
Volume – 1, June 2026, issue – 3,
సమర్పణ (D.O.S): 02 -05 – 2026 ఎంపిక (D.O.A): 18– 05 – 2026 ప్రచురణ (D.O.P) : 01-06-2026
వ్యాస సంగ్రహం :
తెలుగు సాహిత్యంలో ప్రాచీన కాలం నుంచే కథలు ఉన్నప్పటికీ, ఆధునిక కథానిక ప్రక్రియ పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో 19వ శతాబ్దం చివరలో అభివృద్ధి చెందింది. చిన్న పరిమాణంలో ఒకే అంశాన్ని కేంద్రీకరించి, పాఠకునిపై గాఢమైన ప్రభావం చూపే రచనను కథానికగా పరిగణిస్తారు. తెలుగు కథానికకు ఆద్యుడిగా సాధారణంగా గురజాడ అప్పారావు పేరును పేర్కొంటారు. ఆయన రచించిన “దిద్దుబాటు” ఆధునిక తెలుగు కథానికలలో తొలి ప్రాముఖ్యమైన కథగా గుర్తించబడింది. కానీ తర్వాత కాలంలో బండారు అచ్చమాంబ రాసిన ధన త్రయోదశి మొదటి కథానిక భూమిక పత్రికలో ప్రచురించడం జరిగింది. ఆధునిక కాలంలో కథానిక మరింత విస్తృతమైంది. ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులు, నగరీకరణ, కుటుంబ సంబంధాలు, యువత సమస్యలు వంటి అంశాలు కథానికల్లో ప్రతిబింబిస్తున్నాయి. అటుంటి కథానిక ప్రక్రియ లో తొలి తరం రచయితలు గురజాడ. వారు రాసిన కథానికలు అప్పటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. వాటిని తెలియజేయడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.
కీలక పదాలు :
గురజాడ, అప్పారావు, కథానికలు, కథలు, దిద్దుబాటు, మీ పేరేమిటి, ఆధునిక సాహిత్యం , మెటిల్డా, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మతము, విమతము.
ప్రవేశిక :
కథ , కథానిక శబ్ద ప్రయోగాలు కాలం స్పష్టంగా తెలియని “అగ్నిపురాణం”లో ఉన్నాయని ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు వెలుగులోకి తెచ్చారు.
“ఆఖ్యాయికా , కథా , ఖండకతా, పరికథా , తథా
కథానికేతి మన్యన్తే గద్య కావ్యంచ పంచథా “ అని అగ్ని పురాణ కారుడు గద్య రచనలను ఆఖ్యాయిక , కథ, ఖండ కథ , పరికథ , కథానిక అని ఐదు వర్గాలుగా విభజించారు.
భయానకం సుఖపరం గర్భేచ కరుణోరసః
అద్భుతోన్తే శుక్ల ప్తా ర్దా నోదాత్తా సా కథానికౌ “(దక్షిణా మూర్తి పోరంకి – కథానిక స్వరూప స్వభావాలు , పుట – 179 ). ప్రాచీన సాహిత్యంలో కధలున్నా కూడా ఆధునిక సాహిత్యంలో వచ్చిన కథ, కథానికలకు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రాచీన కథా కావ్యాలు రసానికి, నీతికి ప్రాధాన్యత యిస్తే , ఆధునిక సాహిత్యంలో వచ్చిన కథలు పూర్తిగా ప్రజల ప్రయోజాన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చిన కథలే. అటువంటి ఆధునిక కథానిక సాహిత్యంలో ఆద్యులు గురజాడ అప్పారావు. వీరు రచించిన కథానికల వస్తువు అప్పటి సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఉంటాయి.
