sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu & English Research Journal)

Literature & Languages | Linguistics | Performing & Visual Arts | Humanities & History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

తెలుగు వ్యాకరణాలపై ప్రాశ్చాత్యుల సేవ – డా.మరపట్ల రాజు,

తెలుగు వ్యాకరణాలపై ప్రాశ్చాత్యుల సేవ – డా.మరపట్ల రాజు

“The Contributions of Western Scholars to Telugu Grammars – Dr. Marapatla Raju”
Volume – 1,                                             September 2026,                                          issue – 6,

సమర్పణ (D.O.S): 02-07 – 2026               ఎంపిక (D.O.A): 14– 07 – 2026          ప్రచురణ (D.O.P) :  01-09-2026  

వ్యాస సంగ్రహం :

తెలుగు భాషా సాహిత్య వికాసంలో విదేశీ మిషనరీలు మరియు ఆంగ్లేయ ఉద్యోగులు విశిష్టమైన సేవలను అందించారు. తెలుగు భాషను నేర్చుకోవడం, క్రైస్తవ మత ప్రచారం చేయడం, పరిపాలనా అవసరాలను తీర్చడం వంటి లక్ష్యాలతో వారు తెలుగు వ్యాకరణ గ్రంధాలు, నిఘంటువులు, పాఠ్యగ్రంధాలను రూపొందించారు. ఈ వ్యాసంలో వారి కృషిని సమగ్రంగా పరిశీలిస్తూ ముఖ్యంగా తెలుగు వ్యాకరణ నిర్మాణంలో మరియు నిఘంటు సంప్రదాయం అభివృద్ధిలో వారి పాత్రను విశ్లేషించడం జరిగింది.

బెంజమిన్ షుల్జి, విలియం బ్రౌన్, ఎ.డి.క్యాంబెల్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తదితరుల రచనలను ఆదారంగా తీసుకొని, వారు రూపొందించిన వ్యాకరణ గ్రంధాలు మరియు నిఘంటువులు తెలుగు భాషా అధ్యయానికి, ప్రమాణీకరణకు, పద సంపద విస్తరణకు చేసిన సేవలను ఈ వ్యాసం వివరిస్తుంది. అలాగే ఈ రచనలు తెలుగు భాషా పరిశోధనకు, బోధనకు మరియు సాహిత్య వికాసానికి ఎలా దోహదపడ్డాయో విశ్లేషించబడింది. తెలుగు భాషా చరిత్రలో విదేశీయుల కృషి ఒక ముఖ్యమైన అధ్యాయమని, వారి వ్యాకరణాలు మరియు నిఘంటువులు నేటికీ పరిశోధకులకు విలువైన ఆధార గ్రంధాలుగా నిలిచాయని ఈ వ్యాసం నిర్థారిస్తుంది.

Abstract:

Foreign missionaries and British officials made significant contributions to the development of Telugu language and literature. With the objectives of learning the Telugu language, propagating Christianity, and fulfilling administrative requirements, they prepared Telugu grammars, dictionaries, and textbooks. This paper comprehensively examines their contributions, with particular emphasis on their role in the development of Telugu grammatical studies and the evolution of the dictionary tradition.

Drawing upon the works of Benjamin Schultze, William Brown, A. D. Campbell, Charles Philip Brown, and others, this paper explains the contributions of their grammars and dictionaries to the study, standardization, and expansion of the Telugu language. It also analyses how these works contributed to Telugu language research, teaching, and the development of Telugu literature. The paper concludes that the contributions of Western scholars constitute an important chapter in the history of the Telugu language and that their grammars and dictionaries continue to serve as valuable source materials for researchers even today.

కీలక పదాలు :

తెలుగు సాహిత్యం, వ్యాకరణం, సిపి బ్రౌన్, విలియం కేరి, ఏ హెచ్ ఆర్డన్, భాష, మామిడి వెంకయ్య, రావిపాటి గురుమూర్తి శాస్త్రి, క్రైస్తవ మిషనరీలు, విలియం హావెల్, గోదావరి జిల్లా, శాస్త్రము, జ్యోతిష్యం, చందస్సు.

Keywords:

Telugu Literature, Grammar, C. P. Brown, William Carey, A. H. Arden, Language, Mamidi Venkayya, Ravipati Gurumurti Sastry, Christian Missionaries, William Howell, Godavari District, Sastra, Astrology, Prosody.

