sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

భాగవత శ్రీకృష్ణుడు పర్యావరణ పరిరక్షకుడు – డా.యస్.జ్యోత్స్నారాణి

Volume – 1,                                     May  2026,                                             issue – 2,
సమర్పణ (D.O.S): 10 -04 – 2026                           ఎంపిక (D.O.A): 19 – 04 – 2026                                                       ప్రచురణ (D.O.P) :  01-05-2026  

 

వ్యాస  సంగ్రహం:

          పర్యావరణ పరిరక్షణ అంటే  గాలి,నీరు, భూమి, మరియు సహజవనరులను కాలుష్యం నుండి కాపడటమే.  పర్యావరణాన్ని కాపాడటమంటే మన భవిష్యత్తు తరాలకు కాపాడటం, ప్రకృతిలో భాగమైన మానవ జాతి మనుగడను నిలపటమనే చెప్పవచ్చు.

          ప్రాచీన కాలం నుండి అత్యాధునిక కాలం వరకు పర్యావరణ పరిరక్షణ వివిధ రూపాలలో కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ప్రకృతిని దైవంగా ఆరాధించారు. ఆధునిక కాలంలో పర్యావరణ కాలుష్యం గురించి ఆందోళలను ప్రధానాంశాలుగా మారటం జరిగింది. అలానే తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా ప్రాచీన సాహిత్యంలో ప్రకృతిని కాపాడిన ఎందరో మహాపురుషులు గురించి వేదాలలో, ఇతిహాసాలలో, పురాణాలలో, కావ్యాలలోనే కాక ఇతర ప్రక్రియా రచనలలో కూడా కనిపిస్తున్నారు. వారిలో ప్రధానంగా చెప్పకోదగిన ముఖ్యులుగా భాగవత శ్రీకృష్ణుడిని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు ప్రకృతిలో ప్రధానంగా జీవించిన మహనీయుడిగా తెలుపవచ్చు. శ్రీకృష్ణుడు పర్యావరణాన్ని కాపాడి మానవులకు కావలసిన నీరు, ఆహారం, భూమిని చక్కగా రక్షించారు. అందుకే శ్రీకృష్ణుడిని పర్యావరణ పరిరక్షకుడిగా భావించవచ్చు.

కీలకపదములు:

          పర్యావరణం, పంచభూతాలు, పురాణాలు, పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలు,కార్యక్రమాలు, భాగవత పురాణం, కాళీయమర్ధనం, ధేనుకాసుర వృత్తాంతం, గిరిమహోత్సవం, ముగింపు.

పరిచయం:

          పర్యావరణం అంటే ప్రకృతి అని అర్థం. ప్రకృతి ప్రాణకోటికి జీవనాధారమయినది. ప్రాణుల జీవనం పంచభూతాలతో కూడి వుంది. పంచ భూతాలు అంటే భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశము. పంచ భూతాలు లేనిదే భూమిపైన ఏఒక్క ప్రాణి కూడా చివరకు మానవుడు కూడా బ్రతకజాలదు. మనిషి మనుగడకు ఆధారమయినవి పంచభూతాలు. మానవ శరీరం కూడా పంచ భూతాలచే ఆవరించబడింది.ఆ శరీరం చూట్టూ పంచభూతాలున్నాయి. ఆ ప్రకృతి ఆవరణానికి విఘాతం కలిగితే పర్యావరణం పాడైనదని అంటాం. ఆ ప్రకృతికి వికృతి కలిగితే అంతా వినాశనమేనని చెప్పవచ్చు.

