sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

అసమర్థుని జీవయాత్ర ‘పాత్రలు’ – మనస్తత్త్వాలు విశ్లేషణ – తనగాల కిషోర్  

Volume – 1,                                                      August  2026,                                          issue – 5,

సమర్పణ (D.O.S): 13 -07 – 2026               ఎంపిక (D.O.A): 26– 07 – 2026          ప్రచురణ (D.O.P) :  01-08-2026  

వ్యాస సంగ్రహం :

గోపీచంద్ రచించిన ‘అసమర్థుని జీవయాత్ర’ తెలుగు మనోవైజ్ఞానిక నవలల్లో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించింది. ఈ నవలలోని ప్రధాన పాత్ర సీతారామారావు వ్యక్తిత్వం, అతని అంతర్మథనం, జీవితంపై ఏర్పడిన నిరాశ, ఆత్మన్యూనతాభావం, ఆదర్శాలు–వాస్తవాల మధ్య సంఘర్షణ వంటి అంశాలు అత్యంత సహజంగా చిత్రించబడ్డాయి. వ్యక్తి మానసిక సంక్షోభాన్ని సామాజిక, కుటుంబ, ఆర్థిక పరిస్థితులతో అనుసంధానించి రచయిత లోతైన విశ్లేషణను అందించారు.

ఈ వ్యాసంలో నవలలోని ప్రధాన మరియు ఉప పాత్రల మనస్తత్వాలను పరిశీలిస్తూ, ప్రతి పాత్ర కథా నిర్మాణంలో పోషించిన పాత్రను విశ్లేషించబడుతుంది. సీతారామారావు ఆత్మపరిశీలన, నిర్ణయాహీనత, జీవిత విలువల పట్ల ఏర్పడిన సందిగ్ధత అతని వ్యక్తిత్వంలోని అసమర్థతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి. కుటుంబ సభ్యులు, భార్య, మిత్రులు, సమాజం వంటి పాత్రలు అతని మానసిక వికాసం, క్షీణతలపై చూపిన ప్రభావాన్ని కూడా ఈ అధ్యయనం వివరిస్తుంది.

ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం, ఆత్మన్యూనత భావన, అస్తిత్వవాద దృక్పథం వంటి మనస్తత్వ సిద్ధాంతాల వెలుగులో పాత్రల అంతర్ముఖ స్వభావాన్ని విశ్లేషించడం ద్వారా నవలలోని మానవ మనస్తత్వాల సంక్లిష్టతను ఈ వ్యాసం ఆవిష్కరిస్తుంది. వ్యక్తిగత బలహీనతలు, సామాజిక ఒత్తిళ్లు, విలువల సంక్షోభం వ్యక్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో గోపీచంద్ కళాత్మకంగా ప్రతిబింబించిన విధానాన్ని ఈ పరిశోధన స్పష్టీకరిస్తుంది. ఫలితంగా, ‘అసమర్థుని జీవయాత్ర’ కేవలం ఒక వ్యక్తి జీవిత కథ మాత్రమే కాక, ఆధునిక మానవుడి మానసిక సంఘర్షణలకు ప్రతీకగా నిలిచిన మనోవైజ్ఞానిక నవల అని ఈ వ్యాసం నిర్ధారిస్తుంది.

కీలక పదాలు:

అసమర్థుని జీవయాత్ర, గోపీచంద్ , మనోవైజ్ఞానిక నవల, సీతారామారావు, పాత్ర చిత్రణ , మనస్తత్వ విశ్లేషణ, ఆత్మన్యూనతాభావం, అంతర్మథనం, అస్తిత్వవాదం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ, వ్యక్తిత్వ సంఘర్షణ, ఆధునిక తెలుగు నవల

పరిచయం :

నవల అనగానే గుర్తుకువచ్చేది అందులోని పాత్రలు. నవల ఎప్పుడు రచింపబడిన అందులో దేశకాల పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. కాలానుగుణంగా పాత్రలు ఉంటాయి. నవలల్లో ముఖ్యంగా అప్పటి సాంఘీకార్ధిక పరిస్ధితులు ఆ పాత్రలు ద్వారా తెలియపరుస్తారు. నవలలు అనేక భాషలలో లెక్కలేనన్ని వస్తున్నాయంటే కారణం కాలం మారేకొద్దీ నవలల్లో ఆ కాలానికి తగినట్లుగా పాత్రలు సృష్టిస్తారు. అందుకే నవలలు అనేకంగా వస్తున్నా’]’]యి.

“కథలేని నవలల, కథావస్తువులేని నవలలు ఉండవచ్చు. కాని, పాత్రల్లేని నవలలు ఉండటం సాధ్యంకాదు. కథా వస్తువును భరించి కథను నడిపించేవారు. పాత్రలుగా చెప్పబడును!” (వల్లంపాటి వెంకట సుబ్బయ్య, నవలా శిల్పం, పుట-27).  రచయిత పాత్రలు ప్రవర్తన ఆధారంగా కథను అల్లుకుంటూ వెళతాడు. తగిన సమయంలో, తగినచోట పాత్రల్ని ప్రవేశపెట్టడం, అలాగే నిష్క్రమింప చేయడం పాత్ర పోషణకు సంబంధించిన ప్రధాన సూత్రం. “ఏ పాత్ర ఎప్పుడు ఎంతవరకు ఎదగాలి, ఆ పాత్రలోని ఏ గుణం ఎప్పుడు ఎంతవరకు బహిర్గతం కావాలి అనే నిర్ణయించుకొని సాధారణంగా రచయిత పాత్రపోషణ చేస్తాడు. అప్పుడు మాత్రమే పాత్ర క్రమంలో కనిపిస్తుంది.” ( వల్లంపాటి వెంకట సుబ్బయ్య, నవలా శిల్పం, పుట-32)

