
Volume – 1, June 2026, issue – 3,
సమర్పణ (D.O.S): 09 -05 – 2026 ఎంపిక (D.O.A): 22– 05 – 2026 ప్రచురణ (D.O.P) : 01-06-2026
వ్యాస సంగ్రహం :
తెలుగు నవలాసాహిత్యంలో మనస్తత్వ చిత్రణ ఒక ముఖ్యమైన సాహిత్య ధోరణిగా అభివృద్ధి చెందింది. మానవుని బాహ్య ప్రవర్తన కంటే అతని అంతర్మనస్సులో జరిగే భావోద్వేగాలు, ఆలోచనలు, సంఘర్షణలు, ఆశలు, నిరాశలు, భయాలు, ఆవేదనలు వంటి మానసిక అంశాలను కళాత్మకంగా చిత్రించడాన్ని మనస్తత్వ చిత్రణ అంటారు. నవల అనే ప్రక్రియ మానవ జీవితాన్ని సమగ్రంగా చిత్రించే శక్తిని కలిగి ఉండటం వల్ల మనస్తత్వ విశ్లేషణకు విస్తృత అవకాశాన్ని కల్పించింది. తెలుగు నవలల్లో పాత్రల మానసిక స్థితిగతులను లోతుగా విశ్లేషించిన రచయితలలో చలం, బుచ్చిబాబు, గోపీచంద్, రాచకొండ విశ్వనాథ శాస్త్రి ప్రముఖులు. వీరి నవలల్లో పాత్రల అంతర్మథనం, మానసిక సంఘర్షణలు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక ఒత్తిడుల ప్రభావం స్పష్టంగా ప్రతిఫలిస్తాయి.
ప్రత్యేకించి అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది వంటి నవలలు తెలుగు సాహిత్యంలో మనస్తత్వ చిత్రణకు అద్భుత ఉదాహరణలుగా నిలిచాయి. ఈ రచనల ద్వారా మానవ మనస్సులోని సంక్లిష్టతలను రచయితలు సున్నితంగా ఆవిష్కరించారు. వాటి విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
కీలకపదాలు :
నవల సాహిత్యం , అసమర్ధుని జీవయాత్ర , మనస్తత్వం , రావిశాస్త్రి, అల్పజీవి, Psychology, Novella, Novel, Bocassio, Decaneron, మృత్యుంజయరావు, వ్యక్తిత్వం లేని మనిషి, నవీన్, అంపశయ్య , మనస్తత్వ నవలకుం Ego , ID , ఇగో, ఇద్ , సూపర్ ఇగో, delusions
ప్రవేశిక :
ప్రసుత్తం కొనసాగుతున్న వచన సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మకమైనది ‘నవల’ని చెప్పుకోవచ్చు. ఆంగ్లభాషలో ఉన్న ‘నోవెల్ (Novel) అనే మాట ‘నోవెల్ల’ (Novella) అనే ఇటాలియన్ పదం నుండి పుట్టింది. ఇది క్రమంగా 1350వ సంవత్సరంలో ‘నవల’ అనే ప్రక్రియగా రూపాంతరం చెందింది. ఇటలీకి చెందిన బోకేషియో (Bocassio) అనే రచిత తన రచన అయిన Decaneron కు Novell astoria అని పేరు పెట్టాడు. దాని ఆధారంగా ‘నొవెల్లా’ కాస్త నవలగా ఆవిర్భవించింది.
‘నవల’ అనే మాటను నిర్వచించడం చాలా కష్టం. నవలకు మూలంగా ఎన్నుకోబడిన ఇతివృత్తం ఆధారంగా దీనిని రూపొందించడం జరుగుతుంది. ఇందు కథాంశం ఎక్కువైన అవచ్చు లేదా తక్కువ అయిన అవ్వవచ్చు. నవలంతా కూడా Plot (ఇతివృత్తం)పైనే ఆధారపడి ఉంటుంది.
తెలుగు నవల పరిణామ చరిత్రలో పరిశీలించినట్లయితే 1867 నుండి కొనసాగింది. సరైన సంవత్సరం ఇదేనని చెప్పలేము. కొక్కొండ వెంకట రత్నం పంతులుగారు రచించిన “మహాశ్వేత” అను నవలే మొదటిదని నిర్ధారణ జరిగింది. దీనిపై వాదోపవాదాలు పుట్టి 1872 లో గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర అనే నవలే మొదటిదని భావించారు. ఏది ఏమైనా కాశీ భట్ట బ్రహ్మయ్య శాస్త్రి గారు రచించిన వచన ప్రబంథాలకు ‘నవల’ అని నామకరణం చేశారు. అప్పటినుండి. ‘నవల’ అనే పదం తెలుగున వెలుగు చూసింది. ‘నావల్’ (Novel)అను పదం క్రొత్త,నవ్, నవ, పదాలుగా రూపుమార్చుకుని ‘నవల’గా మారింది. ‘నవల’ ఆవిర్భవించడానికి కారణం ఆంగ్ల నవలలే ప్రదానం. ఇది సర్ వాల్టర్ స్కాట్‌తో ప్రారంభమైనది. ఆ విధంగా ప్రారంభమైన నవల రుమెటసిజయ్, రియలిజయ్, నేచురలిజయ్, సింబాలిజమ్గా ఎదిగింది.” (శ్రీరామమూర్తి కోడూరి , తెలుగు నవలల్లో మనో విశ్లేషణ , పుట – 4 ).
తెలుగు నవలా పరిణామాన్ని మన సౌలభ్యంకోసం భాగాలుగా విభజించుకోవచ్చు. అవి మొదటి ప్రపంచయుద్ధంవరకు, యుద్ధానంతరంనుండి ఆధునికం వరకు అని చెప్పుకోవచ్చు. తెలుగుసాహిత్యంపై మార్క్సిజం ప్రభావం బలోపేతమవడంతో హేతువాద ధోరణులు ప్రబలినాయి. దీనితో మనస్తత్వ విశ్లేషణ ఆధారమైన నవలలు పెల్లుబికినాయి. ఈ నవలల ప్రభావం ఫ్రాయిడ్, అడ్లర్, యాంగ్, హెన్రిబెర్గ్సన్ మొదలగువారి మనస్తత్వవేత్తల సిద్ధాంతాలకు గురియైనవి.
