
తెలంగాణ అస్తిత్వ పోరాటానికి “మునుం” పట్టిన కవులు – డా. ఎన్. విద్యాప్రవీణ
Volume – 1, September 2026, issue – 6,
సమర్పణ (D.O.S): 10-08 – 2026 ఎంపిక (D.O.A): 24 – 07 – 2026 ప్రచురణ (D.O.P) : 01-09-2026
వ్యాస సంగ్రహం:
తెలంగాణ ప్రజల అస్తిత్వ పోరాటంలో భాగంగా వచ్చిన కవితా సంకలనాలు మత్తడి, పొక్కిలితో ప్రారంభమయ్యాయి. వాటి కొనసాగింపుగా “మునుం” కవితా సంకలనం తెలంగాణా కవితా పుష్కరంగా ఏప్రిల్ 2012లో వెలువడింది. 285 కవితలున్న ఈ సంకలనాన్ని తెలంగాణ ప్రజల యాస, భాష, సంస్కృతి, పోరాటం, ఉద్యమాలతో నింపడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా వలసపాలకులు గొంతునొక్కుతున్నా వారి చెరనుండి విముక్తి పొందేందుకు నడుం బిగించి నగారా మోగించిన సంకలనం ఇది. తెలంగాణ ప్రజల ఊరి భాషను, మాండలిక పదాలను వెలికి తీసి సరికొత్తగా, మరో తరానికి ఆ భాష మాధుర్యాన్ని తరలించే ప్రయత్నమే ఇది అని చెప్పవచ్చు.
కీలక పదాలు:
మునుం, మెరిగలు, జోలి, బొక్కలు, నిర్లక్ష్యం, దేవులాట, బువ్వకుండ,తెలంగాణ ఉద్యమ కవిత్వం,నిప్పులేపకండి, అస్తిత్వ ఉద్యమం,ఎన్.గోపి.
పరిచయం :
తెలంగాణ వాద కవిత్వంలో అద్భుతమైన వచన కవిత్వం వచ్చింది. విప్లవ కవిత్వంలో కంటే తెలంగాణ కవిత్వంలో పల్లె వచన కవితలు ఎక్కువగా వచ్చాయి. అన్ని ఉద్యమ కవిత్వాల కంటే తెలంగాణ ఉద్యమ కవిత్వంలో బలమైన రచనలే వచ్చాయి. తెలంగాణ విధ్వంసాన్ని, వేదనను, దోపిడీని, ఆక్రోశాన్ని చిత్రించాయి. నిద్రాణంగానో, అలసత్వం ద్వారానో అణగారిపోయిన తెలంగాణ ప్రజల్లో ఒక్కసారిగా పునరుజ్జీవం నింపిన సంకలనం “మునుం”.
తెలంగాణ అస్తిత్వ ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ మేధావులు ప్రత్యేక భాష అనే వాదాన్ని ముందుకు తెచ్చారు. భాష విషయంలో తెలంగాణ మేధావుల వాదనను పక్కన పెట్టినా ఇతర తెలుగు ప్రాంతాలకు తెలంగాణతో సాంగత్యం లేదన్నది వాస్తవం.
విషయ వివరణ:
ఎన్.గోపి నిద్రాణ తెలంగాణ ఉగ్రస్వరూపాన్ని “నిప్పులేపకండి” అనే కవితలో ఇలా అంటారు. ఎవ్వరైతేనేం మమ్మల్ని / మా బువ్వ తిననిస్తే చాలు/ నవ్వులను దోచుకోక ప్రశాంతి/ దివ్వెలను వెలుగనిస్తే చాలు/ రెప్పల చాటున పడుకున్న/ నిప్పును లేపకండి/ తలలెత్తే ఆగ్రహానికి / తలుపులు తీయకండి. 1969లో నాటి తెలంగాణ ఉద్యమ తీవ్రతను చిత్రించిన కవిత ఇది. ఎన్.గోపి తెలంగాణలోని అన్ని పరిసరాలను పెనవేసుకున్నాడు. మాటలను, మాండలికాలను ఆకలింపు చేసుకుని చిత్రించిన కవిత ఇది.