నిజజీవితంలో ఒక వ్యక్తిని పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే ఎదుట వ్యక్తికిఎంతో కొంత పరిజ్ఞానం అవసరం. దానినే ‘మానసిక స్థితి’, ‘మనోవిశ్లేషణ’ అని కూడా అంటారు. గోపీచంద్ సృష్టించిన ఈ అసమర్థుని జీవితయాత్రలో పాత్రలను మనం అర్థం చేసుకోవాలంటే మనకు కూడా మనోవైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతైన అవసరమే. దీనికి తార్కాణం సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించిన మనోవిశ్లేషణ సిద్ధాంతం మనకు బోధపడుతుంది. ఈ నవలలో ఉన్న పాత్రలు పైన చెప్పిన విమర్శకుల అభిప్రాయాలకు తగినట్లుగా చిత్రించడం జరిగింది. క్లిష్టతకు ఉన్నతంగా సమాజానికి దగ్గరగా మనిషి జీవితానికి భావుకతగా ఈ అసమర్థుని జీవితయాత్ర రసరమ్యంగా సాగింది.

“అసమర్థుని జీవితయాత్ర’లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చెప్పినట్లు ‘క్లిష్టతలేని’ పాత్రలు, ‘క్లిష్టత ఉన్న’ పాత్రలకు భిన్నంగా మనోవైజ్ఞానికత్వం ఉంటుంది. నవలల్లోని పాత్రలను ‘టైప్స్’ ‘ఇండివిజువల్స్’ అని కూడా అంటారు. అంతేకాదు ఈ పాత్రలన్ని తెలుగులో కూడా ఇలాంటి నమూనా పాత్రల విభజన ఉంది. వీటిని ‘ఆర్కిటైప్స్’ అంటారు. ఈ ఆర్కిటైప్ల సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా అరిస్టాటిల్ ప్రతిపాదించాడు. ‘ఆర్కిటైప్’ లో విప్లవకారుడు, వ్యభిచారి, తాగుబోతు, భగ్నప్రేమికుడు గ్రామీణ అమాయకుడు, జీవితంలో పైకి వచ్చినవాడు, జీవితంలో దెబ్బతిన్నవాడు, కృతఘ్నడు, డాంభికుడు, పతివత్ర, ద్రోహి, ఆపదలోని అబల అన్యాయాలకు గురైనవాడు ముఖ్యపాత్రలుగా ఉంటారు.”( వల్లంపాటి వెంకట సుబ్బయ్య, నవలా శిల్పం, పుట-31)

ప్రాచీనంలో నాయక, నాయికల పాత్రలుగా ఉండేవారు. ఈ విభజన శృంగార ఆధారంగా ఎనిమిదిమంది నాయికలుగా విభజించారు. నలుగురు నాయకులుగా పేర్కొన్నారు. ‘ఆర్కిటైప్స్’ ప్రకారం అసమర్థుని జీవితయాత్ర కొనసాగింది. ఇందులో  ప్రధానపాత్రగా సీతారామారావు ముఖ్యుడు. సీతారామారావుతో నవల మొదలై సీతారామావుతోనే సమాప్తం అవుతుంది. చెప్పుకోదగ్గ పాత్రలుగా మేనమామ, అత్త ఇందిర, పాప, రామయ్య తాత, శీనయ్య, మేనేజర్, సీతారామారావు మామలను సృష్టించడం జరిగింది.

1.సీతారామారావు :

అసమర్థుని జీవితయాత్రకు ప్రాణంపోసిన పాత్ర సీతారామారావుది. సుసంపన్నమైన కుటుంబంలో జన్మించి, తాత ముత్తాతలపేరు, ప్రఖ్యాతల్లో పెరిగిన దానధర్మాల గుణంతో ఎదిగాడు. తండ్రి మరణించిన తరువాత తండ్రికి తగ్గతనయుడు అనిపించుకోవాలనే ఆశను కలిగి ఉంటాడు. తండ్రి చేసిన మంచిపనులను వంటపట్టించుకుని పదిమందితో మెప్పు పొందాడు. తండ్రి శ్రాద్ధానికి పదివేలు ఖర్చుపెట్టి ఘనంగా క్రతువు జరిపించాడు. మేనమామ ఇవ్వవలసిన నలభైవేల రూపాయిల బాకీని పదివేలకు తగ్గించి తీసుకున్నాడు. చుట్టుప్రక్కల ప్రజలు అతని గొప్పతనాన్ని పొగిడారు. ఆ మంచితనమే సీతారామారావుని కష్టాల కొలిమిలోకి నెట్టివేసింది. అత్యధికమైన తెలివిని కలిగినవాడు. కొడుకులు ఆస్తులు పంచుకోవడానికే పుడతారేతప్ప నిందలు మీద వేసుకోరు. అన్న మాట ప్రకారం సీతారామారావు జీవితం ‘ వికసించి వాడిపోయిన పువ్వులా మారింది.

శైశవ దశలో తాను ఊహించిన ఊహల జీవితానికి, తాను అనుభవించిన యదార్ధ మనుగడకు ఏమాత్రం పొంతన లేదు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లే సీతారామారావు సెకనుకొక ఆలోచనను ఆలోచిస్తుంటాడు. తనమీద తనకే నిలకడ లేకుండా పోతుంది. సమాజంలో జరుగుతున్న ప్రతీ సంఘటనను ఖండించాలనే చూస్తాడు. సాధ్యమైనంతవరకూ సమర్ధించాలనే చూస్తాడు. జీవంలేని ప్రపంచాన్ని నిర్మించాలని అనుకుంటాడు. ఒంటరితనాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. జాలి గుణాన్ని కలిగి రావలసిన   అప్పులను సైతం మొహమాటంకొద్దీ వదిలేసాడు. జీవితంలో ఎన్నో అనుభవించాలని బహుకోరికలు కలిగినవాడు. వాస్తవ జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఈ సమాజాన్ని ఉద్దరించాలనే దేశోద్ధారకుడిగా బయలుదేరతాడు. కానీ, ఏమీ చేయలేని అసమర్థుడుగానే మిగిలిపోతాడు.

