవసరాల వల్ల పుట్టింది. కుంపుణీయుగంలోనే ఆడపిల్లలకు బడి చదువులు వచ్చాయి. కొన్నిచోట్ల బాలికా పాఠశాలలు స్థాపించారు. ఈ విద్యార్థినిలకు బోధించవలసిన నీతిశతకాలు కరువయ్యాయి. ఆ కొరతను పక్కి వేంకట నరసయ్య పూరించాడు. ఆయన విశాఖపట్నం క్రైస్తవ పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేశాడు. చాలాగ్రంథాలు రచించాడు. కుమారీ శతకమే కాక నారాయణ శతకాన్ని కూడా చెప్పాడు. అయితే మొదటి దానికి వచ్చిన ప్రచారం మరే గ్రంథానికి రాలేదు. తరతరాలుగా హైందవ సమాజంలో పెద్దలు చెప్తూ వచ్చిన నీతులను ఈయన సూటిగా తేటగా చెప్పడమే అందుకు కారణం పుట్టింటికి, అత్తవారింటికీ పేరు తెమ్మని ఈ శతకం బోధిస్తుంది”( ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం 10వ సంపుటం, పుట. 220, ఆరుద్ర)
ఈ శతకానికి మకుటం “కుమారీ!” పెళ్ళికాని ఆడపిల్లను ‘కుమారీ’ అంటారు. ఈ శతక విశేషమేమిటంటే ఇది పేరుకి ‘కుమారీ శతకం’ కాని ఇందులో పేర్కొన్న విధులన్నీ పెళ్ళయిన స్త్రీలకు ఉద్దేశించినవే కావటం విశేషం.
ఈ శతకంలో మొదటి పద్యం దేవతాస్తుతికి సంబంధించింది. రెండవ పద్యంలో కవి ఇలా సెలవిచ్చారు.
“చెప్పెడి బుద్దుల లోపల
దప్పకు మొకటైన సర్వ ధర్మములందున్
మెప్పొంది యిహపరంబులఁ
దప్పింతయు లేక మెలఁగ దగును కుమారీ!“( శతకమంజరి, పద్యసంఖ్య 5, పుట. 392)
కుమారీ! నేను చెప్పునట్టి మంచి గుణములలో ఒక్కటైనా విడువక అన్నింటినీ పాటించు. అన్ని ధర్మములందు మెప్పును పొంది ఇహపరములందు తప్పులేకుండా ప్రవర్తించుట మంచిది.
ఒక్కటైనా విడిచిపెట్టకుండా ఆచరించమని స్త్రీలకు కవిగారు సెలవిచ్చిన ఆ నీతులను పరిశీలిస్తే, ఈ పద్యాలన్నీ నూటికి నూరుపాళ్ళు పురుషాధిక్య భావజాలాన్ని వ్యక్తం చేసేవిగాను, పితృస్వామ్య వ్యవస్థకి అనుగుణంగా స్త్రీని అణకువగా నడచుకోమని నిర్దేశించేవిగానే కనబడతాయి. ఆడపిల్ల అత్తింట ఎలా మెలగాలో, భర్తతో ఎలా విధేయంగా ఉండాలో నయానాభయానా నూరిపోసిన పద్యాలివి.
ఆడపిల్ల జీవిత పరమావధి అత్తవారిల్లేనని, పతిసేవాభాగ్యమే సతి జీవన సౌభాగ్యమని, భర్త మంచివాడైనా, చెడ్డవాడైనా, యోగ్యుడైనా, అయోగ్యుడైనా, నిరుపేదయినా, నిర్భాగ్యుడైనా, వ్యసనపరుడైనా, వేశ్యాలోలుడైనా, పతి చెప్పినట్టు పడతి నడుచుకోవాలని, భర్త చెప్పుచేతల్లో మెలగాలని, భర్తతో చెప్పుదెబ్బలు తినాలని, భర్త చెడ్డపనులు చేయమన్నా చీదరించుకోకూడదని అదే బ్రహ్మానందంగా భావించి ఆ పనులు చేయాలని. స్త్రీ గబగబా నడవకూడదని, గలగలా నవ్వకూడదని. భర్త సేవే స్త్రీల ముక్తికి సోపానమార్గమని ఇలాంటి నావానమార్గమని ఇలాంటి అనేకానేక విషయాలను సులభశైలిలో బోధించిన శతకమిది.
ఇందులో శతకకర్త వ్యక్తం చేసిన భావాలను స్త్రీలకు విధించిన విధులను సౌలభ్యం కోసం రెండు విధాలుగా విభజించాను.