పరిచయం :

మానవవులు ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకొనేందుకు ఏర్పరచుకున్న మహత్తర సాధనం భాష. ఇది వాగ్రూపమైనది అలాగే పశుపక్ష్యాదులు, మానవేతర ప్రాణులు కూడా వాగ్రూపమైన అరుపులు, కూతల ద్వారా తమ భావములను ప్రకటించుకుంటాయి. కాని అవి కేవలం సహజ ప్రవృత్తి ద్వారా ప్రేరణ ప్రతీకారములకు అతి పరిమితమైన ప్రయోజనము కలిగి ఉంటాయి. కానీ మానవ భాష అలాంటిది కాదని చెప్పాలి. పశుపక్ష్యాదుల కంటే మానవులను అగ్రస్థానంలో నిలబెట్టింది మానవులు ఏర్పరుచుకున్న భాష అని చెప్పవచ్చు. ప్రపంచంలో అనేక భాషలున్నాయి. అనేక లిపులు కూడా వున్నాయి. అలాగని లిపిలేని భాషలు ఉన్నను, భాష లేని మానవులు ప్రపంచంలో లేరని చెప్పడంలో సందేహం లేదు. ప్రతి మానవుడనికి భాష యొక్క ప్రయోజనం ఎంతగానో ఉన్నది. మానవుని యొక్క కోరికలు, ఊహభావములకు, తత్త్వ అవగాహనకు ఒక్కమాటలో చెప్పాలంటే మానసిక, ఆధ్యాత్మిక, లౌకిక ప్రగతికి భాషయే ఆయువు. దానికి మరో సాధనము లేదు. మనకు తెలియని భాష అనేక శబ్ధాలతో గాసట, బీసటగా వ్యవహరంలో ఉండటం మనం చూడవచ్చు. అట్టి భాషలను వాక్య భాగము గానూ, ప్రకృతి ప్రత్యాయాలు గానూ, నిర్మాణ విభాగాలుగా విభజించి, విశ్లేషించి శాస్త్రీ యబద్ధంగా ప్రదర్శించేది వ్యాకరణం అని చెప్పాలి. వ్యాక్రియంతే వివిచ్చ ప్రదర్శ్యంతే అనేన శబ్ధా: ఇతి వ్యాకరణ” అని పతంజలి వ్యాకరణ శబ్దమును నిర్వచించారు.

వ్యాకరణము భాష యొక్క నిర్మాణ స్వరూపమును వివరిస్తుంది. అలాగని భాషను నిర్మించదు. ప్రపంచ చరిత్రలో భాషాతత్త్వ గ్రహణ నిర్ణయములకు తొట్టతొలుత ప్రయత్నించిన వారు భారతీయులే. భాషా పరమగు ప్రశంసలు, ఐతిహ్యములు వేదకాలంలో ఉండుట, వేద కాలము నాటికే వ్యాకరణమొక శాస్త్రముగా వర్థిల్లి షడంగములలో ఒకటిగా గుర్తించబడింది1.

షడంగములలో జ్యోతిష్యము, కల్పము తప్ప మిగిలిన శిక్షా, వ్యాకరణం, చందస్సు, నిరుక్తములు భాషకు సంబంధించినవే. ఈ నాలుగింటిలో వ్యాకరణము ప్రముఖమైనది. తెలుగు సాహిత్య లోకంలో సర్వశాస్త్రములకు వ్యాకరణమే అగ్రస్థానమని మన ప్రాచీనుల విశ్వాసము కూడా. మన ఆధునిక భాషావేత్తలు తెలుగులో ఉన్న వ్యాకరణాలన్నింటిని నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి అనుశాసనిక వ్యాకరణములు, వర్ణనాత్మక వ్యాకరణములు, చారిత్రక వ్యాకరణములు, తులనాత్మక వ్యాకరణములుగా వీటిని విభజించారు. వివిధ భాషలలో వెలువడిన వ్యాకరణాలకు, సంప్రదాయాలకు పాణినీ, పతంజాలి వంటి వారు రాసిన గ్రంధాలు ఆధారాలుగా ఉన్నాయి. పైగా ఆనాడు సంస్కృత విద్యయే పూర్వులందరూ, పండితులు కూడా అభ్యసించారు. కాబట్టి తెలుగు వ్యాకరణములకు సంస్కృత వ్యాకరణములు మార్గదర్శమైనాయి. ఏదిఏమైనప్పటికి తెలుగునకు వెలసిన వ్యాకరణములు వందల సంఖ్యను మించి పద్యాత్మకముగానూ, గద్యాత్మకముగానూ, సూత్రాత్మకముగానూ, వ్యాఖ్యాల రూపంలో అనేక విధాలుగా వెలువడ్డాయి.