ప్రతీ మనిషికి నచ్చినవి, నచ్చనవి కోరికలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా సీతారామారావుకి ‘పెళ్ళి’ అంటే అసహ్యకరమైంది. వివాహం చేసుకొని సంసారంచేస్తున్న ప్రతి జంటను చూసినప్పుడల్లా యావగింపు చేసుకుంటాడు. సంసారం అంటే రోతని భావించేవాడు. బ్రతుకులో ఈ సంసారంవల్ల ఇబ్బందులు, రోగాలు, దుఃఖాలు, కరువు, దారిద్య్రం, చికాకులు, తాండవిస్తాయని జీవితంలో పెళ్ళంటు చేసుకోకూడదని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ చేసిన పది నిమిషాలల్లోనే తాను ప్రేమించిన ఇందిరను మనువాడాలనుకుంటాడు.

విలాసవంతమైన జీవితాన్ని గడపడం చూసిన రామయ్యతాత, రాబోయే సమస్యలను గురించి ఒక సలహ ఇస్తాడు. జీవితంలో నీవు మంచివనుకొని చేసిన పనులకు పశ్చాత్తాపపడవలసివస్తే హృదయంలో తేళ్ళూ, జెర్రెలు, నివాసమేర్పరచు కుంటాయి. నీ మంచే నీ పతనానికి కారణం అవుతుంది.

ఆరోజు సీతారామారావు, ‘నేను ప్రతిఫలం కోరి చేయడంలేదు తాతా!’ అంటాడు. సీతారామారావు తన మేనమామకు ఒక్క వందరూపాయలు పంపమని ఉత్తరం రాస్తే అందుకు జవాబుగా వచ్చిన ఉత్తరం చదివిన తర్వాత రామయ్య తాత చెప్పినట్లు అతని హృదయంలోనే తేళ్ళూ, జెర్రెలూ నివాసమేర్పరచుకుంటాయి. ఆ ఉత్తరంలో మేనమామ తన మంచితనాన్ని పరిహాసం చేసాడు. తనది మంచితనమే కాదన్నాడు. చేతకాని తనమన్నాడు. కుటుంబగౌరవం నింపుకుంటానికి పెట్టిన పెట్టుబడి మాత్రమేనన్నాడు. తనలోని దుర్గుణాలను బహిర్గతం చేయడంతో పాటు తన తండ్రి, తాతల లోపాలను బయటకు లాగి నిరూపించాడు. తనవాళ్ళందరకూ పదిమందిచేత పొగిడించుకోవాలనే దురద ఉందని రుజువు చేశాడు. ఆ డబ్బును తాను గనుక తెలివిగా దక్కించుకొని, ఉండకపోతే అది మరొక విధంగా దుర్వినియోగమయ్యేదని వాపోయాడు. తాను కాకపోతే ఆ అవకాశాన్ని మరొకరు ఉపయోగించుకొని ఉండేవారని తన అసమర్ధతను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. తనకంటూ స్థిరమైన ఆలోచన లేదంటూ జీవిస్తూంటాడు.

జీవితం గడుస్తున్నకొద్దీ ఆస్తులు తరిగి అప్పులు పెరిగాయి. వాటితోపాటు తన కోపం కూడా పెరిగింది. కోపమే కాదు, చీదరింపు చిరాకు కూడా వచ్చాయి. బ్రతుక బండి నడపలేక మామ సహాయం కోరి ఉద్యోగానికి వెళ్ళతాడు. మేనేజరు విచిత్ర ప్రవర్తనను చూసి మామను తిట్టుకుంటాడు. చివరకు ఉద్యోగాన్నే వదిలేస్తాడు. ఉద్యోగం ఊడటంతో వింత ప్రవర్తనను అవలంభిస్తాడు. ఇంకెప్పుడు బ్రతికి ఉండగా పని చేయకూడదని నిర్ణయించుకుంటాడు. భార్య చెప్పినా, మామ చెప్పినా లెక్కచేయకుండా తిని పడుకుంటాడు. మెలుకువ వస్తుందేమోనని భయపడుతుంటాడు. పాప వచ్చి అమ్మ లెమ్మంటూంది. లే నాన్నా! అంటుంది. కళ్ళు తెరిస్తే భార్య కనపడి వరసపెడుతుంది. ఇంట్లో బియ్యం లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు, కూరల్లేవు అంటుంది. పోనిలే ఇంటి సరుకులు తెద్దామని బజారుకెళితే తను తెచ్చిన సరుకులు భార్యకు నచ్చవు.

 తాను చేసిన బేరం భార్యకు నచ్చదు. తాను తెచ్చిన కూరగాయలు పుచ్చులవుతాయేమోనని త్వరగా నిద్ర లేవటం ఇష్టం ఉండదు. కనుకనే తెల్లవారగట్ల ఒక కలగన్నాడు. ఆనాటి మానసికస్థితికి ప్రతిరూపం ఆ కల.

