
తెలుగు పరిమళం’ – కావ్యసందేశం – వెంకటేశ్వరావు కట్టూరి
Volume – 1, September 2026, issue – 6,
సమర్పణ (D.O.S): 17-07 – 2026 ఎంపిక (D.O.A): 22– 07 – 2026 ప్రచురణ (D.O.P) : 01-09-2026
వ్యాస సంగ్రహం :
తెలుగు పరిమళం కావ్యంలో వెయ్యేండ్ల తెలుగు వారి చరిత్రను ఆధారంగా చేసుకుని రచించిన ఈ కావ్యంలో మాతృభాషను బ్రతికించు కోవాలంటే ముందుగా మన ఇంట్లో నుండే మార్పు రావాలని కవి పిలుపునిచ్చారు.తెలుగు పరిమళం దీర్ఘ కావ్యంలో కావ్య నేపథ్యం, ప్రముఖ దీర్ఘ కావ్యాలు , ఇతివృత్తం గ్రహించిన విధానం , వర్ణనలు, సంభాషణలు, సూచనలు మొదలైన అంశాలతో ఈ కావ్యంలోని విషయాన్ని వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
కీలక పదాలు :
వరప్రసాద్, దీర్ఘ కావ్యం, కవిత్వం, తెలుగు పరిమళం,మహాభారతం, పురాణాలు, రామాయణం,ఆంధ్రులు, ఆదికవిత,జాతి, శివకవిత్రయం
పరిచయం :
డా॥ వూటుకూరి వరప్రసాద్ రచించిన ‘తెలుగు పరిమళం’ దీర్ఘకావ్యం తెలుగు జాతి జీవన పయనం. ఆ జాతి పురోగమనం ఎలా మొదలయిందో ఎలా కొనసాగిందో కవి చారిత్రక దృష్టితో విషయాన్ని క్రమపరిచారు. ఇప్పుడు తెలుగువారిగా పిలవబడుతున్న జాతిని ఒకప్పుడు ఆంధ్రులుగా పిలిచేవారని మనకు భారతీయ సాహిత్యంలో ఆదికావ్యమైన రామాయణంలోనూ, మహాభారతగాథల్లోనూ, పురాణాల్లోనూ వీరి ప్రస్థావన కనిపిస్తుంది. ఆంధ్రులు అనగా వేటగాళ్ళని అర్థం. నిజంగా వీరు పయనించిన తీరు చూస్తే ఆ పేరు వీరికి సార్థకమవుతుంది. ఒక జాతి, వారి భాషణ నడిచిన దారిని కవి నదిలా మొదలైందని అంటున్నాడు. నది ఆరంభం పిల్ల కాలువలా సాగినా అది విస్తరిస్తూ పయనాన్ని కొనసాగించి నపుడు విశాలత సంతరించుకుంటుంది. ఆ రీతిలోనే సాగిన ఈ జాతి పయనాన్ని కవి ఇలా రాసాడు.
” లోయల పాయల్లో మాయాలోయల్లో ధైర్యంగా అడుగు లేసి ఊటల బాటల్లో నీటి తెట్లలో ఈదుకుంటూ వచ్చి
చుట్టూతా తిరుగుకుంటూ” (తెలుగు పరిమళం, పుట,1)
వారు పయనించారని చెపుతున్నాడు. ఇంకా వీరు ప్రయాణంలో అడ్డువచ్చిన అడ్డంకుల్ని దాటుకుంటూ ముందుకు సాగారని చెపుతూ ఇలా అంటున్నాడు కవి.
“ఏళ్ళు బీళ్ళు ఊళ్ళు మైళ్ళు దాటుకుంటూ
ప్రకృతి సౌందర్యతను మీటుకుంటూ” వీరు పయనం కొనసాగిం చారని కవి ప్రస్తావిస్తున్నాడు. ఒక జాతి జీవనవాహికకు భాష బలమైన సంకేతంగా కనబడుతుంది.