వివరణ / విషయ నిరూపణ :

ఆంధ్రరాష్ట్రంలో పుట్టిన తెలుగు భాష “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” గా పేరు ప్రతిష్టలు కలిగి విదేశీయులను సైతం అలరించింది. ఉద్యోగాల రిత్యా ఆంగ్లేయ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కొందరు ఉద్యోగాల రీత్యా, క్రైస్తవ మిషనరీలుగా మరికొందరు వచ్చి ఆయా ప్రాంతాలలో పనిచేసి తెలుగును ప్రోత్సహించారు. తెలుగు మాట్లాడేవారికి తమ భాషపై అభిమానాన్ని పెంపొందించి, భాషాభివృద్ధికై కృషి చేసేలా ప్రోత్సహించారు. ఆ విధంగా తెలుగు వ్యాకరణముల రచనకు కూడా పూనుకున్నారు. వారిలో క్రైస్తవ మిషనరీలు, కంపెనీ ఉద్యోగులు మరియు సౌనిక అధికారులు కూడా కలరు. వీరి కృషి మూలముగా తెలుగు సాహిత్య లోకంలో అనేక వ్యాకరణ గ్రంధాలు వెలసినవి. ఇవి ఫ్రెంచ్, లాటిన్, ఆంగ్లము మరియు రష్యన్ భాషలలో వీరు వ్రాయడం జరిగింది.

తెలుగులో ప్రాశ్చాత్యులు రాసిన మొదటి వ్యాకరణం కీ॥శ॥ 1707లో ఫాదర్ బెష్కి గ్రామర్ పేరుతో వ్రాయబడింది. దీనిని దక్షిణ భారతదేశమునకు వచ్చిన ఫాదర్ బెష్కి (C.J.Beschi) వ్రాశారు. తెలుగు భాషకు వ్యాకరణం వ్రాసిన మొట్టమొదటి ప్రాశ్చాత్యుడు ఇతడే2. ఈ వ్యాకరణము అంతంత మాత్రము గానే వ్రాయబడింది. దీనిని గురించి సి.ఎస్. శ్రీనివాసచారి “ది ప్రమోషన్ ఆఫ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్ స్టడీస్ ఇన్ ది కంపెనీస్ డే” అనే గ్రంధంలో ఈ విధంగా వ్రాశారు. తెలుగు వ్యాకరణాన్ని ఫాదర్ బెష్కి రాశాడు. ఎందుకంటే తెలుగును అప్పటి మధురై నాయకుల ఆస్థానంలో మాట్లాడటం వలన బెష్కికి తెలుగు పరిచయం ఉండి ఉండాలని శ్రీనువాసచారి పేర్కొన్నారు.

తరువాత చెప్ప్పుకోదగ్గ మరొక వ్యాకరణ గ్రంధం “వరుగియన్ గ్రామర్” దీనిని బెంజిమీన్ షూల్జి రచించాడు. ఇతడు జర్మన్ దేశస్థుడు. డెన్మార్కు రాజు బ్రిటర్ ద్వారా ట్రాంక్విబార్‌కు వచ్చిన 2వ జట్టు ప్రొటెస్టెంటు మిషనరీ. ఇతను 1719 సం॥రంలో భారతదేశానికి వచ్చారు. 1728 సం॥రం నుండి యస్.పి.సి.కె తరుపున మద్రాసు నందు పనిచేశారు. ఇదే సం॥రంలో “వరుగియన్ గ్రామర్” “గ్రమిటికా తెలుగికా” అనే వ్యాకరణాలను లాటిన్ భాషలో వ్రాశారు. వరుగియన్ గ్రామర్ అనే వ్యాకరణమును జర్మన్ దేశములోని హలె నగరములో 1747 సం॥రం లో ముద్రించబడింది3. షూల్జియే తొలి తెలుగు ముద్రణ కర్తగా మనం చూడవచ్చు. ఈయన “మోక్షానికి కొంచ్చు పొయ్యెదొవ” అనే గ్రంధాన్ని తెలుగులో వ్రాసి ఈ గ్రంధాన్ని ముద్రించారు. గ్రమటికా తెలుగికా అనే వ్యాకరణ గ్రంధము కూడా ఈయన ప్రాశ్చాత్యులను దృష్టిలో  పెట్టుకొని వ్రాశారు. దీనిని 1728లో మద్రాసులో ముద్రించారు. 1984లో ఇది జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ప్రధాన నగరమైన హలెలో 35వ స్వాతంత్య్ర వార్షికోత్సవ సందర్భంగా పునర్ముద్రించబడింది. ఇందులో 198 పుటలుండి ఎనిమిది అధ్యాయాలుగా విభజించబడ్డాయని కృపాచారి గారు తెలుగు సాహిత్యానికి క్రైస్తవుల సేవ అనే గ్రంధమందు తెలియజేసారు.

