
Volume – 1, June 2026, issue – 3,
సమర్పణ (D.O.S): 11 -05 – 2026 ఎంపిక (D.O.A): 23– 05 – 2026 ప్రచురణ (D.O.P) : 01-06-2026
వ్యాస సంగ్రహం :
మానవుల జీవితంలో పుట్టుక, పెళ్లి, చావనేవి మూడు పండగలు. దీనిలో మనిషికి పుట్టుక గురించిన అవగాహన చావుకు సంబంధించిన విషయాలేవి తెలియదు. మధ్యలో జరిగే పెళ్లిని మాత్రమే మానవులు అద్భుతంగా ఆనందంగా, ఆహ్లాదంగా, వినోదంగా జరుపుకుంటున్నారు. దీని కోసం ఇతోధికంగా ధనాన్ని వెచ్చించి ఆనందపడుతున్నారు. చాలా మంది దృష్టిలో చావనేది మానవుని అంతిమ వీడ్కోలు కాబట్టే కొందరు పెళ్లి కంటే ఈ తంతునే ఉన్నతంగా జరిపిస్తున్నారు. చనిపోయిన వారి ఆత్మలు పుణ్య లోకాలకు వెళ్లాలని రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఒకటి కాటిపాపల వారి చేత మోక్షం దొరుకుతుందని నమ్మి, వారిని చితి దగ్గర కార్యక్రమానికి ఆహ్వానించడమనేది అతి ప్రాచీన సంప్రదాయం.
కాటిపాపల అనే కుల వృత్తి వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా కనిపిస్తారు. వీరు స్మశానాలను కాపాడుతూ తమ కుల వృత్తితో పాటు కనికట్టు, ఇంద్రజాలం జాతకాలు చెప్పడం మొదలైనవి చేస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. కాటిపాపలు అనగానే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది కనికట్టు విద్య. దీన్నే ఇంద్రజాల విద్య అని. కళ్ళు కప్పే విద్య అని రకరకాలుగా చెప్పుతుంటారు. ఇంద్రజాల ప్రదర్శన సమయంలో చేతిలో ఒక ఎముక పట్టుకొని, ఆ ఎముకతో బొమ్మను తాకిస్తూ ఓం మహంకాళి, శాంభవి అంటూ క్షణంలోనే కప్పలను, పాములను, తేళ్ళను, ఎలుకలను పుట్టిస్తారు. వాటి చేత రకరకాల శబ్దాలు చేయిస్తారు. నోటిలో నుండి ఇనుప గోలీలని, మేకులని, విచిత్రమైన వస్తువుల్ని తీస్తారు. ఇతరులను యాచిస్తూ దేశ దిమ్మరులుగా వివిధ ప్రాంతాలు తిరుగుతూ పొట్ట పోసుకుంటారు. ఈ కనికట్టు విద్య, ప్రదర్శన ప్రజలను భయకంపితులను చేస్తుంది. అయినా సరే ప్రజలు దీనిని ఆనందంగా చూడడానికి ఎగబడుతుంటారు. కాటిపాపల వారు అనగానే వారి రూపాన్ని చూసి భయపడతారు. వీరి వేషధారణ అతి గంభీరంగా ఉంటూ, రంగు రంగుల దుస్తులు ధరిస్తారు. రెండు, మూడు పెద్ద గంటలను పట్టుకొని నడుస్త నడుస్తుంటే గంగిరెద్దు లేదా ఏనుగు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నొసటన పెద్ద బొట్టు పెట్టుకుని, పెద్ద బుర్ర మీసాలు, చంకలో జోలె, చేతిలో ఎముకలు పట్టుకొని, ఈకలు మాదిరిగా ఉండేటువంటి ఇత్తడి రేగుల కిరీటాన్ని పెట్టుకొని చూడడానికి భూత వైద్యుడిలా ఉంటాడు. వీరు నెత్తి మీద పెట్టుకునే ఇత్తడి రేకుల కిరీటం పక్కన పెడితే బుడబుక్కల వారికి వీరి వేషధారణ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది.
