
Volume – 1, May 2026, issue – 2,
సమర్పణ (D.O.S): 12 -04 – 2026 ఎంపిక (D.O.A): 16 – 04 – 2026 ప్రచురణ (D.O.P) : 01-05-2026
వ్యాస సంగ్రహం :
ఆదికవి నన్నయ్య ఆంధ్ర మహాభారతంతో మొదలైన తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియల్లో రచనలు వెలువడ్డాయి. ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, కథా కావ్యాలు, నాటకాలు, నవలలు, కథలు, యక్షగానాలు, ప్రబంధాలు , పద సాహిత్యం వంటి ఎన్నో ప్రక్రియల్లో రచనలు వచ్చాయి. ప్రాచీన సాహిత్యంలో కావ్యాలు ఉన్నా కూడా ఆధునిక సాహిత్యంలో వచ్చిన దీర్ఘ కావ్యాల్లో కొంత వైవిధ్యం ఉంది. వస్తు వాస్తవికతకు, కాలానికి అనుగుణంగా మార్పులతో దీర్ఘ కావ్యాల రచన సాగింది.అటువంటి దీర్ఘ కావ్యాలును విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
కీలకపదాలు :
దీర్ఘకవిత్వం, కొయ్య గుర్రం, ఆరుద్ర, విశ్వంభర, గోసంగి, నగ్నముని, సినారె, ఎన్ గోపి,ఎండ్లూరి సుధాకర్, వూటుకూరి వరప్రసాద్, వర్తమానం, జలగీతం, కొత్త గబ్బిలం.
ప్రవేశిక :
తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియల్లో రచనలు చేస్తున్న సాహితీవేత్తలు ఎందరో ఉన్నారు.అటువంటి ప్రక్రియల్లో దీర్ఘకవిత,దీర్ఘకావ్యాలు ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చాయి.వాటిలో కొన్ని భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ‘జ్ఞానపీఠ్’అవార్డును సైతం అందుకున్నాయి. అటువంటి దీర్ఘకావ్యాన్ని,దీర్ఘ కవితల్ని మనం పరిశీలిద్దాం.
కవిత్వం తన నీడకు వచ్చిన వారికి కలల మేడలు కట్టి ఇస్తుంది. వ్యక్తిలోని దౌర్బల్యాల అడ్డుగోడలను కూల్చి వేస్తుంది. వ్యక్తి, సమాజం పురోభివృద్ధికి దోహదం చేయగలిగిందే మంచి కవిత్వంగా రాణించింది. మంచి కవిత్వం రాసినవారు ఆ కవిత్వానికి ఒరవడి పెట్టిన వారు తరువాతి తరాలకు మార్గదర్శకులు అవుతారు.
అంటువంటి కోవలోకే వస్తారు కేశవరావు.పద్యం భూస్వామ్య మైతే వచనం ప్రజాస్వామ్యం. ఆధునిక సాహిత్యం ప్రధానంగా వచన సాహిత్యం. ఇక ఆధునిక యుగం వచనాయుగం గా చూడవచ్చు.వచన కవిత్వం లో దీర్ఘకావ్యానికి ప్రత్యేక స్థానం ఉంది.
విషయ వివరణ :
ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలువడుతున్న వచన కవితా ప్రక్రియ దీర్ఘకవిత లేక దీర్ఘకావ్యం. “ఆంగ్లంలోని ‘Long poem’ నే మాటకు సమానార్థకంగా తెలుగులో దీర్ఘకవిత్వం లేదా దీర్ఘకావ్యం అని వ్యవహరిస్తున్నారు. వచన కవితలాగే దీర్ఘకవితకు కూడా పునాదులు ఆంగ్ల సాహిత్యంలోను ఉన్నాయి. Free verse మీద జరిగిన ఒకానొక ‘Long poem”అని అంటారు
“ఒక ప్రధాన వస్తువును తీసుకొని ప్రత్యేక ఆలోచనా దృక్పథంతో సందేశాన్నిస్తూ, అనేక భావాలను ముందుచుంతూ వాటన్నింటినీ కలిపి ఒక నిర్మాణ బంధాన్ని కలిగి తగినంత విస్తీర్ణం కలిగి ఉండే కవితను దీర్ఘకవితగా పిలుస్తారని సాహిత్య నిఘంటువులు పేర్కొన్నాయి. “(తెలుగు పరిమళం పుట 14) ఆంగ్లంలో ప్రసిద్ధిగాంచిన టి.ఎస్.ఇలియట్ గారి ‘వేస్టాండ్’ దీర్ఘకవిత గురించి ఇలియట్ గురువు ఎర్రీపౌండ్ దీర్ఘకావ్యాన్ని, దీర్ఘకవితను ఈ విధంగా పేర్కొన్నాడు. “The Thing turns from ‘April….. to ‘Shantin’ without a break that is 19 pages forther”2 నిర్వచనం కేవలం రూపపరంగా ఉంది. “వ్యక్తీకరణలో ఆధునికత కోసం ఇంగ్లీషు ‘ఫ్రీవర్స్’ అనే వచన కవితా రూపం తెలుగులో బాగా ప్రాచుర్యమయ్యింది.'(కొయ్యగుర్రం, పుట- 13)లఘుకావ్యానికి, ఖండ కావ్యానికి నడుమ గుర్తించక తప్పదు.”” అని అన్నారు.