దీనిని తరువాత “ ఎ గ్రామర్ ఆఫ్ ది జెంతూ లాంగ్వేజ్” అనే వ్యాకరణ గ్రంధము 1807లో రచించబడింది. కానీ దీని రచయిత ఎవరో తెలియరాలేదు. దీనిని విలియం బ్రౌన్ లిగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంధంలో పేర్కొన్నాడు.

తెలుగు సాహిత్య వికాసానికి బ్రౌన్ ఎలా కష్టపడ్డాడో అదే విధంగా బెంగాలీ సాహిత్యాభివృద్ధికి కృషి చేసినవాడు విలియం కేరి. ఈయన తన ఇంగ్లాండు దేశం నుండి 1793 సం॥రం క్రైస్తవ మత గురువుగా భారతదేశంలో గల కలకత్తా నగరానికి 30 మైళ్ళ దూరంలో ఉన్న బండెల్ అనే పోర్చుగీసు సావరంకు చేరుకున్నాడు. డా॥ థామస్ అనే బెంగాలి ఉపాధ్యాయునితోనూ, రాంబస్ అనువాడితోను  పరిచయం పెంచుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల రీత్యా నీలిమందు ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు. కొద్దికాలానికి వీరికి తోడుగా ముద్రణలో అనుభవం గలిగిన జాషువా మార్షమన్, విలియం వార్డ్‌లు మిషనరీలు, కలకత్తాకి ప్రెస్‌కి సూపరెండెంట్‌గా వచ్చారు. తరువాత కొద్దికాలం అనగా 1800 సం॥రం నాటికి కేరీ, మార్షమన్, విలియం వార్డులు కలిసి సిరంపూర్ నందు పాఠశాల, ముద్రణాలయాలను స్థాపించారు. తరువాత 47 భారతీయ భాషలపై కృషిచేసి, 40 భాషలకు సంబంధించి పోత అక్షరాలను తయారు చేసి భారతదేశానికంతటికి సరఫరా చేసి ముద్రణకు ప్రేరణ కల్గించినట్లు ఆచార్య గజ్జర్లమూడి కృపాచారి గారు తన గ్రంధంలో పేర్కొన్నారు. కేరీ తెలుగు వ్యాకరణం రచించి 1814లో ముద్రించడం జరిగింది. ఈ ప్రతి నేటికి నేషనల్ లైబ్రరీ, కలకత్తాలో ఉన్నది ప్రస్తుత ఈ ప్రతి శిథిలావస్థలో ఉన్నది.

అదే విధంగా ఏ.డి క్యాంబెల్ దొర తెలుగు వ్యాకరణమును “ఎ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్” అనే పేరుతో 1816 సం॥రంలో రాయడం జరిగింది. అంతేకాక తెలుగు నిఘంటువును” కూడా వ్రాశారు. అప్పటిలో ఇది బహుళ ప్రచారం పొందెను. ఈయన ఇండియన్ సివిల్ సర్వీస్‌లో అధికారిగా ఉండి ఎంతో శ్రద్ధతో తెలుగు భాషను అభ్యసించి వ్యాకరణం, నిఘంటువు నిర్మించెను. ఇతడు తన వ్యాకరణంలో తెలుగు భాష సంస్కృత జన్యంకాదని తన పరిశోధనల వలన తేలినట్లు వ్రాశారు. క్యాంబెల్ అభిప్రాయము విలియం కేరి మొదలైన విద్యావంతుల అభిప్రాయములకు భిన్నంగా ఉన్నను, తన భావన సరైనదనియు, తెలుగు తమిళకన్నడాది భాషలకు సన్నిహితమైనదనియు ఇతడు నిరూపించెను4. క్యాంబెల్ అభిప్రాయములతో తెలుగుభాష పరిశోధనలో కొత్త పుంతలు తొక్కింది. పైగా ఇతని అభిప్రాయాన్ని సెయింట్  పోర్టు జార్జి కళాశాల యొక్క నిర్వాహణ సంఘాధ్యక్షడైన ఫ్రాన్సిస్ డబ్లియు ఎల్లిస్ కూడా ఏకీభవించినాడు. పైగా ఈ వ్యాకరణమునకు క్యాంబెల్ కోరికపై ఎల్లిస్ ముందు మాట వ్రాసి తెలుగు, తమిళ, కన్నడ మొదలైన భాషలు సంస్కృత జన్యములు కాదని వ్రాసెను.