ఒక రోజు తెల్లవారుజామున కన్న కలలు నిజం అవుతాయి అంటూ అన్నీ గుర్తు చేసుకొని మరీ కలకంటు ఉంటాడు. ఆ కల కూడా ఆకలి గురించే. ఇక్కడ ఆకలి అనగానే మనకు గుర్తుకువచ్చేది కోటి విద్యలు కూటి కొరకే అన్న సామెతే. పూర్వకాలంలో ఋషులు ‘మరోజన్మ’ ఉండకూడదని ‘మోక్షం’ కోసం తపస్సు చేస్తుండేవారు. ఆ విధంగానే సీతారామారావు తన చుట్టూ పుట్టలు అలుముకున్నట్లు గడ్డాలు, ముర్రి ఊడలలా పెరిగిపోయినట్లు ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సు మెచ్చిన శివపార్వతులు అర్థనారీశ్వర రూపంలో ప్రత్యక్షమౌతారు. తాను కోరుకున్న వరాన్ని ఇచ్చి వెళతారు. వరం ప్రభావంవల్ల తాను ఆకలి లేకుండా జీవిస్తున్నట్లు కల కంటుంటాడు. అంతేకాదు, ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు మనకు ఆదికవి నన్నయభట్టు రచించిన ఆంధ్రమహాభారత షష్టమాశ్వాసంలోని శకుంతలోపాఖ్యానం గుర్తుకువస్తుంది. వేటకు బయలుదేరిన దుష్యంతునికి దాహంవేసి దారితప్పి, కణ్వమహాముని ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలో ఉన్న వింతలు సీతారామారావు కలలో కూడా కనిపిస్తున్నాయి.

చీటికి మాటికి భార్యపై విసుగుకుంటాడు. ఒకరోజు ఉదయం భార్య కాఫీకి లేపింది. మొన్న భార్య కాఫీకి లేపనందుకు కోపగించుకున్నాడు. ఇవాళ భార్య కాఫీకి లేపినందుకు కోపగించుకున్నాడు. కాఫీ త్రాగటం అతని ఇష్టమే, అవసరమే అయిన కోపగించుకున్నాడు. ఆ కోపంతో ఒకప్పుడు దీన్ని ఎలా ప్రేమించానా? అని ఆలోచిస్తూ లేచాడు. ఏమిటి అని ప్రశ్నిస్తాడు? కాఫీ తాగండి అన్నది భార్య. మొహం కడుక్కొనిస్తావా అంటాడు. మీకు బెడ్కాఫీ అలవాటేగా అన్నది భార్య, అది నా యిష్టం ముఖం కడుక్కొని కాఫీ తాగాలని దేవుడు రాసిపెట్టాడా? కాఫీ త్రాగి మొఖం కడుకుంటే ఏం? మొఖం కడిగి కాఫీ త్రాగాలే ఏం? అంటాడు. అందుకే ఈ బెడ్కాఫీ త్రాగండి. మళ్ళీ తాగుదురుగాని మొఖం కడుక్కుని అన్నది భార్య. బెడ్ కాఫీయా, గాడిదగుడ్డు కాఫీయా అని భార్య చేతుల్లోని గాజుగ్లాసు తీసుకుంటాడు. గ్లాసు గోడకేసి కొడదామనుకొని, గడగడ కాఫీ త్రాగేశాడు. ఈ విధంగా కాఫీ విషయంలో భార్యను విసుగుకుంటాడు.

బీరకాయ కూర విషయంలో భార్యను నిందిస్తాడు. ఒక రోజు భోజనం చేసే సమయంలో సీతారామారావు, తన భార్యమీద తనకున్న ప్రేమను బహిర్గతం చేయాలని అనుకుంటాడు. భార్య వడ్డించిన బీరకాయ కూరను పొగిడాడు. భార్య ధరించిన ఇస్త్రీ చీరను మెచ్చుకున్నాడు. వంట్లో బాగా లేదా? అని, పరామర్శించాడు. ఆమె ఇష్టంలేనట్లు మాట్లాడింది. అవసరమయినంతవరకే జవాబు యిచ్చింది. అది అతనికి కోప కారణమైంది. బాగా ఉందని పొగిడిన బీరకాయకూర మరికొంచెం వడ్డిస్తానన్నందుకు అతనికి కోపం వచ్చింది. ఆ వచ్చిన కోపం ఈసారి ఆమె తండ్రిమీద కూడా ప్రసరించింది. ఆయన విషయం ఇప్పుడెందుకులేండి అంది. సీతారామారావుకి మరీ కోపమొచ్చింది. ఎదురుగా ఉంటే ఇంకా తగాదా ముదురుతుందేమోనని, ఆమె అవతలకు వెళితే సీతారామారావుకు కోపం మరీ విజృంభించింది. ఆ కోపంతో తినే పళ్ళాన్ని నెట్టివేసి లేచాడు. పౌరుషానికి పెద్ద బిడ్డడుగా వ్యవహరిస్తాడు. భార్యపై, సంసారంపై విరక్తిపుట్టి పచ్చి పట్టిన వ్యక్తిలా మారిపోయి సమాజపు వీథులపై పడతాడు.మూగజీవులతో కూడా మాట్లాడుతాడు. బల్లి కనబడితే, ‘బల్లి ఓ బల్లి!’ అని పిలిచాడు. బల్లి ఆగింది. బల్లి యోగక్షేమాలు అడిగాడు. బల్లి వెళ్ళిపోయింది. ఆ బల్లిలోనే తన ఏకాకితనాన్ని చూసుకున్నాడు. ఈ బాధలు నా ఒక్కడికేనా శీనయ్యకు, రామయ్య తాతలకు లేవా అంటూ ఆలోచింపసాగాడు. ఆలోచిస్తునే ఏ పని లేని వాడికి అతిగా ఆలోచించేవాడికీ అన్ని బాధలు అని నిర్ధారించుకున్నాడు.

