
Volume – 1, July 2026, issue – 4,
సమర్పణ (D.O.S): 04-06 – 2026 ఎంపిక (D.O.A): 14– 06 – 2026 ప్రచురణ (D.O.P) : 01-07-2026
వ్యాస సంగ్రహం:(Abstract) :
ఆధునిక తెలుగు సాహిత్యం అంతా మానవతా భావాలు నిండి ఉన్నాయి. ఆధునిక సాహిత్యంలో సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, భావకవిత్వోద్యమం, అభ్యుదయ కవిత్వోద్యమం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీ వాదకవిత్వోద్యమం, దళితవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయ వాదం, బి.సి. వాదం మొదలైన విధాలుగా సుసంపన్నం చేశారు. ఆ కవిత్వ ఉద్యమాలు అన్ని రచనలలో మానవత్వమే ప్రధానంగా కన్పిస్తుంది. ఆ రచనలు అన్ని మానవీయ స్పర్శ కలిగినవే.
సామాజికంగా, రాజకీయంగా తలెత్తిన ఉద్యమాలు అన్ని సాహిత్యంపై ప్రభావం చూపాయి. అందులో మానవతను చాటిన కవులు ఎక్కువగా ఉన్నారు. వారు సమాజం గురించి మనిషి గురించి, వారి స్థితి గురించి, వారి ప్రగతి కోసం తపించినది ఆధునిక కవులేనని తెలుపవచ్చు.
మానవత్వం అంటే మనిషితనం, మనిషితత్త్వం, మనిషిని మనిషిగా ఉంచే లక్షణం. మానవుని అభివృద్ధిని, అవసరాలను, కోరికలను, ఉన్నత స్థితిని, ఉత్తమ గుణాన్ని కాంక్షించుటమే మానవతావాదంగా రూపొందింది.
కీలకపదములు: (Key Words) :
మానవత, మానవతావాదం, కలువగుంట రామమూర్తి కవిత్వం, గురజాడ కవితలు, జాషువా ఖండకావ్యాలు,
శ్రీశ్రీ కవితా ఖండికలు, భారతదేశంలో ఎం.ఎస్.రాయ్ మానవతావాద
శ్రీశ్రీ కవితా ఖండికలు,
పరిచయం:
భారతదేశంలో ఎం.ఎస్.రాయ్ మానవతావాద వ్యాప్తికి ఎంతో కృషి చేశారు. మానవతా వాదానికి మార్క్సిజానికి పొంతన కుదరదని భావించిన రాయ్ గారు రాడికల్ హ్యూమానిజాన్ని ప్రతిపాదించాడు. జాతీయ వాదం కాదు, అంతర్జాతీయ వాదం ముఖ్యం అంటారు రాయ్. వ్యక్తి సమాజానికి బలికాకూడదు. వ్యక్తి స్వేచ్ఛలేని సమాజం అభివృద్ధి చెందదు అనేది రాయ్ ముఖ్య లక్ష్యం. భారతదేశంలో రాజారామమోహనరాయ్ గారు మానవతావాదానికి మార్గదర్శకుడని చెప్పాలి. తెలుగులో కందుకూరి వీరేశలింగం మానవతావాదానికి ప్రతినిధిగా తెలుపవచ్చును.
కలువగుంట రామమూర్తిగారు ‘మానవుడి సంక్షేమాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సాగే రచన మానవతా వాదానికి సంబంధించినదవుతుంది. కవిత్వ దృక్పథమే మానవ సంక్షేమం. వివిధ వాదాలకూ భేదాలకూ అతీతమై సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకునే కవిత మానవతా వాద కవిత అవుతుంది’అని వివరించారు.
మూఢాచారాలను నిరసించి, విగ్రహారాధనను గర్తించిన మానవతా వాది వేనున., జీవులందే ప్రేమభక్తి కలిగి ఉండవలెనని తెలిపారు.
‘హృదయ మందు నున్న యూశుని దెలియక
శిలల నెల్ల మ్రొక్కు జీవులార
శిలల నేమి యుండు జీవులందెగాక
విశ్వదాభిరామ వినుర వేమ’ అంటాడు.
గురజాడ అప్పారావుగారు మనిషి మనిషితనాన్ని మరువకూడదనీ, సాటి మనిషి ఉనికిని మరిచిపోరాదనీ అందరూ ఒకే మానవాత్మగా మన కలగాలనీ, మానవసేవే మాధవ సేవ అని చాటిచెప్పటమేగాక ‘మనిషి’ అనే కవితను రాసారు. అచ్చమైన మానతా వాదానికి నిదర్శనం ‘మనిషి’ కవిత.
‘మనిషి చేసిన రాయి రప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు మనుషులంటే రాయిరప్పల కన్న కనిష్టం గాను చూస్తావేల బేలా? దేవుడెకడో దాగినంటూ కొండ కోనల వెతుకులాడే వేలా?
కన్ను తెరిచిన కానబడదో?
మానవ మాత్రుడియందు లేడో
యెరిగి కోరిన కరిగియూడో ముక్తి’
గురజాడ తన కవిత్వంలో పవిత్ర దాంపత్య రక్తి, విశ్వమానవ ప్రేమ చాటాడు. సంఘసంస్కరణ కవిత్వంలో మానవతా వాదం ఉంది. అస్పృశ్యతను, వర్ణాధిక్యతను నిరసించటం మానవతావాదమే అంటారు.
గురజాడ అప్పారావుగారు తన దేశభక్తి గేయంలో ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఎల్లలోకము నొర్కయిలై వర్ణభేదములెల్ల కల్తె వేల నెరుగని ప్రేమ బంధము వేడుకలు గురియ’
దేశభక్తి ప్రబోధంలో వృత్తులను, వర్ణవ్యవస్థలను నిరసించిన మానవతావాది గురజాడ. కులవ్యవస్థలలోని కుళ్ళును భయట పెట్టి ప్రేమే గొప్పదని తెలిపిన కవి గురజాడ.