          నేడు భూమండలం అంతా ప్లాస్టిక్‌తో నిండిపోయింది. గాలి అంతా ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ,వాహనాల   నుండి వెలువడే పొగ, నీరు అంతా ఫ్యాక్టరీల నుండి వెలువడే రసాయనాలు కలిసియున్న వ్యర్థ పదార్థాలతో నదులు అన్నీ కలుషితమవుతున్నాయి. ఆకాశం కూడా ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల సూర్యుని నుండి ఎక్కువగా వెలువడే వేడి అధికమై రకరకాల చర్మసంబంధిత వ్యాధులకు కారణమౌతాయి.వీటి పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రజలు సంఘటితమయి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. పర్యావరణ పరిరక్షణకు  చెట్టు నాటటం ప్రథమ కర్తవ్యంగా పర్యావరణవేత్తలు పిలుపునిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎందరో మహానుభావులు, సంఘసేవకులు, ప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘వనం`మనం’ కార్యక్రమం చేపట్టగా, తెలంగాణ ప్రభుత్వం ‘హారితహారం’కార్యక్రమాన్ని చేపట్టి కొన్ని కొట్ల మొక్కలను నాటుతున్నారు.ఈ పర్యావరణ పరిరక్షణ అనేది అనాది నుండి నేటి వరకు అనేక కార్యక్రమాలు చేపడుతూనే వున్నారు. వేదకాలంనుండి కూడా జరుగుతుంది. ఆ పరిరక్షణకు దేవతలు, పురాణపురుషులు, మునులు,మహర్షులు కూడా యజ్ఞయాగాదులు కూడా చేసినట్లు పురాణాలు, కావ్యాలలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా భాగవతం కావ్యంలో శ్రీకృష్ణుడిని పర్యావరణ పరిరక్షకుడిగా బమ్మెర పోతన చిత్రించారు.

దశావతారములు`భాగవతం:

          వేద వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశారు. వాటిల్లో అయిదవది శ్రీమద్భాగతవము. దీనిని తెలుగులోకి సహజ పండిత బిరుదాంకితుడైన బమ్మెర పోతనామాత్యుడు అనువాదం చేశాడు. భాగవతం భక్తి శాస్త్ర సర్వస్వంగా పండితులు భావిస్తారు. భాగవతుల కథలను తెలియజెప్పేది భాగవతం. ఆ భాగవతులు శ్రీమహావిష్ణుమÖర్తిని పూజించే భక్తులు. వారికోసం విష్ణుమÖర్తి దశ అవతారాలుగా జన్మించాడే.అందులో ఒకటి శ్రీకృష్ణుడు. ఈ అవతారం దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించటం కొరకు. అంతేకాక దశఅవతారాలలో పరిపూర్ణావతారంగా శ్రీకృష్ణుడి అవతారాన్ని కీర్తిస్తారు.జాగ్రత్తగా పరిశీలించి చూస్తే  భక్తుల రక్షణ కోసమేకాదు యావత్ భూమండలాన్ని రక్షించడానికి కూడా విష్ణుమూర్తి  దశ అవతారాలుగా అవతరించాడు. అందులో ముఖ్యమయినది శ్రీకృష్ణుడు అవతారం అని తెలుస్తుంది.

          శ్రీమద్భాగవతంలో భాగాలు పన్నెండు స్కంధాలు. వాటిల్లో దశమస్కంధం శ్రీకృష్ణుడి జననం నుండి బాల్యలీలలు, బృందావనంలో  లీలలు, కాళీయమర్థనము, గొపికావస్త్రావహరణము,ఇంద్రగర్వభంగము,గిరిపూజ, కంసాది దుష్టులను సంహారము, గురుదక్షిణ, కుచేలుని స్నేహం,రుక్మిణికళ్యాణం,మరియు అష్టవిధ భార్యలను పొందినతీరు, నరకాసురవధ, శ్రీకృష్ణుడి సంతతి వంటి విషయాలు ఈ భాగంలో కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు గోకులంలో వున్నప్పుడు పర్యావరణ పరిరక్షణకు పూనుకున్నాడు.ఇక్కడ ప్రధానంగా మూడు  వృత్తాంతాలను వివరించదలచాను.అవి ఒకటి కాళియమర్థనము,రెండవది ధేనుకాసుర వృత్తాంతము , మూడవది  ఇంద్రగర్వభంగము.

          మొదటగా కాళీయమర్థనము. ఇది జల కాలుష్యం నివారణ కొరకు సృష్టించబడింది.ప్రకృతిలో ప్రధానమయినది నీరు. సృష్టిలో మొదటగా నీరే సృష్టింబడినట్లు ప్రమాణాలున్నాయి. హిమాలయాల నుండి పుట్టిన నీరు ,వర్షపు నీరు, కాలువల నుండి ప్రవహించే నీరు, నూతి నీరు అన్నీ మనుషులకు సుఖాన్ని కలిగిస్తాయి.నదులను కేవలం నీటితో నిండిన వాటిగా గుర్తించకుండా ఒక దేవతగా భావించటం హిందూ సంప్రదాయంలో ఒకభాగం. పన్నెండు ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు జరపటం కూడా పరిపాటి.

