sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

ఆధునిక తెలుగు కవిత్వంలో వైద్య వృత్తి-మానవీయ విలువలు – డా|| యస్. జ్యోత్స్నారాణి

ఆధునిక తెలుగు కవిత్వంలో వైద్య వృత్తి-మానవీయ విలువలు – డా|| యస్. జ్యోత్స్నారాణి

Volume – 1,                                             September 2026,                                          issue – 6,

సమర్పణ (D.O.S): 12-07 – 2026               ఎంపిక (D.O.A): 19– 07 – 2026          ప్రచురణ (D.O.P) :  01-09-2026  

వ్యాస సంగ్రహం: (Abstract)

ఆధునిక వచన కవిత్వంలో అనేక రకాల వృత్తులను గురించి కవిత్వం వెలువడింది. వాటిల్లో కొన్ని కవిత్వ ఉద్యమాలుగా కూడా విస్తరించాయి. మానవ సమాజ మనుగడకు, ఆరోగ్య రక్షణకు వైద్య వృత్తి అత్యంత ప్రాధాన్యమైంది.

ప్రాచీన కాలం నుండి ఆధునిక యుగం వరకు వైద్యుడిని భగవంతుని స్వరూపంగా భావించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయితే ఆధునిక కాలంలో సైన్స్ మరియు సాంకేతికత పెరిగినప్పటికీ నైతిక విలువలు క్షీణిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆధునిక తెలుగు కవిత్వంలో వైద్య వృత్తిలోని ఉదాత్తతను, మానవీయ విలువలు, సమకాలీన వైద్య రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించడం, వైద్యుడు గొప్పతనం, వైద్య వృత్తి విశిష్టతలను తెలియజేయడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

కీలకపదములు:

ఆధునిక కవిత్వం, వైద్యవృత్తి, వైద్య కవిత్వం, మానవీయ విలువలు, రోగి వేదన, అక్షర చికిత్స, తెలుగులో వచ్చిన వైద్య గ్రంథాలు, మెడికల్ హ్యూమానిటీస్, కార్పోరేట్ వైద్యం మొదలగునవి.

పరిచయం:

‘.” సాహిత్యం సమాజ హితాన్ని కాంక్షిస్తుంది. వైద్యం సమాజ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ రెండింటి కలయికే వైద్య కవిత్వం. ఆధునిక అంతర్జాతీయ విద్యారంగంలో ‘మెడికల్ హ్యూమానిటిస్’ అనే విభాగానికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య విద్యార్థులలో, వైద్యులలో కేవలం సాంకేతిక నైపుణ్యాలే కాకుండా కరుణ, దయ, సానుభూతి వంటి మానవీయ విలువలు పెంచటానికి సాహిత్యం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆధునిక తెలుగు వచన కవిత్వం ఈ మానవీయ కోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

కవిత్వంలో వైద్యుని ఉదాత్తత:

భారతీయ సమాజంలో వైద్యుడిని ‘వైద్యో నారాయణో హరి:’ అంటారు. వైద్యుడిని భూమి మీద అవర బహుగా, ఇలలో నడిచే దెవంగా బావిస్తారు. రోగి ప్రాణాలు కాపాడే క్రమంలో వైద్యుడుపడే శ్రమను. నిద్రలేని  రాత్రులను ఆధునిక కవులు గౌరవించారు.

‘వందనాలు వందనాలు మీకు

వైద్యులారా

ప్రణామాలు ప్రాణదాతలారా

ప్రణామాలు మీకు’ అంటూ ప్రముఖ రచయిత్రి డా. కందేపి రాణీప్రసాద్రి రాసిన కవితాపంక్తులు వైద్యులకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. వైద్యుడు సర్వమానవ సమానత్వానికి ప్రతీకగా నిలుస్తాడని తెలిపారు.

సమాజంలోని ప్రజలకు వైద్యునిపట్ల భక్తిభావాన్ని కలుగజేసే మరొక కవిత

‘రాత్రైనా పగలైనా

పేదోడైనా కుబేరుడైనా

భరించలేని బాధలతో డాక్టరింటి

తలుపు తడితే చీము నెత్తురితో మురిగి

దుర్వాసన వచ్చినా

అసహ్యించుకోకుండా పరీక్షించేది వైద్యుడే’ అని వైద్యుని యొక్క మహిమాన్విత సేవా స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేసే వైద్యుని త్యాగాన్ని కవయిత్రి రోహిణిగారు చక్కగా చిత్రించారు.