క్యాంబెల్ పండితుడు ఈ వ్యాకరణ నిర్మాణంలో దేశీయ పండితుల సలహలను అనుసరించి వ్రాసెను. ఇతనికి వ్యాకరణ విషయమున సహయము చేసిన వారు శ్రీ ఉదయగిరి వెంకట నారాయణయ్య గారు, శ్రీ వేదము పట్టాభిరామశాస్త్రి గార్లని క్యాంబెల్ దొర తన వ్యాకరణము యొక్క పీఠికలో తెలియజేసెను5. ఈ వ్యాకరణము 1849 నాటికి మూడవ ముద్రణకు నోచుకుంది. దీనిని ప్రభుత్వము వారు కాలేజీ ప్రెస్సులో అచ్చువేసి అప్పటి గరవ్నరైన ఎర్ల్ ఆఫ్ మ్వారా కె.జి కు అంకితమిచ్చారు.

క్యాంబెల్ దొర వ్యాకరణమునకు సమకాలినమైన మరొక తెలుగు వ్యాకరణం “ఎ గ్రామర్ ఆఫ్ ది జెంతూ లాంగ్వేజ్”. ఈ వ్యాకరణ గ్రంధాన్ని విలియం బ్రౌన్ అనే ప్రాశ్చాత్యుడు రాయడం జరిగింది. ఈ విలియం బ్రౌన్‌కు, సి.పి బ్రౌన్‌కు ఎలాంటి బంధము లేదు. విలియం బ్రౌన్ ఈ వ్యాకరణ గ్రంధాన్ని మచిలీపట్నములో ఆంధ్రదీపికను వ్రాసిన మామిడి వెంకయ్య గారి సహయంతో రచన సాగించారు. ఇది 1810 సం॥రంలో వ్రాసిననూ 1817 సం॥రం వరకూ ముద్రణకు నోచుకోలేదు. ముద్రణకు కొన్ని నెలల ముందు మామిడి వెంకయ్య చనిపోవడంతో, గుండుమళ్ళ పురుషోత్తము అనే వ్యక్తి వ్యాకరణ రచనకు సహయపడెను. దీనికి “జెంతూ” అని పేరు పెట్టుటకు కారణం అప్పటిలో ప్రాశ్చాత్యులు తెలుగునకు, తెలుగు ప్రజలకు, తెలుగు దేశమునకు “జెంతూ” అనే పదాన్ని వాడటం వల్ల జెంతూ అనే పేరు పెట్టెను. జెంతూ అనే మాటను క్రైస్తవేతరులు అనే అర్థంలో ప్రాశ్చాత్యులు ఎక్కువగా ఉపయోగించేవారు. అప్పటిలో ఈ పదం బహుళ ప్రచారంలో ఉండటం వల్ల విలియం బ్రౌన్ తన వ్యాకరణానికి జెంతూ అనే పదాన్ని ఉపయోగించి ఈ వ్యాకరణ గ్రంథాన్ని ముద్రించి మద్రాసు అప్పటి గవర్నరైన “హ్యుగ్ ఎలియట్” నకు ది.28.03.1817న తన వ్యాకరణ గ్రంధాన్ని అంకితం ఇచ్చెను6. పైగా ఈ జెంతూ పదం క్రీ॥శ॥1648లో తొలిసారిగా వాడబడినదని ఇది అర్ధరహితమైన పదమని సి.పి.బ్రౌన్ ఈ జెంతూ పదాన్ని త్రోసిపుచ్చెను.

తరువాతి కాలంలో జె.సి.మోరిస్ అనే ప్రాశ్చాత్యుడు తెలుగునకు “తెలుగు సెలెక్షన్స్ విత్ ట్రాన్స్‌లేషన్ అండ్ గ్రమిటికల్ అనాలసిస్” అనే పేరుతో వ్యాకరణమును రచించెను. ఇందులో వ్యాకరణాంశాలతో పాటు తీర ప్రదేశాలలో వ్యవహరించబడే రెవెన్యూ పదములను కూడా తెలియజేసారు.