ఆధునిక తెలుగు సాహిత్యంలో చాలా దీర్ఘకవితలు కావ్యాలుగా అవత రించాయి.దీర్ఘకవిత్వం గురించి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ నిర్వచిస్తూ” ఏదయినా ఒక ప్రధాన వస్తువును తీసుకొని, ప్రజలకు సామాజికపరంగా ఆలోచనలు రేకెత్తించి, మార్పును సూచించే రచనను ఐదారు వందల పదాలతో రచించే కావ్యాన్ని దీర్ఘకావ్యం” అంటారు అని నిర్వచించారు.
ఇక మూలంలో’కి వెళితే ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో తొలి తెలుగు దీర్ఘకావ్యం ఆరుద్ర రచించిన ‘త్వమేవాహం’. తెలంగాణా పోరాట ఇతివృత్తంలో రాసిన ఈ ‘త్వమేవాహం’ గురించి ప్రముఖకవి శ్రీశ్రీ ఆరుద్ర రాసిన ఈ కావ్యం చదివిన తరువాత ఇక నేను పద్యాలు రాయకపోయినా ఫర్వాలేదు అని అన్నారు. అంతటి గొప్ప కవి ఆరుద్ర. ఆయన పూర్తి పేరు భాగవతుల సదాశివ శంకరశాస్త్రి. ఆగస్టు 31, 1925న విశాఖపట్నంలో వెంకటజోగమ్మ, భాగవతుల నరసింహారావు దంపతులకు జన్మించారు.తెలంగాణా సాయుధ పోరాటాన్ని నేపథ్యంగా తీసుకొని ఆరుద్ర ప్రజా ఉద్యమంలో మమేకం అయి ‘త్వమేవాహం’ (నీవే నేను-నేనే నువ్వు) అన్నారు. తెలంగాణా సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాం.
అది “1948 జూలై 10వ తారీఖున కృష్ణా పత్రికలో ‘నాకా సిగ్గు నా స్త్రీత్వం ఎప్పుడో పోయింది’ అనే పతాక శీర్షికలో ఒక వార్త అచ్చయింది. రజాకార్ల చేతిలో అతి దారుణంగా చెరచబడ్డ స్త్రీ కథనం.”నిజాం కాలంలో ఒకసారి ఓ యువతి, ఒక రైలు పెట్టె నుండి మరో రైలు పెట్టెకు నగ్నంగా తిరుగుతూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసిందట. ఆ రైలు పెట్టెలో ఉన్న కొంతమంది ఆమెను ‘ఇలా నలుగురిలో నగ్నంగా తిరగడానికి సిగ్గనిపించడంలేదా’ అని నిలదీశారు. దానికి ఆమె ఆ మాటతో తోకతొక్కిన పాములా లేచి సిగ్గా! నాకు సిగ్గా! ఏ నోటితో చెబుతున్నారామాట? నేను ఆడదాన్నా? నైజాం కిరాతకులు నన్ను వారం రోజులుఇలా నగ్నంగా చెట్టుకు కట్టేసి ఉంచారు. నా స్త్రీత్వాన్ని ఆనాడే దొంగిలించారు. ఇంకా సిగ్గు పడడానికి నా దగ్గర ఏమీలేదు. రోజు రోజుకు ఆ రజాకార్ల చేతుల్లో బలైపోతున్న మహిళలను కాపాడలేకపోతున్నందుకు మీరు సిగ్గుపడాలని ఆమె ఆ ప్రశ్నించిన వ్యక్తికి బదులిచ్చిందట. ఆ తరువాత రజాకార్ల చేతుల్లో అత్యాచారానికి గురైన ఆ మహిళ ఉరి వేసుకొని చనిపోయింది.