విషయ వివరణ :
ఆంధ్రుల ప్రాచీనత ఆంధ్రులు మాట్లాడిన భాష కూడా తెలుగవుతుంది గమనించమంటాడు. కవి. తొలిదశలో ఆంధ్రజాతి మాట్లాడుకునే భాష ఆంధ్రభాషగా జనవ్యవహారంలో ఉన్నా కాలక్రమంలో దేశీయతా దృష్టితో పిలిచినపుడు దక్షిణదేశ భాషగా (వడుగర్) మారి తెలుగుగా ప్రసిద్ధిగాంచిన స్థితిని వర్ణిస్తూ ఆంధ్రభాషగా పిలవబడిందని గుర్తుచేస్తున్నాడు. దీనిని బట్టి ఆంధ్రభాషని పిలిచినా తెలుగుభాషని పిలిచి తప్పేమీ లేదంటున్నాడు. సీమాంధ్ర ప్రజలు మాట్లాడేది ఆంధ్రంగానో, తెలంగాణావారు మాట్లాడేది ‘తెలుగు’ అని పిలవాల్సిన పనిలేదు అని కవి పరోక్షంగా మనకు చెపుతున్నాడు.
ఆంధ్రుల చరిత్ర శాతవాహనులతో ఆరంభమైనా, శాతవాహనుల కంటే ముందు “ఆంధ్రదేశాన్ని సమగోప, గోబధ, నరస, కంవాయల వంశాలకు చెందిన తెలుగు రాజులు తెలంగాణా ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించినట్లు తెలుస్తుంది.” కంవాయల వద్ద శాతవాహనులు సామంతులుగా ఉండి స్వతంత్రులైనట్లు చరిత్ర చెపుతోందని ‘అమరావతి చరిత్ర’ అనే పదవ తరగతి పాఠ్యాంశంలో వూటుకూరి వివరించారు. కనుక ఒక జాతి పేరిట రాజ్యం ఏర్పడిందంటే భాష కూడా వర్థిల్లుతుందని చెప్పవచ్చు. ఆ విధంగా తెలుగుభాష ప్రాచీనత కొంత మనకు అర్థమవుతుంది.
శాతవాహనుల పరిపాలన మొదలుకొని తూర్పుచాళుక్య రాజుల పరిపాలనా కాలం దాకా ఇక్కడ ప్రజల భాష జనం నోళ్ళలో నానుతున్నా లిఖితరూపంలో లేకపోవడం ఒకింత వెనుకబాటు తనమే. ఈ సందర్భంలో రాజరాజు రాజమహేంద్రిని రాజధానిగా చేసి పాలిస్తూ నన్నయను మహాభారత రచనకు పూనుకొమ్మని అర్ధించడం ఒక చారిత్రక శున్నివేశం. ఈ సందర్భంలో కవి దాన్ని ఇలా వర్ణించాడు.’
“వేంగి రాజ్యం పెదవేగి నుండి వేగంగా మార్చి రాజమహేంద్రవరాన్ని రాజధాని చేసి చాళుక్య భూపాలుడు రాజరాజు ఏలుబడిలో సారస్వత కళాపరిమళాలు విరజిమ్ముతున్న తరుణంలో 196
ఒకనాటి ప్రభాత అరుణిమలో నన్నయను ‘తెనుగున రచయింపు’మనే అభ్యర్థన ఎదలో పరవశమై ప్రవహించి ‘శ్రీ వాణి గిరిజా’.. .అంటూ” (తెలుగు పరిమళం, పుట,7)
ఆదికవిత తెలుగులో అక్షరాకృతి దాల్చిందని కవి వర్ణించడంలో తెలుగుభాష ఉన్నతస్థితి సరిగ్గా గుర్తించినట్లయింది. నన్నయ తరువాత తెలుగుభాష రహదారిలో పయనించడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. తెలుగుభాషా విస్తరణకు కవుల భావనలే దీవెనలు. అలా భాషావ్యాప్తిలో అమోఘమైన కృషిని చేసి ప్రక్రియా వైవిధ్యంతో కవిత్వం రాసిన నన్నె చోడుని గురించి కవి ఇలా ప్రశంస పూర్వక వాక్యాలు ద్వారా అతడి ఘనతను మెచ్చుకున్న తీరు చూడండి.
