
Volume – 1, August 2026, issue – 5,
సమర్పణ (D.O.S): 10-07 – 2026 ఎంపిక (D.O.A): 24– 07 – 2026 ప్రచురణ (D.O.P) : 01-08-2026
వ్యాస సంగ్రహం: (Abstract)
తెలుగు సాహిత్యంలో అనేక కవిత్వ ఉద్యమాలు ప్రవేశించాయి. తెలుగు సాహిత్యంలో అనేక మంది పండిత కవులు సంప్రదాయికమైన పద్ధతిలో పద్యాన్ని మెప్పించిగలిగిన వారు ఎందరో కవులు ఉన్నారు. భావ కవిత్వం తెలుగు సాహిత్యానికి ఒక నూతన ఒరవడిని తీసుకువచ్చింది. అలాంటి పద్య చంధస్సులను, భావ కవిత్వాన్ని ఈ రెండింటిని సమపాళ్ళలో సాహితీ సృజనను చేసిన కవి పైడిపాటి సుబ్బరామశాస్త్రిగారు. ఆయన కవిత్వంలో భావ కవిత్వపు ఛాయలు ఎక్కువగా ఉన్నప్పటికి దేశంపట్ల ఎంతో అభిమానాన్ని కలిగిఉన్నారు. శాస్త్రి కవిత్వం నిండా దేశనాయకుల గొప్పతనం, దేశం యొక్క ఐక్కతలను గురించి తెలియజేయటం జరిగింది.
కీలకపదములు:
పైడిపాటి సుబ్బరామశాస్త్రి, రచయిత జీవిత నేపధ్యం, ఉద్యోగ జీవితం, దేశభక్తి, రైతు కవితలు, ఆంధ్రదేశం.
పరిచయం:
ప్రజా క్షేమమే పరమావదిగా కలం పట్టిన అతికొద్దిమందిలో శ్రీ పైడిపాటి సుబ్బరామశాస్త్రి ఒకరు. సమస్త సాహిత్య ప్రక్రియలను అన్నింటిని ఆకలింపు చేసుకున్న పైడిపాటి అన్ని ప్రక్రియలను స్పృశించి అందేవేసిన చేయిగా నిల్చారు. మధురభారతి, జాజిపాటలు, శుక్లపక్షము తదితర రచనలో భావకవితల్ని సృష్టించారు. వీరియొక్క పద్య గేయ కావ్యాల్లో దేశభక్తి ప్రతిబింబిస్తుంది.
కృష్ణవేణి నీరు త్రాగి ఎందరెందరో వ్యక్తులు శక్తులై ఆందనంత ఎత్తుకు ఎదిగారు. వీరందరూ తెలుగుజాతి సర్వతోముఖ వికాసానికి కృషిచేశారు. అలాంటి అమృత మూర్తుల్లో పైదపాటి సుబ్బరామశాస్త్రి ఒకరు. వీరు కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం శాయపురంలో భీష్మ ఏకాదశినాడు 1918 ఫిబ్రవరి28న పేరిందేవమ్మ, వెంకటపున్నయ్య పుణ్య దంపతులకు జన్మించారు.
పైడిపాటివారి విద్యాభ్యాసం- ఉద్యోగజీవితం:
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న చందంగా పైడిపాటి వారి జీవితంలో సాహిత్య పరిమళాలు చిన్ననాటినుండే వ్యాపించాయి.శ్రీ పైడిపాటి శాస్త్రిగారి విద్యాభ్యాసం అంతా ఏలూరు మున్సిపల్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తిచేసి, ఇంటివద్దనుండే సంస్కృత అంలంకారశాస్త్రాలను ఔపాసన పట్టినవీరు అసామానమైన ప్రతిభకలిగిన వారు గా నిలిచారు. తరువాత ఉన్నత చదువులనిమిత్తం మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్షల్లో ఉ త్తీర్ణులైన తదుపరి ఆంధ్రవిశ్వకళాపరిషత్తునుండి డిగ్రీ పట్టాను అందుకున్నారు. పైడిపాటివారు జీవితంలో కడు ప్రశంశనీయులుగా ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షల్లో అత్యధికమైన మార్కులు సాధించి తక్కిన విద్యార్థులలో వారు ప్రత్యేకమైన వారు అని నిరూపించుకున్నారు.
