
Volume – 1, July 2026, issue – 4,
సమర్పణ (D.O.S): 08 -06– 2026 ఎంపిక (D.O.A): 24– 06 – 2026 ప్రచురణ (D.O.P) : 01-07-2026
వ్యాస సంగ్రహం :
తెలుగు చారిత్రక నవలా సాహిత్యంలో పిలకా గణపతిశాస్త్రిగారు 1945లో రాసిన చరిత్రాత్మక నవల మీనాంబిక. ఇది కేవలం ఒక నవల మాత్రమే కాదు, ఆంధ్రుల శౌర్యానికి, కళాభిమానానికి ఒక ప్రతీక. ఈ నవల విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, ముఖ్యంగా విశ్వనాథ నాయకుని జీవిత ఇతివృత్తాన్ని తెలియజేస్తుంది. ఈ నవలలో చారిత్రక ప్రామాణికతకు అద్దం పట్టే అనేక ఘట్టాలు ఉన్నాయి. చారిత్రక అంశాలను పాఠకులకు కళ్ళకు కట్టినట్లు వివరించారు. రచయిత కేవలం ఊహాజనిత కథగా కాకుండా, ఆ కాలం నాటి సామాజిక, సైనిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలించి ఈ నవలను రూపొందించారు. నవలలో చిత్రించిన ఆనాటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని, ఈనాటి సమాజానికి అన్వయించడం వ్యాస ముఖ్యోద్దేశ్యం. అలాగే ఈ రచన మనకు అందించే అమూల్యమైన సందేశాలను గ్రహించడం వ్యాస ప్రయోజనం.
కీలక పదాలు :
మీనాంబిక , చారిత్రక నవల, తెలుగు నవల, నవలా సాహిత్యం, విశ్వనాధ, శ్రీకృష్ణ దేవరాయ, మధురనాయక రాజులు,రామభద్ర ,అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన
నవలా పరిచయం:
విశ్వనాథ నాయకుడు విజయనగర సామ్రాజ్యంలో ఒక ప్రముఖ సేనాని అయిన నాగమ నాయకుని కుమారుడు. శ్రీకృష్ణదేవరాయల కొలువులో విశ్వనాథ నాయకుడు ఒక సమర్థుడైన సేనాధిపతి, నమ్మకస్థుడైన అనుచరుడు. రాయలవారికి ఆయనపై ఎంతో విశ్వాసం. మధుర ప్రాంతంలో పాండ్య రాజుల మధ్య వారసత్వ పోరు మొదలైనప్పుడు, వారికి సహాయం చేయడానికి రాయలవారు నాగమ నాయకుడిని అక్కడికి పంపిస్తాడు. అయితే నాగమ నాయకుడు అక్కడ తిరుగుబాటు చేసి, స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెడతాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆజ్ఞ మేరకు, విశ్వనాథ నాయకుడు తన తండ్రిని ఎదిరించి, ఓడించి, బంధించి రాయలవారి వద్దకు తీసుకుని వస్తాడు. ఈ ఘటన విశ్వనాథ నాయకుని రాజభక్తికి నిదర్శనం. విశ్వనాథ నాయకుని సామర్థ్యాన్ని, విధేయతను గుర్తించిన శ్రీకృష్ణదేవరాయలు, ఆయనను మధురకు ప్రతినిధిగా నియమిస్తాడు. రాయలవారి మరణానంతరం, అచ్యుతదేవరాయల కాలంలో విశ్వనాథ నాయకుడు మధుర నాయక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ప్రారంభమై, కాలక్రమేణా స్వతంత్ర రాజ్యంగా ఎదుగుతుంది. విశ్వనాథ నాయకుడికి, రామభద్ర నాయకుని కుమార్తె మీనాంబికకు మధ్య గల అజ్ఞాతానురాగానికి సంబంధించిన ఘట్టాలు .. మొదలైన వాటిని రచయిత ఎంతో అపురూపంగా చిత్రించారు.