కవికోకిల గుర్రం జాషువాగారు తన బాల్యం నుండి మానవ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలకు ప్రాధాన్యమిచ్చారు. జాషువ ప్రతి మాట, ప్రతి పద్యం, ప్రతి వాక్కు, జాతీయ భావాలతో మానవ జీవిత విధానమునకు, నూతన మార్గములో సమైక్య సందేశమును మానవతా వాద ప్రబోధమును వినిపించారు. ఆధునిక యుగంలో సామాన్య మానవునికి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. మానవ ప్రాధాన్యాన్ని చాటిచెప్పి మధురమైన కవిత్వంలో జాషువా రచనలో కనిపిస్తుంది. జాషువ ‘ముసాఫర్లు’ కావ్యంలో మానవులందరూ ఒకే తల్లి బిడ్డలవలె, స్నేహితులవలె, జీవింపవలెనని, మానవతావాదమును చాటి చెప్పారు.
‘కోటానుకోట్ల నరులొక
మేటి జగన్మాతృ సుతులు మిత్రులని మదిం
బాటింపు మీ సువార్తన్
చాటింపుము జీవితంబు సార్ధక్యమగున్’
మానవతావాదానికి స్త్రీవాద కవిత్వాలు ప్రతిఫలించాయి. బి. పద్మావతి రాసిన ‘గుక్కపెట్టిన బాల్యం’ కవితలో
‘అమ్మ కావాలి
నాన్న చేత తన్నులు తినని అమ్మరావాలి
సుడిగుండంలా అమ్మ
ఏడుపు ముంచెత్తని
సుఖ నిద్ర రాత్రి కావాలి’ అని చిన్న పిల్ల కోరుకోవటం కనిపిస్తుంది.
కుందుర్తి అంజనేయులుగారు
‘మళ్ళీ నరజన్మ ఎందుకంటే
“మళ్ళి నరజన్మ ఎందుకంటే మనుషులంటే యిష్టం నాకు దేవుడి కంటే మనిషి యిష్టం’ అంటారు.
చెరబండరాజు
‘మానవత్వం సూత్రం కావాలని ప్రతి రోజు ప్రతి క్షణం పుట్టి చచ్చే వెలుగు కిరణం’ అంటాడు
శ్రీరంగం శ్రీనివాసరావు ‘భిక్షు వర్షీయసి’ కవితలో
‘దారిపక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్గొకతె మూలుగుతూ ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గు బుట్ట కంటి తలా ముడుతలు తేరిన దేహం కాంతిలేని గాజుకళ్లు
తన కన్నా శవం నయం’అంటాడు.
“అర్థగీతం’ కవితలో
‘నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రి చెట్టు క్రింద మరణించిన ముసలివాణ్ణి నేను చూశాను నిజంగా నీరంధ్ర వర్షాన
వంతెన క్రింద నించు చూలాలు ప్రసవించి మూర్చిల్లిన దృశ్యాన్ని నేను చూశాను నిజంగా తల్లి లేక తండ్రి లేక తిండి లేక ఏడుస్తూ మోచులతో కన్నులు తుడుచుకుంటూ మురికి కాల్వ పక్కనే నిద్రించిన మూడేళ్ళ పసిబాలుణ్ణి నేను చూశాను నిజంగా..
మూర్తి భవత్ దైన్యాన్ని, హైన్యాన్ని నాకు శాంతి కలగదింక నేస్తం నిగర్వినైనాను ఈ అర్తి ఏ సౌదాంతరాలకు పయనించగలదు?
ఏ భగవంతునికి నివేదించకోగలదు. అంటూ కొనసాగిన కవిత్వం అంతా మానవతావాదాన్ని
ప్రకటించినవే.
ముగింపు:
సమాజానికి ప్రతిబింబంగా సాహిత్యం నిలుస్తుంది. ఆధునిక కవిత్వం మొత్తం ప్రధానంగా మానవతావాదాన్నే ప్రబోధించింది. మానవత్వం లేని మానవ జీవనం నిరర్థకమే అవుతుంది. ఆధునిక తెలుగు కవులు అందరూ మానవత్వాన్ని చిత్రించారు. వాదాలు, ధోరణులతో సంబంధం లేకుండా స్వతంత్ర భావాలలో మానవత్వ పరిమళాలను ఆధునిక కవిత్వం అందించింది.
ఆధార గ్రంథాలు :
1. సామ్యూల్ ప్రభాకరరావు, ముప్పిడి,డా॥; జాషువా సాహిత్యము-మానవతావాదము పద్మభూషణ్ డా||గుర్రం జాషువా పరిశోధనకేంద్రం, హైదరాబాద్, 2014.
2. వెంకటాద్రి రావిపూడి, రాడికల్ హ్యూమనిజం; కవిరాజాశ్రమం, నాగండ్ల, లిబర్టీ ప్రెస్, చీరాల, 1983.
3. రంగనాయకమ్మ, ముప్పాళ్ళ, నాస్తికవాదం- హేతువాదం – నవ్య మానవతావాదం;
స్వీట్ హోమ్ పబ్లిరేషన్స్, హైదరాబాద్, 1980.
4. చంద్రశేఖరరెడ్డి, రాచపాలెం: ఆధునికాంధ్ర కవిత్వం ఉద్యమాలు: విశాలాంధ్ర బుక్ హౌస్, హైదరాబాద్, 2006
డా. యస్. జ్యోత్స్పారాణి
తెలుగు శాఖాధ్యక్షులు,
సప్తగిరి డిగ్రీ కళాశాల, విజయవాడ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~