మనస్తత్వశాస్త్రంలో అనేక సిద్ధాంతమైన దృక్పథాలు ఏర్పడ్డవి. వీనిలో చెప్పుకోతగినది సైకో ఎనాలిసిస్ (Psoycho ananysis) దీనినే మానసిక వ్యాధి నివారణ అంటారు. ఫ్రాయిడ్ ప్రకారం సైకోఎనాలిసిస్కు మూల స్థంబాలుగా చేతన, అచేతన, లైంగిక ప్రవృత్తి, ఇడిపస్ కాంప్లెక్స్‌లను చెప్పుకోవచ్చు. ఇందుచేతన, అచేతన అవస్థలను ఐస్ బర్గ్ తో పోల్చవచ్చు. నీటతేలిన భాగాన్ని చేతనంగానూ, మునిగి ఉన్న భాగాన్ని అచేతనంగానూ భావించవచ్చు. ఈ సూత్రాన్ని జీవితానికి అన్వయింపజేయడమే ఫ్రాయిడ్ సిద్ధాంతం. ఫ్రాయిడ్‌ని అనుసరించి అడ్లర్, యూంగ్ లైంగిక ప్రవృత్తి, ఇడిపస్ కాంప్లెక్స్‌లను గురించి సిద్ధాంతీకరించారు. ఈ సిద్ధాంతాలను అనుసరించి ID , Ego(ఇగో), Super Ego (సూపర్ ఇగో)ల సంఘర్షణను ఆధారం చేసుకుని మనోవిశ్లేషణ నవలలు తెరకెక్కాయి.
విషయ వివరణ :
“ఈ మనోవిశ్లేషణ అతి ప్రాచీన గ్రీకు విషాదగాధఅయిన ఇడిపస్ క్స్ (Oedipusrex)నుండి మొదలైనది. దీనిని సోఫాక్షస్ (Sophocles) రచించాడు. ఈ సిద్ధాంతమే ఫ్రాయిడ్‌కి పునాది.” (విద్యేశ్వరి, డి., తెలుగు నవల విశ్లేషణ, పుట-9.)
మనోవిశ్లేషణ అంత మనిషి మనసుపైనే ఆధారపడి ఉంటుంది. ఇది (Conscious), సుప్త చేతన (Unconscious), 4 (Sub-conscious). ప్రాక్తన చేతన (Fore conscious) అను పొరలను కలిగి ఉంటుంది. ఈ పొరలపై ID, Ego, Super egoల ప్రభావం అధికమై మానసిక రుగ్మతకుదారి తీస్తుంది. ఆ భావనలో వెలువడ్డ నవలలే తెలుగు మనోవిశ్లేషణ నవలలు లేదా, మనస్తత్త్వ నవలలుగా చెప్పుకోవచ్చు.
“చైతన్య స్రవంతి విధానంలో వర్తమానం, గతం జోడు గుర్రాల్లాగ ‘నడుస్తాయి. చైతన్యస్రవంతి అంటే Multiple exposere ona cinema film అని అన్నాడు ” (శ్రీరామూర్తి, కోడూరి, తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ, పుట-37)
తెలుగు నవలా సాహిత్యం ఆయా శాస్త్రాలు అందించిన జ్ఞానానికి అక్షర రూపాన్నిచ్చింది. ఆయా శాస్త్రాల ప్రభావంతో, సమాజాన్ని పరిశీలించిన నవలా రచయితల వాస్తవికతా దృక్పథానికిచ్చిన ప్రాధాన్యతా ఫలితమే మనోవైజ్ఞానిక నవలల ఆవిర్భావం. నవలలో మనిషి మనస్తత్త్వాన్ని (Psychology) చిత్రించడం మనోవైజ్ఞానిక నవలల లక్షణం. తెలుగుసాహిత్యంలో మనోవిశ్లేషణాత్మక నవలలు ఎక్కువ రాకపోయిన అడపాదడపా బాగానే వచ్చాయి. నేను ఈ అధ్యాయంలో తెలుగు నవలావిర్భవకాలం నుంచి 2000వ సంవత్సరంవరకు తెలుగులో వచ్చిన మనోవిశ్లేషణాత్మక నవలల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిచయం చేస్తున్నా.
మానవ మనస్తత్వంలో నుంచి తన్నుకు వచ్చిన మరికొన్ని వైచిత్రి నవలలు ఆర్.యస్.సుదర్శనంగారి ‘మళ్ళీ వసంతం’. ఎన్.ఆర్.నందిగారి ‘దృష్టి’, వాసిరెడ్డి సీతాదేవిగారి ‘మట్టిమనిషి ’, పోతుకూచి సాంబశివరావుగారి ‘ఏడురోజుల మజిలి ‘, తాళ్ళురి నాగేశ్వరరావుగారి ‘శ్రావణ సంధ్యా’, యండమూరి వీరేంధ్రనాథ్ గారి ‘రుషి’, మధురాంతం రాజారామ్ గారి ‘త్రిశంకుడి స్వర్గం’, కొమ్మూరి వేణుగోపాల్రావుగారి ‘నివేదిత’, చివుకుల పురుషోత్తంగారి ‘ఏదిపాపం’, పి.శ్రీదేవిగారి ‘కాలాతీత వ్యక్తులు’ చెప్పుకోదగ్గ నవలలు.