చరిత్రాత్మక నవల:
చరిత్రాత్మక నవలలో చరిత్ర అనేది ఆత్మకంగా అంటే ఒక భాగంగా ఉంటుంది. దీనికి రచయిత కల్పన జోడించి ఒక చరిత్రాత్మక నవలగా రూపొందిస్తాడు. అటువంటిదే మీనాంబిక చరిత్రాత్మక నవల. ప్రస్తుత వ్యాసానికి ఈ రచనలోని రాజకీయ, సామాజిక అంశాలను తీసుకుని నేటి సమాజానికి అనుగుణంగా పరిశీలించడమైనది.
రాజకీయ పరిస్థితులు:
ఈ నవలలో నాగమనాయకుడు, విశ్వనాథ నాయకుల మధ్య జరిగిన సంఘర్షణ కేవలం ఒక చారిత్రక ఘట్టం మాత్రమే కాదు, అది శాశ్వతమైన రాజనీతి సూత్రాలకు, మానవ విలువల మధ్య జరిగే పోరాటానికి ప్రతీక. దీనిని నేటి రాజకీయ కోణంలో విశ్లేషిస్తే ఆసక్తికరమైన పోలికలు కనిపిస్తాయి.
అధికారం – దురాశ (నాగమనాయకుని పాత్ర):
నవలలో నాగమనాయకుడు విజయనగర సామ్రాజ్యానికి నమ్మకస్థుడైన సేనాధిపతి. కానీ మధురను జయించిన తర్వాత, అక్కడి సంపద, అధికారం చూసి అతనిలో దురాశ కలుగుతుంది. సామ్రాజ్యానికి విధేయుడిగా ఉండటం కంటే, స్వతంత్ర రాజుగా ఉండాలనే కోరిక అతన్ని రాజద్రోహిని చేస్తుంది.
నేటి రాజకీయాలతో పోలిక: నేటి కాలంలో కూడా అనేకమంది నాయకులు ఒక పార్టీ లేదా సిద్ధాంతం ద్వారా ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కానీ అధికారం చేతికి రాగానే అన్నీ మరచిపోతుంటారు. పార్టీ లేదా సిద్ధాంతాన్నీ పక్కన పెడతారు. తమను పెంచి పోషించిన వ్యవస్థను లేదా అధిష్టానాన్ని ఎదిరించి, సొంత పార్టీ పెట్టుకోవాలని చూస్తుంటారు. కొంతమందిలో పదవీ కాంక్ష అనేది మనిషి ప్రాథమిక విధేయతను ఎలా మారుస్తుందో చూపిస్తుంది. దీనికి ఉదాహరణ ఈ నవలలోని నాగమనాయకుని పాత్ర.
రాజధర్మం – పుత్రధర్మం (విశ్వనాథ నాయకుని సంఘర్షణ):
నవలలో విశ్వనాథ నాయకుడికి ఎదురైన పరిస్థితి అత్యంత క్లిష్టమైనది. ఒకవైపు కన్నతండ్రి, మరోవైపు తాను నమ్ముకున్న రాజు ఆజ్ఞ. తండ్రిని కాపాడుకోవాలా? లేక తప్పు చేసిన తండ్రిని శిక్షించి రాజధర్మాన్ని నిలబెట్టాలా? అనే సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.
నేటి రాజకీయాలతో పోలిక:
ప్రస్తుత రాజకీయాల్లో వారసత్వ రాజకీయం ఒక ప్రధాన అంశం. చాలామంది నాయకులు తమ పిల్లల తప్పులను కప్పిపుచ్చుతూ, కుటుంబం కోసం ప్రజా హితాన్ని వదిలేస్తుంటారు. కానీ విశ్వనాథుడు తన తండ్రి తప్పును సమర్థించకుండా, రాజ్య క్షేమం కోసం తండ్రిపైనే యుద్ధానికి వెళ్లడం అనేది అత్యున్నతమైన నైతిక విలువ. నేటి రాజకీయాల్లో ఇలాంటి నిష్పాక్షికమైన ధర్మం కనిపించడం అరుదు.