సీతారామారావు చేతికి దొరికిన బొగ్గుతో తెల్లగా ఉన్న గోడలపై బొమ్మలు గీశాడు. అతని మానసికస్థితికి అనుగుణ్యమైన చిత్రకలే అది. జరీ పంచలు ధరించి ఎదురైన పెద్దమనిషిని నీవు ఎందుకు పుట్టావో నీకు తెలుసునటయ్యా! అని ఖంగారు పుట్టించాడు. కాఫీ హోటల్లో తిని, పొప్రయిటరుతో అయిదణాలకు బదులు నాలుగణాలు యిస్తే ఏమవుతుందంటా! అని బిత్తరపోయేట్లు చేశాడు.

నాలుగు కూడలి రోడ్డెక్కి సమాజపు స్థితిగతులను, జన పోకడలను గురించి గొప్ప బహిరంగ సభలో ఉపన్యాసకునివలె ఉపన్యసించసాగాడు. పక్కనే జరుగుతున్న రాజకీయ సభలోకి దూసికెళ్ళాడు. ఎవరు పిలవకుండానే వేదిక ఎక్కి వారి మతులుపోయేలా, రాజకీయనాయకుల స్వార్థాలను బట్టబయలు చేశాడు. దీనిని గమనిస్తున్న ప్రజలు సీతారామారావుకి మతిస్థిమితం లేదని రాళ్ళతో జనాలను గురించి పాపం పిచ్చి జనాలు నిజాలు ఉద్దరించాలో ఈ జీవితాలను ఏ విధంగా తీర్చిదిద్దాలో నవ సమాజాన్ని స్థాపించే మహనీయులు దగ్గర తన తుది శ్వాసను వదులుతాడు. దానితో సీతారామారావు పాత్ర ముగుస్తుంది.

2.మేనమామ :

ఈ నవలలో మేనమామ అను పాత్రకు పేరు పెట్టలేదు. తెలుగు సాంప్రదాయానికి ప్రతిబింబించేలా ఉంటుంది. పల్లె ప్రాంతంలో వాడే నానుడి పదమే మేనమామ. ‘మేనమామ’ అనగా అమ్మకు తోబుట్టువు. ఈ మేనమామ సీతారామారావు తండ్రిగారికి స్వయాన బావమరిది. బావకు సహాయంగా వ్యవసాయ పనులలో ఇంటిపనులలో చేదోడు వాదోడుగా ఉండేవాడు.

సీతారామారావు తండ్రి మరణించటంతో లెక్కలలో తప్పులు చూపించినందుకు సీతారామారావు నాన్న వారి మేనమామ ఛీ! కొట్టి పంపించాడు. వారిరువురు మధ్య ఘర్షణ రావటంతో బంధుత్వం చెడిపోయింది. దానితో వారిమధ్య రాకపోకలు కూడా లేవు. తండ్రి మరణానంతరం బాకీ పడ్డ మేనమామ నలభైవేల రూపాయల అప్పును నిజాయితీగ ఒప్పుకుని నేను తీర్చలేను అంటాడు తెలివిగా. జాలిగుణం కలిగిన సీతారామారావు దయతలచి సరేనంటాడు.

ఈ సన్నివేశాన్ని ఆసరాగ తీసుకుని భార్యభర్తలు ఇద్దరు సీతారామావును ఉప్పొంగిపోయే పొగడ్తలతో ముంచెత్తారు. ఆనందాన్ని తట్టుకోలేక బాకీని మరచిపోయాడు. తెలివి ప్రదర్శించి, తన ఆస్తిని దక్కించుకున్నాడు మేనమామ.

సీతారామారావు కష్టాలపాలు అయినప్పుడు వందరూపాయలు అడిగినందుకు నీవు అన్నీ తెలిసిన అసమర్థుడవు. డబ్బు ‘నీకు బాధ్యతలన్నా, డబ్బు విలువన్న తెలియదు’ అని గొప్ప సర్టిఫికెట్ ఇస్తాడు. సీతారామారావు కోల్పోయిన 88 జీవితాన్ని గురించి సార్లక బాధలు గురించి దెప్పిపొడుస్తూ అవమానిస్తాడు. ఈ మేనమామ పాత్ర వ్యంగ్య ధోరణిని కలిగి ఉంది.

3.అత్త :

సీతారామారావుని పొగుడుతూనే ఉంటుంది. తీయని మాటలతో అంటే తడిగుడ్డతో గొంతుకోసినట్లు చేదును రుచి చూపిస్తుంది. మేనమామకు వంత పలుకుతూ సీతారామారావుని బుట్టలో పడేసింది.

ఇందు అత్త అని మాత్రమే సంభోదించాడు. నండూరి నాయుడు, యెంకిలా, కొనకళ్ళ వెంకటరత్నం మామ మరదళ్ళ పోలికలతో త్రిపురనేని అత్త, మామ పాత్రలుగా సృష్టించాడు. అందుకే ఈ పాత్రలకు పేర్లు పెట్టలేదు అనిపిస్తుంది.

4.పాప :

 ఈ నవలలో పాప పాత్ర చిన్నది. ఈ పాప పాత్రకు పేరు పెట్టబడలేదు. సీతారామారావు, ఇందిరలకు పుట్టిన ఒక్కగాని ఒక్క బిడ్డ. బడికి వెళ్ళి చదువుకుంటుంది. పాపకు తన తల్లిదగ్గర రోజుకో గంటసేపు పాఠాలు చెప్పించుకోవటం అలవాటు. తల్లి ఇందిర ఏ పని చెప్పితే ఆ పని చేసేది. తెల్లవారు జామున లేచి ఇంటిముందు పూడ్చి, కళ్ళాపు జల్లి ముగ్గు వేయటం చేస్తుండేది. పనులు చేస్తున్నందుకు తల్లి సంతోషపడేది. మేష్టరుగారు జీతం అడుగుతున్నారనీ బడికి వెళ్ళడం మానేసింది. తండ్రిని డబ్బులు అడిగితే కోప్పడతారిని అడగడమే మానేసింది.