1948లో తెలంగాణాలో రజాకార్ల అకృత్యాలకు బలైపోయిన మహిళల దుస్థితికి ఆ మహిళ ఒక ఉదాహరణ మాత్రమే. ఈ తతంగమంతా ఆ రైలులో ఉన్న ఒక వ్యక్తి ఆ దృశ్యం కళ్ళారా చూసి, ఆమె మాటలు విని కన్నీరు కార్చిన ఆ వ్యక్తి పంపిన రిపోర్టు అది. కృష్ణాపత్రికలో ప్రచురించారు. అలా ప్రచురించిన వార్తను ఆరుద్ర చదివి చలించిపోయారు. తెలంగాణాలో రజాకార్లు చేస్తున్న అకృత్యాలపై గుండెల్లో పుట్టిన తన ఆవేదనను కావ్యరూపంలో వెలిబుచ్చారు. ఆరుద్ర కలం పేరుతో ఆయన రాసిన కావ్యమే ‘త్వమేవాహం’. ఈ రచన “తెలంగాణా ప్రాంతంలో నిజాం నిరంకుశత్వానికి అద్దం పడుతుంది. రజాకార్ల అకృత్యాలపై రచించిన ఈ ‘త్వమేవాహం’ అనే కావ్యం ఎందరో తెలంగాణా వాదులకు స్ఫూర్తినిచ్చింది.” తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంలో వచ్చిన ముఖ్యరచనలలో ఒకటిగా అది నిలిచింది.
తన దిక్’లతో దిక్కులు పిక్కటిల్లేలా కొట్టి కాలాన్ని,కలాలను కదిలించింది ఆయన కవిత్వం. మొద్దునిద్దర్లో జోగుతున్న ప్రభుత్వాన్ని తమ కవిత్వం తో పెనునిద్దర వదిలించిన దిగంబర కవి నగ్నముని.’తుఫాను వ్యవస్థ మీద తెలుగు కవి కన్నెర్ర’అంటూ ‘ప్రజాతంత్ర’లో కొయ్యగుర్రం కావ్యాన్ని సాహిత్య లోకానికి అందించారు.ఈ కొయ్య గుర్రం దీర్ఘకావ్యాన్ని మహాకావ్యం గా అభివర్ణించారు చేకూరి రామారావు. ‘మనం రోజూ చూసే ఖండికల కన్నా పెద్దవిగా ఉంటే తప్ప భిన్నభావాలను చెప్పటం కుదరదు. అంటే మహాకావ్యం కావాలి. మహాకావ్యానికి విస్తీర్ణతే ప్రధానం కాదుగాని అవసరమైన ఒకలక్షణం. పెద్ద పాయింటులో అచ్చెయ్యటం వల్లనో, పాదాలుగా విరవటంవల్లనో కవిత్వం కానట్టే, విస్తీర్ణత వల్లే ఏదీ మహాకావ్యం కాలేదు.
ఒక ప్రధాన వస్తువుతో ఒక తాత్విక చింతనతో, సందేశంతో, అనేక భావాలతో, కథ లేకుండా, ‘అర్బేనిటీ’ అనే లక్షణం కలిగివుండి, తగినంత విస్తారంగా ఉన్న దీర్ఘ కవితను ఆధునిక మహాకావ్యం అంటున్నాను. ఈ నిర్వచనంతో కొలిచి చూస్తే ‘ కొయ్యగుర్ర’ మే మొదటి ఆధునిక మహా కావ్యంగా కనిపిస్తుంది'(కొయ్యగుర్రం, పుట- 14)అవును మహాకవి శ్రీ శ్రీ చెబుతున్నట్లు
“మహా కావ్యానికి క్రైటీరియా సైజూ బరువూ కావయా నిన్నటి మహా కావ్యం పద్దెనిమిది పర్వాలైతే నేటి మహా కావ్యం పద్దెనిమిది పేజీలే”(తెలుగు కవిత్వం లో ఆధునికత, పుట- 327) అన్నట్లుగా కొయ్యగుర్రం కొన్ని పేజీలు కావచ్చు.కానీ మహాకావ్యం అనదగ్గ లక్షణాలు పుష్కళంగా ఉన్నాయి.దివిసీమ ఉప్పెన (నవంబర్ 19, 1977.)వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.ఉప్పెన జరిగిన తర్వాత రెండు మూడు రోజుల వరకు సహాయక చర్యలు ఊపందుకోలేదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికే ప్రభుత్వానికి చాలా సమయం పట్టింది.దేనికి నిరశనగా నగ్నముని కొయ్యగుర్రం కావ్యాన్ని రాసారు.
‘కొయ్యగుర్రం స్తబ్దతకీ మూర్ఖతకీ అజ్ఞానానికీ అహంకారానికీ అసమర్థ పరిపాలనకీ ప్రతీక’.(కొయ్యగుర్రం, పుట – 41) అంటూ ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నగ్నముని.