          బృందాదావనంలో బాలకృష్ణుడు,బలరామునితోను,గోపబాలురతోను కూడి విహరిస్తూ అనేక లీలలు చూపుతున్నాడు.ఒకనాడు బలరాముడు లేకుండా కృష్ణుడు మిత్రులతో కలిసి యమునానది వద్దకు వెళ్ళి ఆటలాడుతుండగా, అందరూ అలసిపోతారు.గోవులూ,గోపాలురు అంతా యమునా నదిలో నీరు త్రాగగా వెంటనే అందరూ మÖర్ఛపోయి, ప్రాణం లేనివారిలా నిశ్ఛేష్టులయి పడిపోతారు. ఆ యమునానది ఉత్తరాన వున్న కాళింది మడుగులో నీరు విషంతో కలుషితం అయినట్లు తెలుసుకున్న కృష్ణుడు ప్రాణం లేకుండా పడియున్న గోవులను,బాలురను తన అమృతమైన చూపులతో వీక్షించగా వారంతా లేచి కూర్చున్నారు. తమ్మును కాపాడిన కృష్ణయ్యను చూసి వారు సంతోషంతో పొగిడి ఎత్తుకున్నారు.

 కాళింది మడుగు విషమయం కావడానికి కారణమైన కాళియుడనే సర్పాన్ని అక్కడినుండి తొలగించకపోతే ప్రజలకు,పశువులకు ఎల్లప్పుడు ప్రమాదం కలుగుతుందని గ్రహించిన కృష్ణుడు ఆ విషగాలులు సోకి,గట్టున వున్న చెట్లు,పక్షులూ ఇతర జీవాలూ మాడిపోతుండేవి దీనికి నివారణోపాయం ఆలోచించిన భగవానుడు ఆ మడుగు గట్టుపైన ఒక పెద్ద కదంబవృక్షం ఉన్నది. ఆచెట్టెక్కి మడుగులోని చెంగున దూకాడు దానితో నీరు చెదిరిమడుగు మొత్తం కల్లోలమేర్పడడంతో కాళీయుని ప్రశాంతత భంగమయింది. అతడు రోషంతో బుసలుకొడుతూ విషంకక్కాడు. నీరు నూరు ధనుస్సులపైకి ఎగసినది.తన స్థావరంలోకి వచ్చిన బాలకృష్ణున్ని చూపి తన అయిదు పడగలతో అతని శరీరాన్ని చుట్టివేసి,తొడలూ,పాదాలూ కరవసాగాడు.కృష్ణుడు కాసేపు నిస్సహాయునిలా నటించి ఒక్క ఊపున సర్ప బంధమునుండి విదిలించుకున్నాడు.కాళీయుడు రోషంతో పడగలు పైకెత్తి విషజ్వాలలు కక్కుతూ బాలునిపైపడగా, కృష్ణుడు చెంగున ఆ పడగలపైకి లంఘించి,ఇటూ,అటూ విలాసంగా నడిచి,నాట్యం చేయనారంభించాడు.నూట ఒక్క పడగలతో మణులవలె మెరిసిపోతున్న ఆ కాళీయుని శిరస్సు ఒక విశాలమయిన నాట్యవేదిక అయింది.ఆ తాండవ నాట్య పాదాఘాతాలకు తట్టుకోలేక కాళీయుడు విషంతోపాటు రక్తంకూడా కక్కడం చూసిన కాళీయుడి భార్యలు కృష్ణుడ్ని శరణుకోరడంతో విడిచిపెట్టాడు. కృష్ణుడి ఆదేశానుసారం కాళీయుడు తన భార్యలతో,తన అనుచరం గణంతో కలిసి సముద్రానికి వెళ్ళిపోతారు.

          ఈ కాళీయుడి వృత్తాంతం చూస్తే నేటి కాలంలో పెద్దపెద్ద పరిశ్రమల వల్ల అవి విడిచిపెట్టే వ్యర్థ పదార్థాల వల్ల నదులు అన్నీ కలుషితం అవుతున్నాయి. ఆనాడు కృష్ణుడు యమునా నదిని కాళీయుని విషం ప్రభావం పడకుండా కాపాడినట్లే ఈనాడు కూడ నదులలో నీళ్ళు విషపూరితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని చెప్పవచ్చు.