మెరిగెలు అనే కవితలో
“రాళ్ళు జీల్చినోళ్ళకు గూళ్ళులేవు
ఇటుకలు జేసినోళ్ళకు ఇండ్లులేవు
గొర్రెలు గాసినోళ్ళకు గొంగళ్లు లేవు
అట్లా! ఇట్లా! అందరూ పోయోటోళ్ళే!
దూపబోయిన పోరగాండ్లు
అటే! యాపారం జేసేటోళ్ళు, కాయ కష్టం జేసేటోళ్ళూ అందరూ
కుశ్పిని సంకనబెట్టుకుని పోయెటోళ్ళే! పట్నానికి తరలిపోయేటోళ్ళే!
ఇగ ఉన్న సగంమంది మబ్బున పోయిన మాపటికొచ్చేటోళ్ళే! పల్లె
బొక్కజెరం వచ్చినోని తీర్గ బక్కబడిపోయింది పట్నం జెర్రిపోతయింది” (మునుం ` రామగిరి శివకుమారశర్మ` పుట`1)
ఈ కవితలో పల్లె నుంచి పట్టణానికి వలస వెళ్ళిన కూలీలు, శ్రమజీవుల దుర్భర జీవితాన్ని వివరించారు. పట్టణాల నిర్మాణానికి తమ చెమటను ధారపోసిన వారికే అక్కడ సొంత ఇల్లు, సౌకర్యం భద్రత వుండదు. ఇతరుల కోసం భవనాలు కట్టినవారు తాము మాత్రం గుడిసెల్లో, లేదా తాత్కాలిక నివాసాల్లో జీవించాల్సి వస్తోంది.
ఇటుకలు మోసి, నిర్మాణ పనులు చేసి ఇతరులకు భవనాలు సమకూర్చిన శ్రమజీవులకు కనీసం అవసరమైన వస్త్రం, దుప్పటి వంటి సౌకర్యాలు కూడా అందడంలేదు. పల్లెల్లో ఉపాధి లేక ప్రజల పట్టణాల వైపు వలస వెళ్తున్నారు. కాయకష్టం చేసి జీవించే ప్రజలు, తమ శ్రమను అమ్ముకొని పట్టణంలో బతకడానికి వస్తున్నారు. కానీ పట్టణ జీవితం వారికి ఆశించిన సౌఖ్యాన్ని ఇవ్వకుండా మరింత కష్టాలను మిగులుస్తోంది. గ్రామాల నుంచి వేలాది మంది ఉపాధికోసం పట్టణాలకు రావడంతో జనసాంద్రత, పేదరికం, నివాస సమస్యలు, జీవనపోరాటం పెరుగుతున్నాయి.
‘జోలి” అనే కవితలో
“గడప గడపకు జోలెలో నింపుకున్న కన్నీళ్ళు
లిపిలేని బాధను మోస్తున్నవి
ఆకులు అల్లలాడుతున్న గీ అడవంతా
కొలుపు గుంతల్ల వెండి కొడవళ్లై పూస్తుంది!
మట్టి పాత్రలు బీటలెత్తినప్పుడు జీవితం ఓ పాచి మడుగు
బుడుంగున మునగాలి
కైగట్టిన పాటకు
డప్పుమీద దరువు మార్చాలి
కులపు ఊబిలో అల్లుకుపోయిన నాచు మధ్య ఎంతకాలం
జలపాత ప్రవాహాలమై సాగాలి” (మునుం` పగడాల నాగేందర్ ` పుట`12)
తరతరాలుగా అనుభవిస్తున్న పేదరికం, అవమానం, వివక్షలను కవి తెలిపారు. ఆ బాధకు అక్షరరూపం లేకపోయినా ప్రతి ఇంటి గడప దానిని మోస్తోంది. జోలె అంటే పేదల జీవితంలో ఉన్న దుఃఖాన్ని మోసుకెళ్ళే ప్రతీకగా నిలుస్తుంది.