తుపాను సమాచారం ప్రభుత్వ పెద్దలకు ముందే తెలిసినా ప్రజల్ని హెచ్చరించి,సురక్షితప్రాంతాలకు తరలించడంతో విఫలం అయ్యారంటూ…
‘కొయ్యగుర్రానికి నిజం తెలుసు
అయినా చెప్పదు
కడలి కెరటానికి నిజం తెలుసు
కెరటాలపై కనబడని రక్తపు మరకలకి నిజం తెలుసు'(కొయ్యగుర్రం పుట 45)ఆవేదన,ఆక్రోశం చెంది ప్రభుత్వాన్ని ఆయన కవిత్వం లో కొయ్యగుర్రంతో పోల్చారు.
‘అయినా ప్రకృతి విలయ తాండవానికి ప్రజల్ని వదిలేసిన పరిపాలకులే హంతకులన్న విషయం ఈ కావ్యం చదివితే మనం గ్రహించగలం. కొయ్యగుర్రాన్ని తగల బెట్టగల కొత్త ఇంథనాన్ని కనిపెట్టటమే కర్తవ్యం అని కూడా మనకు ఈ కావ్యం గుర్తు చేస్తుంది.'(కొయ్యగుర్రం, పుట – 19)కవి ఆవేదనకు,ఆక్రోశానికి,ఆగ్రహానికి ఫలితం ఈ కావ్యం.
సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్యం లో ఈ పేరు తెలియని వారుండరు.
తెలుగు కవిత్వ లోకంలో గేయం మీద పట్టుసాధించి ఋతుచక్రం, కర్పూర వసంతరాయలు వంటి అద్భుత సృష్టి చేసిన సినారె గారి కలం నుండి జాలువారిన అద్భుతమైన కావ్యం విశ్వంభర.
ఈ ‘విశ్వంభర’ కావ్యానికి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. సినారెను జ్ఞానపీఠమెక్కించినది. ‘విశ్వంభర’ దీర్ఘకావ్యం. ఈ కావ్యం 1988వ సంవత్సరంలో రచించిన పద్యకావ్యం భారతదేశంలో అత్యున్నత జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేశారు ప్రభుత్వం వారు.
“ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర. ఇతి వృత్తం తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనిషి కథ. కథకు నేపథ్యం ప్రకృతి. మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు ఆదిమ దశ నుండి ఆధునిక దశ వరకు మనిషి చేసిన ప్రస్థానాలు కావ్యంలోని ప్రసంగాలు” అని రచయిత పేర్కొన్నారు. ఈ కావ్యం మానవ జీవన గమ్యాన్ని, ఆయా కాలాల్లో ఎలా ప్రభావితమైందీ సూచించారు. మహనీయులైన వ్యక్తులు సమాజ పురోగమనంలో తమ వంతుగా ఎలా, వారి బాధ్యతలు నెరవేర్చారో అని ఇందులో చెప్పారు. ఆరంభంలో..
“నేను పుట్టక ముందే
నెత్తిమీద నీలితెర
కాళ్ళ కింద ధూళితెర” (విశ్వంభర- సినారె, పుట- 1)అంటూ మానవ జీవన పయనానికి ముందే సృష్టి గమనాన్ని తెలియజేసింది.
ప్రపంచంలో చాలా హింస జరిగింది. కానీ ప్రేమ కంటే గొప్పది ఏదీలేదు అని తెలియజేస్తుంది. ఈ కావ్యం.
” వేయి తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక పువ్వును ఉర్వీతలాన్ని వణికించిన శక్తి
ఒక హృదయాన్ని జయిస్తుందా…?
అని ప్రశ్నిస్తాడు. ప్రేమకున్న ఔన్నత్యాన్ని తెలియజేస్తాడు. చివర్లో
“మనసుకు తొడుగు మనిషి, మనిషికి ఉడుపు జగతి ఇదే విశ్వంభర తత్త్వం. “(విశ్వంభర – సినారె, పుట- 83) ఇదే అనంత జీవితసత్యం.
ఈ విశ్వంభర కావ్యం గురించి ఆచార్య ఎన్.గోపి గారి మాట్లాడుతూ “విశ్వంభర కేవలం భూగోళం అనే మట్టిముద్ద గురించి రాసిన కవిత్వం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని గురించి, వికాసాన్ని గురించి, మనిషి చైతన్య స్థాయి గురించి, ఆ చైతన్యానికి మూలమైన మట్టితో సంబంధం గురించి. ‘మట్టే విశ్వంభర, విశ్వంభరే మానవుడు’ అంటూ ఈ కావ్యం గొప్పదనాన్ని వివరించారు గోపి. ఈ విశ్వంభర ఏ ఒక్క వ్యక్తి కథో కాదు, సాక్షాత్తూ ‘మానవుడి కథ’.