1. స్త్రీలు చెయ్యాల్సిన పనులు
2. స్త్రీలు చెయ్యకూడని పనులు
1. స్త్రీలు చెయ్యాల్సిన పనులు:
“మగనికి నత్తకు మామకు
దగ సేవ యొనర్చుచోట దత్పరిచర్యన్
మిగుల నుతి బొందుచుండుట
మగువలకుం బాడి తెలిసి మసలు కుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 3, పుట. 391)
స్త్రీ భర్తకు అత్తమామలకు సేవ చేయాలి. ఆ సేవలలో మిక్కిలి మెప్పు సంపాదించుకొనుటకు మెలకువతో ఉండాలి. మరదలు, వదినెలు, బావల కొడుకులు మరియు పెద్దలు వచ్చినప్పుడు స్త్రీ పీటలు, మంచములు. అరుగుల మీద కూర్చున్నచోత్వరపడి దిగాలి.
“పతి పరకాంతలతో సం
గతిఁజేసిన నాడు పుణ్య గతి యిట్లనుచున్
మతిఁ దలఁవలయు లేదా
బతిమాలగవలయు గలహ పడక కుమారీ!” ( శతకమంజరి, పద్యసంఖ్య: 13, పుట. 395)
భర్తకు పరాయిస్త్రీలతో సంబంధం ఉంటే నా పుణ్యమింతే అని సరిపెట్టుకోవాలి.
లేదా భర్తని బతిమాలాలి. కాని పోట్లాడకూడదు.
“పతి పాపపుఁ బని జెప్పిన
బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 11, పుట, 394)
భర్త పాపపు పని చెయ్యమంటే ప్రార్థించి అతడాపని మానునట్లు చెయ్యాలి. అతడు వినకపోతే మంచిదనుకుని మనసులో సందేహపడకుండా ఆ పని చెయ్యాలి.
“పతి భుజియించిన పాత్రను
మెతుకొక్కటియైన భార్య మెసగుటకై తా
హీత మూనకున్న నది యొక
సతియే కడుఁ బాపజాతి జగతి కుమారీ!””( శతకమంజరి, పద్యసంఖ్య: 18, పుట. 397)
భర్త భోజనం చేసి పాత్రయందలి ఒక మెతుకైనా భార్య తినాలి. లేకపోతే ఆ స్త్రీ పాపాత్మురాలవుతుంది.
“వేకువ జామున మేల్కని
పైకి వెడలి వచ్చి ప్రాఁచి పని దీర్పవలెన్
లేకున్నఁ దెల్లవారిన
లోకులు నవ్వుదురు సభలలోన కుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 38, పుట. 404)
తెల్లవారు జామున లేచి పాచిపనులు చేసుకోవాలి. అట్లుగాక తెల్లవారితే నలుగురు.
కూర్చొని మాట్లాడుచోట్ల నీ గురించి చెప్పుకొని నవ్వుకుంటారు.
తన కడుపుకు తినకైనను, చుట్టాలకు పెడితే కీర్తి కలుగుతుంది. భోగమోక్షములు కలుగుతాయి.
“తా నమ్ముడుపడియైనం.
దీనుండగు ధవునియార్తి దీర్చుట సతికిన్
మానము చంద్రమతీ జల
జానన దలపోయవలయు నాత్మకుమారీ!””(శతకమంజరి, పద్యసంఖ్య: 66, పుట. 413)
తానమ్ముడు పోయియైనను దరిద్రుడైన తన భర్త కష్టము తీర్చుట పతివ్రతకు మర్యాద!
… మనసున హరిశ్చంద్రుని భార్యయగు చంద్రమతిని తలచుకోవాలి.
“గురుశుక్రవారముల మం
దిరగేహళులందు లక్ష్మి తిరముగ నిలుచుం
గరగరిక నలికి మ్రుగ్గిడి
గురుభక్తి మెలంగఁబాయు గొదువ కుమారీ! ( శతకమంజరి, పద్యసంఖ్య: 70, పుట. ‘414)
గురుశుక్రవారములందు ఇంటిగడపల లక్ష్మీదేవి స్థిరముగ నిలుస్తుంది. కావున శుభ్రముగ అలికి ముగ్గులు పెట్టినచో హీనదశ తొలగిపోతుంది.
ఇతరుల వస్తువులు ఎరువుగా తెస్తే, పనైపోయిన వెంటనే తిరిగి ఇచ్చెయ్యాలి. కలిగినంతలో దానధర్మాలు చేయాలి.