తల్లి ఇందిర ‘పాప’మీద జాలిపడింది. బిడ్డ చేస్తున్న పనులు చూసి బాధపడింది. పాపకు తండ్రి అంటే భయం. అంట్లు తోమటంవల్ల గోళ్ళు అరిగిపోయాయి. తన ఆకారం, స్వభావం అన్నీ మారిపోయినాయి. నిద్రపోతున్న తండ్రిని లేపితే కోప్పడతారని తెలిసి తల్లిమీద ప్రేమతో లేపుతుంది అంతటితో పాప పాత్ర ముగుస్తుంది.

  1. రామయ్య తాత :

సీతారామారావు నివసించే ఊరిలోనే రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనిని అందరు ‘తాతా!’ అని సంభోదించేవారు. ఇతనికి సీతారామారావు కుటుంబం అంటే ఎంతో మక్కువ సీతారామారావుకి తండ్రి చనిపోయిన దగ్గరనుంచి సూచనలు సలహాలు అందిస్తూ ఉండేవాడు. తప్పుచేసినప్పుడల్లా దండిస్తున్నట్లు సలహా ఇచ్చేవాడు. ఆ మాటలు విన్నా సీతారామారావు, ‘నాకంతా తెలిసే చేస్తున్నాను తాత’ అని సమాధానం ఇచ్చేవాడు. ముసలిప్రాణం ఊరుకోక ‘పశ్చాత్తాపంపడే పనులు చేయవద్దు’ అంటూ వేడుకుంటాడు. తన కుటుంబంపై ఉన్న అభిమానంమీద బాబు ఎక్కడ ఇబ్బందులుపాలు అవుతాడోనని బాధపడుతూ ఉండేవాడు. అంతేకాదు పశ్చాత్తాప పడవల్సివస్తే హృదయంలో తేళ్ళూ, జెర్రులూ నివాసం చేసుకుంటాయని చెపుతుండేవాడు. ‘ఇప్పుడు మంచి అనుకున్నది రేపటికి చెడ్డగా కనిపిస్తుంది. ఆ చేదు నిజం తెలిసిన తర్వాత నీవు తప్పు చేశావే అని తెలుసుకుని బాధపడవల్సి వస్తుంది’ అని సీతారామారావుకు చెపుతూ ఉండేవాడు.

ఆ విధంగా ఒక్క విషయంలోనేకాదు మేనమామ విషయంలోనూ, భార్య విషయంలోను, కూతురు విషయంలోనూ ఎన్నో తప్పులను సరిదిద్దాడు. తాత మాటలకు విసుగుపుట్టిన సీతారామారావు తాతను తన్నాలనుకుంటాడు. ఆ పరిస్థితులలో కూడా తాత సీతారామారావు బాగునే కోరుకున్నాడు. కానీ సీతారామారావు తాత మాట ఒక్కసారి కూడా వినలేదు. తాత సీతారామారావు ప్రవర్తన చూసి సకారంగానో. అకారంగానో ‘నీవు పిచ్చివాడివి రా!’ అని ముద్రవేశాడు. అయినాసరే సీతారామారావును వదిలి వెళ్ళిపోతాడు. ఆత్మహత్య చేసుకున్న సీతారామారావు భౌతిక శరీరాన్ని నవలాంతంలో గుర్తుపట్టినవాడు రామయ్యతాత అంతటితో తాత పాత్ర ముగుస్తుంది.

6,ఇందిర :

ఈ నవలలో ఇందిర సీతారామారావు భార్య. సీతారామారావు కాలేజి చదువుతున్న రోజులలో ఇందిరను ప్రేమించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తనలో కొత్త కోరికలు పుట్టడంవల్ల పెళ్ళిచేసుకోవాలనే ఆలోచన కలిగి మనసుకు నచ్చిన ఇందిరను వివాహం చేసుకున్నాడు.

ప్రేమించి పెళ్ళాడిన ఇందిర ఉత్తమ ఇల్లాలు; గుణవంతురాలు; చదువుకున్న సంస్కారవంతురాలు. సీతారామారావు ఆలోచనలకు తగ్గట్టు మసులుకుంటూ ఉండేది. భర్తే తన ప్రాణం అని నమ్మిన అమామాయకురాలు. సమాజపుచేష్టల్లో విసిగెత్తిన సీతారామారావు ఇందిరను వేధించటం మొదలుపెడతాడు. పాపం పిచ్చిపిల్ల వల్లెత్తుమాట కూడా అనేదికాదు. ఎందుకంటే తనూ కూడా ప్రేమించి పెళ్ళిచేసుకుందికాబట్టి. అసమర్థుడైన భర్తతో ఇష్టంలేని కాపురం అన్నట్లు కాకుండా బాధ్యతాయుతమైన ఇల్లాలిగా తన కాపురాన్ని చక్కదిద్దుకుంది. సంవత్సరాంతంలోనే తల్లి పాత్రలోకి అడుగుపెట్టింది. పుట్టింది ఆడపిల్ల అని తెలిసి తగు జాగ్రత్తలు పడింది. విసుగిస్తున్న భర్తతో ప్రేమగా నడుచుకుంటూనే కూతురికి తగిన బుద్ధులు నేర్పించింది. తన తండ్రి వింత స్వభావాన్ని కూతురికి చెప్పుకుంటూ ఈ సమాజంలో ఇలా బ్రతకాలి అంటూ హితోపదేశం చేసేది . భర్తను నిద్రలేపడానికి కూడా వొణికిపోయేది. సరుకులు నిండకున్నగాని ప్రక్కవారి ఇంటినుంచి అరువు పుట్టించుకుని సంసారాన్ని సాగించిందేతప్ప తన భర్తను నిందించలేదు. పక్కవారికి అబద్దం చెప్పి ఇంట్లోకి కావలసిన సరుకులను తెప్పించేది.