ఆచార్య ఎన్.గోపి రాసిన ‘జలగీతం’ ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రభావవంతమైన దీర్ఘకావ్యం. పర్యావరణ స్పృహను, ముఖ్యంగా నీటి ఆవశ్యకతను ఇంత తాత్వికంగా, ఆర్తిగా చిత్రించిన కావ్యం మరొకటి లేదు..
స్థానీయ పత్రికలలో విశ్వజనీనతను సంతరించుకుంటుంది. ఇది ఆయన ప్రత్యేకత. ఆయన కవితలు ఆత్మాశ్రయ కోణం నుంచి వస్త్వాశ్రయాన్ని సంతరించుకుంటూ విశ్వజనీనాన్ని సంతరించుకుంటాయి. అందుకే ఆయన కవితలను అందరూ ఆశ్వాదించేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా ‘జలగీతం’ కావ్యం. సాహిత్యంలో ఇది చరిత్ర సృష్టించింది. ప్రపంచ భాషల్లోకి అనువదించబడిన ఒకే ఒక భారతీయ కావ్యంగా ‘జలగీతం’ను చెప్పవచ్చు. సుమారు పన్నెండు భాషల్లోకి అనువదించబడింది ఈ ‘జలగీతం’ కావ్యం.
“ఏ బ్రహ్మాండాల నుంచి వొలికి పడ్డాయో నీళ్ళు ఊహలో పట్టని ఏ వైశాల్యం గుండా వీటి చిరంతన ప్రయాణమో
ఏ విశ్వాంతరాళాల
ఆదిమ శబ్దాలను మోసుకొచ్చాయొ..(జలగీతం – ఎన్.గోపి, పుట – 1)
ఇలా మొదలై, జల పాతంలా ఉన్నత భూమిక నుండి ఉదృతావేశంతో దుమికి రమ్యంగా సాగిపోతుంది ‘జలగీతం’ కావ్యఝరి.
“ఈ నీలి నీలి గోళంతో పాటు అతిథిగా విచ్చేసిన ఓ అపురూప జీవకణమా”
అంటూ కవి నేరుగా నీటితోనే సంభాషిస్తాడు. కొన్ని ప్రయోగాలు మనల్ని అబ్బురపరుస్తాయి.
“నువ్వు స్పృశించగానే
వసుంధర నిత్యబాలింతగా మారింది”
తడి తగులుతున్నంతసేపూ పుడమి పచ్చదనాన్ని ప్రసవిస్తూనే ఉంటుంది. ‘అదే నిత్యబాలింత’ అంతరార్థం. మనిషి నవమాసాలు ఈదేది ఉమ్మనీటిలోనే. జన్మతోనే నీటితో అనుబంధం మనిషిది. ఆపైన అంతిమశ్వాస వరకు నీటిలోనే మనిషి జీవితం.
“నదీ తీరాల్లోనే కదా
సాహిత్య కేదారాలు మొలకెత్తింది”
అంటూ కవి వాల్మీకి, కాళిదాసుల కవిత్వ ఘనతల్ని తనదైన శైలిలో నదీజలంతో అను సంధానం చేస్తూ గొప్పగా చెప్పారు గోపి. జలాన్ని వస్తువుగా ఎంచుకోవడం గోపీగారి మానవీయ, తాత్త్వికతకు తార్కాణం. సామాజిక చైతన్యం గోపీగారి ఊపిరి. అలాగే కావ్యం ముగిస్తూ ‘జలం ఎలర్టు’ ప్రకటించమంటారు గోపి. అంతరించి పోతున్న అమూల్య సంపదల్లో జలం ముఖ్యమైంది. వీటన్నింటికీ ప్రాణదానం చేసే జలాలు ప్రాణప్రమాదంలో పడ్డాయి. తక్షణం మానవ జాతి జాగృతం కావాల్సిన తరుణం ఇదే అంటూ ‘జలగీతం’గా ఒక మానవీయ మహాకావ్యాన్ని రచించి మానవాళిని మేల్కొలిపారు.
ఆధునిక వచన కవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్. తెలుగు సాహిత్యంలో సూపరిచిత రచయిత ఈ తరం.దళిత కవిత్వానికి దళ నాయకుడు.అమ్మలాంటి సినారె,’నానీ’లా నాన్న ఎన్. గోపి గార్లను అభిమానించే గొప్ప భావుకత ఉన్న కవి ఎండ్లూరి సుధాకర్.ఆచార్య ఎండ్లూరి .సుధాకర్ కావ్యత్రయం పేరు తో మూడు దీర్ఘకావ్యాలను రాశారు.
