sahithivani

లక్ష్మి గొల్లపల్లి నానీలు వస్తు వైవిధ్యం – డా.భాగ్యలక్ష్మి

Volume – 1,                                     May  2026,                                       issue – 2,

సమర్పణ (D.O.S): 07 -04 – 2026                                ఎంపిక (D.O.A): 20 – 04 – 2026                                                                              ప్రచురణ (D.O.P) :  01-05-2026  

వ్యాస సంగ్రహం :

ఆధునిక తెలుగు సాహిత్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా కవితా ప్రక్రియలోను , కవితా వస్తువు స్వీకరణలోను కన్పిస్తాయి. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ,స్త్రీవాద కవిత్వం, దిగంబర కవిత్వం , విప్లవ  కవిత్వం వంటి ఎన్నో రకాలుగా కవిత్వం వచ్చింది . అదే విధంగా కవిత రచనా ప్రక్రియలోనూ ,నిడివిలోను వచ్చిన మార్పులతో క్రొత్తగా వచ్చిన ప్రక్రియలో ఒకటి నానీలు. తక్కువ అక్షరాలతో ఎక్కువ అర్ధాన్ని స్పష్టంగా, సూటిగా చెప్పడమే నానీల ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. అటువంటి ప్రక్రియలో వర్తమాన విషయాలను చెబుతూ రచయిత్రి గొల్లపల్లి లక్ష్మి రాసిన నానీలు నిశ్శబ్ద శబ్దం పుస్తకంగా వచ్చాయి.

కీలకపదాలు :

నానీలు, గొల్లపల్లి, అమ్మ , మానవ సంబంధాలు,  బంధాలు , రాజకీయాలు, దళితులు , ఎన్నికలు, రైతు, వ్యవసాయం,ఎన్.గోపి, జలగీతం, శ్రీ శ్రీ

1.ప్రవేశిక :

ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన ప్రక్రియలలో ఒకటి నానీలు. ఈ ప్రక్రియను రూపిందించింది ఆచార్య ఎన్.గోపి.నానీలు ఒక విలక్షణమైన కవితా ప్రక్రియ. ఎన్.గోపి రాసిన నానీలు వార్త దినపత్రికలో ప్రచురిస్తున్నప్పుడే ఎంతోమందిని ఆకర్షించాయి.  నానీల ఆవిర్భావ కాలం 1997వ సంవత్సరం. ఇవి మొదట వార్త దినపత్రికలో 1997 వ సంవత్సరం అక్టోబర్ 5వ తేదీ నుండి 1998 ఫిబ్రవరి 8వ తేదీ వరకు  ధారావాహికంగా ప్రచురించబడ్డాయి. అలా ప్రచురించినవే 1998 వ సంవత్సరంలో నానీలు అనే పేరుతో సంపుటిగా వచ్చాయి.

రాచ పాళెం  చంద్రశేఖరరెడ్డి  గారు నానీలను నిర్వచిస్తూ “ నావీ , నీవీ అంటే ఆత్మాశ్రయ . భావాశ్రయ వస్తువులతో కూడినవి . ఏ చిన్న భావానికైనా అత్యల్ప కాలంలో ఒక స్వతంత్ర కవితా  రూపమివ్వడానికి అనువైన ప్రక్రియ నానీలు “ (భవాని : 2004 : పు – VI )

నాన్ర్ర్లో నాలూ పాదాలుంటాయి. అంటే ఒక్కో పాదానికి యిన్ని అక్షరాలు ఉండాలని కానీ ఇన్ని పదాలు ఉండాలి అని కానీ నియమం లేదు. పాదంలో అవసరాన్ని బట్టి ఎన్ని అక్షరాలైనా  ఉండవచ్చు. ఎన్ని పదాలైన  ఉండవచ్చు. కాకపోతే నాలుగు పాదాలూ ముగిసే సరికి మాత్రం 20 నుంచి 25 అక్షరాలూ మాత్రమే ఉండాలి.

2.విషయ వివరణ:

గొల్లపల్లి లక్ష్మీ నానీలలోని వస్తువుని సామాజిక పరంగా ఈ క్రింది విషంగా విశ్లేషించవచ్చు.  స్త్ర్రీ, రాజకీయాలు,  దళిత సమస్య,  వ్యవసాయం , అభ్యుదయం , పేద వర్గం వంటి ఎన్నో కోణాల్లోంచి ఆలోచించి రచయిత్రి నానీలను రచించారు. నానీలు స్వల్ప పదాలు అనల్ప అర్ధం కావడం వలన ప్రతి సమస్యను అన్నినానీల తో తేటతెల్లం చేసారు రచయిత్రి. నిశ్శబ్ద శబ్దం పుస్తకంలో రచయిత్రి నానీలను ప్రచురించారు.