విశ్వసనీయత – వ్యవస్థా నిబద్ధత:
శ్రీకృష్ణదేవరాయలు విశ్వనాథుని నమ్మి పంపడం, విశ్వనాథుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఈ నవలలో కీలకంగా కనిపిస్తుంది.
నేటి రాజకీయాలతో పోలిక: నేడు రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సర్వసాధారణం అయిపోయింది. కానీ మీనాంబిక నవలలో విశ్వనాథుడు చూపిన విధేయత ఒక గొప్ప పాఠంగా చెప్పుకోవచ్చును . వ్యవస్థ వ్యక్తుల కంటే పెద్దదని, ధర్మం కుటుంబం కంటే మిన్న అని ఆయన నిరూపించారు.
రాజనీతిలో పర్యవసానాలు:
నాగమనాయకుని పతనం, విశ్వనాథుని విజయం మనకు ఒక విషయాన్ని స్పష్టంచేస్తాయి. అన్యాయంగా సంపాదించిన అధికారం నిలవదు. అధికారం బాధ్యతతో కూడుకున్నది, అహంకారంతో కాదు. పుత్రుడు తండ్రిని ఎదిరించడం ఇక్కడ క్రూరత్వం కాదు, అది ధర్మ సంస్థాపన. రాజధర్మం ముందు రక్తసంబంధం తక్కువే అని చాటిచెప్పడమే ఈ సంఘటన యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా నవలలో కనబడుతుంది. ధర్మబద్ధంగా వ్యవహరించిన విశ్వనాథుడే మధుర నాయక వంశానికి ఆద్యుడై, చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
నేటి రాజకీయాలతో పోలిక:
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ఏ నాయకుడైనా ప్రజాధర్మాన్ని విస్మరించి, కేవలం స్వార్థంతో ముందుకు వెళ్తే, చరిత్రలో నాగమనాయకుడిలాగే పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. నేటి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా వారసత్వ రాజకీయాల్లో ఉన్న వారికి, విశ్వనాథ నాయకుని పాత్ర ఒక దిక్సూచి వంటిది.
సామాజిక పరిస్థితులు:
నవల శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో విజయనగర నగర వర్ణనతో ప్రారంభమవుతుంది. రచయిత ఆ కాలం నాటి భక్తి భావాన్ని, దేవాలయ సంస్కృతిని అద్భుతంగా చిత్రించారు. దేవాలయాల్లో జరిగే నృత్య ప్రదర్శనలు, ధూప దీప నైవేద్యాల వర్ణన ఆనాటి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఆ కాలం నాటి దేవాలయాలు, రాజవీధుల వైభవాన్ని రచయిత కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. 16వ శతాబ్దపు విజయనగర సామాజిక జీవనచిత్రణ అత్యంత సహజంగా, చారిత్రక స్పృహతో నవలలో కనిపిస్తుంది. ఆనాటి ఆచారాలు, ముఖ్యంగా పుత్ర సంతానం పట్ల సమాజంలో ఉన్న దృఢమైన నమ్మకాలను రచయిత ఏవిధంగా చిత్రించారో అర్థం చేసుకోవచ్చు.
ఆచార వ్యవహారాలు :
దేవాలయ సంస్కృతి – దైవభక్తి:
విజయనగర సామ్రాజ్యంలో దేవాలయం అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, అది సామాజిక, సాంస్కృతిక కేంద్రం. గుళ్ళలో జరిగే ఉత్సవాలు, ధూప దీప నైవేద్యాలు, పురాణ పఠనాలు నాటి సామాజిక జీవనంలో అంతర్భాగమని రచయిత వర్ణించారు. ప్రజలు దైవాజ్ఞను శిరోధార్యంగా భావించేవారు.