దీర్ఘకావ్యనిర్మాణమంటే మాటలుకాదు. వందల పంక్తుల సేద్యం. వస్తు వైవిధ్యం, అభివ్యక్తి నైపుణ్యం, చదివించే గుణం ఈనాలుగు ముఖ్యం. మొదటి కావ్యం ‘కొత్తగబ్బిలం’ రాయడానికి ముప్పైయేళ్ళు దాటాల్సివచ్చింది. రెండోకావ్యం ‘వర్గీకరణీయం’ పుట్టేనాటికి నలభైయేళ్ళ వయస్సు వచ్చింది. మూడోకావ్యం’గోసంగి’ రచించేనాటికి యాభైయేళ్ళ మైలురాయి చేరాల్చివచ్చింది. అప్పటికిగాని నా ‘కావ్యత్రయం’పూర్తి కాలేదు.(కావ్యత్రయం- సుధాకర్ ఎండ్లూరి, పుట – 3)
నామూడు కావ్యాలనిండా మానవ వేదన మంత్రంగా నినదిస్తూ ఉంటుంది. ఒక మనిషితనం కోసం, ఒక మంచితనం కోసం, ఒక మానవత్వం కోసం పరితపిస్తూఉంటుంది. ఈ సమాజమంతా స్పందిస్తూ ఉంటుంది. అందరూ బాగుండాలనే ఒక ఆర్తనాదం నా అక్షరాల వెనక గూళ్ళుకట్టుకున్న పావురాల కువకువ రావంలా వినిపిస్తూ ఉంటుందంటారు..సుధాకర్ గారికి అత్యంత ఇష్టమైన కవి జాషువా, ఆయన సాహిత్యంపై పరిశోధన చేసి, పిహెచ్డి పట్టా పొందారు. తన కవిత్వంతో కులవివక్షను, అంటరానితనాన్ని చీల్చి చెండాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ నేపథ్యంలో ‘కొత్త గబ్బిలం’ పేరుతో దీర్ఘ కవిత రాశారు. జాషువా గబ్బిలాన్ని శివుడికి విన్నవించటానికి పంపిస్తే- సుధాకర్ తన కొత్త గబ్బిలాన్ని రాజధానికి రాయబారానికి పంపించారు. ‘ఆయన 1990లో భార్య హేమలత, ఇద్దరు పసిపిల్లలతో యూనివర్సిటీ ఉద్యోగానికి రాజమండ్రి వచ్చారు. ఆ చారిత్రిక నగరిలో అద్దె ఇల్లు కోసం వెతుకుతుంటే- చాలాచోట్ల ‘మీరేమిట్లు?’ అన్న ప్రశ్న ఎదురయింది. కొత్త గబ్బిలానికి ఆ నగర వివక్ష గురించే తొలి ప్రబోధం చేశారు ఎండ్లూరి.
“తండ్రీ, ఇది రాజమండ్రి కులం కలుగులోంచి ఇంకా బయటికి రాని ఎండ్రి
నడిచే పాదాలకైనా నాడాలు కుట్టగలదు
నమ్మకంగా దేన్నయినా అమ్మకానికి పెట్టగలదు” అని నిర్ద్వంద్వంగా ఎద్దేవా చేశారు.'(ఎండ్లూరి కవన కళ – పుట 52 )ఆవేదనతో కూడిన విమర్శనాత్మక చమత్కారం కళాత్మకంగా వ్యక్తం చేయడం ఎండ్లూరి సుధాకర్ కవితా లక్షణం.ఆత్మగౌరవ ప్రకటన దళిత కవులకు నిజంగానే పాఠ్యగ్రంథమైంది.
డా.ప్రసాద మూర్తి అన్నట్లుగా దళితాగ్రహ ప్రకటనలో నగేష్ బాబుని మించిన వాడు లేడు. దళితాత్మ ప్రకటనలో ఎండ్లూరిని కొట్టిన వాడు లేడు. “ఓనా చండాలికా / నీ వెండి కడియాల నల్లకాళ్ళ ముందు / వెయ్యేళ్ళ కావ్య నాయికలు వెటలవెలబోతున్నారు. / నా జాతి పుష్పమా నా నీలమణీ .. / నీ బంతిపూల కొప్పు మీదనే ఒట్టు / నిన్ను ఊరి బయటనే నిలబెట్టిన /ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను.” సుధాకర్ కలం నుండి వెలువడిన నీలిక అనే ఈ కవిత అంబేద్కరిస్టు భావజాలంలో దళిత కళాతత్వాన్ని శిఖరాలకు చేర్చింది.ప్రభావం కూడా తక్కువదేమీ కాదు.
