sahithivani

 సంపాదకీయం – సాహితీ వాణి  జూన్ 2026

   

               Volume – 1,                                          June  2026,                            issue – 3,

                                              

తెలుగు కథా సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన ప్రముఖ రచయితలలో పాలగుమ్మి పద్మరాజు ఒకరు. పద్మరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని అత్తిలి మండలం, తిరుపతి పురంలో జూన్ 24, 1915లో జన్మించారు. ఎమ్.ఎస్సీ చదివారు. తర్వాత కాకినాడలోని పి.ఆర్. ప్రభుత్వం కళాశాలలో 1939 నుండి 1952 వరకు సైన్స్ అధ్యాపకులుగా పనిచేశారు. సత్యానందాన్ని వివాహం చేసుకున్నారు. ఎమ్.ఎన్, రాయ్ సిద్ధాంతలపై మక్కువతో వాటిని ప్రచారం చేశారు. హేతువాదిగా జీవించారు. 23 ఏళ్ల వయసులో తొలి కథ సుబ్బిని ప్రచురించారు. తర్వాత ఎన్నో విలువైన రచనలను తెలుగు ప్రజలకు అందించారు. మొత్తంగా 60 కథలు, 8 నవలలు, 30 కవితలు రాశారు.   కథారచయితగా, నవలా రచయితగా, సినీ రచయితగా తెలుగు సాహిత్యానికి విశేష సేవలను అందించారు. మానవ జీవితంలోని అంతర్ముఖ భావాలను, సామాజిక వాస్తవాలను, మనస్తత్వ సంఘర్షణలను తన రచనల ద్వారా అద్భుతంగా చిత్రించారు.వీరి వాసనలేని పువ్వు, హెడ్ మాస్టారు, కొలవరానిదూరం ఇలాంటి తప్పక చదవాల్సిన కథలు. ఇక నవలల విషయానికి వస్తే, పద్మరాజు బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ల పాలన వంటి ఎనిమిది నవలలు రాశారు.

పద్మరాజు రచనల్లో మానవతా దృక్పథం, వాస్తవికత, మనోవిశ్లేషణ ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామీణ జీవితం, మధ్యతరగతి కుటుంబాల సమస్యలు, వ్యక్తుల అంతర్గత సంఘర్షణలు ఆయన కథల్లో సహజంగా ప్రతిఫలిస్తాయి. సరళమైన భాష, సహజమైన శైలి, పాత్రల మనస్తత్వ చిత్రణ ఆయన రచనల ప్రత్యేకత.

ఆయన రచించిన కథల్లో గాలివాన” అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ కథకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అలాగే అనేక కథలు, నవలలు, వ్యాసాలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. సినీరంగంలో కూడా కథలు, సంభాషణలు రచించి తన ప్రతిభను చాటుకున్నారు.

తెలుగు కథానికను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన రచయితగా పద్మరాజుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆధునిక తెలుగు కథా వికాసంలో ఆయన పాత్ర విశేషమైనది. కథా శిల్పం, భావగాంభీర్యం, మనస్తత్వ విశ్లేషణలో ఆయన చూపిన నైపుణ్యం తరువాతి తరాల రచయితలకు ఆదర్శంగా నిలిచింది.

పాలగుమ్మి పద్మరాజు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే మహోన్నత రచయిత. తన కథల ద్వారా మానవ జీవిత సత్యాలను ఆవిష్కరించి తెలుగు కథా సాహిత్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆయన రచనలు నేటికీ పాఠకులను ఆలోచింపజేస్తూ తెలుగు సాహిత్య సంపదలో అమూల్యమైన భాగంగా నిలిచాయి.

           “సాహితీ వాణి” పరిశోధనా మాస పత్రిక ఈ సందర్భంగా  పాలగుమ్మి పద్మరాజు  గారి సాహిత్య సేవలను గుర్తుకు చేసుకోవడం ,    భావితరాల వారు వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తుంది..

ప్రధాన సంపాదకులు,

డా.లక్ష్మణరావు ఆదిమూలం .

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top