కాశీ విశ్వేశ్వరుని ప్రసాదం:
విశ్వనాథ నాయకుని జననం గురించి వివరిస్తూ, నాగమనాయకుడు సంతానం కోసం కాశీ విశ్వేశ్వరుని సేవించడం, ఆ స్వామి అనుగ్రహంతోనే కుమారుడు పుట్టాడని నమ్మడం ఆనాటి ప్రజల దైవభక్తిని చాటుతుంది.
మీనాంబిక సౌందర్య వర్ణన – దైవత్వపు ఛాయలు నవలలో మీనాంబిక కేవలం ఒక అందగత్తెగానే కాకుండా, ఒక పవిత్రమైన మూర్తిగా వర్ణించబడింది. రచయిత ఆమెను మధుర మీనాక్షి అమ్మవారితో పోలుస్తూ అద్భుతమైన పదచిత్రాలను అందించారు.
సాక్షాత్తూ మీనాక్షి:
“రామభద్రనాయకునికి మీనాక్షీ సుందరేశ్వర లిష్ట దైవతములు. అందుచే నాతఁడు రెండవకుమార్తెకు మీనాంబిక యని పేరు పెట్టెను. ఆమె నేత్రములుకూడఁ బేరు నకుఁ దగినట్లు మిగుల దీర్ఘములుగ నుండెను. అందుచే నందరును నామెను జూచి “వీరి యింట సాక్ష్యత్మథుర మీనాక్షీ దేవి యవ తరించినది” అని యను చుండువారు.” (గణపతిశాస్త్రి, పి. 1945: 32)
సౌందర్యంలోని గాంభీర్యం: ఆమె అందం చంచలమైనది కాదు, అది ఒక రకమైన గాంభీర్యంతో కూడినది. ఆమె కదలికలలో, నృత్యంలో ఒక దివ్యత్వం ఉట్టిపడేదని రచయిత వర్ణించారు.
పుత్ర సంతానం – పున్నామ నరక భయం :
ఆనాటి ఆచారాలు, ముఖ్యంగా పుత్ర సంతానం పట్ల సమాజంలో ఉన్న దృఢమైన నమ్మకాలను రచయిత చిత్రించారు . ఆనాటి హిందూ సమాజంలో ‘పున్నామ నరకం’ నుండి తండ్రిని రక్షించేవాడే పుత్రుడు అనే నమ్మకం బలంగా ఉండేది. నవలలో ఈ అంశం కేవలం ఒక నమ్మకంగా కాకుండా, పాత్రల మనస్తత్వాన్ని నడిపించే ఒక శక్తిగా కనిపిస్తుంది.
నాగమనాయకుని ఆవేదన: నాగమనాయకుడు గొప్ప వీరుడైనప్పటికీ, మొదట్లో సంతానం లేకపోవడం అతడిని మానసికంగా కుంగదీస్తుంది. ‘పుత్రులు లేనివారికి పరలోకగతి లేదు’ అనే సామాజిక విశ్వాసం అతడిని తీర్థయాత్రలకు, దైవ ప్రార్థనలకు పురికొల్పుతుంది.
దైవకృప: కాశీ విశ్వేశ్వరుని సేవించడం వల్లనే విశ్వనాథుడు జన్మించాడని నమ్మడం, ఆ నమ్మకం వల్లనే ఆ బిడ్డకు ‘విశ్వనాథ’ అని పేరు పెట్టడం ఆనాటి మతపరమైన ఆచారాలకు నిదర్శనం. పుత్రుడు కలగడం అనేది ఒక సామాజిక గౌరవంగా, పితృదేవతల రుణం తీర్చుకోవడంగా భావించేవారు.
ధర్మం, కులాచారాలు:
నవలలో ప్రతి పాత్ర కూడా తమ వర్ణ ధర్మాన్ని, కులాచారాన్ని పాటించడాన్ని ఒక పవిత్ర విధిగా భావిస్తాయి.
క్షత్రియ ధర్మం: యుద్ధం చేయడం, శరణు కోరిన వారిని రక్షించడం (చంద్రశేఖర పాండ్యుని వలె) క్షత్రియ ధర్మంగా చిత్రించబడింది.