“వడ్డించునపుడు తాగను
బిడ్డనికిం దల్లి భంగిఁ బ్రేమ దలిర్పన్
వడ్డింపవలయు భర్తకు
నెడ్డెతనము మానవలయు నెండు కుమారీ!”(శతకమంజరి, పద్యసంఖ్య: 76, పుట, 416,417)
స్త్రీ భర్తకు భోజనం వడ్డించేటప్పుడు బిడ్డకు తల్లి ఎంతో ప్రేమతో వడ్డిస్తుందో అంత ప్రేమతో వడ్డించాలి.
“పవళించునపుడు రంభా కువలయదళనేత్రి భంగి కోరిన రీతిన్ ధవుని కొనఁ గూర్పవలయును దివి భువి నుతిఁ బొందునట్టి తెఱవ కుమారీ!”””( శతకమంజరి, పద్యసంఖ్య: 74, పుట, 416)
పడుకునే సమయంలో భార్య రంభవలె భర్త కోరిన విధంగా నడుచుకొనుచు అతనిని సంతోషపెట్టుట భార్య కర్తవ్యం. అట్లు చేసినచో ఇహపరాలలో స్త్రీ కీర్తి పొందుతుంది.
“ఆలోచన యొనరించెడి
వేళలలో మంతి భంగి కోరిన రీతిన్
కాలోచితకృత్యంబుల
భూలోకమునందు గీర్తిఁబొందు కుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 78, పుట. 417)
భర్తకు కార్యాలోచనలో మంత్రివలె మంచి సలహాలను ఇచ్చిన స్త్రీ ఈ లోకంలో గణ్యత పొందును.
“పని సేయునపుడు దాసీ
వనిత విధంబునను యేను వంపగఁవలయున్
ధనవంతుల సుతయైనను
ఘనత గలుగు దానివలనఁ గాదె కుమార్! (శతకమంజరి, పద్యసంఖ్య: 79, పుట. 417)
తాను ఎంత ఐశ్వర్యవంతుల బిడ్డయైనా పనిచేయు సమయమునందు తన శరీరం వంచి దాసీదానివలె పనిచేసిన స్త్రీని జనులు కీర్తిస్తారు.
“శ్రమయెంత సంభవించిన క్షమ మఱువఁగరాదు ధరణి చందంబున స త్యమున బ్రవర్తించి యా రమణియె లోకంబునందు రమణి కుమారీ!” ( శతకమంజరి, పద్యసంఖ్య: 80, పుట, 418)
ఎన్ని కష్టాలు సంభవించినా భూదేవివలె ఓర్పుతో ఉండాలి. ధర్మబద్ధంగా సంచరించిన స్త్రీయే మంచిదనిపించుకొనును. ఇలా ఉన్న స్త్రీ కీర్తి పొందుతుంది. భూలోకంలో నిందలు తొలగిపోతాయి. ఘోరమైన పాపాలన్నీ కూడా పోతాయి.
2. స్త్రీలు చెయ్యకూడని పనులు:
“తిట్టినఁదిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేనిఁ గోపింపక నీ
పుట్టిన యింటికిఁ బాదము
పెట్టిన యింటికి వన్నె పెట్టు కుమారీ!”(శతకమంజరి, పద్యసంఖ్య: 12, పుట. 395)
భర్త తిట్టినా తిరిగి తిట్టకూడదు. కొట్టినా కొట్టకూడదు. కోపగించినా కోపగించకుండా పుట్టింటికీ అత్తింటికీ పేరు తీసుకురావాలి.
“నోరెత్తి మాటలాడకు,
మాటాడకుఁ గోపపడిన మర్యాదలలో
గోరంత తప్పి తిరుగకు
మీరకుమీ యత్తపనుల మెలఁగు కుమారీ!” ( శతకమంజరి, పద్యసంఖ్య:7, పుట. 393)
నోరెత్తి మాట్లాడకూడదు. అత్తింటివారు కోప్పడినా వారిని ఏమీ అనకూడదు.
మర్యాదలలో కొంచెమైన లోపం రానివ్వకూడదు. అబద్ధాలాడకూడదు. భర్త కొట్టవస్తే కేకలు పెట్టకూడదు.