2.1.రైతు – వ్యవసాయం :

మన దేశానికి వెన్నుముక్క రైతు.అటువంటి రైతు నేడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు. నేటి కాలంలో రోజురోజుకి వ్యవసాయంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి అనేది అందరికి తెలిసిన విషయమే. ఆదునిక సాహిత్యంలో కవిత్వం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది అనేది ఎవరూ కాదనలేని సత్యం. మన దేశానికి రైతే వెన్నుముక. అలాగే వ్యవసాయం  ప్రధాన భూమిక పోషిస్తుంది. అటువంటి వ్యవసాయం యొక్క స్థితిని, రైతు పరిస్థితిని నానీలలో పేర్కొన్నారు రచయిత్రి.

అన్నదాత

రైతే రాజు

రైతుకు మాత్రం తప్పవు

ఆకలి , అప్పులు “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 40)  అనే నానీలో రైతు అందరికీ అన్నం పెట్టె అన్నదాత. అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అంటారు పెద్దలు. కానీ ఆ పంటను పండించే రైతుకి మాత్రం ఆకలి , అప్పులు .రైతు కష్టాన్ని, జీవితాన్ని  ఈ నానీలో వివరించారు.

చేలో చీడ చావదు

తింటే రైతు చావడు

అంతా

కల్తీ (మందు)మయం “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 40)  మరొక నానీలో ఏంటో కష్టాన్ని సైతం లెక్కచేయకుండా పొలాన్ని నమ్ముకుని బ్రతికే రైతు పంటలను పండించాడానికి వాడే ఎరువులుణు కల్తీ చేయడం వలన రైతు ఎంతగానో నష్టపోతున్నాడు.

తినేవాడి పేరు

బియ్యం గింజ పై

పండించేవాడి పేరు

రుణ పత్రం పై “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 41) ప్రస్తుత కాలంలో పంటను పండించడానికి రైతు పడే కష్టం వర్ణించలేము . ఎన్ని ప్రయాసలు పడి పంటను పండిస్తాడు రైతు కానీ తన పేరు మాత్రం ఆ పంట పండించడానికి తీసుకునే ఋణం పైనే రైతు పేరు ఉంటుంది. అది తీర్చలేక వ్యవసాయం చేయలేక , మరొక పనికి వెళ్తున్న రైతులు నేడు ఎందరో ఉన్నారు.

భూమి పుత్రులకి

భుక్తి కరువు

పరాన్న భుక్కులకి

బొజ్జ బరువు “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 55)  రైతు జీవితాన్ని , దైనందిన పరిస్థితులను వివరించారు.

2.2.రాజకీయం :

నేటి కాలంలో రాజకీయలు ప్రధానంగా తీసుకుని సాహిత్యం సృష్టించడం జరుగుతుంది.రాజకీయాలు నేటి జీవితంలో భాగం కాబట్టి రచయిత్రి  రచనలో ఉండడం రచయిత్రికి  సమకాలీన  దృక్పధాన్ని తెలియజేస్తుంది.

అప్పటి వరకు ఊరిలో కనిపించని రాజకీయ నాయకులు ఇంటి ఇంటికి గడప గడప తిరగడం మొదలు పెడతారు. అలాగే దళితుల్ని ఎలా ఉఅపయోగించుకుంటారో ఈ నానీలో తెలియజేసారు లక్ష్మి.

“ఊళ్ళో పెళ్ళికి

కుక్కలు బిజీ

ఎన్నికలోస్తే

దళితులూ బిజీ “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట – 38 ) అంటూ వాళ్లకి సంబంధం లేకపోయినా , కనీసం వారికి ఏ విధంగాను ఉపయోగం లేని రాజకీయ నాయకుల కోసం దళితులను ఉపయోగించుకోవడం,  దళితులు కూడా ఏ విధంగా ప్రవర్తిస్తారో ఈ నానీలో వివరించారు.

మరొక నానీలో ఓటు విలువను ఇలా తెలియజేసారు రచయిత్రి……

“ఓటే కదాని

వేసేయకు

బాలట్ లోనే

భవిష్యత్ వెతుక్కో “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట – 38)  ఓటు ని ఎవరు నిర్లక్ష్యం చేయకూడదని, ఆ ఒక్క ఓటే నీ భవిష్యత్ ణు నిర్ణయిస్తుంది . కాబట్టి ఒకటికి పడి సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఈ నానీలో వివరించారు రచయిత్రి.

మరొక నానీలో అయితే రాజకీయ పార్టీల స్వభావాన్ని వివరించారు.