కడప, కర్నూలు జిల్లాలయందు క్రైస్తవ సంఘాలకు పునాది వేసిన విలియమ్ హవెల్ గారు “కంపెండియమ్ ఆప్ ది ఆంధ్ర వ్యాకరణం” అనే గ్రంధాన్ని 1834లో వ్రాయడం జరిగింది. ఈయన 19వ శతాబ్ధంలో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్‌లో సర్వేయర్ ఉద్యోగిగా పనిచేసేను. చిన్ననాటి నుండి తెలుగు వారి మధ్య నివసించడం వల్ల తెలుగును దారాళంగా మాట్లాడేవారు. అంతేకాక ఈయనకు సంస్కృతం మీద కూడా మంచి పట్టు కలదు. పుదూరి సీతారామశాస్త్రి గారు వ్రాసిన ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము హవెల్ దొర రాసిన వ్యాకరణము ఒకే కాలంలో వెలువడ్డాయి. హవెల్ గారు బళ్ళారి నుండి శాస్త్రి గారు చెన్నై పట్టణం నుండి తమ వ్యాకరణ గ్రంధాలను ప్రకటించారు. ప్రస్తుతం హవెల్ గారి వ్యాకరణం లభించడంలేదు7.

ఇక తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలందించిన ఘనుడు సి.పి బ్రౌన్ మహనీయుడు. ఈయన తెలుగు నేర్చుకొనే ప్రాశ్చాత్యుల కోసం నిఘంటువులు, వ్యాకరణాలు, వాచకాలను రాశారు. బ్రౌన్ దొర “ఎ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్” అనే పేరుతో వ్యాకరణ గ్రంధాన్ని వ్రాశారు. ప్రాశ్చాత్యులను దృష్టిలో పెట్టుకుని కఠినముగా, నిష్కర్షగా వ్యాకరణ రచన చేసేను. ఇది మొట్టమొదటి సారిగా 1840 సం॥రంలో ముద్రించబడింది. బ్రౌన్ వ్యాకరణ గ్రంధం ప్రచారంలోనికి రాగానే అప్పటి వరకు ప్రచారంలో ఉన్న క్యాంబెల్ గారి వ్యాకరణం కాస్త మరుగునపడింది. అందుకు కారణం క్యాంబెల్ తన వ్యాకరణ గ్రంధాన్ని గ్రాంధిక భాషలో రచించగా బ్రౌన్ వ్యవహరిక భాషలో వ్రాసెను. బ్రౌన్ వ్యాకరణ రచనకు రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు సహయపడిరి. బ్రౌన్ తన వ్యాకరణమును ద్వాదశ పరిచ్చేదములుగా విభజించెను. వాటికి బుక్స్ అని మారు పేరు కూడా కలదు. ఈ వ్యాకరణ గ్రంధము రెండవ ముద్రణకు ముందు చదవరులు, విద్యార్ధుల సలహ అనుసరించి కొన్ని మార్పులు చేసి 1857 సం॥రంలో రెండవసారి ముద్రించెను.

విశాఖపట్టణమునకు చెందిన రెవరెండు ఎ.రిక్కాజ్  “ఎన్ అబ్రిజ్‌మెంట్ ఆఫ్ తెలుగు గ్రామర్” అనే వ్యాకరణ గ్రంధాన్ని 1869వ సం॥రంలో వ్రాశారు. ఇది ఒక సంక్షిప్త తెలుగు వ్యాకరణం. ఇందు మొత్తం 253 సూత్రాలతో దీనిని నిర్మించెను. రిక్కాజ్ తన వ్యాకరణ నిర్మాణానికి ఆధారమగు గ్రంధము బ్రౌన్ వ్యాకరణ గ్రంధమని తెలియజేసేను. రిక్కాజ్ వ్యాకరణం బ్రౌన్ వ్యాకరణం కన్నా సరళముగా వున్నది.