కీలక పదాలు :
కాటిపాపల, కళారూపాలు, కళ్ళుకప్పే విద్య, ఇంద్రజాల విద్య, కనికట్టు, జానపద కళాకారులు, జోలె, కిరీటం, ఇత్తడి రేకులు, భూత వైద్యుడు, బుడుబుక్కల, కుల వ్యవస్థ, పల్లె, మరణం, వేషధారణ
ప్రవేశిక :
పల్లెలకు ప్రాణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ పాడైన రోజున పల్లెల ప్రాణాలు పటాపంచలౌతాయి. ఈ కులాలు చేసే పని ఆధారంగా ఏర్పడ్డాయని కొందరంటే, అధిపత్య ధోరణిలో ఏర్పడ్డాయని మరి కొందరంటారు. ఎలా ఏర్పడ్డా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వలన గ్రామం సమృద్ధిగా ఉంటుంది.‘‘ కులానికి సంబంధించిన ఆచారాలని…మనిషి పుట్టిన దగ్గరి నుండి చనిపోయే వరకు… చాలా విషయాలలో పోలికలు కనిపించిన కులం కులానాకి మధ్య మౌళిక బేధాలు ఉన్నాయి’’. (తెలుగులో కుల పురాణాలు, పుట : 14) ఈ వ్యవస్థలో ఏ ఒక్కరు వారి కులవృత్తి చేయకపోయినా గ్రామమంతా ఇబ్బంది పడాల్సిందే. పుట్టుక నుండి చావు వరకు ఎవరికి కేటాయించిన వృత్తిని వారు చేసుకుంటూ జీవిస్తున్నారు. మనిషి చనిపోయిన తర్వాత స్మశానంలో కాల్చడం, పూడ్చడం చేసే వృత్తి వారిని కాటికాపరులు అంటారు. ఈ కాటికాపరి వారే కాటిపాపల వారు అయ్యారు. కాటికాపరి వారి వృత్తి, వారి మహిమలు, విద్యలు, వేషధారణ, జీవన విధానం మొదలైన అంశాలను ఈ వ్యాసంలో చర్చించదలిచాను.
కాటిపాపల గురించి:
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో కాటిపాపలు కళాకారుల ప్రదర్శన గురించి…
కలమెత్తిన హలమెత్తిన
మలమెత్తినవారి నొక్కమై జూడవలెన్
వలతియు నలతియు లేదిట
బలు వృత్తులు సాగినపుడె బ్రతుకులు సాగున్ ( తెలుగు లెంక తుమ్మల)
కాటిపాపల వారు ఇంద్రజాల విద్యతో పాటు ఊరిలో శవయాత్ర, ఉత్తర సంస్కార క్రియలు మొదలైనవి చేస్తూ బిక్షమెత్తుకుంటారు. సత్యహరిశ్చంద్రుడు కొంత కాలం కాటికాపరిగా స్మశానంలో ఉండి పోయాడు. కాబట్టి కాటిపాపలు సత్యహరిచంద్రుని వారసులమని చెప్పుకుంటారు. చాలా గ్రామాల్లో కాటిపాపల కులస్తులు ఉండకపోవడం వలన కాటికాపరి పనిని మాదిగ కులస్తులు చేస్తున్నారు. కాటిపాపల కులస్తులు సంచార జాతిగా గుర్తింపు పొందారు. కానీ వీరిని తెగల జాబితాలో కాకుండా వెనుకబడిన కులాల జాబితాలో ప్రభుత్వం గుర్తించింది.
విషయ వివరణ :
కాటికాపరి లేదా కాటిపాపల వారు స్మశానంలో విధులు నిర్వహించడం వలన వారికి అతీంద్రియ శక్తులు, మాయలు, మంత్రాలు వస్తాయని ప్రజలు నమ్ముతారు. వీరి దగ్గర గవ్వలు, పసుపు కుంకుమతో అలంకరించిన అమ్మవారి బొమ్మ ఉంటుంది. దీపావళి తర్వాత చెట్ల తీర్థం (పస్క తీర్థాలని) వెళ్లి, పోచమ్మ బోనాలు చేసుకుంటారు. కుల దైవమైన గుస్సాయి పండుగ ముగించుకొని తమ కట్టడి గ్రామాలకు చేరుకుంటారు. తిరిగి శ్రావణ మాసంలో వారి స్వంత ఇండ్లలోకి వెళ్లి పోతారు. సంవత్సర కాలంలో రెండు లేదా మూడు నెలలు మాత్రమే తమ ఇంటి దగ్గర ఉంటారు. మిగతా నెలలన్ని సంచార జీవనంలోనే గడుపుతారు. ఆ సమయంలో వారి గ్రామ పెద్దలను కలిసి వివిధ అంశాలను చర్చిస్తారు. గురువులు మొదలైన వారిని కలిసి కొత్త విద్యలు నేర్చుకుంటారు.కాటిపాపల వారు కాష్టంపై శవంతో పాటు పడుకుంటారు. కాబట్టే వీరికి కాటిపాపల అని పేరు వచ్చింది. వీరు బుడగ జంగం కులంలో ఒక శాఖకు చెందినవారు.