విషయ వివరణ :
గురజాడ అప్పారావు తన జీవితంలో చూసిన సంఘటనలను కథానిక రూపంలో అందించారు. అందుకే నేటికి మనం సమాజంలో చూస్తున్న సంఘటనలే గురజాడ కథలలోని వస్తువు ఒక్కటిగానే కన్పిస్తాయి. గురజాడ అప్పారావు కోసల్యమ్మ , వేంకటరామదాసు దంపతులకి విశాఖ జిల్లా ఎలమంచలి తాలుకా రాయవరమో 1862 లో జన్మించారు. “ 1885 లోనే వివాహం అయ్యింది. కాలేజీలో కొన్నేళ్ళు ఉద్యోగం చేసి డిప్యూటీ కలెక్టరు ఆఫీస్ లో హెడ్ గుమాస్తాగా పనిచేసారు.ఆనంద గజపతి సంస్థానంలో కొన్నాళ్ళు సంస్థాన పరిశోధకుడిగా , తర్వాత కాలంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫెలోగా నియమించబడ్డారు. “ (నాగేశ్వర శాస్త్రి ద్వాదశి , తెలుగు సహితు చరిత్ర , పుట – 356 ). గురజాడ రచించిన కథానికలు దిద్దుబాటు, మీ పేరేమిటి, మెటిల్డా, పెద్ద మసీదు, సంస్కర్త హృదయం, మతము, విమతము. రాసారు. వీటితో పాటుగా కన్యాశుల్కం నాటకం, ముత్యాలసరాలు గేయ సంపుటి, సుభద్ర, మాటా మంతీ, వ్యాస చంద్రిక, కొండుభట్టీయం,డైరీలు వంటి రచనలు కూడా చేసారు.
1.దిద్దుబాటు :
కమిలిని , గోపాలరావు భార్యాభర్తలు. యిద్దరు చదువుకున్న వారే. రాముడు వాళ్ళ ఇంట్లో పనిమనిషి. గోపాలరావు సంస్కరణోద్యమంలో ముఖ్యంగా వేశ్యా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటూనట్లుగా భార్యకి చెప్పి రోజూ సాని దగ్గర కాలం గడుపుతూ ఉంటాడు.ఈ విషయం తెలిసుకున్న భార్య కమలిని భర్తను మార్చడానికి పథకం వేస్తుంది.
“ అయ్యా పది దినములు అయినది. రాత్రుల నింటికి మీరాకను నేనెరుగను మీటింగులకు బోవుచుంటిమంటిరి . మా చెలుల వలన నిజాము నేర్చితిని. నేనింట నుండుటను గదా మీరు కల్లలు పలుకవలసి వచ్చెను. నేను పుట్టినింటనున్న మీ స్వేచ్చను , నిర్భంధమును , అస్త్యమునకు ఆవకాశము కలుగుకుండును. మీచే దినదినమున అసత్య మాదించుట కన్నా మీ త్రోవకు అడ్డుగా నుండకుంటయే పతి మేలు కోరిన సతికి కర్తవ్యము కదా !నే, నీరేయి కన్న వారింటికి వెళ్ళుతున్నాను “ (గురజాడ సాహితీ సర్వస్వం , కథానికలు , పుట – 427 ) అని ఒక ఉత్తరం రాసి టేబుల్ మీద పెట్టి మంచం కింద దాక్కుంటుంది. గోపాలరావు అర్దరాత్రి ఒంటి గంటకు వస్తాడు. ఇంట్లో భార్య కనిపించదు. బయటకి వచ్చి పనివాడు రాముడిని అడగుతాడు. రాముడు నుంచి సమాధానం రాకపోవడంతో ఇంట్లోకి వచ్చి చూడగా టేబుల్ మీద ఉత్తరం కనిపిస్తే చదువుతాడు. విషయం తెలుసుకుని తాను చేసిన తప్పు ఏమిటో అర్ధం చేసుకుని పని వాడు రాముడిని మామ గారి ఇంటికి వెళ్లి భార్య కమిలిని తీసుకురమ్మని చెబుతాడు. మరొక పది రూపాయిలు కూడా రాముడికి యిస్తాడు. తన భర్త తప్పు తెలుసుకున్నాడని గ్రహించిన కమలిని మంచం కింద నుంచి గాజులు చప్పుడు , స్త్రీ నవ్వు వినిపించడంతో కథ ముగుస్తుంది.