ఏ.హెచ్.ఆర్డన్ దొర గారు “ఎ ప్రొగ్రాసీవ్ గ్రామల్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్” అనే పేరుతో 1873లో వ్యాకరణ రచన చేసి ప్రచురించెను. బ్రౌన్ దొర రాసిన వ్యాకరణం తరువాత పేరు సంపాదించుకున్న వ్యాకరణం ఆర్డన్ వ్రాసినదని చెప్పాలి. దీనిని తెలుగు భాష తెలియని విదేశీయులను దృష్టిలో పెట్టుకొని సరళముగా, ఆంగ్ల వ్యాకరణ పద్ధతిని అనుసరించి వ్రాసెను. ఆంగ్లేయులు వ్రాసిన వ్యాకరణములో ఇది పేర్కొనదగినది. ఇది మూడు భాగాలుగా గల వ్యాకరణం. మొదటి రెండు భాగాలలో వాడుక భాషను గురించి, మూడవ భాగంలో గ్రంధాలలో ఉపయోగపడు సలక్షణ భాషా స్వరూపమును వివరించెను. ఇతను తన వ్యాకరణ పీఠికలో తెలుగు చదువు ప్రతి విద్యార్థి బ్రౌన్ దొరకు కృతజ్ఞుడై వుండాలని వ్రాసి, బ్రౌన్ దొరపై తనకున్న గౌరవమును వ్యక్తీకరించెను8.

జె.సి మారిస్ సోదరుడైన హెచ్.మారిస్ తెలుగునకు వ్యాకరణమును గోదావరి జిల్లా చరిత్రము వ్రాసెను. మారిస్ తన వ్యాకరణ గ్రంధానికి “సిప్లిఫైడ్ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్” అనే పేరుతో వ్రాసెను. దీనిని 1890 సం॥రలో ముద్రించెను. మోరిస్ తెలుగు భాషా స్వరూపమును బాగుగా పరిశీలించి విశిష్ఠ లక్షణాలను తెలియజేసేను. ఇందులో ఇంట్రడక్షన్, ఆర్ధోగ్రఫీ, ఇదియోలజీ సైటెక్స్ అనే నాలుగు ప్రకరణాలుగా 371 వివరణాత్మక సూత్రాలతో వ్రాసెను.

“ఎ మాన్యుల్ ఆఫ్ తెలుగు గ్రామర్ అండ్ పొనిటిక్స్” అనే వ్యాకరణ గ్రంధం 1918 సం॥రంలో ప్రచురించబడెను. కానీ ఈ వ్యాకరణ గ్రంధి రచయిత ఎవరో తెలియరాలేదు. ఈ వ్యాకరణం మొదటి భాగంలో భాషాశాస్త్ర   విషయమగు తెలుగు ధ్వనుల వివరణ గూర్చి ఉన్నది. రెండవ భాగంలో భాష యొక్క నుడికారములు చర్చించబడినవి. ఇందులో మొత్తం 11 ప్రకరణలు, 113 సూత్రములు కలవు. ఇది సరళ సంక్షిప్తమైన సూత్రములతో కూడుకున్న వ్యాకరణ రచన.

ఆల్‌ఫ్రెడ్ మాస్టర్ అనే ప్రాశ్చాత్యుడు తెలుగునకు “ఏన్ ఇంట్రడక్షన్ టూ తెలుగు గ్రామర్” అనే పేరుతో వ్యాకరణమును వ్రాసి 1947 సం॥రంలో ప్రచురించెను. ఆల్‌ఫ్రెడ్ మాస్టర్ రాసిన ఈ వ్యాకరణ గ్రంధం ఆర్డన్ వ్రాసిన వ్యాకరణమునకు వ్యాఖ్యవంటిది. ఆర్డన్ వ్యాకరణ సూత్రాలను పాటిస్తూ తాను గుర్తించిన విశేషాలను వివరించెను.

ఇక వ్యాకరణ గ్రంధాలు ఆంగ్ల భాషయందునే కాక రష్యన్ భాషలో కూడా తెలుగు వ్యాకరణములు రచించబడ్డాయి. ఇందులో మొదటిగా “తెలుగు లాంగ్వేజ్” అనే పేరుతో “జెడ్.పెత్రూని చెవా” తెలుగునకు ఒక లఘు వ్యాకరణమును రష్య భాష యందు రచించెను9. ఇదే కాక మరో వ్యాకరణం రష్యన్ భాషలలో రచించబడింది.  “Kratky grummatichesky ocherk Yazyka Telugu” అనే పేరులో యన్.ద్జేనీత్, పి.హెచ్.జె. పెత్రూనిచెవా, ఎన్.గూరోవ్‌లు ముగ్గురు కలిసి ఈ వ్యాకరణ గ్రంధాన్ని రచించారు. ఇది 1972 సం॥రంలో ప్రచురించబడింది. ఈ విధంగా ప్రాశ్చాత్యుల వ్యాకరణాలు ఆధునిక భాషాశాస్త్రి దృష్టితో రూపొందించబడ్డాయి. ఇంగ్లీషు వ్యాకరణ నమునాతో తెలుగు భాషా స్వభావాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దీని వల్ల కొన్ని పరిమితులు ఏర్పడి, తరువాతి వ్యాకర్తలకు మార్గదర్శమైనాయి. ఇంకా ప్రశంశించ దగ్గ విషయమేమిటంటే వీరి పరిశోధన దృక్పథం తెలుగు వ్యాకరణ అధ్యాయాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది.