కొడవలి సాధారణంగా కష్టానికి, శ్రమకు గుర్తు. వెండి కొడవళ్లుగా పూయడం ద్వారా శ్రమలోనే భవిష్యత్తును నిర్మించుకునే శక్తి వుంటుంది. మట్టిపాత్రలు పగిలిపోవడం అంటే పేదల జీవనాధారాల దెబ్బతినడం. అప్పుడు జీవితం స్వచ్ఛమైన ప్రవాహంలా కాకుండా నిలిచిపోయిన, కలుషితమైన పాచి మడుగులా మారుతుంది. అంటే అవకాశాలు లేక, మార్పు లేక జీవితం స్తబ్ధంగా మారుతుంది.
కొత్త పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఆలోచన, కొత్త పోరాట పద్ధతి, కొత్త చైతన్యం అవసరమవుతుంది.
ఇక్కడ కుల వ్యవస్థను కవి ఊబి, నాచుతో పోల్చాడు. ఊబిలో చిక్కుకున్నవారు సులభంగా బయటపడలేరు. అలాగే కులవివక్షలో చిక్కుకున్న సమాజం కూడా ముందుకు సాగలేకపోతుంది. అందుకే ఆ బంధనాలను ఛేదించి జలపాతంలా శక్తివంతంగా, స్వేచ్ఛగా, నిరంతరంగా ముందుకు సాగాలి.
‘దాలి’ అనే కవితలో
“భూమి ఏమాత్రం కదలదు
ఏ మీడియాల కంటపడకుంటనే
బొక్కలు నుగ్గు నుగ్గయితయి
నుసి కమ్ముకుంటది
నింగికైనా దెల్వదు
బంగారు యెన్నులు
మన్నుల గలుస్తయ్
ఒక్క కొబ్బరి చెట్టిరిగితే పరిగెత్తే ఫైళ్ళకు
లక్ష పరెన్నుల శోకం సోకనే సోకదు
మోసే చేతులగుపించవు
పాడె ఒక్కటే కదిలి పోతుంటది” (మునుం` సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ` పుట`17)
భూమి తనపై జరిగే విధ్వంసాన్ని మౌనంగా భరిస్తోంది. చెట్లు నరికి వేయబడినా, ఆకులు నలిగిపోయినా నా బాధ ఎవరికీ కనిపించదు. అది మీడియా దృష్టికి కూడా రాదు. ప్రకృతి పడుతున్న బాధకు ప్రచారం ఉండదు. చెట్లు నాశనం కావడం వల్ల భూమి నెమ్మదిగా తన పచ్చదనాన్నే కోల్పోతుంది. ఈ విషాదం ఆకాశానికైనా తెలియనంతగా మౌనంగా జరుగుతోంది. చెట్లు, ప్రకృతి సంపద బంగారంతో సమానమైనది. అవి నాశనమైతే ఆ సంపద మట్టిలో కలిసిపోతుంది. ఒక చిన్న చెట్టు విరిగిపోయినా, దాని వెనుక ఉన్న ప్రకృతి విలువను పట్టించుకోకుండా అధికారులు తమ ఫైళ్ళలో లక్షల రూపాయల లెక్కలు వేసుకుంటారు. ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యాన్ని కాగితాల పరిపాలనను ఎద్దేవా చేస్తున్నారు కవి.
చివరగా చెట్టు మరణాన్ని మనిషి మరణంతో పోల్చారు. మనిషి చనిపోతే పాడె కదులుతుంది. బంధువులు శోకిస్తారు. కానీ చెట్టు చనిపోతే దాని కోసం శోకించే మనిషి లేడు. అందుకే చెట్టు ఒక “మÖగ జీవి”గా మిగిలిపోతుంది.