వేషధారణ :
పూసల దండలు, చంద్రబాల గొలుసు, రుద్రాక్ష మాలలు, నొసుట పసుపు, విభూతితో పెద్ద బొట్టు, కళ్ళకు కాటుక, చేతి వేళ్లకు రకరకాల ఉంగరాలు, ఒక చేతిలో గంట మరో చేతిలో ‘నపీరా’ అనే సంగీత వాయిద్యం, ఎడమవైపు చంకలో జోలె, అందులో గారడీకి అవసరమైన ఎముకలు, గచ్చకాయలు రాళ్లు, చెక్క బొమ్మ లాంటి వస్తువులు ఉంటాయి. వీరి రేకుల కిరీటంపైన శివుడు, హరిశ్చంద్రుడు, లోహితాసురుడు, పాము చిత్రాలు ఉన్న కిరీటాన్ని ధరిస్తారు. గరుడ విద్యలు అనగా విష నివారణ విద్య,మంత్రం, తంత్రాలు ( గరుడ మంత్రం, యంత్రాలు, తాయెత్తులు) ఆద్యాత్మిక సాధన మొదలైనవి చేస్తారు.
ఇద్దరు, ముగ్గురు వంత పాటగాళ్లు ఉంటారు. నాలుగు బాటల కూడలిలో ఇంద్రజాల విద్య ప్రదర్శించేటప్పుడు ప్రధాన వ్యక్తి సంభాషణ కొనసాగిస్తాడు. అతనికి తోడు ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు వంత పాటగాళ్లు ఉంటారు. అందులో ఒకరు బోనగను ఊపుతూ రామ రామ అంటూ వంత పాడుతుంటారు. ఈ కార్యక్రమంలో బొమ్మలతో దండాలు పెట్టిస్తూ, అవి మాట్లాడుతున్నట్లుగా ప్రజలకు భ్రమ కలిగిస్తారు. ఊర పిచ్చుకలను సృష్టించి వాటి చేత అరిపించి (శబ్దం) వాటిని మాయం చేస్తారు.
వీరి మీరాశి గ్రామంలో ఏ కులం వారు చనిపోయిన అంతిమ సంస్కారంలో పాల్గొంటారు. ఇద్దరు లేక ముగ్గురు పురుషులు బృందంగా ఏర్పడి శవం మందు నడుస్తూ, చనిపోయిన వ్యక్తి గుణ గణాలను కీర్తిస్తూ, వారిని గొప్ప రాజులతో పోల్చుతూ పాటను కైకట్టి పాడుతుంటారు. శివశంకరుడు, పోచమ్మ, వినాయకుడు, సత్యహరిశ్చంద్రుడు వంటివి పాటలు పాడుతారు. ఒకరు పాడుతుంటే మిగిలిన ఇద్దరు కర్రలతో చేసిన గంటను వాయిస్తూ రామ రామ అంటూ వంతపాడుతారు. శవాన్ని పాడెపైన పెట్టడానికి ముందు దానిపైన పడుకుంటారు. కాష్టం పేర్చిన తరువాత శవం పొట్టపై కూర్చొని కావాల్సినంత సంభావన అడుగారు. శవ సంబంధీకులు ఇవ్వనంటే శవంతో పాటు తమను కాల్చివేయలని విపరీతమైతమైన ధైర్యాన్ని కనబరుస్తారు. శవ సంబంధీకులు భయపడి వారితో రాజీ కుదుర్చుకుంటారు. పదవ రోజు బూడిద ఎత్తే సమయంలో కాష్టంలో పడుకొని కొంత డబ్బుని కట్నంగా ఇవ్వాలని అడుగుతారు. వారు అడిగినంత ఇస్తేనే బూడిదని ఎత్తనిస్తారు. లేదంటే అడ్డుపడతారు. పిండం పెట్టేటప్పుడు అడిగిన సంభావన ఇవ్వకపోతే పిట్టను ముట్టనీయకుండా వాటిని తరిమివేస్తారు. ఏదో రకంగా శవ సంబంధీకులని పీడించి వారికి కావలసిన సంభావనని రాబట్టుకుంటారు. ఇతర సమయాలలో బిక్షం ఎత్తుకుంటూ, కొన్ని సార్లు వేటను నమ్ముకుని జీవిస్తారు. ఈ కులంలోని స్త్రీలు ఈత చీపిరిలు అల్లుతారు. కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తారు. దిలావర్ తన కథల్లో కాటికాపల వారి కష్టాలు స్పష్టంగా చూపించాడు.