బృందాగిరి అనే ఆధునిక రచయిత్రి ‘అక్షరాల అభివందనం’ అనే కవితలో

‘అనుకోని పరిస్థితులలో, ఆపద

తరుముతున్న సమయంలో

ఇంటికి, తన వారికి దూరంగా నిలిచి,

విపత్కర కాలంలో ఉన్న పళంగా ఆదుకునే దైవంగా

ఊపిరి నిలుపుతూ, ప్రాణాలను కాపాడే వైద్యులకు వందనం అంటారు. కరోనా వంటి కష్టకాలంలో అత్యవసర ఆపద సమయాల్లో తమ ప్రాణాలను పణంగాపెట్టి పోరాడిన వైద్యులకు కృతజ్ఞతగా అక్షరాలతో చేసిన అభివందనాలు కవిత వైద్యుని పట్ల విపరీతమైన భక్తి భావాన్ని కలిగింపజేసింది.

డా. వోల్టేరు రవికుమార్ గారు వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తిరీత్యా ఉత్తమ రచయిత. వైద్యులు ప్రతిరోజు ఎదుర్కునే మానసిక ఒత్తిడిని రోగుల ప్రాణాలు కాపాడే క్రమంలో వారు పడే ఆరాటాన్ని ఒక వైద్యుని కోణంలో రాసిన అద్భుతమైన కవిత’ సఫారీ దుస్తుల వెనుక సత్యం’.

‘తెల్లని కోటు వెనుక దాగున్న గుండెకు తెలుసు

ఎన్ని రాత్రులు నిద్రకు దూరమయ్యాడో

పండగలు, పబ్బాలు గడప దాటవు,

ఐసియూ గదిలో శ్వాసల

సవ్వడే అతని ప్రపంచం

దేవుడు కాకపోయినా దేవుడిలా

పోరాడటమే అతని నిత్యకృత్యం’ అంటారు. వైద్యులను దేవుళ్లుగానో లేదా యంత్రాలుగానో కాకుండా వ్యవస్థ మధ్య నలిగిపోయే సగటు మనుషులుగా చూపిస్తూ, వారి త్యాగాల వెనుక ఉన్న వాస్తవాలను కళ్ళకు కట్టినట్లు చక్కగా చిత్రించారు.

వైద్యుడు- మానవీయ విలువలు:

వైద్యునిలో ఉన్నటువంటి మానవతా దృక్పథాన్ని ప్రధానంగా మూడు విధాలుగా చూడవచ్చు, అందులో మొదటగా ‘స్పర్శే ఒక సంజీవని’గా తెలుపవచ్చు. వైద్యుడి చేతి చలవ(హస్తవాసి మంచిది అనే నానుడి పుట్టింది) రోగిని పలకరించే తీరు సగం రోగాన్ని నయం చేస్తాయి. కేవలం మందులు ఇవ్వడమే కాకుండా, మానసిక ధైర్యాన్ని ఇవ్వడం వైద్యుని పరమోత్కృష్టమైన మానవీయ విలువ అది. “స్టెత్ స్కోప్ తన యొక్క కంఠాభరణం మందులతో వ్యాధుల మీద చేయును సమరం తన చూపులతో మాయం చేయును రోగం తన స్పర్శతో రోగులతకు పోయును ప్రాణం’ డా. పురుషోత్తమంగారు తెలిపారు.

రెండవది లాభాపేక్ష లేని సేవగా వైద్యవృత్తిని గుర్తించటం. వ్యాపార ధోరణి పెరుగుతున్న నేటి ఆధునిక సమాజంలో పేద ధనిక అనే భేదం లేకుండా అందరికీ సమాన వైద్యం అందించడమే నిజమైన వైద్యుడి ప్రధమ లక్షణం. ఇక మూడవది నిరంతర సమరం అనేది వైద్యవృత్తిలో ఉంటుంది. సమాజం నిద్రపోతున్నా, అర్ధరాత్రి వేళ కూడా ఒక ప్రాణాన్ని కాపాడటానికి వైద్యుడు చేసే పోరాటం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుంది.

‘కంటికి కనిపించని దేవుడి కంటే కళ్లముందే ప్రాణం పోసే వైద్యుడే మిన్న! తెల్లని కోటు వెనుక దాగున్న హృదయం ప్రతి క్షణం కోరుకుంటుంది రోగి క్షేమం కుల మతాల పట్టింపులు లేని వృత్తి ఇది

మానవత్వమే పరమార్థంగా సాగే ప్రవృతి ఇది’ అంటారు.