“నా పేరు యాద్గిరి” అనే కవితలో
“నేను భాషను ప్రేమిస్తాను
భాష నా తల్లి
తల్లిని ప్రేమించని వాడు మనిషే కాదు
కవి అంతకన్నా కాదు ఏ భాషైనా యాసైనా నాకిష్టమే
నా భాషను ఏవడు ఖూనీ చేసినా
వాడిని ఖూనీ చేయాలనేంత కోపం
నా పేరు, యాద్గిరి నా పేరు వింటేనే
మీ మొఖాలు వెకిలిస్తాయి నన్నో సర్వర్గానో, విలన్గానో
ద్వంద్వార్థాలో జోకర్ గానో
మోసగాడిగానో తార్పుడి గాడినో చూపిస్తారు
అవహేళన చేస్తారు” (మునుం ` జింబో ` పుట`85)
భాష కేవలం మాట్లాడడానికి ఉపయోగించే సాధనం కాదు. అది తన అస్తిత్వానికి ప్రతీక, ఇక్కడ భాషను తల్లితో పోల్చడం ద్వారా భాషతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని తెలియజేస్తున్నాడు. కవి తన భాషను, ప్రజల మాటలను, వారి అనుభవాలను, సాహిత్యంలో నిలబెట్టేవిగా తన భాషను ప్రేమించడం అంటే ఇతర భాషలను ద్వేషించడం కాదని స్పష్టం చేశారు. అన్ని భాషలు, అన్ని యాసలు గౌరవించదగినవి. ఇక్కడ “యాద్గిరి” అనే పేరును విన్న వెంటనే కొందరు ఒక నిర్ధిష్ట ప్రాంతం, వర్గం యాసకు సంబంధించిన వ్యక్తిని ఊహించి, అతన్ని హాస్యపాత్రగా లేదా ప్రతికూల పాత్రగా చిత్రిస్తారు. సినిమాలు, కథలు, హాస్య ప్రదర్శనలు మొదలైన వాటిలో తరచుగా హాస్యానికి, అవహేళనకు గురిచేసే పాత్రలుగా చూపించే ధోరణిని కవి విమర్శస్తున్నారు. అంటే సమస్య యాసలో లేదు ఆ యాసను చూసే మనిషి దృష్టిలో ఉంది. ఒక భాషను, యాసను గౌరవించకుండా వెక్కిరించడం ద్వారా ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఆ భాష మాట్లాడే మొత్తం సమాజపు అస్తిత్వాన్ని అవమానిస్తున్నారని కవి భావిస్తున్నారు.
‘దేవులాట’ అనే కవితలో
“ఒక చినుకు పడుతుంది
తప్పిపోయిన తొలకరి బంధాల కోసం
పిండి పిండిలా దున్నిన దుక్కై
తపిస్తున్న ఊరు కనుగుడ్ల మీద
పండుగ పాశమై కురుస్తుంది
బతుకు తెరువు చూపలేక
పల్లె భంగపడినప్పుడే కదా
ఎండిన డొక్కల్ల నుంచి
వలస రెక్కలు మొలుచుకొచ్చింది
గాలి దుమారానికి
ఎగిరిపోయిన పక్షులన్నిటికీ
గుండె గూడు యాదికొస్తది” (మునుం` దేశపతి శ్రీనివాస్ `పుట`95)
ఒక్క వానచినుకు పల్లెకు సాధారణమైన నీటి బిందువు కాదు. అది ఎండిపోయిన నేలకు రైతుకు, ఊరికి ఆశను నింపే జీవన సంకేతం. తొలకరి కోసం ఎదురు చూస్తున్న గ్రామం ఆ చినుకును పండగలా స్వాగతిస్తుంది. వాన కేవలం ప్రకృతి సంఘటనగా కాకుండా తప్పిపోయిన బంధాలను తిరిగి కలిపే శక్తిగా కవి భావిస్తున్నాడు. ఎండలతో పొలం చీలిపోయి దున్నిన నేల వాన కోసం ఆర్తిగా ఎదురుచూస్తోంది. వాన చినుకులు పల్లె ప్రజల కళ్లలో ఆనందాన్ని నింపుతాయి. వానలు పడక జీవనోపాధి లేకపోవడం వల్ల పల్లె ప్రజలు ఊరిని విడిచి పట్టణాలకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఎండిపోయిన పల్లె జీవితం నుంచే వలస రెక్కలు మొలుస్తున్నాయి. వలస వెళ్ళిన మనుషులను పక్షులతో పోల్చాడు. గాలి దుమారం పక్షులను గూటి నుంచి దూరం చేసినట్లే ఆర్థిక పరిస్థితులు మనుషులను స్వగ్రామం నుండి దూరం చేస్తున్నాయి. అయినప్పటికీ వారికి తమ “గుండె గూడు” అయిన పల్లె ఎప్పటికీ గుర్తుకొస్తూనే ఉంటుంది.