కూతురు చదువుకు ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే కళ్ళనీళ్ళు పైట కొంగుతో తుడుచుకుని, బాధను దిగమింగుకునేది. తల్లిని గమనించిన కూతురు తల్లికి చేదోడు వాదోడుగా సాయపడేది. సంతోషించాలో, దుఃఖించాలో అర్ధంకాక ఇందిర ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉండిపోయేది. భర్తను ప్రేమించిన భార్యగా కూతురిని లాలించి తల్లిగా, సంసారాన్ని చక్కదిద్దిన గృహిణిగా బాధ్యత తెలిసిన మహిళగా ఈ సమాజానికి సార్ధకతగల స్త్రీగా జాతికే వన్నే తెచ్చిన నారీమణిగా మిగిలిపోయింది. సీతారామారావు ఇందిరను వదిలివెళ్ళే సమయంలో కూడా భర్త ప్రేమనే కోరుకుందేతప్ప అసహ్యించుకోలేదు. అటువంటి భార్య దొరుకుట అరుదు అని మన జీవిత భాగస్వాములనూ సరిచేసుకోవలసిన పరిస్థితి మనందరికి ఉంటుంది. అటువంటి మైలైన పాత్రగా ఇందిర పాత్రను త్రిపురనేని గోపీచంద్ ఆవిష్కరించాడు.

7.మామ :

 మామ పాత్రలో కూడా పేరును ప్రస్థావించలేదు. ఇక్కడ మామ అనగా ‘పిల్లనిచ్చిన మామ’ అని అర్ధం చేసుకోవాలి. ఇందిర తండ్రిగా ఈ పాత్ర చెప్పబడింది.ఆస్తులు పోగొట్టుకున్నా అల్లుడిని చూసి బాధపడతాడు. ఇందిర కోరికమేరకు ఉద్యోగం వెతికి పెడతాడు. మేనేజరుతో సన్నిహిత సంబంధం ఉండడంతో మామ తాను కొంచెం వింతప్రవర్తనను కలిగి ఉంటాడు. మీరు కొంచెం దయతలిస్తే అని వేడుకుంటాడు.

తన కూతురి ఇష్టంమేరకు అల్లుడిని సహించాడేతప్ప దూషించలేదు. అంతేకాదు ఏనాడు పల్లెత్తు మాటైనా అనేవాడు కాడు. సీతారామారావుకి తన మామ గుర్తుకొచ్చినప్పుడల్లా కసితీర తిడతాడు. తిట్టడమేకాదు తన కూతురిని ఎందుకు కన్నాడో, తెలియదు. ఆ కూతురే లేకపోతే నాకిన్ని కష్టాలు ఉండవు కదా! అని గుర్తుచేసుకుని మరీ తిట్టేవాడు. పిల్లనిచ్చిన పాపానికి ఎన్ని బాధలనైన భరించాలని జీవితాన్ని సర్ధుకుపోతుంటాడు.

8.మేనేజరు :

ఈ పాత్రలో కూడా మేనేజరు అని పేరును సంబోధిండాడేతప్ప పేరు పెట్టలేదు. మేనేజరు ఆఫీసర్లతో, గుమస్తాలతో కంపెనీ పనులు కాకుండా సొంత పనులను చేయించుకునేవాడు. అదే తరహాలో సీతారామారావుకి ఊరు నుంచి వస్తున్న తన కూతురును స్టేషన్ నుండి ఇంటికి తీసుకురమ్మని కారు తాళాలు ఇస్తాడు. దానితో చిర్రెత్తిన సీతారామారావు పని మానేసి పనికిమాలిన బొమ్మను గీశాడు. మేనేజరు అదేంటి అని అడిగితే మా మామ బొమ్మ, నీకవసరమా! అన్నాడు. మేనేజరుకు కోపం వచ్చి ఉద్యోగాన్ని ఊడపీకాడు. విషయం తెలిసిన సీతారామారావు బ్రతుకు గడవదనే భయం లేకుండా మేనేజరు దగ్గరకు వెళ్ళి నీ కూతురు వచ్చిందా! పురుడు పోసి అల్లుడు దగ్గరికి పంపిస్తావు. మరలా అల్లుడు కడుపుచేసి ఇంటికి పంపిస్తాడు.నువ్వు మరల పురుడుపోసి అత్తవారింటికి పంపిస్తావు. ఈ విధంగా నీ జీవితమంతా పురుళ్ళు పోయడానికే సరిపోతుంది. మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటావు అని వెటకారంగా అడిగాడు. కోపం వచ్చిన మేనేజరు నీవు ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి సమాధానంగా మా మామ బొమ్మకు మీసాలు గీయడం మర్చిపోయాను. గీసి వెళదామని వచ్చానంటాడు. అంతటితో మేనేజరు, సీతారామారావు చేతిలో పరాభవాన్ని రుచి చూస్తాడు. అంతటితో మేనేజరు పాత్ర పతాకస్థాయికి చేరింది.