రోగం ముందట అందరూ సమానమే. మనిషి ఏ స్థితిలో ఉన్నా ఆఖరుకు తన జీవన కోసం వైద్యుడి దగ్గరకు చేరవలసినదే. వివిధ రకాల రోగుల ప్రధాన ఆశయం తమ ప్రాణాలను కాపాడుకోవటమే. మనిషి స్థాయి ఎంత ఉ న్నతమైనది అయినా, ఎంత తక్కువదైనా అతని జీవితాన్ని నిలబెట్టేది వైద్యుడు మాత్రమే. రోగి ప్రాణం, శ్వాస ఆరోగ్యం అనేవి వైద్యుడి చేతిలోనే, చేతల్లోనే ఉంటుంది.

‘కరుడు గట్టిన నేరస్తుడైనా దేశాన్నేలే ప్రధానైనా పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముదుసలి దాకా చదువురాని కూలీ ఐనా – రాకెట్టు పంపే శాస్త్రవేతైనా మానవరూపంలోని దేవుడైనా – బతికించేది వైద్యుడే’అంటారు కవయిత్రి రోహిణిప్రసాద్ గారు, వైద్య వృత్తిలోని గొప్పతనాన్ని అత్యంత ప్రభావవంతంగా చాటి చెప్పారు.

దేవుడి ప్రతిరూపం వైద్యుడు:

కంటికి కనిపించని దేవుడు కంటే ప్రాణం రక్షించే వైద్యుడే నిజమైన దేవుడని ఆధునిక దేవుడని ఆధునిక కవులు విశ్వసించారు. మృత్యువుతో పోరాడుతున్న రోగికి పునర్జన్మ ప్రసాదించే వైద్యుడి చేతి స్పర్శను, వైద్యుడి ప్రేమామృతాన్ని, కరుణను శ్లాఘించాయి.

దేవాలయంలో శిలగా మారిన

‘ ఆసుపత్రి గదిలో శ్వాస పోసే వైద్యుడే మిన్న

దేవుని కంటే

కన్నీరు తుడిచే ఆ చేతులే మానవత్వపు సిరులు’

నిజమైన వైద్యుడికి రోగి యొక్క ఆర్థిక స్థితి, కులం, మతం ముఖ్యం కాదని, కేవలం ప్రాణాన్ని కాపాడటమే వైద్యుడి ఏకైక లక్ష్యమని ఆధునిక అభ్యుదయ కవులు చాటి చెప్పారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడటం అనేది సమాజ రక్షణలో భాగమని కవులు భావించారు.

సాహిత్యంలో వైద్యుడు- వైద్య వృత్తి:

తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి వైద్యం గురించి, వైద్యుడు గురించి అనేక రకాల గ్రంధాలు కనిపిస్తున్నాయి. అనేక వైద్య పద్ధతులు, ఔషదాలు, మూలికలు, పసరులు, ఆకులు, కాయలు వాటి తయారు విధానాలు కాకుండా వాటి ద్వారా రోగికి కావాల్సిన ఉపశమనం గురించి కూడా తెలిపారు. చరకసంహిత, వస్తుగుణ దీపిక, రసరత్నాకరము, వైద్యచింతామణి, గృహవైద్య దీపికలు మొదలైన గ్రంధాలు కనిపిస్తున్నాయి. ఆధునిక కాలంలో అనేక వైద్య పద్ధతులతోపాటు అంతుచిక్కని వింతరోగాలు వస్తున్నాయి. వీటి నివారణ కోసం అల్లోపతి, హోమియోపతి, యునాని, నాటువైద్యం, గృహవైద్యం, పశువైద్యం వంటి వైద్య గ్రంథాలు సాధారణ వ్యవహారిక భాషలో కనిపిస్తున్నాయి.

‘హౌన్సర్జన్, లెటర్ ఫ్రం డాక్టర్ నవలలు రాసిన డాక్టర్ మేకా విజయమోహన్రెడ్డి.

గాలి వాసరరెడ్డి కవిత్వం పేరుతో 16కవితలు సంపుటంను రచయిత గాలి వాసరరెడ్డిగారు ముద్రించారు. కవయిత్రి డాక్టర్ కందేపి రాణీప్రసాద్ గారు రాసిన అనేక వైద్యం, వైద్యుడు కవితలు ఎంతో ప్రసిద్ధాలు.

వ్యాపారీకరణలో వైద్యవృత్తి-వైద్యుడు:

ఆధునిక తెలుగు కవిత్వంలో కేవలం ప్రశంసలే కాకుండా, ప్రస్తుత కాలంలో వైద్య రంగంలో పెరుగుతున్న వ్యాపార ధోరణిని కూడా కవులు ప్రశ్నించారు. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడిని ఎండగడుతూ ‘వైద్యం పేదవాడికి అందుబాటులో ఉండాలి అని డిమాండ్ చేస్తూ మావనీయవిలువలు మృగ్యంకాకూడని హెచ్చరించే కవితలు వచ్చాయి.
‘రోగి గుండె చప్పుడు వినాల్సిన స్టెతస్కోప్ నేడు జేబుల బరువును కొలుస్తోంది ప్రాణం పోయాల్సిన తెల్లని కోటు, నోట్ల కట్టల వెనుక దాక్కుంటోంది ఆసుపత్రి ఇప్పుడు శ్వాస నిచ్చే ఆలయం కాదు అడుగడుగునా బిల్లులు వేసే కార్పొరేట్ బజారు’ అంటూ కొనసాగిన ఈ కవితలో వైద్యం ఒక అమ్మకపు వస్తువుగా మారిందని డబ్బున్న వాడికే దక్కే ఒక లగ్జరీ వస్తువులా మారిపోయిందని, పేదవాడు ఆసుపత్రి మెట్లు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని కవులు ఆవేదన చెందుతున్నారు. అనవసర పరీక్షల దోపిడి చేస్తూ రోగాన్ని నయం చేయడం కంటే డయాగ్నోస్టిక్ లాబ్ లతో కుమ్మక్కై అనవసరమైన టెస్టులు రాయడం, రోగులను భయభ్రాంతులను గురిచేసి డబ్బులు గుంజడాన్ని ఆధునిక అభ్యుదయ కవులు తీవ్రంగా నిరసించారు.

అత్యవసర స్థితిలో రోగి ఆసుపత్రికి వస్తే ముందు ప్రాణాలు కాపాడటం మానేసి, అడ్వాన్స్ ఫీజు కట్టాలని, ఇన్సూరెన్స్’ కాగితాలు చూపించాలని వేధించే అమానవీయ కోణాన్ని కవులు తమ కలాలతో ప్రశ్నించారు. నైతిక విలువల పతనం వైద్య విద్య కూడా లక్షలాది రూపాయల డౌనేషన్లతో వ్యాపారమయం కావడం వల్లే, చదువు పూర్తి చేసుకుని వచ్చే కొందరు వైద్యులు ఆ పెట్టుబడిని తిరిగి సంపాదించుకోవడానికి మానవత్వాన్ని పక్కన పెడుతున్నారని కవులు తమ కవితలలో తెలిపారు.

ఆధునిక కవులు కేవలం వ్యవస్థను తిట్టడమే కాకుండా నైతిక విలువల పునరుద్ధరణను కోరుకుంటున్నారు. వైద్యం అనేది మానవ హక్కు కావాలని, లాభాల కంటే మనుషుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇచ్చే మానవీయ వైద్యవిధానం తిరిగి కవిత్వం ద్వారా గళాలను విప్పారు.

ముగింపు:

ఎంత సాంకేతికత ఎంత ఆధునికీకరణ అభివృద్ధి చెందినా, వైద్య వృత్తికి మూలస్థంభంగా మానవత్వమే ఎంత సాంకేతికత ఎంత ఆధునికీకరణ అభివృద్ధి చెందినా, వైద్య వృత్తికి మూలస్థంభంగా మానవత్వమే అని ఆధునిక తెలుగు కవిత్వం స్పష్టం చేస్తుంది. వైద్య రంగం తన కొల్పోయిన పవిత్రతను, సేవాగుణాన్ని తిరగి సాధించుకోవాలని కవులు ఆకాంక్షింస్తున్నారు. వైద్యుడిలో సేవాభావం, రోగిలో నమ్మకం ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన సాధ్యమవుతుంది. వైద్యవృత్తికి, వైద్యుడికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని పొందగలరు.

ఆధార గ్రంథాలు:

1. అరుణకుమారి,జి. (1986), ఆధునిక తెలుగు కవిత్వం- మానవతా దృక్పథం, హైదరాబాదు విశ్వవిద్యాలయం..

2. రామకోటి శాస్త్రి, కేతవరపు. ఆధునిక తెలుగు సామాజిక కవిత్వ ఉద్యమాలు,

సుందరయ్య విజ్ఞానకేంద్రం ప్రచురణలు, హైదరాబాద్.

3. చంద్రశేఖర రెడ్డి,, రాచపాళెం. సాహిత్యము- సామాజిక చైతన్యము, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.

4. జాతశ్రీ (2018), వృత్తి జీవితాల సంక్షోభ చిత్రం, సారంగ బుక్స్ ప్రచురణలు.

5. డాక్టర్ కందేపి రాణీప్రసాద్. వైద్యుడు కవితలు,

6. గాలి వాసరరెడ్డికి లేఖలు- గాలి వాసరరెడ్డి.

 

డా|| యస్. జ్యోత్స్నారాణి

తెలుగు శాఖాధ్యక్షులు

సప్తగిరి డిగ్రీ కళాశాల, విజయవాడ.

సెల్ : 9491498749

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top