మనోవైజ్ఞానిక నవలా పరం పరంగా, దశలవారీగ జరిగింది. 1969వ సంవత్సరంనుంచి గమనిస్తే కొన్ని నవలలు మనకు బహిర్గతం అవుతాయి. ఇదే సంవత్సరంలో వచ్చిన ‘ముళ్ళపొదలు’, 1991లో ‘అంతస్రవంతి’ మరియు ‘అంపశయ్య నవలలు చెప్పుకోదగ్గవి. ఈ మూడు నవీన్ రచించినవే. 1972నుంచి ఆర్థిక సంక్షోభం ఏర్పడటంవల్ల నవలలు నత్తనడక నడిచాయి. తరువాత 1979లో వాసిరెడ్డి సీతాదేవి రచించిన ‘మరీచిక’, 1991లోనవీన్ రచించిన ‘అంతస్రవంతి 199355 రచించిన ‘గులాబీలు’. 1995లో కె. సురేష్ రచించిన ‘The University’, 2000లో డా||వి. చంద్రశేఖరరావు రచించిన ‘ఐదుహంసలు ‘ చెప్పుకోదగ్గవి.
మానసికపరమైన మనోగాథలను సృష్టించి నవలకు శిల్పంగా, ఇతివృత్తంగా గ్రహించి తెలుగు మనస్తత్త్వ నవలలుగా రచించారు. అందులో చెప్పుకోదగ్గవి మరియు మనోవైజ్ఞానికమైనవి కొన్ని ఉన్నాయి.
అవి : చివరకు మిగిలేది – బుచ్చిబాబు, అల్పజీవి – రాచకొండ విశ్వనాథశాస్త్రి
అంపశయ్య – నవీన్ , వ్యక్తిత్వంలేని మనిషి-కొమ్మూరి వేణుగోపాల్‌రావు
అసమర్థుని జీవయాత్ర-త్రిపురనేని గోపీచంద్ . మనస్తత్వ విశ్లేషణకు ఈ పై కొన్ని ఉదాహరణలను సోదారణంగా తెలుసుకుందాం.
- చివరకు మిగిలేది :
“చివరకు మిగిలేది’ బుచ్చిబాబు రచించిన మనోవైజ్ఞానిక నవల. ఇందులో నాయకుడు సర్కారు జిల్లాల వాతావరణంలో ఇమడలేడు. అనేక అనుభవాలు అతన్ని ఏకాకిని చేస్తాయి. రాయలసీమలో మరో జీవితం ప్రారంభిస్తాడు. అదృష్టవశాత్తు అతనికి భాగ్యం లభిస్తుంది. స్థిమితపడుతుండగానే మరల పూర్వపు అనుభవాలు, శక్తులు అతన్ని చుట్టుముట్టుతాయి. ప్రేమ రాహిత్యంలో ప్రవాహంలో పడిపోతాడు. ప్రాణాలతో బయటపడి మరోచోట, మరోజీవితం సాగించడానికి వెళ్ళిపోతాడు. ఇదీ ఇందులో కథ. అతనేమి సాదించలేడు కాని ఏమి సాధించలేకపోయాను అన్న జిజ్ఞాస అతన్ని జీవితానికి కట్టిపడేసినా కూడా, నిస్పృహుణ్ణి చేయలేదు.
ఈ నవలలోని పాత్రలు మనోవిశ్లేషణ అంతరంగ సంఘర్షణ చిత్రింపబడ్డాయి. ఇందులో నాయకుడు చివరిలో జీవితానికి అర్ధంలేదన్న నిర్ణయానికి వస్తాడు. తనని గురించిన నిజం తెలుసుకోవాలని బయలుదేరిన ఒక యువకుని అభిప్రాయంగా సాగుతుంది. “తల్లిదండ్రుల గుణాలుగాని, అవగుణాలుగాని రక్తంద్వారా పిల్లలకు ఏ విధంగా సంక్రమిస్తాయో వివరించడం ‘చివరకు మిగిలేది’ తలపెట్టదు. తన తల్లిని గురించి సమాజంలో చాటుచాటుగా నీతికి, అవినీతికి సంబంధంలేని కథలేవో ప్రచారమవుతుండగా వింటున్న కొడుకు జీవితం ఎన్ని విధాలుగా కుంటుబడిపోతుందో చిత్రించడమే ఈ నవల లక్ష్యం.” (బుచ్చిబాబు , చివరకు మిగిలేదు , పుట – VI ).
ఏ వ్యక్తి జీవితంలోనూ అన్నీ రసవంతమైన ఘట్టాలు ఉండవు. చాలాకాలం మామూలుగా జీవించే ఒక్కక్షణంలో మహాత్తరమైన అనుభవాలకి గురికావచ్చు. జీవితంలో ‘చెడుగు’ పాపం అనే అంశాలు ప్రతీవ్యక్తిని పీడిస్తూ ఉంటాయి. ఈ కథలో నాయకుడి తల్లిపాత్ర చిత్రింపబడలేదు. కాని ఆమె చేసిన అపచారాల ఫలితం నీడలా అతనికి వెంటాడి వేదిస్తుంది. అంతేకాదు సంఘ విమర్శ ద్వారా తన జీవితాన్ని కలుషితం చేస్తుంది. ఈ భావం ఇడిపస్ కాంప్లెక్స్‌కు దారి తీస్తుంది. ఏమి జరగకపోయినా తనలో తానే మదనపడుతూ ఉంటాడు. ప్రతీ సంఘటన ఘర్షణకు దారితీస్తుంది. ఇది లిబిదోకు ప్రతీకగా ఉంటుంది.
చివరకు మిగిలేది పదకొండు భాగాలుగా విభజింపబడింది. అవి.
1.గడ్డిపోచ విలువెంత? 2. అనుభవానికి హద్దులులేవు. 3. మూణ్ణాళ్ళ ముచ్చట
- చప్పుడుచెయ్యని సంకెళ్ళు 5. సౌందర్య రాహిత్యం 6. స్వయం సంస్కారం
7.చీకటి సమస్య 8. రాళ్ళసీమ 9. కాత్యాయని సంతతి
- ఆకులు రాలడం 11. చివరకు మిగిలేది.