          రెండవది ధేనుకాసుర వృత్తాంతం.ఇది చెట్ల సంరక్షణ తెలుపుతుంది.బలరామకృష్ణుడు తమ తోటి గోపబాలకులతో వనంలో విచ్చలవిడిగా విహరిస్తుంటారు. శ్రీదాముడు ‘ఇక్కడ దగ్గరలో ఒక తాటిచెట్ల వనం వుంది. ఎన్నో తాటిపండ్లు రాలుతూనే వుంటాయి.కాని ఆవనంలోకి ఎవ్వరూ ప్రవేశించలేరు.ఎందుకంటే అక్కడ గార్ధభ రూపంలో వున్న ధేనుకుడు అనే రాక్షసుడు వున్నాడని’ చెప్పాడు. ధేనుకాసురుడు మహాబలశాలి అని అతనితో నసమానమయిన గార్ధభరాక్షసులు ఎందరో ఆవనంలో వుంటారు. ఆ వనంలోని ఎవ్వరూ ప్రవేశించిన ఆ రాక్షసులు భక్షించేస్తారు. అందుచేత మనషులేకాక పశుపక్ష్యాదులు కూడా ఆ వనంలోని ప్రవేశించవని, ఆ తాటి పండ్ల వాసన వాసన అంతటా వ్యాపిస్తుంది. మాకు ఆ పండ్లను తినాలని వున్నదని గోపబాలురు కోరతారు. మిత్రుల కోర్కెలను తీర్చడం కోసం బలరామకృష్ణులిద్దరూ ఆ వనంలో ప్రవేశించారు. బýరాముడు ఆ చెట్లను బలంగా ఊపగా చాలా పండ్లు రాలినవి. ఆ శబ్ధము విని రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చి బలరామకృష్ణుల మీదకి ఉరకగా దాని వెనుక రెండుకాళ్ళను పట్టుకుని గిరగిరాతిప్పి,విసిరికోట్టే సరికి అక్కడే ప్రాణాలు విడిచి,చెట్ల మీదనే చచ్చి పడిపోతాడు. ఆ తాకిడికి మిగిలిన గార్దభ రాక్షసులు వారిమీదికి రాగా వారినందరినీ హతమార్చడంతో ఆ వనానికి రాక్షసపీడ వదిలిపోతుంది. పిల్లలందరూ గోవులను తోలుకొని వచ్చి ఆ వనంలోకి ప్రవేశించి పండ్లను ఆరగిస్తారు.గోవులకు పచ్చని గడ్డి దొరుకుతుంది.

          ప్రకృతి ప్రసాదించిన వాటిని తాము అనుభవించలేనందున ఇతరులెవ్వరూ కూడా అనుభవించరాదు అని అనుకుంటే తత్త్వంగలవారు లోభులు మత్సరులు అనబడుతారు.అట్టివారు నశిస్తారని ధేనుకాసుర వృత్తాంతం తెలుపుతుంది.

          కృష్ణుడు తన గోపబాలకులతో బృందావనం విహారం చేస్తున్నప్పుడు అక్కడి గొప్ప వృక్షాలను చూసి ‘ఇతరుల కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్నాయి.ప్రచండ గాలులను,వర్ష తాపాలను,మంచును భరిస్తూ మన బాధలను పొగొడుతున్నాయి.మనకు ఉపకరిస్తున్నాయి.మనకు నీడనిస్తున్నాయి. దాత యాచకులకు ఇచ్చినట్లుగా వారిని నిరాకరించనట్లుగా మనపట్ల అవి ప్రవర్తిస్తున్నాయి.నారతో, ఆకులతో, పువ్వులతో,పండ్లతో,నీడతో, జిగురు,భస్మ, కర్ర,చివురులతో మనలను ఆదుకొంటున్నాయి.వాటి సుగంధం అన్నీ మన కోరిక తీరుస్తున్నాయని చెప్పటం జరిగింది.