ముగింపు :

పైన తెలిపిన విధంగా వ్యాకరణ వ్యాకర్తలందరూ తెలుగునకు ఫ్రెంచ్, లాటిన్, ఇంగ్లీషు, రష్యన్ భాషలలో వ్యాకరణాలను వ్రాసి ప్రచురించారు. పైగా ఇతర ద్రావిడ భాషల కన్నా తెలుగుభాష తియ్యదనము ప్రాశ్చాత్యులను ఆకర్షించుటచే అనేకులు ఈ వ్యాకరణాలను రచించారు. పైగా ఈ వ్యాకరణములన్నియు వ్యవహరిక భాషలోనే ఉన్నవి. ప్రాశ్చాత్యులు దేశీయ తెలుగు వ్యాకర్తల మార్గమును వీడి, ఆంగ్ల వ్యాకరణ విధానమును అనుసరించెను. వీరు విదేశీయులను దృష్టిలో ఉంచుకొని సరళముగా వ్యాకరణాలను వ్రాశారు. ఆంగ్లభాషలో రచించిన వ్యాకరణములు సమగ్రమైనవిగా, రష్యన్ భాషలో ఉన్న వ్యాకరణములు సంక్షిప్తమైనవిగా పేర్కొనబడ్డాయి. పూర్తిగా విద్యార్ధులను దృష్టిలో పెట్టుకొని కొందరు పండితులు లఘు వ్యాకరణములు రచించుటకు ప్రేరణగా ప్రాశ్చాత్యులు నిలిచారని చెప్పాలి. రావిపాటి, ఉదయగిరి, పాపినేని, కందుకూరి వంటి తెలుగు పండితులను ప్రభావితం చేసి, తెలుగు వ్యాకరణ రచనను వెలుగు వెలిగించిన ఘన ప్రాశ్చాత్యులకే దక్కుతుంది.

పాద సూచికలు :

  1. ప్రొఫెసర్ జి.లలిత, తెలుగు వ్యాకరణముల చరిత్ర – పుటసంఖ్య -2
  2. ప్రొఫెసర్ జి.లలిత, తెలుగు వ్యాకరణముల చరిత్ర – పుటసంఖ్య -238
  3. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, తెలుగుసాహిత్యానికి క్రైస్తవుల సేవ -పుటసంఖ్య -76
  4. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము -పుటసంఖ్య -118
  5. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ -పుటసంఖ్య -130
  6. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ -పుటసంఖ్య -133
  7. ప్రొఫెసర్ జి.లలిత, తెలుగు వ్యాకరణముల చరిత్ర -పుటసంఖ్య -248
  8. ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ -పుటసంఖ్య -148
  9. ప్రొఫెసర్ జి.లలిత, తెలుగు వ్యాకరణముల చరిత్ర – పుటసంఖ్య -257

ఆధార గ్రంధములు :

  1. చార్లెస్ ఫిలిప్‌బ్రౌన్, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, తిలక్‌రోడ్,హైదరాబాదు-1963
  2. తెలుగు వ్యాకరణముల చరిత్ర, ప్రొఫెసర్ జి.లలిత, వెలగపూడి ఫౌండేషన్, మద్రాసు -1996
  3. తెలుగు సాహిత్యముపై ఇంగ్లీషు ప్రభావము, ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు, అంజనా ప్రింటర్స్,సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్ -1960
  4. తెలుగు సాహిత్యానికి క్రైస్తవుల సేవ, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య నాగర్జున విశ్వవిద్యాలయం,గుంటూరు-1988

 

డా.మరపట్ల రాజు,

అసిస్టెంట్ ప్రొఫెసర్,

మద్రాసు క్రైస్తవ కళాశాల,

తాంబరం,చెన్నై.

చరవాణి: 9951372731,

మెయిల్ ఐడి: marapatlaraju1994@gmail.com

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top