“కవిరాజ శిఖామణి నన్నెచోడుడు సారస్వత గగనంలో నిండుచంద్రుడు చిత్ర విచిత్ర ప్రయోగాలతో భాషను పరిపుష్టిగా చేసి
‘జానుతెనుగు’ భాషణకు బాణీలు కట్టి కొత్తపుంతలు తొక్కిన మార్గాన్వేషి” (తెలుగు పరిమళం, పుట,8) అని అభివర్ణిస్తున్నాడు కవి.
నన్నయ తర్వాత సంస్కృత భాషాప్రభావం నుండి “తెలుగుభాషను నిజమైన తెలుగుగా ముందుకు తీసుకురావాలని ప్రయత్నించిన వారిలో నన్నెచోడుడు ప్రథముడైనా, స్థానీయమైన ఇతివృత్తాల్ని స్వీకరించిన ఘనత మాత్రం పాల్కురికి సోమనాథునికే దక్కుతుంది.”” శైవమత వ్యాప్తికి భాషను ఒక సాధనంగా వాడుకున్నా, ప్రజల దగ్గరకు తెలుగుభాష చేరువయ్యేలా చేసిన ఘనత మాత్రం నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్యులకే దక్కుతుంది. “ తెలుగు సాహిత్యచరిత్ర: ద్వా.నా. శాస్త్రి పుట, 27
వీరినే ‘శివకవిత్రయం’అని, వీరి కాలాన్ని శివకవియుగం అని అంటారు.
“తొలిసారి కవులు శివకవిత్రయంగా కంకణం
కట్టుకొని కవితా రచన చేసారు
శివోహమంటూ ఆనందపు పులకింతలు దాసోహమంటూ జనం దరికి చేర్చారని” (తెలుగు పరిమళం, పుట,9) తర్వాత తెలుగుకు మరింత స్థానికతను జోడించి తేటతెనుగు పదాలను వాడుతూ ఆంధ్ర మహా భారతాన్ని పూర్తిచేసిన ఘనత దక్కించుకున్నవాడు తిక్కన. దీన్ని కవి ఇలా వర్ణించాడు.
“అచ్చతెనుగు పదాలతో ముచ్చట గొలిపి ప్రతి పాత్ర గుండెను చిలకరించాయి. మహాభారత రచనలో పదునైదు పర్వాలు పరిమళాలు వెదజల్లి పులకరించాయి”
(తెలుగు పరిమళం, పుట,10)
తెలుగుభాషను సుసంపన్నం చేయడంలో భారతంతో పాటు రామాయణాన్ని రాసిన కవులున్నారని రంగనాథ రామాయణం మొదలుకొని మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ ‘గారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం వరకు వచ్చిన రామాయణేతివృత్త కావ్యాలను తన దీర్ఘ కావ్యంలో ప్రస్తావించాడు. అరణ్యంలో ఆగిపోయిన మహాభారత రచనకు పూర్తిచేసి తెలుగు వాళ్ళకు ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడయ్యాడని కీర్తించాడు.
తెలుగు సాహిత్యం ఒక రకంగా చెప్పాలంటే చాలా విస్తృతంగా విస్తరించి నప్పటికీ అందులో ఉన్న విషయాత్మకతను పట్టుకోవడంలో కవి సఫలత చెందాడని చెప్పవచ్చు. తెలుగు సాహిత్యంలో యుగకర్తలందర్నీ వారి కవిత్వ మాధుర్యాన్ని సంక్షిప్తం చేసి చెప్పడం కత్తిమీద సాములాంటిది. అయినా ఈ రచనలో కవి ప్రతిభ మనకు ద్యోతకమవుతుంది. ‘తెలుగు పరిమళం’ గత వర్తమానకాలంలో సాహిత్యం పరిభ్రమించిన తీరుతెన్నుల్ని మనకు కొండను అద్దంలో చూపాడు. శ్రీకృష్ణదేవరాయలు ‘దేశభాషలందు తెలుగు లెన్స’ని భావించి, ఆదరించిన తీరు వెనుక అతడి భాషాప్రియత్వం మనకు తెలుస్తుంది. శతక కవుల సాహిత్యంలో సామాజిక విస్ఫోటన మనకు వేమన కవిత్వంలోనూ, వీరబ్రహేంద్రుని తత్త్వగీతాల్లో బోధ పడుతుంది. పదకవులు వారి పరమార్ధిక చింతన తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి నట్లుగా చెపుతుంది ‘తెలుగు పరిమళం’.