9.శీనయ్య :

పక్క ఊరు నుంచి బ్రతుకుదెరువుకోసం సీతారామారావు ఊరిలోకి వస్తాడు. సీతారామారావు ఇంటిలోనే చిల్లర పనులు చేసే సహాయకారిగా ఉంటాడు. ఆ ఊరి మొత్తంలో ఒకే ఒక బావి ఉంది. అదీ కూడా సీతారామారావు ఉన్న ఖాళీ స్థలంలో ఉంది. ఊరిలో ఉన్న ఆడపడుచులంతా కడవలు తీసుకుని నీళ్ళు తోడుకోవడానికి వచ్చేవాళ్ళు. సరసానికి యవ్వన స్త్రీలు శీనయ్యను చూసి చతుర్లు ఆడేవారు. ప్రక్కన వచ్చిన ముసలవ్వలు వరుస కలిపి అన్నయ్య అని పిలిచేవారు. ఇందిర ఏ పని చెప్పిన కాదనకుండా చేసేవాడు.

ఒకరోజు సీతారామారావు శీనయ్య నువ్వు ఎందుకు వచ్చావు. ఈ ఊరు? అని అడుగుతాడు. దానికి సమాధానంగా బ్రతకడానికి అంటాడు. ఆ బ్రతికేది ఏదో మీ ఊరిలో బ్రతకవచ్చుగా. ఇక్కడ పనేమి దొరుకుతుందని వచ్చావ్ అని అంటాడు. మరలా సీతారామారావు ఆ పని మా ఊరిలో ఉంటే తినడానికే సరిపోతుంది. ఈ ఊరిలో ఉంటే నాలుగు డబ్బులు మిగులుతాయి. ఆ డబ్బులతో పెళ్ళి చేసుకుని నా భార్యతో సుఖంగా ఉంటానని చెప్పాడు.    94 ఈ మాటలలో నిజాయితీ సీతారామారావును పొడిచేసినట్లు అనిపించింది. ఏమీ తెలియని శీనయ్య సుఖాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అన్ని తెలిసిన నేను అసమర్దుడిగా మిగిలిపోయాను అని సీతారామారావు తలుచుకునేలా శీనయ్య పాత్రను సృష్టించడం జరిగింది.

ఈ అసమర్థుని జీవితయాత్రలో పై పాత్రలే కాదు కూరగాయలు అమ్మే ముసలమ్మ పొరిగింటి కాంతమ్మ అనే పాత్రలేకాకుండా గోడమీద బల్లి, సమాజం, సభలు కూడా చెప్పుకోదగ్గవే. సీతారామారావు ఏకాకితనాన్ని బల్లితో సంభాషించి తనలాగే నేను ఒంటరినే అని తన గోడును విన్నవించుకున్నాడు. బల్లి తన బాధను అర్థం చేసుకున్న దానిలాగ ఆగి, విని వెళ్ళిపోయింది. ఇంట్లో రూకలు లేకపోవడంవల్ల కూరగాయలు కావలసి వచ్చినప్పుడు అప్పు ఇచ్చిపోయే ముసలమ్మ ఇందిరను ఆదుకుంటూ ఉండేది. ఇంకా పాలుపోసే పనివాళ్ళు కూడా మంచితనాన్నిబట్టి మసలుకునేవారు. పిచ్చిపట్టి రోడ్డునపడ్డా సీతారామారావు సమాజాన్ని నిందిస్తూ సభలలో మాట్లాడుతూ, జనాలను పిచ్చివాళ్ళుగా భావించి, నిజంగా జరుగుతున్న యధార్ధాన్ని తన ఉపన్యాసంతో వినిపించాడు. అప్పటికే సీతారామారావు మనుషులమధ్య మతిలేనివాడిగా ఉండిపోయాడు. అందరితో తన్నులు తిని, తుది శ్వాసను విడిచాడు.

ముగింపు:

 తెలుగు నవలా సాహిత్యంలో పాత్రలపరంగా విశిష్టత కలిగిన నవల త్రిపురనేని గోపిచంద్ అసమర్థుని జీవితయాత్ర. దీనిలో ప్రధాన పాత్ర సీతారామారావు. ఇది గొప్ప పాత్ర. ఒక ప్రత్యేక పాత్ర, వైవిధ్యమున్న పాత్ర, ఈ పాత్ర మానసిక పోకడలవల్ల కదులుతుంది. మనోవిశ్లేషణాత్మక ప్రవృత్తిని ఈ పాత్ర ప్రదర్శిస్తుంది. అలాంటి పాత్రలు అరుదుగా ఉంటాయి. మిగిలిన పాత్రలు విరుద్దంగా ఉంటాయి. ప్రత్యేకమైన గుర్తింపుకలిగి ఉంటాయి. మిగిలిన పాత్రలు భౌతిక చేతనతో నడుస్తాయి. సీతారామారావులాంటి పాత్రలు అంతఃచేతనం కలిగి ఉంటాయి. ప్రధానంగా పాత్రలమధ్య వైరుధ్యం కనిపిస్తుంది. ఈ నవలలోని పాత్రలు చాలా ఉన్నప్పటికీ సీతారామారావు పాత్ర యావత్ ఆంధ్ర నవలా సాహిత్యంలో ప్రత్యేకంగా నిలబడింది. గోపీచంద్ సృష్టించిన సమాజ సజీవ పాత్రగా సీతారామారావు పాత్ర ఇలలో నిలిచిపోయింది.

ఆధార గ్రంధాలు :

1.వెంకట సుబ్బయ్య వల్లం పాటి – నవలా శిల్పం

2.సుదర్శనం ఆర్.ఎస్. – సమాజము – సాహిత్యము ,

3.గోపీచంద్ త్రిపురనేని – అసమర్ధుని జీవయాత్ర

తనగాల కిషోర్  ఎం.ఏ,ఎం.ఫిల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top