విశ్లేషణ :
వ్యభిచారం కులంగా, అది ఒక వృత్తిగా ఉన్న సమాజం. వేశ్యల పట్ల వ్యామోహంతో విద్యావంతులు, ధనికులు ఎక్కువుగా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకునేవారు.అటువంటి వ్యామోహంలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఒక భర్తకు దిద్దుబాటు చేసిన కథే దిద్దుబాటు కథానిక. ఈ కథానికలో ప్రధాన పాత్రలు కమలిని, గోపాలరావు . కమిలిని లాంటివాళ్ళు , గోపాలరావు లాంటి వ్యక్తులు చేసే పనులను అరికట్టి వారిని సక్రమ మారంలో నడిపించే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. తప్పు తెలుసుకున్న ఒపాలరావు శివుడు పార్వతికి సం దేం పంచి ఇచ్చాడు. ఇంగ్లీష్ వాడు భార్యను బెటర్ హాఫ్ అంటాడు. ఆనాటి సమాజంలో వ్యసనాలు, భార్య ఉన్న గౌరవం, గుర్తింపు అనేవి ఈ కథానికలో స్పష్టం అవుతున్నాయి.
2.మీ పేరేమిటి? :
రామగిరి అనే ఊరు విష్ణుక్షేత్రం. ఆ ఊరిలో శైవమతం బాగా బలంగా ఉంది. బౌద్ధ కట్టడాలు చాలా ఉన్నాయి. ఆ ఊరిలో శైవ వైష్ణవులకు ఎప్పుడూ వైరమే. శైవమతమునకు ముఖ్యమైనవాడు శరభయ్య. వైష్ణవుల పక్షమున ముఖ్యమైనవాడు మనవాళ్ళయ్య. వీరి ఇద్దరి స్వార్ధ ప్రయోజనాల కోసం మత కార్యక్రమాలు, మార్పిడులు జరుగుతూ ఉంటాయి. ఈ ఊరి లక్షాధికారి సారధినాయుడు. అతను బావమరిది గ్రామ మునుసుబు రామినాయుడు. ఈ ఇద్దరు ఏ మతం వైపు ఉంటే ఆ మతం వెలిగిపోతుంది. శరభయ్య, మన వాళ్ళయ్య వీళ్ళను తమవైపుకు తిప్పుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. ఆ ఊరిలో రంగాచార్యులు వైష్ణవానికి ధర్మకర్త. ఆయన కొడుకు కృష్ణమాచార్యులు. ఇతను అంత ప్రయోజకుడు కాదు. ఇతని భార్య నాంచారమ్మ. ఈ ఊరిలో దేనికైనా శైవులు ఏకమవుతారు. వైష్ణవులు కారు. ఒక సందర్భంలో వీళ్ళందరిని నిలదీసి వీళ్ళ గుట్టురట్టు చేసి బుద్ది చెబుతుంది నాంచారమ్మ.
ఒకసారి దక్షిణదేశం నుంచి ఒక అయ్యంవార్లుగారు వచ్చి సారధినాయుడికి, మరికొందరి నాయుళ్ళకి వైష్ణవం ఇప్పించి పోయాడు. అప్పట్నుంచి వాళ్ళు శివాలయం వైపుకు చూడలేదు. ఇది శరభయ్యకి నచ్చక ఒక పథకం వేస్తాడు. హైదరాబాదు శివాచార్లు వచ్చి ఆ ఊళ్ళో అర్ధరాత్రి వేళ శివార్చన చేస్తూ అట్టహాసం చేస్తున్నాడు. దానిని చూచి ఊరి నాయళ్ళు మెల్లగా శైవంలోకి చేరతారు . సారధి నాయుడిని మార్చడానికి శైవులంతా ఇంటికి వెళ్ళారు. ఇది తెలిసి సాతానులు రంగాచార్యులకు చెప్పాడు. మనవాళ్ళయ్య రంగాచార్యులుతో లాభం లేదనుకుని రాత్రి రెండు జాములప్పుడు మీటింగ్ పెట్టి సారధి నాయుణ్ణి శివాచార్ల గుండం దగ్గరికి పోకుండా ఆపాలన్నాడు. అందుకు రామానుజయ్య, మనవాళ్ళయ్యను రాగి ధ్వజం చేత పట్టుకొని నాలాయిరం పఠిస్తే గుండం తొక్కమన్నాడు. మనవాళ్ళయ్య అతన్నే తొక్కమన్నాడు. రామినాయుడు, మనవాళ్ళయ్య మహిమను నిలదీసి ఎద్దేవా చేశాడు. మనవాళ్ళయ్య తప్పించుకోడానికి చాలా ప్రయత్నించాడు. రామినాయుడు ఒప్పుకోలేదు.