ఆంగ్లేయుల పరిపాలనా కాలం మిషనరీల ఆగమనంతో తెలుగు నేలపై కొత్తదార్లు పరుచుకున్నాయి. సామాజిక సేవాతత్త్వం మానవీయకోణాల్ని చూపుతూ తెలుగు సాహిత్యానికి ముద్రణాకళతో తెలుగు ముంగిటకు తీసుకురావడం ఒక విప్లవాత్మకమైన సామాజిక మార్పుగా ‘తెలుగు పరిమళం’ మనకు చెపుతోంది. ఇక్కడ ప్రజలభాష పరిఢవిల్లి పుస్తకాల్లో కెక్కిందని చెప్పారు. క్రైస్తవ్యానికి కీర్తనా సాహిత్యం ద్వారా జనహృదయాల్లోకి చొచ్చుకుపోయాయి.
తెలుగు సాహిత్య విస్తరణలో సినిమాల పాత్ర తక్కువేమీకాదు. మానవుడి విజ్ఞాన జగత్తును విశాలం చేసిన ప్రక్రియ సినిమా. అంతేకాదు ఆనందాన్ని సంభాషణల్లో, ‘ఆహ్లాదాన్ని దృశ్యాల్లో, పాటల్లో రసోల్లాసాన్ని కలిగించి వివిధ రకాలైన అనుభూతుల్ని ఏక కాలంలో మనిషి పొందేలా చేసిన మాంత్రిక జగత్తు సినిమా. సాహిత్యం లేకుండా సినిమా లేదు. ఈ విధంగా సినిమాలు మానవ హృదయక్షేత్రాల్లో మనోజ్ఞ ప్రబంధాలుగా వెలిసాయని కవి అభిప్రాయపడుతున్నాడు.
ఆధునికయుగంలో కథ, నవల, గల్పికలు, రకరకాల ప్రక్రియలు జనం చెంతకు వచ్చాయి. ఆధునిక కాలంలో జరిగిన అభ్యుదయ కవిత్వోద్యమం, దిగంబర కవిత్వోద్యమం, విప్లవ కవిత్వోద్యమం, దళితకవిత్వోద్యమం, స్త్రీవాద కవిత్వోద్యమం, బి.సి. వాదం, బహుజనవాదం, మొదలైన వాదాలు సామాజిక స్తబ్దతను బద్దలుకొట్టి జనం ముందు కొచ్చి ఆలోచించేలా చేసాయి. ఈ క్రమంలో సాహిత్యం ద్వారా సామాజిక విస్తృతికి యివన్నీ బాటలు వేసాయని చెప్పొచ్చు.
తెలుగునేలపై ప్రపంచీకరణ ప్రభావం కూడా బాగానే సాగుతుంది. ఈ క్రమంలో కార్పొరేట్ విద్యాలయాలు ఇంగ్లీషు మీడియం ద్వారా సంపన్న వర్గాలకు విద్య సందిస్తూ లాభపడుతున్నారు. బీదవాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువు కొని ఉట్టికి స్వర్గానికి ఎక్కలేక చతికిలపడుతున్నారు. అవకాశాలు చేజిక్కించుకున్నవారు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. కార్పొరేట్ విద్యాలయాల్లో మాతృభాషను కాదని మార్కుల కోసం మృతభాషయైన సంస్కృతాన్ని రెండవ భాషగా ఎంచుకోవడాన్ని కవి ఇలా ప్రశ్నిస్తున్నాడు.
“విద్యావాణిజ్యంలో చదువుల సేద్యంలో మన వాణి చిన్నబోతుంది. కార్పొరేట్ చదువుల ఏథేసులో నిషిద్ధఫలంగా ముద్రవేసి మృతశిశువుకు జోలపాట పాడేస్తారు” (తెలుగు పరిమళం, పుట,48)
అని కార్పొరేట్ విద్యావ్యవస్థపై కవి ప్రశ్నల పరంపరను ఎక్కుపెడుతున్నాడు. ఇప్పుడు భాష బతుకుతుంది. బడుగు బలహీనవర్గాల మధ్య దళిత, ఆదివాసి జీవనపర్వంలో సంభాషణల్లో తెలుగు స్వరం వినబడుతోంది. అంతేకాదు ఇన్ని లక్షలమంది తెలుగువారు మాట్లాడే భాష మన కళాశాలల్లో ఎందుకు ప్రథమభాషగా మనలేకపోతుందని ప్రశ్నిస్తున్నారు.