ఎండ్లూరి సుధాకర్ ‘వర్తమానం’ 1992లో వెలువడింది. ‘నాకు ప్రతిభ లేదనే కదా అభియోగం/ నా భూమిని దొంగిలించాక నా కళల్ని తొక్కిపట్టాక/ నా చుట్టూ నిషిద్ధ కుడ్యాలు నిలబెట్టాక/ ఇంక నాకు ప్రతిబెక్కడిది?’ అని ప్రశ్నించిన సుధాకర్… ‘మట్టి నా ప్రతిభ’ అని ప్రకటించాడు. కుల వ్యవస్థ తనకు చేసిన గాయాలను, అవమానాలను వివరించాడు. అమానుష చర్యలను నిరసించాడు. అంతేకాదు. ‘ఇవాళ నాది అగ్నిముఖం/నా చేతులు వజ్రాయుధాలు/ నేనిప్పుడు నడిచే ఖడ్గాన్ని/ నన్నెవరూ తాకలేరు/ నేను నిద్రలేచిన పులిని..’ అన్నాడు. గతం తనమీద జరిపిన జులుంను ఖండించాడు. ‘నా తరతరాల ఆక్రోశాల కన్నీటి కైఫీయతుల్ని/ నా జాతి వేలిముద్రల దరిద్రపు చీకటి చరిత్రల్ని /నడిరోడ్డు మీద చించిపోగులు పెడుతున్నాను..’ అని చెప్పి… ‘భవిష్యత్తు గుండెల్లో నిర్భయంగా సంతకం చేస్తున్నాను’ అనే ధీమాను ప్రకటించాడు.’వర్తమానం’లోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు.
శ్రీ కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదలో చేసిన ఓ ప్రస్తావన ఆధారంగా “గోసంగి” దళిత కావ్యం రాశారు. “దళితులు అంటే మాలమాదిగలు మాత్రమే కాదు; అంతకన్నా వెనకబడినవారు అనేకమంది ఉన్నారు. ఇంకా ఈ సమాజంలో ఓటుహక్కు కూటిహక్కు ఓ గూటిహక్కు లేని సంచార జీవులకు సముచిత స్థానం కావాలి.” అని ముందుమాటలో తన మనసును ఆవిష్కరించారు. ‘అట్టడుగున పడి కాన్పించని ప్రతి ఒక్కరి ముంగిట్లోకి చదువు, ఉద్యోగం వంటి ప్రగతి ఫలాలు వెళ్లినప్పుడే మన స్వాతంత్ర్యానికి అర్థం’ అని ఆయన అనేవారు.
చివరికి రాయలవారిని ఉద్దేశించి “జోహార్! మూరురాయడగండ నీవైపే చూస్తున్నది నీవు జయించలేకపోయిన అంటరానికొండ చరిత్రలో మచ్చగానే ఉండిపోయింది” అంటూ జగరూకుణ్ణి చేస్తాడు. చివరిలో ఒక వేదాంత ధోరణిని, వైరాగ్యభావాల్ని కవి వ్యక్తీకరించటం మనకు ఈ గోసంగి కావ్యంలో కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికి చరిత్రలో జరిగిన తప్పులపై చూపుడు వేలు లాంటి జవాబు ఈ కావ్యం.
తెలుగు భాషా సాహిత్యాలకిది వసంత ఋతువు అంటూ తనదయిన శైలిలో తెలుగు పరీమళాలు నలుదిశలా విస్తరిస్తూ.తెలుగు భాషా వైభవ కీర్తిని,ఖ్యాతి ని ‘తెలుగు పరిమళం’ దీర్ఘకావ్యం గా అందించారు డా౹౹వూటుకూరి.వరప్రసాద్.
ఒక జాతి జీవన ప్రయాణాన్ని వారి గమనంలోని అవస్థలను మన కళ్ళ ముందుంచారు ‘తెలుగు పరిమళం’ కావ్యంలో. నేడు నాగరిక జీవనంతో సంశోభితమై అలరారుతున్న తెలుగు ప్రజలు తొలినాటి స్థితిగతులను కవి చక్కగా వర్ణిస్తూ ముందుకు నడిపారు. ఈనాడు నగరాల్లో, పట్టణాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజల పూర్వస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ గమనించవచ్చు.