ఇందులో కథానయకుడు దయానిధి. ఇతని చుట్టుతా కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. తల్లిపై ఉన్న ప్రేమ చెప్పలేనిది. ఆమెపై ఉన్న నిందారోపణలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో పడుంటాడు. దయానిధికి కష్టసుఖాలు చెప్పుకునేవాళ్ళు కోమలి, అమృతం, ఇందిర, సుశీల, జగన్నాథం మున్నగువారు ఉన్న చెప్పలేని పరిస్థితిలో తన జీవితాన్ని ఒక ప్రశ్నార్థకంగా చూపిస్తూ ఉంటాడు.
చివరకు మిగిలేదేమిటి? అన్న ప్రశ్నతోనే నవల ప్రారంభం అవుతుంది. దీనికి సమాధానం తెలిస్తే రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికి అర్ధం ఏమై ఉంటుంది? అన్న ప్రశ్నలతోనే దయానిధి దర్శనమిస్తాడు. తల్లిపై ఉన్న ప్రేమ. చేతనలో నుంచి వచ్చిన సాధారణమైన ప్రేమకాదు. అచేతనలోనుంచి పుట్టుకొచ్చిన ప్రేమ మాత్రమే. తల్లి రూపాన్ని తన చుట్టూ ఉన్న కోమలి, అమృత, ఇందిర, సుశీలలో చూసుకుని ఏవగించుకుంటాడు. చంపాలని ప్రయత్నిస్తాడు. తనలో Ego (అహం) అట్టొచ్చి కోపాన్ని దిగమింగుకుంటాడు.
“దయానిధి చదువుకున్నవాడు, అందగాడు, ఉన్నత కుటుంబీకుడు. అంతో, యింతో సంపన్నుడు. త్వరలో డాక్టర్ కాబోతున్నాడు. ఇలాంటి దయానిధికి కోమలి ప్రియురాలు అంటే సామాన్యమైన ఊహకు చాలా అసహజంగా కనబడవచ్చుకాని, మనస్తత్వ శాస్త్రరీత్యా దీనిని సమర్థించే కారణాలు చాలా కనబడతాయి. కోమలిలో దయానిధికి mother figure కనబడింది. దయానిధి చిన్నతనంనుంచి తల్లిని ఎంతగానో ప్రేమించాడు. ఆరాధించాడు. పైగా, తండ్రిని ద్వేషించాడు. అతనిలో ‘ఇడిపస్ కాంప్లెక్సు’ పుష్కలంగా ఉంది. దయానిధికి కోమలిలో తల్లిని లోకం అంతా నిందించే నిందయొక్క అంశం కనబడింది. అయితే, అతని తల్లికి, కోమలికి మిగతాపోలికలు ఏమీలేవు. తల్లిలాగా కోమలికూడా ఓ గడ్డిపరక అంతే. అందుకనే దయానిధి కోమలి తలలో గడ్డిపరకపెట్టాడు. అయితే అతని ఆవేదన అర్థంచేసుకోగల శక్తిగాని, ఓపికగాని ఆమెకు లేవు. అందుకే ఛీత్కరించింది. (. శ్రీరామూర్తి, కోడూరి, తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ, పుట-115.)
గడ్డిపరక ఒక సింబాలిక్. గడ్డిపరక ఎందుకు పనికిరాదు. దానికి విలువ కూడా లేదు. అదేవిధంగా తన తల్లిని గడ్డిపోచతో పోల్చి కోమలి జడలో తురిమాడు. అర్ధంకాని కోమల ‘”గడ్డి నోట్లో పెట్టాలి కానీ తలలో కాదు” (బుచ్చిబాబు -చివరకు మిగిలేది , పుట – 19 ) అంది. ఈ వాక్యాన్ని సమర్ధిస్తే పూలకి గడ్డికి తేడా తెలియనివాడిగా దయానిధి కనపిస్తాడు. ఎందుకు పనికిరాని గడ్డిలా మిగిలావు. నీవు కూడా అని కోమలికి తెలియదు. అంతరార్ధం మాత్రం లిబిడోకు సంబంధించిందే. ఈ విధమైన సన్నివేశాలు కోకొల్లలు. తల్లి ప్రేమను మరువలేక ఆమెపై ద్వేషాన్ని విడవలేక తన జీవితాన్ని శుష్కింపచేసుకుంటూ జీవితం అనే మాటకే అర్ధం లేకుండా మరియు అర్ధం కాకుండా అగమ్యగోచరంగా మిగిలిపోతాడు. చివరకు మిగిలేది ఏమిటో కూడా తెలియనిస్థితిలో సమాధానం దొరకకుండానే నవల సమాప్తం అవుతుంది.
2.అల్పజీవి :
వ్యక్తిత్వంలోని దౌర్బల్యాలను బహిర్గతంచేసే ఆలోచనల అల్పత్వానికి అక్షరరూపమే ఈ అల్పజీవి. అల్పజీవి రాచకొండ విశ్వనాథశాస్త్రి రూపకల్పన. ఇందులోని ప్రధానపాత్రగా చెప్పుకోదగ్గది సుబ్బయ్యపాత్ర, అతడు ఒక గుమస్తా. భార్య పిల్లలు కలరు. కాని భార్య సుబ్బయ్యను లెక్కచేయదు. పిల్లలకు అతనంటే గౌరవంలేదు. దీనికి కారణం సుబ్బయ్య పిరికివాడు అగుటయే; అమాయకుడు కూడా. ఈ రెండు అంశాలను పరిశీలిస్తే అడ్లర్ ప్రతిపాదించిన ఆత్మన్యూనత భావాన్ని స్ఫురింపజేస్తుంది. అధికారాన్ని, డబ్బును, ధైర్యాన్ని చూసి భయపడాలని తనలోతానే నిర్ణయించుకున్నాడు. ఈ భావన ఆత్మన్యూనతే. జీవితంలో భయపడటంతప్ప మరేమి అతడు నేర్చుకోలేదు.