“బువ్వకుండ” అనే కవితలో
“గీ తెలంగాణ కావాలనెటోళ్ళం
మనలచ్చలచ్చల ఇలువగల
పానాలు తీసుకుంటున్నం
గాని
గాడ
ఆంధ్రుల ఓడన్నా సచ్చిండా
గదే ఆడి ఇఖ్మత్
గిదింకా మనకు సమజైతలేదు
గదే బోలబాలతనం
అదే
గిప్పట్నుంచి మీ పానాలు
మీయిగావు మాయి
మీరు
ప్రజలకంకితమై
పోరాటంల ముందువర్సల
మీరే వుండాల
సావకుండ్రి బేటా
సావకుండ్రి
జర ఆలస్యమయితే ఏంబాయే
మన బువ్వకుండ మనది కాకుండా వోదు!” (మునుం` తుర్లపాటి లక్ష్మి`పుట` 359)
తెలంగాణ కోసం పోరాడుతున్న యువతను “తమ్మి” బేటా అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు. ఒక మనిషి మరణించినా దాని వెనుక ఉన్న ప్రాణం, కుటుంబం, ఆశలు, త్యాగం వంటి విషయాలను గుర్తించకుండా పోతుంది. “ఆడి ఇఖ్మత” వంటి మాండలిక ప్రయోగం ఆ మనిషి పట్ల ఉన్న అనుబంధాన్ని, బాధను సజీవం చేస్తుంది. అమాయకత్వంతో, ఆవేశంతో ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదని హెచ్చరిస్తున్నారు. పోరాటంలోకి అడుగుపెట్టిన వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా ప్రజల బాధ్యతను తనమీద వేసుకోవాలి. నాయకత్వం వహించేవారు ముందువరుసలో నిలబడి ప్రజలకు దిశానిర్దేశం చేయాలి. నాయకత్వం అంటే బాధ్యత, త్యాగం, ప్రజల పట్ల అంకితభావం. పోరాటం అవసరమే అయినా ప్రాణాలను నిర్లక్ష్యంగా కోల్పోకండి. బతికి ఉండి ప్రజల కోసం పోరాడండి. కాలం ఆలస్యమైతే పరిస్థితి చేజారిపోవచ్చనే ఆందోళన. ఉద్యమ లక్ష్యాన్ని సాధించడంలో అసలత్వం, ఆలస్యం ప్రమాదకరం.
మన బతుకు, మన బువ్వ, మన భూమి, మన వనరులు మన చేతుల్లో లేకపోతే మన అస్తిత్వమే పరాయిదైపోతుంది. అంటే తెలంగాణ కోసం జరిగిన పోరాటం కేవలం ఒక ప్రాంతం కోసం కాదు. మన జీవనాధారం, మన హక్కులు, మన స్వాభిమానం, మన అస్తిత్వం కోసం జరిగిన పోరాటం.
ముగింపు:
తెలంగాణ మలిదశ ఉద్యమం కాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వం తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని అనేక కోణాల్లో వ్యక్తీకరించింది. ప్రాంతీయ వివక్షను ప్రశ్నించడంతోపాటు తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర జానపద సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం సామాజిక వర్గాల అనుభవాలకు గౌరవప్రదమైన స్తానం కల్పించింది. తెలంగాణ అస్తిత్వాన్ని సాహిత్య స్వరంగా, ప్రజా స్వరంగా, ఆత్మగౌరవ స్వరంగా మలచడంలో మలిదశ కవిత్వం చిరస్థాయిగా నిలిచిందని చెప్పవచ్చు.
ఆధార గ్రంధాలు:
- మునుం (2012) -తెలంగాణ కవితా పుష్కరం.
- పొక్కిలి (2002)-జూలూరి గౌరీ శంకర్ (సంపా )
- నా గొడవ (2012) -కాళోజి.
డా. ఎన్. విద్యాప్రవీణ,
తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్,
ఎస్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల, అటామస్ .
కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~