“కొండ కోనల్లో ఎండావానల్లో తడి పొడిగా తరలివచ్చి రేయి పొద్దుల్లో సందెసుద్దుల్లో వడి వడిగా అడుగులేసి చెట్టు చేమల్లో మిట్టపల్లాల్లో గట్టు తెగిన వాగై సాగి” (తెలుగు పరిమళం, పుట – 1)
ఆదిమానవుని ఉనికి ప్రకృతిలోనే ఆరంభమై ప్రకృతిని పెనవేసుకొని సాగిందని చెప్పడానికి ‘కొండకోన- ఎండవానల్లో జరిగిందని తెలియజేస్తున్నారు కవి. రేపటి గురించి,ఆలోచించే మనిషి వాటిని సందెసుద్దుల్లో వల్లించుకుంటాడని వాటి కోసం వడివడిగా అడుగులేసి చెట్టు-చేమ, మిట్ట-పల్లాలలో అతడి పయనం కట్టుతెగిన వాగులా సాగిందని కవి తెలియజేస్తున్నాడు.’తెలుగు పరిమళం-కావ్యసందేశం’లో, వెయ్యేండ్ల తెలుగువారి చరిత్రను ఆధారం చేసుకొని రచించిన ఈ కావ్యంలో మాతృభాషను బ్రతికించు కోవాలంటే ముందుగా మన ఇంట్లోనుండే మార్పు రావాలని కవి పిలుపునిస్తున్నారు. భాషాపరిరక్షణకై ప్రజలు ముందుకువచ్చి సహకరించాలని ప్రభుత్వ శాఖల్లో, నామఫలకాలు తెలుగులో ఉండేలా ప్రభుత్వ పరిపాలన తెలుగులోనే సాగేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కవి కోరుతున్నారు. అప్పుడే భాష మనగలుగుతుందని కవి అభిప్రాయం. ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉన్న తెలుగుప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, తెలంగాణా, సీమాంధ్రులుగా పిలువబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల జీవన వైవిధ్యాన్ని, జనజీవన స్రవంతిని ఉదహరిస్తూ కవి ఆ ప్రాంతీయ భాషల గొప్పతనాన్ని వివరించారు. ఈ తెలుగు పరిమళం దీర్ఘకావ్యంలో కావ్యనేపథ్యం, ప్రముఖ దీర్ఘకావ్యాలు, ఇతివృత్తం గ్రహించిన విధానం, వర్ణనలు, సంభాషణలు, సూచనలు మొదలైన అంశాలతో ఈ కావ్యాన్ని రచయిత మనకు అందించారు. తెలుగు సాహిత్యం లో అనేక దీర్ఘకావ్యాలు చాలా వచ్చాయి,వస్తున్నాయి.
ముగింపు :
ఆధునిక తెలుగు సాహిత్యం లో దీర్ఘ కవితకు,దీర్ఘకావ్యానికి ప్రత్యేక మైన స్థానం ఉంది.ఆరుద్ర,నగ్నముని,సినారె,ఎన్ గోపి,ఎండ్లూరి సుధాకర్,వూటుకూరి వరప్రసాద్ గార్లు రాసిన ఈ దీర్ఘకావ్యాలను పరిశీలిస్తే ప్రతీకావ్యం ఒక సందేశాన్ని,జీవిత గమనాన్ని, సాటి మనిషి పట్ల సోదర భావం,మానవత్వం పెంపొందించుకోవాలి.విశ్వమానవ ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలని చూసిస్తున్నాయి.మనిషి విలువ,నీటి విలువ,సమానత్వం, ఆర్ధిక అసమానతలు లేని సమాజ నిర్మాణం కోరుకుంటున్నారు.ముక్యంగా భాషా సాహిత్యాలను ఆదరించాలని సందేశాన్ని ఇస్తున్నారు.’భాషల్ని ప్రేమించండి అవి మిమ్మిల్ని అందలం ఎక్కిస్తాయి’.యని పిలుపునిచ్చారు. ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అవును ఇది అక్షర సత్యం.
ఉపయుక్త గ్రంథ సూచి:
- నారాయణరెడ్డి.సి – ఆధునికాంధ్ర కవిత్వము-సంప్రదాయం-ప్రయోగం
- చంద్రశేఖర్ ఎస్జీడి – ఆధునికాంధ్ర కవిత్వం ఆవిర్భావ వికాసాలు:
- నారాయణరెడ్డి.సి. – ఆధునికాంధ్ర కవితా ధోరణులు
- రమేష్ డప్పోళ్ల – ఎండ్లూరి కవన కళ స్మారక స్వరం:
- సుధాకర్ ఎండ్లూరి – కావ్యత్రయం
- నగ్నముని – కొయ్యగుర్రం
- గోపి.ఎన్ – జలగీతం
8.తెలుగు కవిత్వంలో ఆధునికత:పరిశోధన సిద్దాంత గ్రంథం
9.తెలుగు పరిమళం దీర్ఘ కావ్యం-పరిశీలన:కె.వి.రావు
లఘు సిద్ధాంత వ్యాసం:
- ఆరుద్ర- త్వమేవాహం
11.నారాయణరెడ్డి సింగిరెడ్డి –విశ్వంభర
-వెం కటేశ్వరరావు కట్టూరి ఎం.ఏ,ఎం.ఫిల్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`