          మÖడవది గిరిమహోత్సవం లేక ఇంద్రగర్వభంగం లేదా గోవర్ధనోద్ధరణ. గోకులంలోని పెద్దలు అయిన నందాదులు ఇంద్రయాగం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఎందుకంటే ఇంద్రుడు వర్షాధిదేవత అని భావిస్తారు. సకలజీవులకూ జలం అత్యవసరం. పంటలకూ, పచ్చికలకూ ఆ జలమే ఆధారం. పచ్చికల వలన పశువులూ,పంటల వలన మనుష్యులు వృద్ధిచెందుతారు. పాడిపంటలు సమద్ధిగా ఉంటే మానవులు అందరూ సుఖసంతోషాలతో వుంటారు.అందుచే ఇంద్రయాగం చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెబుతారు.ఈ మనుష్యులంతా పూర్వాచారాన్ని మÖఢవిశ్వాసముతో అనుసరిస్తూ చేస్తున్న పనిని పెద్దలందరికీ కృష్ణుడు అర్థం అయ్యేలా చెబుతాడు. “అయ్యలారా!ఇంద్రుడు, వరుణుడు మొదలయిన దేవతలందరూ తమతమ విధులను నిర్వహించడానికి భగవంతునిచే నియమింపబడిన కార్యకర్తలు.వారి శక్తియుక్తిలన్నీ వారికి ఆ సర్వేశ్వరుని నుండి సంక్రమించినవే.స్వతహాగా వారు స్వతంత్రులు కారు. ఇంద్రుడు వర్షాన్నివ్వలేడు,దానిని ఆపలేడు.ఇంద్రునికి ప్రీతి కలిగించాలని మనం ఈ యాగం చేయనవసరం లేదు. దానికి బదులుగా మన జీవనాధారాలయిన పశువులకు వాటికి జీవనాధారమయిన గోవర్ధన గిరి అందరిహితాన్ని కోరే వేదపండితుల చేత ఆ యజ్ఞాన్ని చేయించడం ఉత్తమం అని చెబుతాడు.

          మనం “యజ్ఞయాగాదులు చేసే బ్రాహ్మణులం కాదు, భూమిని దున్నే కర్షకులం మరియు వనచరులం. గోవులే మన ధనం. మన దైవాలు గిరులు,వనాలు. ఎవరు ఏ వృత్తిని, విద్యలను స్వీకరిస్తారో అదే వారికి దైవం. తను అవలంబించిన వృత్తి లేక విద్య ఫలాన్ని కోరుకోవాలిగాని మరోక కర్మవల్ల వచ్చే ఫలాన్ని కోరుకోకూడదు.అలా చేస్తే రెంటికీ చెడ్డ రేవడిలా అవుతారు. గ్రామాల సరిహద్దుల వరకు పంటపొలాలుంటాయి.అదే పొలిమేర. పంట పొలాల సరిహద్దులు దాటిన తరువాత అడవులుంటాయి. వనాలలో కొండలు,పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాలే మనకు పరమగతి, ఈ వనంలో గిరులు కామరూపులని అనగా ఇష్టం వచ్చే రూపాన్ని ధరించగలవని విన్నాం. అందులోని క్రూరమృగాలు చెట్లను నరికే వారిని భయపెడుతూ వనాలను రక్షిస్తున్నాయి. కనుక గిరియజ్ఞం, గో యజ్ఞం మనం చేయాలి. అడవుల్లో నివసించేవారు అడవులను నాశనం చేస్తుంటే, ఆ చెడు ప్రవర్తన కారణంగా అడవులు అంతరించిపోతాయి. బ్రాహ్మణులు మంత్రయజ్ఞములు చేస్తారు. రైతులు దుక్కి దున్ని వ్యవసాయం చేస్తారు. గోవులకు పాలకులమైన మనం గిరియజ్ఞం,గోయజ్ఞాలను చేసి వాటిని పూజించాలి. ఇంద్రునితో మనకేమి పని? గోవులు, కొండలే మన దేవతలని ” హితవు పలుకుతాడు.

                              “గంధాలంకరణాంబరావళులచే గైసేసి యిష్టాన్నముల్

                              బంధుశ్రేణియు మీరలుంగుడిచి నాభాషారతిన్ వేడుకల్

                              సంధిల్లన్ గిరి గో ద్విజానల నమస్కారంబు గావింపుడో

                              జం ధర్మంబని తోచెనేని జనకా! జన్మంబు ధన్యంబగున్ ” (10/1`889)

          గోకుల పెద్దలందరూ కృష్ణుడి మాటలకు కట్టుబడి గోవర్థనగిరి మహాత్సవంలో భాగంగా హోమాలు చేయించి, పాయసం పిండివంటలు వండించి,బ్రాహ్మణులకు గోదాన దక్షిణలతో సంతుష్టులను చేస్తారు. అచంచల భక్తి విశ్వాసాలతో గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేస్తూ ఆరాధిస్తారు.