బ్రాహ్మణ మేధస్సు: తిమ్మరుసు పాత్ర ద్వారా నాటి రాజతంత్రంలో బ్రాహ్మణుల మేధస్సు, వారికి సమాజంలో ఉన్న అత్యున్నత గౌరవం ప్రతిబింబిస్తాయి.
స్త్రీల స్థానం, కట్టుబాట్లు:
మీనాంబిక పాత్ర ద్వారా ఆనాటి ఉన్నత వర్గాల స్త్రీల జీవనశైలిని రచయిత వివరించారు.
కళాభినివేశం: ఆ కాలంలో స్త్రీలు సంగీత, నృత్య కళల్లో ఆరితేరడం గొప్ప విషయంగా ఉండేది. మీనాంబిక ఒక గొప్ప నర్తకిగా, విద్యావతిగా చిత్రించబడటం ద్వారా నాటి స్త్రీల విద్యావ్యాప్తిని మనం గమనించవచ్చు.
గౌరవం: స్త్రీలను సాక్షాత్తూ దేవతా స్వరూపాలుగా (మీనాక్షి దేవిగా) గౌరవించే సంస్కృతి నవలలో కనిపిస్తుంది.
సైనిక వ్యవస్థ – యుద్ధ తంత్రం:
విజయనగర సామ్రాజ్యంలో సైనిక శక్తి ఎంత పటిష్టంగా ఉండేదో, నిరూపించే కొన్ని విశేషాంశాలు నవలలో ఉన్నాయి. అవి
శరభ సాళ్వము : నవలలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఈ ఫిరంగి. ‘శరభ సాళ్వము’ అనే పేరు గల ఈ మహా శతఘ్నిని రాయలు పోర్చుగీసు వారి సాంకేతిక సహాయంతో చేయించారని రచయిత పేర్కొన్నారు. “ఆసమయమునఁ బెద్దపిడుగు పడినటు లొకశతఘ్నీగర్జనము వినఁబడెను. ఈమూఁడురోజులనుండియు నట్టిభయంకరనాద మెవరును విని యుండ లేదు! అందుచే జోళ పెన్య మంతయు నిర్ఘాంత పడి యొక నిమిషమువఱళును నాశతఘ్నీ గర్జనమువైపు దృష్టి మరల్చెను. వెంటనే యాశతఘ్నినుండి బయలువెడలిన యగ్నిగోళము ఢామ్మని మథురకోటగోడకుఁ దగిలెను. దానితో నాగోడ యంతయు దద్దరిల్లి గజగజ వణఁకిన ట్లయ్యెను. ఆదెబ్బ తగిలినప్రదేశమునకుఁ జలదూరమువఱకును గోటగోడ బీటలు తీసెను.” ( గణపతిశాస్త్రి, పి. 1945: 75) ఈ సంఘటన ఆనాటి ఆధునిక యుద్ధ సామాగ్రిని సూచిస్తుంది.
దళవాయి వ్యవస్థ: సైన్యాధ్యక్షులను ‘దళవాయి’ అని పిలవడం, సైనిక శిబిరాల ఏర్పాటు, గూఢచారి వ్యవస్థను నడిపే తీరు చారిత్రక సత్యాలకు దగ్గరగా ఉంటుంది.
రాజనీతి – పరిపాలన:
రాయల కొలువులో జరిగే చర్చలు అప్పటి రాజనీతిని కళ్లకుకట్టినట్లు ఉంటాయి. చోళ-పాండ్య రాజ్యాల మధ్య వివాదాలు సామ్రాజ్యానికి తలనొప్పిగా మారిన తరుణo. చంద్రశేఖర పాండ్యుడు తన రాజ్యాన్ని వీరశేఖర చోళుడు ఆక్రమించుకున్నాడని రాయల వద్ద మొరపెట్టుకుంటాడు. “శరీరములో నేమియు బాగుగ లేదు; కాని చోళపాండ్య రాజ్యముల పరిస్థితులు నానాఁటి కధ్వాన్నము లగుచున్నవి ఏమి చేయను? ” (గణపతిశాస్త్రి, పి. 1945: 4) అని మహాప్రధాని తిమ్మరుసు రాయలతో అనడం అప్పటి రాజకీయ అస్థిరతను సూచిస్తుంది.