“తల్లిదండ్రులన్నదమ్ములు
తులఁదూగగనిమ్ము పసిడిఁతోనైనను వా
రలయింట సతత ముండుట
వేలఁదికి మర్యాదగాదు వినవె కుమారీ!” (శతకమంజరి, పద్యసంఖ్య: 25, పుట. 399)
తల్లిదండ్రులు, అన్నదమ్ములు బంగారంతో తులతూగినా వాళ్ళింట్లో ఎల్లప్పుడు ఉండకూడదు. అది స్త్రీకి మర్యాద కాదు. భర్తకు, అత్తమామకు, ఇష్టంకాని పనులు కాదు. భర్తకు, అత్తమామకు, ఇష్టంకాని పనులు మానెయ్యాలి. అధిక ప్రసంగాలు చెయ్యకూడదు.
అత్తింటివారు పెట్టిన కష్టాలు పుట్టింట్లో చెప్పకూడదు. తనకెంత మేలు చేసిన దాసీవాళ్ళకు చనువివ్వకూడదు.
“కూతురుఁ చెడుగై యుండిన
మాతది తప్పన్న మాట మది నెఱుగుదుగా
నీ తలిదండ్రులకు నప
ఖ్యాతులు రానీయగూడ దమ్మ కుమారీ!” (శతకమంజరి, పద్యసంఖ్య: 17, పుట. 396)
బిడ్డ చెడుపనులు చేస్తే తల్లినే తప్పుపడతారు. కాబట్టి తల్లిదండ్రులకు అపకీర్తి తెచ్చే పనులు చేయకూడదు.
“ఇక్కడి దక్కడ నక్కడ
దిక్కడ జెప్పినను వారి కిద్దరికిఁ బగల్
పొక్కినఁగల చేడియల
మ్మక్కా యిడుమళ్ళమారి యండ్రుకుమారీ!“( శతకమంజరి, పద్యసంఖ్య: 41, పుట. 404)
“ఇక్కడిమాటలక్కడ, అక్కడిమాటలిక్కడా చెప్పి ఇరువురి మధ్య పగలు, ద్వేషాలు పెరుగునట్లు చేయు స్త్రీని తోటి ఆడవాళ్ళు తగవులమారి, కయ్యాలమారి అని అందురు.
కాబట్టి అలాంటి పనులు చెయ్యకూడదు.
“తలవాకిట నెల్లప్పుడు
నిలువంగ రాదెప్పుడెంత నిద్దురయైనన్
మెలకువ విడరాదు సుమీ
తలనడచుచు విప్పికొనుట తగదుకుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 39, పుట. 404)
తలవాకిట ఎప్పుడూ నిలవకూడదు. ఏవేళ ఎంత నిద్దురలో ఉన్నా మెలకువ కలిగి ఉండాలి. నడచేటప్పుడు జుట్టు విప్పకూడదు.
“నవ్వంగ రాదు పలుమరు
నవ్వినఁ జిఱునవ్వుగాని నగరాదెపుడున్
గవ్వలవలె దంతంబులు
జవ్వున కానంగఁ బడెడి జాడకుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 45, పుట. 406)
స్త్రీ ఎక్కువసార్లు నవ్వకూడదు నవ్వినా చిరునవ్వు నవ్వాలి. కాని గవ్వల్లా పళ్ళు కన్పించేలా ఏ సమయంలో కూడా నవ్వకూడదు.
“చెప్పకు చేసిన మేలు నొ
కప్పుడయినఁగాని దాని హర్షింపరుగా
గొప్పలు సెప్పిన నదియును
దప్పేయని చిత్తమందు దలఁపుకుమారీ!“( శతకమంజరి, పద్యసంఖ్య 58, పుట. 410)
నీవు ఏదైనా మేలు చేసినచో దానిని ఇతరులకు చెప్పకు దానిని ఎవరూ హర్షింపరు.
గొప్పలు చెప్పడం కూడా తప్పే అని తెలుసుకో.
“దీపములనీడ మానవ
రూపంబులనీడ శనిత రులనీడ సుఖ
ట్వపాదిత మగునీడల
నేపట్టున నిలువఁగూడ దెపుడు కుమారీ!”( శతకమంజరి, పద్యసంఖ్య: 96, పుట. 423)
దీపముల యొక్క, మనిషి ఆకారముల యొక్క తాండ్ర చెట్ల నీడ, మంచముల వలన పడు నీడలందు ఏ సమయంలో కూడ నిలవకూడదు.
కుమారీ శతకములో పేర్కొన్న కొన్ని అంశాలు:
*ఇతరులకున్న వస్తువులు తనకు లేవని బాధపడకూడదు.
* నడిచేటప్పుడు అడుగుల చప్పుడు వినబడకూడదు.
*భోజనపు పంక్తిలో పక్షపాతం చూపకూడదు.
*సన్నికాలు పొత్రాన్ని తన్నకూడదు.
* ఎంగిలి ఇతరులకు పెట్టకూడదు.