ముగింపు :
ప్రపంచీకరణ రోజు రోజుకు గ్రామాలను నగరాలుగా మార్చేస్తుంది. మనుషులతో పని తగ్గి యంత్రాలు వాటి స్థానాన్ని ఆక్రమించాయి. ఇలాంటి సమయంలో ఎంతో ముఖ్యమైన కుల వృత్తులే మాయమైపోతున్నాయి. ఒకప్పుడు ఏ ఒక్క కులం లేకపోయినా ఇబ్బంది పడిన గ్రామాలు ఈ రోజు కులాల ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. మనిషి జీవించి ఉన్నప్పుడే కులాలని పట్టించుకోనప్పుడు మనిషి మరణించినప్పుడు ఏ కులాన్ని గొప్పగా చూడరు. కాబట్టే కాటిపాపల వారి జీవన విధానంలో ఎన్నో మార్పులు సంభవించాయి. స్మశానాలు ఊరికి దగ్గరగా నిర్మించుకోవడం, కాటిపాపల వారు సంభావన ఎక్కువ అడుగుతారని ఇబ్బంది పెడతారని, వారికి మరణ వార్తను అందకుండా జాగ్రత్తపడి స్మశాన పనులన్నీ గుట్టుగా చేయించుకుంటున్నారు.
కాటిపాపల కులస్తులు ఇంతకు ముందు కంటే ఇప్పుడు వలసల కారణంగా చాలా తగ్గిపోయారు. మిగిలిన నేటి తరం ఇంద్రజాల విద్యలు, యాచించడం మొదలైనవి చేయడానికి ఇష్టపడడం లేదు. కాటిపాపల కులస్తుల జీవన విధానం ఎంతో మారిపోయింది. ప్రస్తుత తరం ఉన్నతమైన ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. నేటికి కొద్ది మంది మాత్రమే అక్కడక్కడ ఈ వృత్తిలో కనిపిస్తున్నారు. మరణించిన తరువాత వారి సంబంధీకులే శవాన్ని చూసి భయపడతారు. వీరు మాత్రం శవం చుట్టే తచ్చాడుతారు. దీనికి ఎంతో ధైర్యం, సాధన అవసరం అవుతాయి. ఇంద్రజాల విద్యలు నేటి తరానికి ఎంతో అవసరం. ఇలా ఒక్కొక్కటిగా కులాలు అంతరిస్తే ముందు తరాలకి మన జాతి వైభవం చరిత్ర తెలియకుండాపోతాయి.
ఉపయుక్త గ్రంథాలు :
1.తెలుగులో కుల పురాణాలు, పులికొండ సుబ్బాచారి, 2000, ప్రజా శక్తి బుక్ హౌస్, హైదరాబాద్.
2.భారతీయ సంస్కృతి -తత్వం, గుమ్మ వీరన్న, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
3.ధర్మపురి మండల జానపదకథలు, తాటికాయల భోజన్న,2015, ధర్మపురి ప్రచురణలు, హైదరాబాద్.
4.చంద్రుడు గీయని బొమ్మలు, దిలావర్, 2020, సమత ప్రచురణలు, హనుమకొండ.
-డా.తాటికాయల భోజన్న
చరవాణి : 9704383592
విద్యుల్లత: bhojanna87@gmail.com
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~