సుబ్బయ్య ఆశలకు కోరికలకు ప్రతీక. ధనాశ ఎక్కువే. అవసరం కొద్ది బావమరిదికీ అప్పుగా డబ్బు ఇప్పిస్తాడు. ఆ అప్పు తీర్చమనే ధైర్యం మాత్రం తనకు లేదు. లోలోపలమాత్రం బావమరిదిని దబాయించాలనుకుంటాడు. గురవయ్య పంపించిన రౌడీని కొట్టే శక్తి గలదు. కానీ అలా బయటకు కనిపించడు. అమ్మాయి ఎదురైతే చాలు గజగజ ఒణికిపోతాడు. అంతర్మదనంలో మాత్రం ఆమె అందచందాలను లెక్కింపగల సామర్థ్యంగలవాడు. తన పిరికితనంతో తన ఆలోచనల అలలవలే ఎగిసిపడడంతప్ప ప్రయోజనంలేవని మనకు తెలుస్తుంది. పై మాటలలో ఏదీ తన సొంత నిర్ణయం కాదని మనకు అనిపించడంలేదు. చేతన, అచేతనలు ప్రక్కప్రక్కనే ఉన్నట్టు అగుపిస్తుంది. యదార్ధంగా గ్రహించినప్పుడు ఆత్మన్యూనతతో అల్లాడుతుంది. ఇది మానసికమైన రుగ్మతయే. కానీ ప్రతి సంఘటన ఎదుర్కొనే శక్తికలిగి ఉండి శక్తిలేని విధంగా చిత్రించబడింది. గుప్తచేతన మనిషిని ఎంత పిరికివాడిని చేస్తుందో, ఎంతటి భయస్తుడిగా మారుస్తుందో సుబ్బయ్య పాత్రలో చూడవచ్చు. మచ్చుకకు ఒక సన్నివేశాన్ని ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది……
“ఈ విపత్తు తప్పిపోతే దేవ దేవ – జగన్నాథా పూరీ వస్తాను — నీకోసం
నేను, కమల, కృష్ణుడు ముగ్గురం కూడా తలలిచ్చేస్తాం సావిత్రి కూడా వేణీ ఇచ్చేతే బాగుండును, కాని ఇవ్వదు.”(విశ్వనాథ శాస్త్రి రాచకొండ, అల్పజీవి , పుట- 108 ).
పై వాక్యాలను చదివినపుడు యజమానిగా పిల్లలలై పెత్తనం కనిపిస్తుంది. భార్యపై భయం కనిపిస్తుంది. ఎందుకంటే తనకంటే పిల్లలు చిన్నవారు అవటంచేత, భార్య భయంవలన అని మాత్రమే కాదు. తనకు ఉన్న ఆపదలు తొలుగిపోవాలని పూరీలో ఉన్న జగన్నాథుని దర్శించాలనుకుంటాడు. మొక్కిన మ్రొక్కులు అన్నీంటిని చెల్లిస్తేనే ఫలితం దక్కుతుందనే కాంక్ష కలిగినవాడు కూడా. అనే అర్ధం తేటతెల్లం అవుతుంది. ఇన్ని ఆలోచనలలో సతమతమవుతూ తనకంటూ ఒక సొంత నిర్ణయం లేని వ్యక్తిగా కనిపిస్తాడు సుబ్బయ్య. అతడి జీవితంలోనే కాదు ఆలోచనలలో కూడా భూత, వర్తమాన, భవిష్యత్తులు పెనవేసుకుని జీవిస్తుంటాయి. అన్ని ఉన్న అల్లుడినోట్లో శని ఉన్నట్లు జీవితంలో ఏమి కోల్పోని సుబ్బయ్య మాత్రం అల్లుడిగానే జీవిస్తుంటాడు. అందుకే అల్పజీవి ఆశలతో ఆరాటపడి నిరాశతో నీరసపడిపోయాడు.
- వ్యక్తిత్వం లేని మనిషి :
వ్యక్తిత్వంలేని మనిషి అనే నవలలో మృత్యుంజయరావు ప్రధాన నాయకుడు. అతడు కురూపి. శారీరకంగా బలహీనుడు మరియు పిరికివాడు కూడా. ఏ విషయంలోనూ త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి. ఇంక జీవిత సమస్యలు దేవుడే ఎరుగును. ఏ పని విలువ అతనికి తెలిసేదికాదు. ఈ లక్షణాలు కలిగిన ‘వ్యక్తిత్వం లేని మనిషిని’ రూపొందించింది కొమ్మూరి వేణుగోపాలరామ్.
మృత్యుంజయరావు అల్పజీవి పాత్రలోని సుబ్బయ్యకు తగ్గవాడిగా కనిపిస్తాడు. తను కూడా తన ఆకారాన్ని చూసుకుంటూ ఏమి చేతకాని దద్దమ్మనని వాపోతాడు. ఇది కూడా ఆత్మన్యూనతా భావనకే పరిమితం అయింది. ఈ ఆత్మన్యూనతాభావం మృత్యుంజయరావుని చిన్నతనంలోనే వెంటాడింది. తన స్నేహితుల దగ్గర నుంచి కట్టుకున్న భార్యదాక వెంటాడి వేధించిన వాళ్ళే. మిత్రులు మృత్యుంజయరావును ‘ముక్కువంకరవాడా! బక్కవెదవా! తొస్సి సన్యాసి! నల్లకోతి!’ అని హేళన చేసేవారు. ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్న తూటాల్లా వెనువెంటాడేవి. వారిని చూసినప్పుడల్ల అధోలోకంలో విచారించేవాడు. ఈ ఆత్మన్యూనతా భావం తన ఆకారంలోనే పోతపోయబడిందని సిగ్గుపడుతూ ఉండేవాడు. అతడి అందం చూసి తనను ఎవరు ఇష్టపడరని తెలుసుకాని అందగత్తెల కోసం వెంపర్లాడేవాడు. వాళ్ళకు ప్రేమలేఖలు రాసేవాడు. అంతేకాదు కామకోరికలు అమితంగా కలిగినవాడు. ఎదురుపడ్డా అందమైన అమ్మాయిని ప్రేమించమని ప్రాధేయపడేవాడు. వాళ్ళు.. నువ్వు గాడిదవి, పిరికిపందవి, నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. నీతో ప్రేమేంటి? అంటుండేవారు. ఆ మాటలకు కూడా మృత్యుంజయరావుని వేధించేవి.