ఇంతలో ఒక చేతిలో కరదీపం, మరొక చేతిలో సూరకత్తి పట్టుకొని రౌద్రాకారంతో నాంచారమ్మ వచ్చింది. ఆమెను చూచి అందరూ భయపడి దూరంగా పోయారు. ఆమె మనవాళ్ళయ్యను, రామినాయుడిని ఏమి కావాలని అడిగింది. వాళ్ళు తమకు ఏమి వద్దని అన్నారు. వాళ్ళను గుండం తొక్కమంది. ఇద్దరు ఏదో సాకు చెప్పి తప్పించుకున్నారు.
ఆమె వైష్ణవ పూజారుల స్వార్ధమును బయటపెట్టి “ఏ దేవుడి మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గుండమే కాదు అన్నీ కష్టాలు తరించవచ్చును” (గురజాడ సాహితీ సర్వస్వం , కథానికలు , పుట – 422 ) అని ప్రభోదించి, పీరూసాయెబును పిలిచి గుండం తొక్కమన్నది. శివునిశూలం, విష్ణునామం పీరూ అంతా ఒక్కటేనంది. పారిపోయిన మనవాళ్ళయ్య తిరిగొచ్చి, ఆమెకు నమస్కరించి పీరూసాయెబు గుండం తొక్కె కార్యక్రమాన్ని నిర్వహించాడు.
విశ్లేషణ :
అప్పట్లో శైవ వైష్ణవ విభాగాలలోని కొందరి పోటాపోటీలు దగాకోరులు ,ఒకే మతంలోని రెండు ముఠాల మధ్య దగాకోరు తగాదాలు మొదలైనవి అన్నీ కూడా గురజాడ జీవిత కాలము నాటి నగ్న సత్యాలు. ఈ విధంగా ఎన్నో సామాజిక అంశాలు ఈ కథానికలో మనకి కన్పిస్తాయి. శూద్రులు అయినంత మాత్రాన ఉత్సవ విగ్రహం యివ్వకూదదన్న అభిప్రాయం ఈ కథానికలో కన్పిస్తుంది. అప్పటికి కులాల మధ్య అగాధాలు ఎలా ఉన్నాయో ముఖ్యంగా కుల వివక్షత గురించి ఈ కథానిక చెబుతుంది.
3.సంస్కర్త హృదయం:
సీతాపూర్ కాలేజిలో సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటాడు.. ఉన్నత భావోద్రేకి. అన్యాయాన్ని అవినీతిని ఏ రూపంలో ఉన్నా సరే, ఏరిపారేయాలని పట్టుదలగలవాడు. ఆయన వేశ్య వ్యతిరేక ఉద్యమంలో అలజడి సృష్టిస్తున్నాడు. వేశ్యా ప్రియులైన వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. వాళ్ళను దేశద్రోహులుగా చిత్రిస్తూ వ్యాసం ప్రచురించాడు. జిల్లా మునుసుబు కోపానికి గురి అయ్యాడు. రంగనాధ అయ్యరే ఉద్యమంతో మున్సిపల్ కౌన్సిల్లో, దేవస్థానం బోర్డులో చీలికలు వచ్చి రెండు వర్గములుగా కొట్టుకొవడం దాకా వచ్చింది. ఊళ్ళో క్లబ్బు కూడా వేశ్య అనుకూల, వ్యతిరేక వర్గములుగా చీలిపోయింది. తరగతి గదిలో తన విద్యార్ధులకు సైన్స్ పాఠం చెబుతూ ఏదో అవకాశం కల్పించుకొని పడుపువృత్తిని దుయ్యబట్టేవాడు రంగనాధయ్య కెమిస్ట్రీ ప్రొఫెసర్.
అలాంటి రంగనాధయ్య ప్రకృతి సౌందర్యపాపి. గ్రీకులవంటి సౌందర్యరాధకుడు. ప్రతిరోజూ స్వర్ణరేఖా నదీ తీరానికి షికారు పోయేవాడు. స్నేహితులతో కవిత్వం, విజ్ఞానం విషయాలను చర్చించేవాడు. ఆయన భార్య మాత్రం అతని సంస్కరణోద్యమం నచ్చక రోజు గొడవచేసేది.
ఒకరోజు రంగనాధయ్య చీకటి పడేదాకా కొండ మీద ఉండియాడు. అప్పుడు సరళ అనే వేశ్యకూతురు అక్కడి దేవాలయానికి వెళ్ళింది. ఆమెను చూడగనే అయ్యరులో అలజడి మొదలైంది. ‘ఓహో! ఏమా సౌందర్యరాశి’ అని ఆశ్చర్యపోయాడు. ఆమెను గురించి తెలుసుకోవాలని ఆరాటపడ్డాడు. తన హృదయం హెచ్చరించింది. దానిని దబాయించి అదిమి పెట్టాడు. మళ్ళీ సోమవారం సరళ గుడికి వచ్చింది. తన స్నేహితులను అడిగి అయ్యరు ఆమె వివరాలు తెలుసుకున్నాడు.
మరునాడు గుడిలో సరళ ప్రక్కనే నిలుచున్నాడు. ఆమె సాహచర్యం లభించాలని తపించాడు. ఆ తరువాత రోజు ఉదయం తన వేశ్యా సంస్కరణాభిలాషను ప్రస్తావించాడు. ఆయన హెచ్చరించాడు. సరళను సంస్కరించే పథకంలో భాగంగా ఆమెకు పురాణ పాఠాలు చెప్పడానికి విశ్వనాధశాస్త్రిని యాభై రూపాయలు ఇచ్చి నియమించాడు. అతని బోధనలు ఆమె దగ్గర పని చెయ్యలేదు . అయ్యరుకు మనశ్శాంతి లేదు. ఇంతలో క్రిస్మస్ శెలవులు వచ్చినాయి. ఒకరోజు సాయంకాలం ఏదో ప్రయోగం చేసి ఆనందంలో మునిగిపోయి ఉంటే సరళ చెల్లెలు, సరళ ఒక ఉత్తరం తీసుకొని వచ్చి అయ్యరుకు వచ్చింది. అది సరళ, ప్రొఫెసర్ను తన ఇంటికి ఆహ్వానిస్తూ పంపిన లేఖ. ఆ రాత్రి చీకటిలో ఒంటరిగా సరళ ఇంటికి వెళ్ళాడు. ఇంటిదాకాపోయి భయపడి తిరిగి ఇంటిదారి పడుతుంటే తరళ పిలుపు వినిపిస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చాడు. సరళ గదిలోకి వెళ్ళాడు. సరళ, అందాన్ని తాగేస్తున్నట్టుగా చూశాడు. ఆమె కనిపించగానే అంతకుముందు తయారుచేసుకున్న ఉపన్యాసం మరచిపోయాడు. ఆమె పెదవుల్ని ముద్దుపెట్టుకోవాలన్న కోరిక ఒక్కటే మిగిలింది. ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమె లేవనెత్తిన సామాజిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయాడు. సరళ వీణ మీటుతూ జావళి పాడుతున్నది. ప్రొఫెసర్ గబుక్కున పోయి సరళ పెదవుల్ని ముద్దుపెట్టుకున్నాడు. సరళ వీణ జారిపడిపోయింది. అయ్యరు దగాలోపడ్డాడు. మోసం, మోసం అని అరిచాడు. ఆ మాటలు విని సరళ సిగ్గుపడిపోయింది. ఆశ్చర్యపడింది. ప్రొఫెసర్ పరుగెత్తి వెళ్ళిపోయాడు. మరునాడు ఉద్యోగానికి రాజనామా చేశాడు. దాంతో కథ ముగుస్తుంది.
విశ్లేషణ :
వ్యభిచారాన్ని నిర్మూలించాలని ఒక ఉద్యమంగా ఆరోజుల్లో కార్యక్రమాలు జరిగేవి. దానిని పర్చారం చేస్తూ గురజాడ రాసిన కథానిక ఇది.ఈ కథానికలో సంఘటనలు చూస్తే వ్యభిచారం పై అప్పటి సమాజంలో ఉన్న అభిప్రాయంతోపాటుగా వేశ్యల పట్ల సామాన్యుల ప్రవర్తన ఎలా ఉండేదో ఈ కథానికలో తెలియజేసారు రచయిత.
4.మెటిల్డా:
నేను వ్రుక్షశాత్రము ఏం.ఏ పరీక్షకు చదువ్తూ ఉండే రోజుల్లో మైలాపురి పెద్ద రోడ్డున ఒక మిద్దె ఇంట్లో ఉండేవాడిని “ (గురజాడ సాహితీ సర్వస్వం , కథానికలు , పుట – 432 )అంటూ కథ మొదలవుతుంది.
మెటిల్దా యవ్వనవతి, సౌందర్యవతి. ఆమె భర్త, వయసులో ఆమె కన్నా చాలా పెద్దవాడు. ఇతడు కొంచెం తెల్లగా, పొట్టిగా ఉంటాడు.
పెద్దకళ్ళు, కోర మీసాలు, స్పోటకం మచ్చల మొహం ఉంటుంది. వీరు ఇరువురు ఎక్కడ నుంచి వచ్చారో ఎవరికి తెలియదు. వీధివైపు పెరటిలోనికి వొరసుకొని పెద్దగది ఉంది. దానిలో 3 బీరువాలలో పుస్తకాలు ఉన్నాయి. ఎల్లప్పుడు ఏదో ఒకటి చదువుతూనో, రాస్తూనే ఉండేవాడు. అతడు మెటిల్దాను ఎప్పుడూ అవమానించేవాడు. హింసించేవాడు. ఆమెను హింసించడమే కాని, ఆమె ముఖంలోని విషాదరేఖల్ని గురించి పట్టించుకోడు. చుట్టు ప్రక్కల వాళ్ళకు ఇతని పేరు తెలియదు.
అందుకే భార్యను నిరంతరం పీడించే ఇతనికి ఇరుగు పొరుగు వారు ‘ముసలి పులి’ అని పేరు పెట్టారు. ఆయనకు ఒక అక్క ఉంది. ఆమె మెటిల్డాను నిరంతరం జగడాలకు పిలుస్తూ ఉండేది. ఆ ఇంటికి ఇతరులు ఎవ్వరు రారు. మెటిల్దా గుమ్మం దాటకూడదని శాసనం. మెటిల్దా ముఖంలో ఎప్పుడు కూడా విచారం కనపడుతూ ఉండేది.
ఒకరోజు ఒక వృక్షశాస్త్ర విద్యార్థి దారిన పోతూ, గుమ్మం దగ్గర మెటిల్డాను చూస్తాడు. అంతలోకి పులిగుహలోంచి పైకి దుమికినట్లుగా మెటిల్డా భర్త అతనిని ఇంట్లోకి పిలిచి, అబ్బాయి ఇలారా అన్నాడు. ఆ విద్యార్ధిని లైబ్రరీ గదిలోకి తీసుకెళ్ళాడు. నా పెళ్ళాం వైపు చూస్తున్నావా? ఔను, ఎదుట నిలుచుంటే కనపడరా, అంతే పిడుగులాగా ఒసే, ఒసే అని పిలిచాడు. మెటిల్డా రాలేదు. వస్తావా, రావా, లంజా అన్నాడు. ఒణుకుతూ మెల్లగా వచ్చి తలవంచుకుని నిలబడింది మెటిల్డా.
నీవు ‘ఈ ముండను తీసుకుపో’ నీకు దానం చేశాను. తీసుకుపో! నాకు శని విరగడైపోతుంది. అని అంటాడు. మరునాడు పులి ఇంటిముందు ముసలి బ్రాహ్మణుడు, విద్యార్థి చేతులో ఒక చీటి పెట్టి జారిపోయినాడు. ఆ విద్యార్ధి గదిలోకి వెళ్ళి లోపల గడియవేసుకొని చీటి చదువుకొన్నాడు. దానిలో మెటిల్డా ఆ విద్యార్ధిని ప్రాధేయపడుతూ, మీరు నా కాపురం మన్ననివ్వరా? మీకు నేను ఏమి అపకారం చేశాను? మీరు తలవంచుకొని మీ తోవను మీరు పోతేనే, బతుకుతాను లేకపోతే నా ప్రారబ్ధం అని ఉత్తరం రాసి ఉంది. తరువాత కొన్నాళ్ళకు ఆ ముసలిపులి ఆ విద్యార్ధిని పిలిచి, నీవు, నీ స్నేహితుడు మరొక గొప్ప ఉపకారం చేశారు. మీ మాటల వల్ల, చేష్టల వల్ల నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. తనలో చాలా మార్పువచ్చిందని, తనకు చాలా తెలిసి వచ్చిందని తాను మారానని చెబుతాడు.
విశ్లేషణ :
యవ్వనంలో ఉన్న భార్యలతో ముసలి భర్తలు కాపురం వితంతు వివాహాలు ,పెద్ద వయసు తేడాలో జరిగే వైధవ్యాలు వాటి పలితంగా జరిగే వ్యభిచారాలు మొదలగునవి అన్నీ కూడా ఆకాలంలో జరిగిన వాస్తవాలు మనకు కనిపిస్తాయి. ముసలిపులిగా పేరుపడిన వృద్ధ భర్త చేతిలో చిక్కున్న అందమైన పడుచు పెళ్ళాం పడేపాట్లు ఆవడ దైన్య స్థితి , అనుమానంతో ముసలిభర్త పెట్టె హింసలు చేసే అవమానాలు అన్నీ కూడా ఆకాలపు నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కాలంలో వివాహాలు ఎలా జరిగేవి , ముఖ్యంగా వయసు వ్యత్యాసం దాని వలన మహిళలు పడే కష్టాలను ఈ కథానికలో తెలియజేసారు గురజాడ.
5.పెద్ద మసీదు (మతము : విమతము) :
కార్తీక శుక్ల పక్ష దశమి నాటి సాయంత్రము ఇద్దరు బ్రాహ్మణులు, వారిలో ముప్పై ఏండ్లు వయస్సు ఉన్న నారాయణభట్టు, ఇరవై ఎండ్ల వయస్సు ఉన్న పుల్లాభట్టు అనువారు తూర్పు నుండి పడమరకు వస్తున్నారు. నారాయణభట్టు ముఖం అత్యంత సంతోషంతో వికసించి ఉన్నది.
పుల్లా మా ఊరు వచ్చినాం రా. ఇటువంటి ఊరు భూప్రపంచంలో ఉండబోదురా, యేమి నది, ఏమి ఊరు, యేమి పాడిపంటలు మరియు ఇక శ్రీకాకుళేశ్వరుడి క్షేత్రము. ఇది ఎటువంటి మహాక్షేత్రము అని చెప్పను అదుగో? నారాయణభట్టు నిశ్చేష్టుడై నిలచి కొంతసేపు మాట్లాడకుండెను. ఏమి స్వామి!, యేమి స్వామి అని పుల్లంబొట్లు అడుగ, ఏమి చెప్పనురా పుల్లా! కోవెల గోపురం మాయమైపోయిందిరా! అని నేలపై కూలబడెను. చెట్లుచాటున ఉందేమో స్వామి! ఏ చెట్లు కమ్మ కలవురా పుల్లా ఆకాశము అంత ఎత్తు ఉన్నా ఆ గోపురమును, మనస్సు చివుక్కమందిరా పుల్లా, యీ పట్టణమునకు, మనకు ఋణం చెల్లపోయిందిరా, తిరిగి కాశీ పోదాం, అని అన్నాడు నారాయణభట్టు.
గోపురం కోసం వచ్చి నామాస్వామీ, మళ్ళీ వెంటనే కాశీ పోవడానికి యినప కాళ్ళు కావు గదా? లెండి, నా మాట వినండి. గోపురం అయితే మా ఊరుకు రండి. అన్నాడు పుల్లా భట్లు.
ఓరి వెర్రివాడా, మీ ఊరు గోపురం ఎవరికి కావాలిరా! నీకు బోధపడదు. మా గోపురం ఎంతో విశేషమైనది. మీ ఊరి గోపురం కూడా యీ మ్లేచ్చులు పడగొట్టి ఉంటారు, రా!
నారాయణభట్టు లేచి మౌనంవహించి కొంత దూరము నడవగా, అంతట తలఎత్తి చూడ, సంజ చీకటిలో నెలి వెలుగు కమ్మిన పడమటి ఆకాశమును చూడగా రెండు మసీదు స్తంభములు కళ్ళ ఎదుట కనపడినది. శ్రీకాకుళేశ్వరుడి గుడి పగులగొట్టి మసీదు కట్టినారు అని అనుకున్నాడు.
మసీదు వైపు పోదాం పద అని నారాయణభట్టు నడవగా, మసీదు దగ్గర గడ్డము పెంచిన యాభై సం॥ములు వయస్సు ఉన్న వ్యక్తి తురక చిలుము పీల్చుచూ ఉన్నాడు. అతనికి సలామ్ కొట్టి, బాయీ! ఇక్కడ పూర్వం శివాలయం ఉంటూ వచ్చింది అని అడుగగా, ‘హా సైతాన్ కాఘర్’ అని సమాధానమిచ్చెను. నారాయణభట్టు ఈ ఊరిలో చేబ్రోలు వారు ఉండాలి, ఉన్నారా! అని అడగగా, స్వచ్చమైన తెలుగుభాషలో లేదనెను.
అయ్యో, మా పెదమావ రామావధాన్లు, చినమావ లక్షణభట్టు దేశాంతర గతులైనారా? మృతులైనారా? అని “సాయిబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలుదెసల చెదర , “నారాయణ “ అని సఖేదముగా పిలిచెను .
అయ్యో ! నువ్వా మావా !” (గురజాడ సాహితీ సర్వస్వం , కథానికలు – పుట – 454) అని పిలువడంతో కథానిక ముగుస్తుంది.
విశ్లేషణ :
ఈ కథానిక 16 వ శాతాబ్దపు చివరి కాలంకి చెందినది. రెండు మతాల మధ్య సంఘర్షణ దాని వలన జరిగిన దుష్ఫలితాలు చివరికి ఎటువంటి పరిస్థితులకు దారి తీసుంది అనేది ఈ కథానిక సారాంశం. ఈ కథలోని పాత్రల సంభాషణలు గమనిస్తే ఆ రోజుల్లో ఊరు యొక్క ప్రాధాన్యతను కన్నతల్లితో సమానంగా చూసేవారని తెలుస్తుంది.అప్పట్లోనే మతాల మార్పిడి ఉన్నది విషయం కూడా తెలుస్తుంది.
ముగింపు :
గురజాడ అప్పారావు తెలుగు కథానికా సాహిత్యానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఆయన కథలు కేవలం సాహిత్య సృష్టులుగానే కాకుండా, సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు, అసమానతలు, అన్యాయాలపై ప్రశ్నించే సాధనాలుగా నిలిచాయి. వ్యావహారిక భాషను ఉపయోగించి కథానికను ప్రజలకు చేరువ చేసిన ఘనత ఆయనదే. మానవతా దృక్పథం, సామాజిక సంస్కరణ భావాలు, వాస్తవికత గురజాడ కథానికల ప్రధాన లక్షణాలు. అందువల్ల ఆయన రచనలు నేటికీ ప్రాసంగికతను కోల్పోకుండా పాఠకులను ఆలోచింపజేస్తూనే ఉన్నాయి. తెలుగు కథానిక వికాస చరిత్రలో గురజాడ అప్పారావు స్థానం మరువలేనిది.
ఆధారగ్రంధాలు :
ఈశ్వరరావు సెట్టి – గురజాడ కథానికలు
దక్షిణా మూర్తి పోరంకి – కథానిక స్వరూప స్వభావాలు
నాగేశ్వర శాస్త్రి ద్వాదశి – తెలుగు సాహిత్య చరిత్ర
రమణ మూర్తి ఆర్.వి. గురజాడ సాహిత్య సర్వస్వం – తెలుగు అకాడమీ ప్రచురణ
సిమ్మన్న వెలమల – తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు
K. ఝాన్సీ దేవి
తెలుగు అధ్యాపకులు ,
St.Anthony E.M School , Kakinada.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`