పైడిపాటివారు చేసిన ఉద్యోగాలు, అలంకరించిన పదవులు, హాదాలు, అందుకున్న గౌరవపురస్కారాలు అనేకం. ఏలూరుజిల్లా లోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలలోను, కళాశాలలోను, బోధనావృత్తిని చేపట్టి అక్కడనుండి అనేక కీలకపదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా, తెలుగు ప్రపంచ మహాసభల ప్రభుత్వ సలహాదారునిగా 1968 నుండి అకాడమీ సభ్యునిగా ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యునిగా చిరస్మరణీయంగా సేవలందించారు.
వ్యక్తి ప్రతిభకు సమాజం పట్టం కడితేనే అది మరింత రాణిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన పైడిపాట్టివారు ఆంధ్రులంతా గుర్తేరిగే తెలుగు నేలమీదనే కాకుండా దేశవిదేశాలలో కూడా అనేక సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. పైడిపాటివారిని జాతీయకవిగా గుర్తించినవారు ఏలూరులో జరిగిన సత్కార కార్యక్రమంలో శ్రీపైడిపాటి ‘కవికోకిల’ బిరుదునున 1934లో శ్రీగరికపాటి మల్లావధాని ప్రధానం చేసారు. అంతేకాకుండా ప్రముఖ కథా రచయిత శ్రీపాదకృష్ణమూర్తిగారిచే ‘కవిరాజు’ బిరుదును పొందారు. పైడిపాటివారి జీవితంలో మరపురాని సన్మానఘట్టం హైదరాబాదులో 1957 లో అయ్యదేవర కాళేశ్వరరావుగారి చేతులమీదుగా ‘కవిసమ్రాట్’ బిరుదునిచ్చారు. ఇవియేకాకుండా విజయవాడలో జరిగిన సభలో పైడిపాటివారికి సమకాలీనకుడైన మేటికవిమైన శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారి చేతులమీదుగా స్వర్ణఘంటా కంకణ ధారణను పొందారు.
స్వాతంత్ర ఉద్యమంలో పైడిపాటి:
పైడిపాటివారి దేశభక్తిత్వం అమోఘమైన బానిసత్వపు సంకెళ్ళు, పెకిలించి స్వేచ్చా వాయువు పీల్చడానికి జాతియావత్తు చేసిన ప్రయత్నమే స్వాతంత్య్ర్య సమర బాధ్యతలను పౌరుడిగా శ్రీపైడిపాటి సాహిత్య సమరాన్ని సృష్టించడమే కాకుండా స్వయంగా స్వాతంత్య్రపోరాటం లో పాల్గొన్నారు.
జాతీయోద్యమంలో గొప్పమలుపు అనదగిన క్విన్ఇండియా కు మద్దతు పైడిపాటివారు దేశభక్తిపూరితమైన పాటలతో కూడిన ‘దేశం’ అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. ఈ గేయసంపుటిలో ప్రసిద్ధమైన “త్రిలింగదేశ: మనదేనోయ్”….. లో ప్రముఖంగా పరిసరాలు పైడిపాటివారిని గొప్పస్వాతంత్య్ర సమరయోధునిగా మలచాయి.
పైడిపాటివారి ‘తూణీరం’ గేయకావ్యంలో తొలిపలుకు, జట్కాసుందరి, సొంతడబ్బా, రాగం, చితుకులమంట, విపర్యాసం, లోకం, కబడ్డార్ అనే గేయ ఖండికలు ముఖ్యమైనవి.