మృత్యుంజయరావు చేసేది ఏమిలేక కవితలు రాసుకునేవాడు. అంతేకాదు నవలలు కూడా రాసేవాడు. జీవితంలో అన్నీ కోల్పోయినవాడు. ఏదో సాధించాలనే తపన కోసం పాటుపడ్డట్టు ఒక డైరీ ఉపయోగించేవాడు. కల్లబొల్లి కబుర్లు అల్లి తాను చేస్తున్న ఉద్యోగ ఆఫీసులో పనిచేస్తున్న మాలతీకి చెప్పేవాడు. మాలతీ పరిచయం ప్రేమలేక నడచింది. వారి మధ్యలో ‘శేఖరం’ విలన్‌గా దాపురించాడు. దాంతో మృత్యుంజయరావు కోపంతో రగిలిపోతుంటాడు. శేఖరకి మాలతీ దగ్గరవుతుంది. కొంతకాలానికి వాళ్ళిద్దరు విడిపోతారు. అచేతనా అవస్థలో ఉన్న మృత్యుంజయరావుకి మాలతీ భార్యగా వశం అవుతుంది. ఈ స్థితిలో ఉన్న అతనికి మాలతీ ఎందుకు భార్య అయిందో అర్థం కాదు. మాలతీ తనను ప్రేమిస్తుందా లేదా అన్న అనుమానం మొదటినుండి ఉన్నది. ఆమె చనిపోతున్న సమయంలో కూడా తన అనుమానాన్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ కుదరదు. ఆ సందిగ్ధంలో ఉన్న మృత్యుంజయరావు ఒంటరివాడై పోతాడు.
మృత్యుంజయరావులోని ఇలాంటి inferiority complex ప్రసాదించిన Fantasis రకరకాలుగా ఉంటుంది. ఒక్కో సమయంలో నేనే చక్రవర్తిననిపిస్తుంది; గొప్పవాడనిననిపిస్తుంది. తనకు అద్భుతమైన శక్తులున్నాయని, తను ఈలవేస్తే ఆడవారు వెంటపడతారని, ఒక్క తన్ను తంస్తే ఆడవారు క్రింద పడతారని, పెద్ద టెన్నిస్ చాంపియనని, వరల్డ్ చాంపియనని, కలలు కంటూ ఉంటాడు. ఈ కలలు వెనుక ఆత్మన్యూనత ఇతనికి తెలియకుండానే అతనులోకి ప్రవేశిస్తుంది.
ప్రేమదాహం తీరని అతనిలో delusions పెచ్చు పెరిగిపోయాయి. మాలతీ దూరం అవ్వడంతో యూంగ్ ప్రతిపాదనల భావనలోకి, తొంగి చూస్తుంటాడు. తాను ఒక అబద్ధాల పుట్ట. అలాంటి డైరీ రాసుకుంటూ ఆ డైరీలో కూడా అన్నీ అబద్ధాలే రాస్తుంటాడు. అరుణ అనే అందమైన అమ్మాయిని ఊహిస్తూ తనే నా ప్రేయసి అని తెలియని వ్యక్తులకు పరిచయం చేస్తుంటాడు.
ఈ విధంగా తనను ఎవరు ప్రేమించరనీ తెలుసు. సాటి మానవునిలో నేను ఒకరినే అన్న భావన ప్రతో మనిషిలోను ఉంటుందని తెలుసు. కానీ అందవికారమైన తన రూపం తనకు ఎంత అందంగా కనిపిస్తుందో ఇతరులకు అంత హేళనగా అనిపించింది. ఆ భావనను తట్టుకోలేని మృత్యుంజయరావు ఆత్మన్యూనతలో లీనమై తనకు తానే సాటినని, ఈ లోకం నాముందరికాళ్ళ బంధమని, కోతలు కోసుకుంటు తనను తానే సమర్ధించుకునేవాడు.
కామకోరిక తీర్చుకొవడానికి వ్యభిచారిణి సంగమించినప్పుడు సోకిన వ్యాధితో మృత్యువాత పడతాడు. తన బాధను ఎవరికి చెప్పుకోలేక తనలోతానే కుంగిపోతాడు. ఆత్మన్యూనతభావం ఎంత ప్రమాదకరమైన వ్యాదో ఈ వ్యక్తిత్వంలేని మనిషిద్వారా మనం గ్రహించవచ్చు.
- అంపశయ్య:
“మనస్సులో జనించే విభిన్నమైన అదుపులేని ఆలోచనా ప్రతిబింబానికి” ( విద్యేశ్వరి, డి., తెలుగు నవల విశ్లేషణ, పుట-101) నిదర్శనం ఈ అంపశయ్య. ఇది చైతన్య స్రవంతి నవల. చైతన్య స్రవంతి నవలల్లో పాఠకులకు ప్రత్యేక సంబంధం ఉంటుంది. అంపశయ్య నవీన్ రచించిన మనోవైజ్ఞానిక నవల.
అసభ్యకరమైన కోరికలకు ఆలోచనలు అక్షరరూపం ఇచ్చి, దానిని మనస్తత్వ చిత్రణగా రూపొందించాడు. ఇది పాఠకులను భ్రమపెట్టే ప్రమాదంగా ఉంటుంది. ఇది నిజమని, అబద్ధమని నిర్ధారణ చేసుకునే మానసిక సంఘర్షణ ప్రధానపాత్ర అయిన ‘రవి’లో కనిపిస్తుంది. అంపశయ్య అంతకూడా మరణశయ్యకు దారి తీసినట్లే కనిపిస్తుంది. దీనికి కారణం సిగ్మండ్ ఫ్రాయిడ్ రచించిన ‘ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్’. ఇది భయంకరమైన కలలనుండి తేరుకుని వాస్తవాన్ని గ్రహించడానికి సిద్ధాంతీకరించిన గ్రంథం. ఈ గ్రంథాన్ని అనుసరించి అంపశయ్య నడుస్తుంది. సంఘర్షణల మధ్య నలిగిపోతున్న ‘రవి’ సమస్య పరిష్కారానికి పోరాడుతున్న విద్యార్థిగా కనిపిస్తాడు.
రవి తెల్లవారుజామున కలలుకంటూ ఉంటాడు. మధ్యమధ్యలో అక్కడక్కడ విద్యార్ధులలో సంభాషించే విధంగా మరియు సన్నివేశానికి తగ్గట్టుగా కలగంటాడు. ఆ సమయంలో కూడా తన ఆలోచనధోరణి మారదు. ఏ విధం అంటే ఎక్కడో ఆగాధంలో పెద్దపెద్ద కొండచిలువలు. అవి కొండచిలువలేనా? వంకర్లు తిరుగుతూ నోరు తెరుచుకుని తనని మింగేస్తాయా? అమ్మబాబోయ్! అసలవి కొండచిలువలు కాదు. నది అదిగో నీళ్ళు పారుతున్నాయి; మెలికలు తిరుగుతున్నాయి. ఈ గుట్టమీదనుండి ఆ నదిలో దూకితే… దూకితే…. ఇంకేముంది. చచ్చిపోతాను. అరే! ఇదేమిటి? తను నదిలో పడిపోయాడు. నీళ్ళలో మునిగిపోతున్నాడు. దూకేశానన్నమాట” ! (నవీన్, అంపశయ్య, పుట-1) ఈ విధంగా కనిపిస్తుంది.
అంపశయ్య నవల ఒక ప్రయోగాత్మకమైన రచన. సాధారణమైన పాఠకులకు తొందరగా అర్ధంకాదు. ఇందులో ఆశ్చర్యం ఏమీలేదు. కాస్తోకూస్తో కాలేజి జీవితంలోని, తెలుగుసాహిత్యంలోనూ సంబంధం ఉండి తనలో చెలరేగుతున్న అనేక మానసిక సంఘర్షణకు, ఒత్తిళ్ళకు గురి అయ్యేవారికి అర్ధం అవుతుంది. అంపశయ్యలో ప్రతీ విద్యార్ధి తన మనుగడను వెతుక్కుంటాడు. ‘ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ డ్రీమ్స్’ ప్రకారం విద్యార్ధి పరీక్షలసమయంలో, ఫీజులు కట్టే విషయంలో తడబడుతుంటారు. వారి జల్సాలకు డబ్బులు వృధాగా ఖర్చుపెట్టి పీకలమీదకు వచ్చిన తరువాత ఏమి చేయాలని ఆలోచిస్తూంటాడు. అవసరానికికొద్ది అబద్ధాలు ఆడుతుంటారు.
“మెస్బిల్ కట్టాలి వెంటనే మూడు వందలు పంపించమని నాన్నకు ఉత్తరం రాస్తే—ఐడియా ఇంత సింపుల్‌గా ఇంతకుముందే వచ్చుంటే అంత టాచర్లే అనుభవించేవాడు కాదు కదా?” (నవీన్ – అంపశయ్య , పుట – 60 ) . ఇటువంటి అబద్దాలకు ఉపాయాన్ని ఆలోచించే మంత్రం ఒక్క ‘కల’కు మాత్రమే సాధ్యం ఉదయంనుంచి సాయంత్రంవరకు తాను చేసిన పనులన్నింటిని గుర్తు చేసుకునేవి నిద్రలోనే. మంచి పని ఒక్కటీ గుర్తురాదు. చెడ్డపనులు వెనువెంటనే గుర్తుకు వస్తుంటాయి. అవి భయంకరంగా కూడా కనిపిస్తాయి. ఈ భ్రమలో విద్యార్ధి ఏ విధంగా ఉంటాడో, వాడి ఆలోచనలు ఎంతవరకు దారి తీస్తాయో ఈ అంపశయ్య ద్వారా మనం తెలుసుకోవచ్చు.
- అసమర్థుని జీవయాత్ర:
చివరకు మిగిలేది, అల్పజీవి, వ్యక్తిత్వంలేని మనిషి, అంపశయ్య నవలలు ఒక వ్యక్తి జీవితానికే పరిమితం అయింది. కాని అసమర్థుని జీవయాత్ర మాత్రం సమాజ వాస్తవజీవితానికి అద్దంపడుతుంది. పై నవలలు మనోవిశ్లేషణపై ఆధారపడినవే. మనోవిశ్లేషణ శాస్త్రజ్ఞుల ప్రకారం ఒక సిద్ధాంతానికి ఒక్కొక్క నవల ప్రాతినిధ్య వహిస్తే అసమర్థుని జీవయాత్త సర్వాన్ని ఆపాధించుకుంది.
ప్రాయిడ్, అడ్లర్, యూంగ్ ప్రతిపాదనలకు ప్రతిరూపం అసమర్ధుని జీవయాత్రగా తీర్చిదిద్దినవాడు త్రిపురనేని గోపీచంద్. ఇది మనోవైజ్ఞానిక నవలయే.
అసమర్థుని జీవయాత్రలో ‘సీతారామరావు’ ప్రధాన నాయకుడు. సీతారామారావు చుట్టూ ఒక ప్రపంచాన్ని చిత్రించాడు గోపీచంద్.