“భాష విత్తనంలాంటిది దానికి మొలకెత్తడమే కాని చావడం తెలీదు” (తెలుగు పరిమళం, పుట.51)
అని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. తెలుగుభాషను పరిరక్షించే తెలుగు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాడు. తెలుగుభాష ప్రపంచంలో చాలా విశాలంగా విస్తరించి ఉంది. తెలుగునేలపై తెలుగువాళ్ళు తెలుగులో పట్టుమని పది మాటలు మాట్లాడలేకపోతున్నారు. ‘మనిషి ఆయువుకు ప్రాణవాయువు భాషే’ నని భాషదూరమైతే జాతెక్కడ? నీతెక్కడ? అని ప్రశ్నిస్తున్నాడు. మనం నలుగురం కలిసినపుడు మన సంభాషణ మన భాషలోనే ఉండాలని కవి కోరు కుంటున్నాడు. మన భాషలోనే బంధుత్వాన్ని సరి చూసుకోవాలని చెపుతున్నాడు. మన అక్షరాలు మన బంధువుల్లా భావించమని చెపుతున్నాడు.
“భాషల ఆకాశంలో నక్షత్రమై భాసిల్లెలా
అజంతమై
అనంతమై
ప్రశాంతాల వసంతమై
చంద్రోదయాల ప్రభాతమై” (తెలుగు పరిమళం, పుట,72)
హృదయాలను పరవశింపచేయాలని కవి కోరుకుంటున్నాడు.
చివరిగా తెలుగువారి మొదటి సంస్కృతీ కేంద్రమైన అమరావతిలో విధుకుడనే చర్మకారుడు బహూకరించిన ‘పూర్ణకలశం’ నుండి జాలువారే పరిమళ సుగంధపు పాలబువ్వలా నా తెలుగు పరిమళించాలని మన మనస్సనే మధుకలశం నుండి భావపరిమళం దిగంతాల వరకు గుబాళించాలని కవి ఆకాంక్ష. ఇదే కావ్యసందేశం.
ఉపయుక్త గ్రంథసూచి:
1. అప్పారావు, గురజాడ : లవణరాజు కల
2. ఇనాక్, కొలకలూరి : ఆధునిక సాహిత్య విమర్శ సూత్రాలు
3. ఇనాక్, కొలకలూరి : హరిజనుల సాహిత్యం
4. కృష్ణమూర్తి, భద్రిరాజు(సంపా) : తెలుగు భాషాచరిత్ర విజయమనోహర్ ఆఫ్ సెట్ ప్రాసెస్, హైదరాబాద్
5. కృష్ణారావు,వై.వి. (సంపా) తెలుగు సాహిత్యచరిత్ర ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్
6. కోదండరామయ్య, పారుపల్లి : తెలుగే. గొప్పభాష కాని కనుమరుగవుతున్నది వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా>
7. నాగయ్య, జి తెలుగు సాహిత్య సమీక్ష 1,2 సంపుటాలు, తిరుపతి
8. నారాయణరెడ్డి,సి. ఆధునికాంధ్రకవిత్వము – సంప్రదాయం-ప్రయోగం
9. నారాయణరెడ్డి, సి. – ఆధునికాంధ్ర కవితాధోరణులు.
10.వరప్రసాదరావు వూటుకూరి – తెలుగు పరిమళం
11.వరప్రసాదరావు వూటుకూరి : దళిత కవిత్వంలో హిందూ బౌద్ధ క్రైస్తవ మత ప్రతీకలు
-వెంకటేశ్వరరావు కట్టూరి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పరిశోధక విద్యార్థుల కరదీపిక సాహితీవాణి.సంపాదకులు డా.లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు