sahithivani

ఎండ్లూరి “నల్లద్రాక్షపందిరి” –  వస్తువైవిధ్యం – షేక్.వలీ అహ్మద్

     Volume – 1,                               June  2026,              issue – 3,

సమర్పణ (D.O.S): 07 -05 – 2026               ఎంపిక (D.O.A): 21– 05 – 2026            ప్రచురణ (D.O.P) :  01-06-2026

వ్యాస సంగ్రహం :

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉన్న ప్రక్రియలో కవిత ప్రక్రియ ఎంతో వైవిధ్యాన్ని సంతరించుకుంది.వాస్తవికతకు, సామాన్యులు ఎదుర్కొంటున్న సంఘటనల మీద కవిత్వం రావడం మొదలయ్యింది. అందుకే ఆధునిక సాహిత్యం ముఖ్యంగా కవిత ప్రక్రియ లో  వాస్తవికత ఎక్కువ చోటు చేసుకుంది. ఆధునిక కాలంలో ఎండ్లూరి సుధాకర్ కవిత్వానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వీరు రచించిన వాటిలో నల్ల ద్రాక్ష పందిరి కవితా సంపుటి ఒకటి. ఈ కవితా సంపుటిలో  కవితలు తెలుగు , ఆంగ్లం రెండు భాషలలోను  ఉంటాయి . వాటిలో వస్తువును విశ్లేషిస్తూ రచయిత సుధాకర్ కవిత్వంలోని వైవిధ్యాన్ని ఆవిష్కరించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

కీలక పదాలు :

నల్లద్రాక్ష పందిరి, కవిత, ఎండ్లూరి, సుధాకర్, నీలిక, కవితలు,  ఆత్మకథ, కొత్త కల, గ్రీష్మ గోదావరి, తపన,తీపికోత, ఇందిరా పార్కు, నీలిక, నెత్తుటి ప్రశ్న, మైసమ్మ మరణం,నిలువెత్తు నిప్పు, షకీలా, సహచరి, స్వరపరికరం .

ప్రవేశిక :

డా॥ఎండ్లూరి సుధాకర్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 211959 లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు ప్రథమ సంతానం. వీరి కవితలు ఎన్నోదిన, వార, పక్ష, మాస, త్రైమాసిక పత్రికల్లోను ఇతర ప్రత్యేక సంచికల్లోను ప్రచురించబడ్డాయి. వర్తమానం, జాషువా’ నాకథ ‘, కొత్త గబ్బిలం, నా పుస్తకమే నా ఆయుధం, మల్లె మొగ్గల గొడుగు, పుష్కర కవితలు, వర్గీకరణీయం, “ఆటా “జనికాంచె…,జాషువా సాహిత్యం- దృక్పథం – పరిణామం, గోసంగి, కథానాయకుడు జాషువా, నవయుగ కవి చక్రవర్తి జాషువా, కావ్యత్రయం, సాహితీ సుధ, తెలివెన్నెల, తెలుగు రుబాయీలు, హేమంతం వీరి రచనలు.  ఇలా అను వదించబడినవి ఒక పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు జె.జె ప్రచురణ సంస్థవారు. దానికి DARKY అనేది ఆంగ్లములోను, అదే తెలుగులో ‘నల్లద్రాక్షపందిరి’గాను ప్రచురింపబడింది.

విషయ వివరణ :

నల్లద్రాక్ష పందిరి కవితా సంపుటిలో ఉన్న కవితలు 1985 నుండి 2002 మధ్యకాలంలో ప్రచురింపబడ్డవి. దీనిలో మొత్తం 39 కవితలు ఉన్నాయి.  సమాజంలో జరిగిన కొన్ని సంఘటన లకు స్పందించి రాసిన కవితలు.

ఈ సంపుటిలో  మొదటి కవిత “అమ్మ గాజులు” . అమ్మ ప్రేమతో పాటు పిల్లల మీద ప్రేమ, విశ్వమానవ ప్రేమ దీనిలో కవితా వస్తువుగా కూడ చోటు చేసుకున్నాయి. మాతృత్వాన్ని పంచి పెట్టే అమ్మంటే అందరికీ గౌరవమే. ఎంతో శ్రమపడి చెమట ధార పోసిన అమ్మనుచూస్తే గుండెలు తరుక్కు పోతాయి.

“గాజుల్లేని అమ్మ చేతుల్ని చూసినప్పుడల్లా

చుక్కలేని బోసి ఆకాశమే కనబడుతుంది

పూలులేని మొండి కొమ్మలు

కంటి ముందు కన్నీళ్ళై కదులుతుంటాయి”‘(డా.ఎండ్లూరి సుధాకర్, నలద్రాక్షపందిరి, పుట 10.) తన బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటూ అమ్మమీద ప్రేమను అందరికి పంచుతారు సుధాకర్. దీనికి ఆంగ్లంలో ‘Mothers Bangles’గా అనువదించారు. ఇది 7-1-94 ఆంధ్ర జ్యోతి చిత్ర వారపత్రికలో ప్రచురింప బడింది.

నల్లద్రాక్ష పందిరిలో మరొక కవిత “ఆత్మకథ” దీనిని ఆంగ్లభాషలో ‘An Auto Biography’ గా అనువదించారు. దీనిలో వస్తువుగా తన జీవితంలో అనుభవించిన అవమానాల చరిత్ర వివరించబడింది.

“మయసభలో నా ఆత్మకథ ఆవిష్కరించబడింది

బహిరంగ వేదిక మీద నా సన్మానం మొదలయ్యింది

యిప్పుడు నా మెడలో దండలు పడుతుంటే

నిన్నటి నా గాయాలు ఉలిక్కి పడుతుంటాయి

నా తల మీద పూలు చల్లుతున్నప్పుడు

నా లోలోపల ముళ్ళ కొరడాలు చరుస్తుంటాయి “( డా. ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట- 14) ఇంకా ఈ సమాజంలో సమధర్మంలేదు. విభజించు పాలించు అనే సిద్ధాంతమే రాజ్యం యేలుతుంది. దళితులను సమాజానికి ఇంకా దూరం చేస్తుంది. ఆనాడు చదువుకునే హక్కు లేదు. వేదాధ్యయనం అసలే వీలులేదు. చెవుల్లో సీసం, నాలుక కోయడం, మూతికి ముంత, మొలకు ఆకు కట్టే దుస్థితిని దుయ్యబట్టాడు. అంతేకాదు దగాపడిన ఏకలవ్యుడు ఇలా గతమంత అస్పృశ్యత సెగలతో మాడి మసై పోయినస్థితిని గుర్తుచేస్తాడు. మేము మేధావులుమే మాకు చదువుంది. మాకు ప్రతిభ వుంది. ఈ అణిచివేత ఇక సాగదంటారు సుధాకర్.

హరిత విప్లవాన్ని తీసుకొస్తు హరితాలయాలు నిర్మిద్దాం రండి అంటారు. 1999లో కార్గిల్ యుద్ధం లో ఎంతోమంది జావాన్లు అసువులు బాసారు. ఎందరో తల్లుల కళ్ళు శోక సముద్రాలయ్యాయి. అటు వంటి అమర వీరులను వస్తువుగా చేసుకుని డా.సుధాకర్ “ఒక వీరుడి తల్లి” అనే శీర్షికతో అద్భుతమైన కవిత వ్రాసారు. దీనిని ఆంగ్లంలో ‘A Soldiers Mothers’ గా అనువదించారు.

“రాష్ట్రమేదైనా కావొచ్చు

రక్త మేదైనా కావొచ్చు

ఈ దేశం యుద్ధ వీరుల పురిటిశాల

వర్గ మేదైనా కావొచ్చు

వర్ణ మేదైనా కావొచ్చు

వీరమాతల ఒడి నెత్తుటి ఉయ్యాల

దుఖాన్ని ఆపగలమా

కడుపు చిచ్చు ఆర్పగలమా ” ( డా॥ఎండ్లూరి సధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట – 26)అంటారు.

ఈ కవిత  జూలై 4-1999 ఆదివారం ‘వార్త’ పత్రికల్లో ప్రచురింపబడింది.

“గ్రీష్మ గోదావరి “కవితలో  కవిత . సుధాకర్ ఉద్యోగ రీత్యా రాజమండ్రిలో ఉండటం వలన గోదావరితో అనుబంధం ఏర్పడింది. ఎప్పుడు గలగలా పారే గోదావరి గ్రీష్మ కాలంలో ఎలా ఉంటుందో తన కవితలో తెలియజేససు సుధాకర్.

“నాన్న కొట్టినప్పుడు

ఒక మూల ముడుచుకొని పడుకున్న అమ్మలా వుంటుంది.

ఎండాకాలపు గోదావరి

నీటి కొవ్వు కరిగిపోతూ

పలచబడుతున్న జలచర్మంతో

ఎనీమియా పేషెంటులా

ఎంతో జాలి గొలుపుతుంది .

నల్లద్రాక్షపందిరిలో మరొక కవిత “ గూర్కా” దీనిని  ఆంగ్లంలో ‘The Gorkha’ అని అనువదించబడింది. అందరూ గాఢంగా నిద్రపోతున్నా గూర్కా మాత్రం రాత్రంతో కంటి మీద రెప్ప వేయకుండా గల్లీ గల్లీ తిరుగుతూ ఊరికే కాపలాకాస్తుంటాడు. అటువంటి సగటు శ్రమజీవి వ్యథను, శ్రమను, వస్తువుగా చేసుకుని ఈ కవిత రాసారు రచయిత.

” అతడు రాత్రి సూర్యుడు

కాళ్ళ బొరియలలో నిడురచాప మడత పెట్టి

దొంగ చీకటిని వెంటాడుతుంటాడు .

వీధి మలుపులోంచే

అతడి పదధ్వనుల్నీ వాసనల్నీ పసిగట్టి

గల్లి కుక్కలు గౌరవ సూచకంగా లేచి తోకలూపుతాయి

ఎక్కడివాడో తెలియదు గాని

అత్యంత ఆప్తుడిలా కనిపిస్తాడు .” (డా॥ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట – 38.) అంటారు.

“చెరువులేని ఊరు” కవితలో  ఒక ఊరికి చెరువు యొక్క ప్రాముఖ్యతను ఈ కవితలో తెలియజేసారు.

“అమ్మలేని అనాధలా

మా వూరికి చెరువు లేదు

చిన్నప్పుడుచెరువు చెక్కిళ్ళని ముద్దుపెట్టుకున్న

నీటి జ్ఞాపకాలు కానీనీటి మైదానంలో దిసమొలతో

పరుగెత్తిన గాఢ స్మృతులు కానీ

జల వృక్ష మెక్కి అలల ఆకుల నడుమ

పిందెలా కదిలిన బాల్యాను భూతులు కానీ లేవు. “ (సుధాకర్ ఎండ్లూరి , నల్లద్రాక్ష పందిరి – పుట – 42 ) ఒక ఊరికి చెరువు లేకపోతే ఎలాంటి దుస్థితి ఎర్పదేదో ఈ కవిత రచయిత తెలియజేసారు. అలాగే చిన్నప్పుడు నీటి కోసం పడిన పాట్లు గుర్తు చేసుకున్నారు.

నల్లద్రాక్ష పందిరిలో మరొక కవిత “డక్కలి పిల్ల” ఇది ఆంగ్లంలో ‘Dakkali Girl’ గా అను వదించబడింది. సంచార తెగకు చెందిన డక్కలి వాళ్ళు వేసవికాలంలో ఆయాగ్రామాలకు వచ్చి

యాచనచేసుకుంటూ, వాళ్ళకు వున్న కళాప్రావిణ్యాన్ని ప్రదర్శిస్తు, పొట్టగడుపుకుంటు జీవితాన్ని కొన సాగిస్తుంటారు. వీరి జీవన విధానాన్ని, వారి శైలిని, స్థితిని వస్తువుగా చేసుకుని డా॥సుధాకర్ ఇలా అవిష్కరిసారు.

“భూమి బొంగరమై ఒక సంచార దేశంగా వాళ్ళ పొట్ట చుట్టూ తిరుగుతూ ఉండేది ఆ చండాల బాలిక” (డా|| ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట- 46.) అంటారు

అంతేకాదు వాళ్ళు పల్లెలోకి వస్తే వారితో పాటు గాడిదలు, కోళ్ళు, కుక్కలు, మంచాలు, ఇంకా పెద్ద సరంజామాతో వచ్చేస్తారు. అది దళిత వాడలకు ఎంతో వింతగా వుండేది.

నల్లద్రాక్ష పందిరిలో మరొక కవిత “దూది పూల దుఃఖం” దీన్ని ఆంగ్లంలో “Cry Cotton Flowers” గా అనువదించారు. దీనిలో పత్తిరైతులు ఆత్మహత్యలు, రాజకీయ నాయకుల కుఠిల నీతి, పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం పనితీరు అన్నీ విమర్శిస్తు, రైతుల ఆవేదనను వస్తువుగా చేసుకు న్నారు డా||సుధాకర్.

“పతి రైతుల ఆత్మహత్యలన్నీ

పచ్చి అబద్దాలేనా పత్తి పువ్వా ?

తెల్ల బంగారాల మీద

నల్లమబ్బుల దోపిళ్ళల్లోంచి

తెలివెన్నెల కురిపించే చందమామా !

సూర్యుడి మీద చెయ్యి పెట్టి

చూసిన రహస్యాలకు సాక్ష్యం చెప్పు

పంచభూతాల్లారా ”'( డా||సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట- 64 ) అంటారు.

నల్లద్రాక్షపందిరిలో మరొక కవిత ‘నాన్న’ దీన్ని ఆంగ్లభాషలో “Father” గా అనునదించారు. దాసుధాకర్కి నాన్న మీద ప్రేమ ఎంత వుందో. ఈ కవిత తెలియజేస్తుంది. అరవైయ్యేళ్ళ నాన్నని, గత జ్ఞాపకాల్ని తలచుకుంటు

“నగరంలో పాత రోడ్లన్నీ

నాన్న పాదలకు నమస్కరిస్తాయి

అరవై యేళ్ళ ప్రయాణంలో అలసిపోయిన

 నాన్న పట్టె మంచంలో నిద్రిస్తున్నాడు.

నాన్న చనిపోయాడని నాకెప్పుడు అనిపించదు”( డా॥ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట- 78.)  అంటారు.

తండ్రి చూపిన ప్రేమకోసం అద్భుతంగా చెపుతాడు.

” నేను తండ్రినయ్యాకే తెలిసింది

 నా తండ్రి ప్రేమేమిటో

నాన్న లేనప్పుడే తెలిసింది.

నాన్న లేని తనమేమిటో” ‘(డా॥ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట 78.)అంటారు.

నల్లద్రాక్ష పందిరిలో మరొక కవిత “నాన్నా యుద్ధమెప్పుడు ఆగిపోతుంది” దీనిని “Father when will the war end ” అని అనువదించారు. దీనిలో గల్ఫ్ యుద్ధంలో జరిగిన భయనకాన్ని కవితా వస్తువుగా చేసుకుని తనచిన్న కూతురైన మానస భయానికి స్పందించి వ్రాసిన కవిత యిది. రెండు దేశాల ఆధిపత్య పోరులో సామాన్య మానవులు, భస్మీ పటలమైన భవనాలు, తుపాకుల మోత లు ప్రపంచాన్ని కుదిపేసాయి. మానవ వినాశనంఏవిధంగా జరగుతుందో మూడవ ప్రపంచ యుద్ధానికి ఎంత దగ్గరగా వున్నామో అని భయబ్రాంతులుతో గజగజ వణికిపోయిన జనాన్ని, వారి బాంబుల వర్షాన్ని ఈ కవితలో ఆవిష్కరించారు.