‘ఒక వ్యక్తి తను చేస్తున్న పని లోకాన్ని, తను ఉంటున్న పరిసరాలమీద కాని, ఉత్సాహాన్ని కోల్పోతున్నాంటే ఆ విషయంపైనుండి ‘లిబిడో’ తప్పక ఉన్నదని అర్ధం” (శ్రీరామూర్తి, కోడూరి, తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ, పుట-28.) . సీతారామారావు కూడా లిబిడోకు గురైనవాడే. ప్రాయిడ్ చెప్పిన ‘లిబిడో’కి యూంగ్ చెప్పిన ‘లిబిడో’కి బేధం కనిపిస్తుంది. కాని సీతారామారావు జీవితంలో రెండు సమన్వయం చెందుతాయి.
ఏ వింధగానంటే ‘లేవండి కాఫీ ఆరిపోతూవుంది’ అన్నది భార్య. ఒకప్పుడు దీన్ని ఎట్లా ప్రేమించానా అని ఆలోచిస్తూ కళ్ళు నలుపుకుంటూ లేచాడు.. “అయితే నేను బ్రతకటం కూడా మీ అమ్మ చూడలేకుండా ఉందా ఏమిటి?” అని కూతుర్ని ప్రశ్నించాడు. ఆమె ప్రక్కకుంది.
“కాఫీ!” అన్నదీ భార్యగ్లాసు అందిస్తూ. ‘లేవనివ్వు’ అన్నాడు సీతారామారావు. లేచాడు.
‘మొహం కడుక్కో అక్కర్లా?’
‘మీకు అలవాటుగా బెడ్ కాఫీ’
‘!” కొంచెం మొహం కడుక్కొనిస్తావా? ‘అప్పుడు మళ్ళీ యిస్తాను?’ ‘ఏం అలవాటయితే తప్పా? మొహం కడుక్కొని తాగాలని భగవంతుడు నిర్ణయించాడు? కాఫీ తాగి మొహం కడుక్కుంటేనేం. మొహం కడుక్కొని కాఫీ తాగితే నేం? నాయిష్టం —-“( గోపీచంద్, త్రిపురనేని, అసమర్థుని జీవయాత్ర, పుటలు – 40, 41.)
పై విషయాన్ని గమనిస్తే లిబిడో సీతారామారావుపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనకు తెలుస్తుంది. సీతారామారావులోని ఉన్న అహం కాఫీ తాగాలని ఉంది; తాగకూడదని ఉంది. ఈ రెండు విషయాల మధ్య ఒక న్యూనతాభావం ఏర్పడింది. మానసిక రుగ్మతలో ఉన్న సీతారామారావు Ego(అహం) మాత్రం తనే గెలవాలన్న తపన చేతన అవస్థ అయిన అచేతనలోనే మునిగిఉంది. ఇటువంటి సందర్భాలు అసమర్థుని జీవయాత్రలో అనేకం.
తన ఆలోచన గాలి కంటే శరవేగమైనది. ఒకే మాటపై నిలబడనివాడు. సంచారిక స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చేతనంలో మనకు కనిపిస్తున్నట్లు ఉన్న అచేతనలో తను పడే అవస్థ అంతా ఇంతాకాదు. అటువంటి మానసికస్థితిని కలిగిన వ్యక్తి ‘ఇంటర్ ప్రేటేషన్ డ్రీమ్స్’లో స్థితిని చదివితేగాని మనకు బోధపడదు.
ఈ ఉద్వేగస్థితిలో ఉన్నప్పుడు క్షణానికోవిధంగా ప్రవర్తించే నైజం కనబడుతుంది. ‘ఉద్వేగాలు తీవ్రస్థాయిలో ప్రస్ఫుటమవుతాయి. మొదట ఉత్సాహం చూపించడంవంటి లక్షణాలను ప్రదర్శిస్తారు. వాళ్ళు చేసిన పనిని విమర్శ చేసినా, అపహాస్యం చేసినా తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తూ, తమ కోర్కెలు నెరవేరనప్పుడు ఏర్పడే ఒడిదుడుకులకు తట్టుకోలేక ఆత్మాహత్యా ప్రయత్నం” (తెలుగు అకాడమి, విద్యామనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు, పుట-59 ) చేస్తారు. ఆ విధంగానే సీతారామారావు కూడా ఒక అసమర్ధునిగా అదే పని చేశాడు.
ముగింపు :
ఇవేకాక నా దృష్టికి రానివి ఇంకా ఉండి ఉండవచ్చు. ఆ దిశగా పరిశీలన జరిగితే నవల పరిశీలనలో ఒక మేలు జరుగుతుంది. మానవ మనస్సులోని సూక్ష్మ భావోద్వేగాలు, అంతర్మథనాలు, సంఘర్షణలు మరియు వ్యక్తిత్వ వికాసాన్ని రచయితలు సమర్థవంతంగా చిత్రించడం ద్వారా నవలకు మరింత లోతును, జీవాన్ని అందించారు. మనోవిజ్ఞాన దృష్టితో రచించబడిన నవలలు పాఠకులను పాత్రల అంతరంగ ప్రపంచంలోకి తీసుకువెళ్లి, వారి ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఈ విధంగా మనస్తత్వ చిత్రణ తెలుగు నవలాసాహిత్యాన్ని సుసంపన్నం చేయడమే కాకుండా, మానవ జీవితంలోని సంక్లిష్టతలను అర్థం చేసుకునే సాధనంగా కూడా నిలిచింది. అందువల్ల తెలుగు నవలల వికాసంలో మనస్తత్వ చిత్రణకు అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఉందని చెప్పవచ్చు.
ఆధార గ్రంధాలు :
తెలుగు అకాడమి, విద్యామనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు
గోపీచంద్, త్రిపురనేని, అసమర్థుని జీవయాత్ర
నవీన్ – అంపశయ్య
విశ్వనాథ శాస్త్రి రాచకొండ, అల్పజీవి
బుచ్చిబాబు -చివరకు మిగిలేది
శ్రీరామూర్తి, కోడూరి, తెలుగు నవలల్లో మనోవిశ్లేషణ
– తనగాల కిషోర్ ఏం.ఏ ,ఏం.ఫిల్
తెలుగు ఉపాధ్యాయులు,
శ్రీ సూర్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ , ఏలూరు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~