పువ్వుపుట్టగానే పరిమళం వెదజల్లిన చందనంగా శ్రీ పైడిపాటి తన తొలికవితా సంపుటితూణీరం’ తోనే విద్వత్కవి అనిపించుకున్నారు. ‘దేశం’ కవితా సంపుటి ఆంధ్రులు దేశభక్తి పూరిత ఆలోచనలను, భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. ఈ గేయం 1942లో ప్రచురణం కావటమే కాకుండా 1943 లో కూడా మలిముద్రణకు నోచుకుంది అంటే ఈ గేయం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంది. ‘దేశం’ కవితా సంపుటిలో అటు జాతీయాభిమానమే కాకుండా ఇటు ప్రాంతీయభిమానం కనిపిస్తుంది.
“పట్టపగటీ నిదురలేరా
పిట్ట పిడుగువోలే రారా..
.. భారతీయుడ నంచు రావేరా
భేరి మ్రోగించాలి లేవేరా……”
ఈ గేయంలోని పంక్తులు ప్రతి భారతీయుణ్ణి కర్తవ్యోముఖునిగా ప్రేరేపిస్తాయి.
భారతదేశంముపై దేశభక్తి:
తనకు జన్మనిచ్చిన మాతృదేశాభిమాన్ని చాటుతూ “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరియసీ’ అనే వేదోక్తిని ప్రతిబింబించేలా ‘భారతదేశం’ గేయఖండికలో అద్భుతంగా చిత్రించారు..
“భరతంబా! నీకు జోహారు
జ్ఞానధాత్రీ! నీకు జోహారు
వీరమాతా! నీకు జోహారు
పాడిపంటా యిచ్చి
బ్రతికించు చునట్టి
కన్నతల్లికి నీకు జోహారు
వెన్నల చూపులకు జోహార్లు……
దేశంకోసం ప్రతిఒక్కరు ఆలపించి నేర్చుకోవలసిన గేయం మరొక్కటి ఉంది. అందులో దేశం కోసం ఎంతో చక్కగా వివరించారు. మన జాతీయగీతం ‘జనగణమన’ గీతానికి దగ్గరగా ఉంటుంది.
జయ జయ జయ జయా
జయమంగళం
జయ మంగళంనిత్య
శుభ మంగళం
మా భరతమాతాకు
మా జగజ్జననీకీ..
గంగా తరంగణీకి
సంగీత ఝరులతో
దివ్యమంగళం.…… అంటూ అమృత సందేశమ్ము సందింపవోయి భారతీయుడా జయ
జయ అని అంటూ సాగే ఈ గేయం మంచి దేశభక్తిని ప్రభోదిస్తుంది.
వివిధ రంగాల్లో దేశభక్తి పతాకాన్ని ఎగురవేసిన భరతముని, వాల్మీకి, శ్రీకృష్ణుడు, దదీచి, రాధేయుడు, సత్యహరిశ్చంద్రుడు కాళిదాసు, భీష్ముడు, మొదలైనవారి ప్రస్తావన ‘భారతదేశం’ అనే ఖండికలో ఉంది. ‘
ఆదికవి వాల్మీకి
అమృత ప్రవాహాలు
కృష్ణయ్య చిందినా
గీతా ప్రభోదాలు
మానేను మావేను అనవేరా
లేవేమి మాకేవి…… లేవేమి మాకేవి….
అంతేకాకుండా సప్తరుషులు సంచరించిన, వేదాలు, ఉపనిషత్తులు, పురాణేతిహాసాలు, ప్రభవించిన భరతఖండ
ఔన్నత్యాన్ని అక్షర బద్దం చేశారు శాస్త్రిగారు.
మా రుషులు దివ్య ప్ర భావైన ధనులు
మా మునులు లోక సం గ్రహణార్థ నిధులు
అరటి పండొల్లచినట్లు లందించి నారు.
శ్రుతి ధర్మములను వి-స్తతమగును స్మతుల.… అన్నారు.
ఆంధ్ర దేశముపై దేశభక్తి:
పైడిపాటి వారికి ఆంధ్రదేశం అంటే అభిమానం కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఆంధుల దేశభక్తి పూరిత ఆలోచనలను ఈ కవితలు సరళమైన రీతిలో ఉన్నాయి. ‘దేశం’అనే గేయ సంపుటిలో రెండో గేయ ఖండిక ‘ఆంధ్రదేశం’.