చిగురుదేహాం మీద స్కడ్ క్షిపణుల కర్కశ భీభత్సమేమిటి అని ప్రశ్నిస్తారు సుధాకర్. ఇంటి మీద కూడ స్కడ్లు ప్రయోగిస్తారా! అందరిని చంపేస్తారా! అని తన కూతురు మానస అడిగినప్పుడు హృదయం ద్రవిస్తుంది. సమాధానం దొరకదు. ఇప్పుడు యుద్ధం రాక్షసిగా కనిపిస్తుంది అంటారు. చందమామ కళ్ళలో చుమురుబావుల పొగలు కమ్ముకున్నాయి అంటారు.

నల్ల ద్రాక్ష పందిరిలో మరో కవిత “నీలిక ” దీనినే ఆంగ్లంలో ‘Darky’ అని అనువాదం చేశారు. ఇది దళిత స్త్రీ కోసం వ్రాసింది. నల్లపిల్ల కవితా వస్తువు. నల్లదనం దళిత జీవనానికి ప్రతీక, నిమ్న కులానికి నిలువెత్తుసాక్ష్యం అందుకే చండాల జీవితానికి ప్రతీకయైన నల్లపిల్ల కవితా వస్తువైయింది.

అందుకే సుధాకర్ “ఓ చండాలికా నీ వెండి కడియాల నల్లకళ్ళ ముందు

వెయ్యేళ్ళ కావ్యనాయికలు వెలవెలబోతున్నారు”( డా॥ ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట-94.).

నల్లద్రాక్షపందిరిలో మరొక కవిత “రేపటి చరిత్రకు ముందు మాటను నేనే” అనేది దీన్ని ఆంగ్లం “I am the foreword to tomorrows History” డా.ఎండ్లూరి ఆవేశంతో పాటు ఆవేదన కూడ కవితా వస్తువుగా చేసుకున్నారు. అనుభవంతో ఈ కవిత రాసారు. దీనిలో తీవ్రవాద ధోరణితో పాటు నిరసన కూడ ఉంది. రేపటి చరిత్ర మాదే అని దళిత స్వరా న్ని హెచ్చించి ఒక ఘాటైన హెచ్చరిక జారీచేసారు. నేను రగులుతున్న అగ్నిపర్వతాన్ని అంటు

“నాది దగ్ధ ముఖం నా లోపలి ముఖాన్ని దాచుకోలేను నా ఏక ముఖంలో ముసుగు ముఖాలు పరావర్తనం చెందవు” ?( డా|| ఎండ్లూరి సుధాకర్, నల్లద్రాక్షపందిరి, పుట- 148) అంటారు.

ముగింపు :

ఈ విధంగా డా॥ ఎండ్లూరి రచించిన నల్లద్రాక్ష పందిరి అనే ఉభయభాషా కవిత్వంలో ఉన్న వస్తువు సామాజిక, రాజకీయ విషయాలతో పాటు జరిగిన, జరగుతున్న అణిచివేత, దళిత జాతుల మనుగడ, దళిత కవుల హృదయాల్లో చెలరేగుతున్న ఆవేదన అగ్ని కణాలై వర్షించాయి. బాల్య స్మృతు లతో పాటు జన్మనిచ్చిన అమ్మ, పెంచి పోషించిన తండ్రి, పేగు తెంచుకు పుట్టినపిల్లలు, సహచారణి కూడ దీనిలో కవితా వస్తువులయ్యాయి. ప్రతీకవిత ఒక ప్రత్యేకతను సంతరించుకుని సామాజిక స్పృహను కల్గించాయని చెప్పవచ్చు తరువాత ఆటజనికాంచెలో వస్తువైవిధ్యాన్ని పరిశీలిద్దాం.

ఆధార గ్రంధాలు :

నాగేశ్వర శాస్త్రి ద్వాదశి – తెలుగు సాహిత్య చరిత్ర

నారాయణ రెడ్డి .సి. – ఆధునిక ఆంధ్ర కవిత్వం – సంప్రదాయాలు  

సుధాకర్ ఎండ్లూరి – నల్లద్రాక్ష పందిరి

షేక్.వలీ అహ్మద్

ఏం.ఏ తెలుగు, టి.పి.టి., ఏ.పి.సెట్

స్కూల్ అసిస్టెంట్ తెలుగు,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాల , భైరవపాలెం

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top