          దేవేంద్రుడు తనకు జరగాల్సిన యాగం పర్వతానికి జరిగేసరికి క్రోధావేశుడై ఉరుములు,మెరుపులు, రాళ్ళ వర్షాన్ని కురిపించమని ఆదేశించి సంవర్తక మేఘాలను విడుదల చేసి గోకులంపై జడివానను కురిపిస్తాడు. అలా ఏడు పగళ్ళు,ఏడు రాత్రులలు ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. కృష్ణుడు గోకులాన్ని, గోసంపదనలు కాపాడాలని గోవర్దనగిరి పర్వతాన్ని తన చిటికెన వేలుమీద ఎత్తి వారిని కాపాడతాడు.దానితో ఇంద్రునికి గర్వభంగమౌతుంది.

          ఈమాటలలో పర్యావరణవేత్తలుచెప్పే వాతావరణసమతౌల్యం కనిపిస్తుంది.అడవులలోని క్రూరమృగాల ఆవశ్యకతను మరొక్కసారి గుర్తు చేస్తున్నాయి. అడవులను రక్షించుకోవాలనే విషయం కూడా కనిపిస్తుంది.

          ఇంకా భాగవతంలో కొన్ని భాగాలలో కూడా వనరక్షణ సంబంధించిన అంశాలు ఉన్నాయి. అవి ముఖ్యంగా   దావాగ్నివిమోచనం, దావాగ్నిపానం మొదలయిన కథలలో వన సంరక్షణమే ధ్యేయంగా కృష్ణుడు భావించినట్లు చెప్పవచ్చు. భాండీరమనే వట వృక్షాన్ని సంరక్షించడంలో అతని వృక్షప్రేమ వ్యక్తమవుతుంది. రాసలీలలకు ముందు ఋతువర్ణనలు పర్యావరణ పరిరక్షణమే ముఖ్యోద్ధేశ్యంగా కనిపిస్తుంది.

ముగింపు:

          ప్రాచీన భారతదేశంలో వేదకాలం నుండి పర్యాపరణ పరిరక్షణ జరుగుతుంది. ఆ పరిరక్షణకు దేవతలు, పురాణపురుషులు, మునులు,మహర్షులు కూడా యజ్ఞయాగాదులు కూడా చేసినట్లు పురాణాలు, ఇతిహాసాలలో, కావ్యాలలో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా భాగవతంలోని శ్రీకృష్ణుడిని పర్యావరణ పరిరక్షకుడిగా తెలుగు కవి బమ్మెర పోతన చక్కగా చిత్రించారు. శ్రీకృష్ణుడిని అవతారపురుషునిగా, దేవునిగా, ధర్మసంస్థాపనార్ధం అవతరించిన దశఅవతారమÖర్తిగా కనిపిస్తున్నపటికీ నిజంగా శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా ప్రకృతిని ఆరాధించాలని, పర్యావరణాన్ని రక్షించాలని లోకానికి చాటిచెప్పాడు. శ్రీకృష్ణుడు మాత్రమే నిజమైన పర్యావరణ ప్రేమికుడని తెలుపవచ్చు.

 ఆధారగ్రంథాలు:

  1. శ్రీమధాంద్రభాగవతం` బమ్మెర పోతన, తిరుమలతిరుపతి దేవస్థానములు, తిరుపతి,2017.
  2. అష్టాదశ పురాణములు సరళవ్యాఖ్య ` కొంపెల్ల వెంకటశాస్త్రి,రోహిణి పబ్లికేషన్స్,రాజమండ్రి,2007.
  3. పురాణాలు`పర్యావరణం; డి.శేషగిరిరావు, ఎమ్మఎస్‌కో పబ్లిషర్స్,విజయవాడ,జనవరి2012.
  4. పోతన భాగవతం`సమాజదృక్పథం; ఆచార్య రావికంటి వసునందన్, 2001.

 

-డా.యస్.జ్యోత్స్నారాణి,
తెలుగు శాఖాధ్యక్షులు,
                                                                                సప్తగిరి డిగ్రీ కళాశాల,
విజయవాడ.

       

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top