‘రాయలు మనవాదోయ్- పండిత రాయలు మనవాడోయ్
అందులో ఆంధ్రరాష్ట్రం గొప్పతనాన్ని తెలుగువైభవం గురించి తెలిపారు కవిగారు.
కలం తిక్కనా ఖడ్గ తిక్కనా
గణపతి దేవులు మన వాడోయ్………
తిమ్మరు సయ్యా – తిమ్మ కవీంద్రులు
కేతన మనవాడోయ్ – బమ్మెర పోతన మనవాడోయ్
విద్యా రణ్యుడు – విద్యా నాథుడు
నన్నయ భట్టు – నాచన సోమన
ఎట్టు కవీంద్రులు మన వారోయ్’ అంటూ పేరు పేరున ప్రతి ఒక్కరిని సంస్మరించిన.
పైడిపాటి వారి సంస్కార హృదయం కనిపిస్తుంది.
ఆంధ్ర దేశంలోని అమరావతి, నాగార్జున కొండ శిల్పాలను, శాతవాహనులను, ఆంధ్ర విష్ణువులను, డొక్కా సీతమ్మ, అక్కన, మాదన్నలను, అన్నవరం, కోటప్పు, కాళహస్తి, విజయాద్రీ, భద్రాద్రీ, వేదాద్రీ, సింహాద్రీ, శేషాద్రీ, శ్రీశైలం, మొదలైన పుణ్య క్షేత్రాలను పైడిపాటి వారు ఎంతో చక్కగా స్మరించారు. నదీమ తల్లులకు కూడా నివాళీ అర్పించారు కవి.
“త్రిలింగ దేశం మనదేనోయ్
తెలుంగు లంటే మనమేనోయ్” అంటూ తెలుగు గొప్పతనాన్ని తెలిసిన తీరుచక్కగా ఉంది.
ముగింపు:
పైడిపాటి సుబ్బరామశాస్త్రిగారు నిజమైన దేశభక్తుడు. ఆయన ఆలోచనలు అన్ని దేశభక్తి పూరితములేనని చెప్పవచ్చు. ఆంధ్రాభిమానం కూడా మెండుగా ఉన్న ఆంధ్రుడు. జాతీయ భావ స్ఫూర్తితో రాసిన గేయాలు, కవితలు ప్రజోపయోగకరమైనవిగా ఉన్నాయి. ‘చక్కని అనుభూతితో పదముల కూర్పు, నేర్పుతో జాతీయతా ధర్మాములు రమణీయుముగా బహుముఖముగా గానముములు చేసిన పైడిపాటి ప్రతిభ స్తుతి పాత్రము అని ఉన్నవ లక్ష్మీనారాయణగారి మాటలు అక్షర సత్యములని తెలుపవచ్చును.
ఆధార గ్రంథాలు:
- చెన్నకేశవరెడ్డి. జి.డా., ఆధునికాంధ్ర గేయ కవిత్వం, జయమిత్ర పబ్లికేషన్, బాగ్లింగంపల్లి, హైదరాబాద్. 1988.
- నారాయణరెడ్డి, సింగిరెడ్డి, డా, ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషింగ్స్, హైదరాబాద్, 1989.
- పూర్ణచంద్రరావు యశోద.డా.. పైడిపాటి సుబ్బరామశాస్త్రి రచనలు సమగ్ర పరిశీలన, యశోదపబ్లికేషన్స్, విజయవాడ, ఫిబ్రవరి2008.
- వేంకటావధాని, దివాకర్ల,డా., సాహిత్య సోపానములు, ఆంధ్రసాహిత్య పరిషత్తు, హైదరాబాద్ , 1978,
- సుబ్బారెడ్డి, మద్బూరి, దా.. తెలుగులో జాతీయోద్యమ కవిత్వం, రాగసుధా ప్రచురణలు, తిరుపతి, 1982.