సామంత రాజ్యాల నిర్వహణ: చోళ-పాండ్య రాజ్యాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు రాయలు పూనుకోవడం, అప్పాజీ (తిమ్మరుసు) ఇచ్చే సలహాలు విజయనగర సామ్రాజ్యపు సార్వభౌమాధికారాన్ని చూపిస్తాయి.
విధేయత – ద్రోహం: నాగమనాయకుడు జయించిన రాజ్యాలను అప్పగించకుండా తానై రాజు కావాలనుకోవడం రాజద్రోహంగా పరిగణించడం, దానికి శిక్షగా సొంత కుమారుడినే పంపడం ఆనాటి కఠినమైన రాజనీతికి నిదర్శనం.
సామాజిక పరిస్థితులు – భాష:
భాషా వైభవం:
రాయల కొలువులో అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన వంటి కవుల ప్రస్తావన, వారి మధ్య సాగే సాహిత్య చర్చలు ఆ కాలం నాటి స్వర్ణయుగాన్ని గుర్తుచేస్తాయి.
వంశ గౌరవం:
పుత్ర సంతానం లేకపోతే ‘పున్నామ నరక యాతనలు’ తప్పువు అన్న నమ్మకం వంటి సామాజిక అంశాలను రచయిత యథాతథంగా వాడారు.
ప్రధాన సందేశాలు:
ఈ నవల కేవలం గతకాలపు చరిత్రను నెమరువేసుకోవడం మాత్రమే కాదు, అది నేటి ఆధునిక సమాజానికి, వ్యక్తిగత, రాజకీయ జీవితాలకు అనేక విలువైన సందేశాలను అందిస్తుంది. ఈ రచన ద్వారా మనం గ్రహించవలసిన ప్రధాన సందేశాలు అనేకం ఉన్నాయి.
ధర్మం – కుటుంబం కంటే మిన్న:
నేటి సమాజంలో కుటుంబీకులు తప్పు చేసినా, రక్తసంబంధం కోసం వారిని వెనకేసుకొచ్చే ధోరణి పెరిగిపోయింది. కానీ, విశ్వనాథ నాయకుడు తన తండ్రి రాజద్రోహానికి పాల్పడినప్పుడు, తండ్రిపైనే యుద్ధానికి సిద్ధపడతాడు.
సందేశం:
నైతిక విలువలు, సామాజిక బాధ్యత ముందు వ్యక్తిగత బంధాలు తలవంచాలి. తప్పు ఎవరు చేసినా అది తప్పే అని ఎదిరించే ధైర్యం నేటి యువతకు అవసరం.
అధికారం – ఒక బాధ్యత, అహంకారం కాదు:
నాగమనాయకుడు ఒక సామాన్య దళవాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగి, చివరికి అధికారం పట్ల వ్యామోహంతో పతనం చెందుతాడు.
సందేశం: పదవి అనేది సేవ చేయడానికి ఇచ్చిన అవకాశం మాత్రమే. అధికారం తలకెక్కితే అది ఎంతటి గొప్పవారినైనా వినాశనం వైపు నడిపిస్తుందని ఈ నవల హెచ్చరిస్తుంది. నేటి రాజకీయ నాయకులకు ఇది ఒక గొప్ప పాఠం.
విధేయత – విశ్వసనీయత:
శ్రీకృష్ణదేవరాయల పట్ల విశ్వనాథుడు చూపిన విధేయత అచంచలమైనది.