*కాలు మట్టెలు ఖంగుమని శబ్దం రాకూడదు.
*అధికారం లేనిచోట అధికారం చేయకూడదు.
*విరగబడి నడవకూడదు. ఇతరుల నడకలను తప్పు పట్టకూడదు.
స్త్రీల జీవితంలో అడుగడుగునా ఆంక్షలే స్త్రీ పుట్టింట మహరాణియైనా, అత్తింట అణకువతో మెలగాలి, వంచిన తల ఎత్తకుండా భర్తకు అత్తమామలకు సేవ చేయాలి. భర్త పెట్టే ఆంక్షలు, అత్తింటివారి ఆరళ్ళు, సమాజం గీసే హద్దులు వీటన్నిటినీ భరించాలి. భర్తకు అత్తింటివారికి, సమాజానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ బతకాలి, వారు చేయమన్న పనులు చేయాలి, చేయకూడదన్న పనులు మానాలి. ముఖ్యంగా పతిసేవే జీవిత పరమార్ధమని స్త్రీ భావించాలి, ఇలా పితృస్వామ్య భావజాలాలను పదే పదే నూరిపోసిన శతకం కుమారీ శతకం.
ముగింపు:
తెలుగు శతక సాహిత్యంలో స్త్రీ వ్యక్తిత్వ వికాసాన్ని, కుటుంబ జీవన విలువలను, నైతిక ధర్మాలను ప్రతిపాదించిన గ్రంథాలలో “కుమారీ శతకం” విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. బాలికలను ఆదర్శప్రాయమైన జీవన విధానానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రచించబడిన ఈ శతకం, విద్య, వినయం, శీలం, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం, కుటుంబ బాధ్యత, సామాజిక మర్యాద వంటి విలువలను సరళమైన భాషలో ప్రజలకు చేరవేసింది. అందువల్ల ఇది కేవలం నీతిబోధక శతకమే కాక, సమకాలీన సమాజంలోని సాంస్కృతిక, సామాజిక, కుటుంబ వ్యవస్థలకు అద్దం పట్టే సాహిత్య ప్రక్రియగా నిలిచింది.
ఈ శతకాన్ని నేటి దృక్పథంతో పరిశీలించినప్పుడు, ఇందులో ప్రతిపాదించిన కొన్ని భావాలు ఆ కాలపు సామాజిక నిర్మాణానికి అనుగుణంగా ఉన్నప్పటికీ, ఆధునిక స్త్రీ సమానత్వ భావనలకు పూర్తిగా అనుకూలంగా ఉండవని గమనించవచ్చు. ముఖ్యంగా స్త్రీ పాత్రను కుటుంబ పరిమితులలోనే నిర్వచించడం, విధేయతను ప్రధాన లక్షణంగా ప్రతిపాదించడం వంటి అంశాలు సమకాలీన స్త్రీవాద విమర్శకు గురవుతాయి. అదే సమయంలో విద్య, సంస్కారం, వ్యక్తిత్వ వికాసం, నైతికత వంటి విలువలు నేటి సమాజంలో కూడా తమ ప్రాసంగికతను కోల్పోలేదు.
కాబట్టి “కుమారీ శతకం”ను కాలానుగుణమైన సామాజిక పత్రంగా, సాంస్కృతిక దస్తావేజుగా, స్త్రీ సంబంధిత శతక సాహిత్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించవచ్చు. ఈ శతకంలోని విలువలను చారిత్రక సందర్భంలో అర్థం చేసుకుంటూనే, ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా విమర్శనాత్మక దృష్టితో పునర్వ్యాఖ్యానం చేయడం అవసరం. ఈ విధమైన అధ్యయనం తెలుగు శతక సాహిత్యంలోని స్త్రీ దృక్పథాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకోవడానికి దోహదపడటమే కాక, సంప్రదాయం–ఆధునికతల మధ్య ఉన్న భావపరమైన సంబంధాలను కూడా స్పష్టంగా తెలియజేస్తుంది.
ఆధార గ్రంధాలు :
ఆరుద్ర – ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం
గోపాల కృష్ణారావు .కె.- ఆంద్ర శతక సాహిత్య వికాసము
పక్కి వెంకట నరసింహ కవి – కుమారీ శతకము”
నాగయ్య.జి. – తెలుగు సాహిత్య సమీక్ష
సుబ్బారావు వంగూరు -శతక కవుల చరిత్ర
డా.కె.సుధారాణి ఏం.ఏ, ఏం.ఫిల్,పిహెచ్.డి