సందేశం: ప్రస్తుత కాలంలో స్వార్థం కోసం పార్టీలు, సిద్ధాంతాలు మార్చే ‘రాజకీయ ఫిరాయింపులు’ సర్వసాధారణం అయ్యాయి. కానీ, ఒక ఆశయానికి లేదా వ్యవస్థకు కట్టుబడి ఉండటం వల్లనే చరిత్రలో శాశ్వత గౌరవం లభిస్తుందని విశ్వనాథుని పాత్ర నిరూపిస్తుంది.
స్త్రీ శక్తి – మేధస్సు:
మీనాంబిక పాత్ర ద్వారా రచయిత కేవలం సౌందర్యాన్నే కాదు, ఆమెలోని సంస్కారాన్ని, విజ్ఞానాన్ని వర్ణించారు.
సందేశం: స్త్రీలు కేవలం గృహిణులుగానే కాకుండా, కళల్లో, సామాజిక అవగాహనలో రాణించాలి. మీనాంబిక లాంటి పాత్రలు నేటి మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, సంస్కారాన్ని నేర్పుతాయి.
సాంస్కృతిక వారసత్వ రక్షణ:
ఈ నవల విజయనగర కాలం నాటి కళలు, సాహిత్యం, దేవాలయ సంస్కృతిని గౌరవించాలని చెబుతుంది.
సందేశం: మన మూలాలను, చరిత్రను మర్చిపోవడం అంటే మన అస్తిత్వాన్ని కోల్పోవడమే. నేటితరం మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలుసుకుని, మన సంస్కృతిని కాపాడుకోవాలనే సందేశం ఇందులో అంతర్లీనంగా ఉంది.
ఆశయం కోసం త్యాగం:
వ్యక్తిగత సుఖాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఈ నవల చాటిచెబుతుంది.
సందేశం: ప్రతి పౌరుడు తన స్వార్థం కంటే దేశ క్షేమం కోసం ఆలోచించినప్పుడే సమాజం బాగుపడుతుంది. త్యాగం లేని విజయం నిలబడదని ఈ రచన తెలియజేస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః
ధర్మాన్ని మనం కాపాడితే, ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. నాగమనాయకుడు ధర్మాన్ని తప్పి పతనమైతే, విశ్వనాథుడు ధర్మాన్ని నమ్మి ఒక నూతన రాజవంశానికి (మధుర నాయక రాజులు) పునాది వేశాడు. నేటి సమాజానికి కావాల్సింది అడ్డదారుల్లో పొందే విజయం కాదు, ధర్మబద్ధంగా సాధించే సుస్థిరమైన పురోగతి.
ముగింపు:
ఈ నవలలో చారిత్రక వీరత్వంతో పాటు మరో కోణం విశ్వనాథ నాయకుడు, మీనాంబికల మధ్య సాగే ప్రణయ ఘట్టాలు అత్యంత రమణీయంగా, సున్నితంగా చిత్రించబడ్డాయి. అటు రాజకీయ చదరంగం (చోళ- పాండ్య కలహాలు), ఇటు మానవ సంబంధాల సున్నితత్వం (మీనాంబిక- విశ్వనాథల ప్రణయం) సమపాళ్ళలో ఉన్నాయి. ‘చరిత్రను చదువుతుంటే అది మన కళ్ల ముందు జరుగుతున్నట్లు ఉండాలి’ అనే సూత్రానికి ఈ నవల ఒక నిలువుటద్దం. ముఖ్యంగా మధుర కోట ముట్టడి, ఫిరంగుల వాడకం వంటి అంశాలు చారిత్రక పరిశోధకులకు కూడా ఆసక్తిని కలిగిస్తాయి. పిలకా గణపతిశాస్త్రి గారు చారిత్రక సత్యాలకు కల్పనను జోడించి, ఆనాటి వైభవాన్ని సజీవంగా నిలిపారు.
ఆధార రచన :
- గణపతిశాస్త్రి, పి. మీనాంబిక (తెలుగు చరిత్రాత్మక నవల). రౌతు బుక్ డిపో. రాజమహేంద్రవరము.
డా. శిరీష ఈడ్పుగంటి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~