   “ఏ పార్టీ  చూసినా

ఏమున్నది ఘనత

పదవుల కోసం

పాకులాట మినహా “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట – 6 4) అంటూ  ఈ స్వతంత్ర భారతావనిలో ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకు వస్తున్నాయి. అన్నీ కూడా వాటి స్వలాభం కోసమే పనిచేస్తున్నాయి. ఒక్క పార్టీ కూడా ప్రజల కోసం పని చేసిన దాఖలాలు లేవు అని రచయిత్రి ప్రశ్నిస్తున్న్నారు. ఈ నానీ చదువుతుంటే మనకి శ్రీ శ్రీ రాసిన దేశ చరిత్రలు కవితా ఖండిక గుర్తుకు వస్తుంది.

“ఏ దేశ చరిత్ర చూచినా

ఏమున్నది గర్వకారణం

నరజాతి చరిత్ర సమస్తం

పర పీడన పరాయణత్వం” (శ్రీనివాసరావు శ్రీరంగం   – మహాప్రస్థానం – పుట -73 )  

 ఎన్నికల్లో

ఇద్దరూ ముష్టి వాళ్ళే

ఒకడు ఓట్ల కోసం

ఒకడు నోట్ల  కోసం “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట -58)  నేటి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఈ నానీలో చెప్పారు. రాజకీయ నాయకుడు ఓట్ల కోసం పడే ఆరాటం , వాళ్ళు ఇచ్చే డబ్బులు కోసం ప్రజలు ఇద్దరు ఒక ముష్టి వాళ్ళే అని చెప్పడంలో రచయిత్రి  రాజకీయాలు  ప్రస్తుత స్థితిని ధైర్యంగా తెలియజేసారు.

“ O “2  (ఆక్సిజన్ )

ప్రాణ వాయువైతే

ఓటు

దేశ భవితకు ఆయువు “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం, పుట – 57)   మనిషికి ప్రాణ వాయువు ఎలా అవసరమో అదే విధంగా ఓటు అనేది మన దేశ భవిష్యత్ కి అవసరం అంటూ ఆక్సిజన్ తో ఓటు ని పోల్చి చెప్పారు రచయిత్రి.

2.3.బంధాలు – అనుబంధాలు :

నేటి కాలంలో మనుషులు మధ్య పలకరింపులు, సంబంధాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఉండేది ఒకటే ఇంట్లో అయినా కనీసం వారానికి ఊకరోజు కూడా సరదాఆ ఒకే కత కుర్చుని సమయం గడుపుతున్న వాళ్ళు చాలా అరుదనే చెప్పాలి. ముఖ్యంగా ఇంటర్ నెట్ లో ఉండే సమయం ఎక్కువ. ఇంట్లో ఉండే సమయం తక్కువ అయిపొయింది. బంధాలు గురించి మనుషుల మధ్య ఉండే అనుబంధాల గురించి రచయిత్రి చెప్పిన నానీలు అందరిని ఆలోచించేలా చేస్తాయి.

మానవీయ కోణంలో రచయిత్రి రాసిన నానీలు నేటి సమాజంలోని సంఘటనలకు సాక్ష్యాలు.ఆస్తిపై తప్ప  రక్త మాంసాలు పంచి ఇచ్చిన వారికి ఆప్యాయత అనురాగాలు పంచివ్వాలనే ధ్యాసే లేని మధ్యతరగతి మనుషుళ మనస్తత్వాలకు  వీరు రాసిన నానీలు   నిదర్శనం.

మాంసాన్ని పంచింది

మమతనీ పంచింది

అమ్మ

బ్రహ్మ కన్నా మిన్న “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 3 9)  ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు.  మనిషిని సృష్టించే బ్రహ్మ కన్నా తన రక్త మాంసాన్ని పంచిన తల్లి గొప్పది అనడంలో  అమ్మ గొప్పతనం వివరించారు రచయిత్రి.

“అమ్మను

నిర్లక్ష్యం చేయకు

నీ జన్మకు అమ్మే

జవాబుదారి “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 39)  ప్రస్తుత కాలంలో తల్లిదండ్రుల మీద మమకారం లేకుండా జరుగుతున్న సంఘటనలు ఎన్నో వార్తల్లో వస్తున్నాయి. మన జన్మకు కారణం అయిన తల్లిని ఎట్టి పరిస్థితుల్లోను నిర్లక్ష్యం  చేయకూడదని రచయిత్రి అభిప్రాయం.

అజమాయిషి తో

అత్త అవుతుంది

ఆదరిస్తే ఆమె

అమ్మ అవుతుంది “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 40 ) మహిళల పై జరుగుతున్న గృహ హింసకు ప్రధాన కారణం అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోవడమే. ప్రతి ఇంట్లో అత్త తన కోడలి కూతురిలా , కోడలు అత్తను అమ్మలా చూస్తే ఎటువంటి గొడవలు ఉండవు. పెత్తనం చేయాలని అత్తళా ఉండకుండా ప్రేమ ఆప్యాయతలతో అమ్మలా మారవచ్చని  అప్పుడు బంధాలు మరింత పటిష్టంగా ఉంటాయని రచయిత్రి వివరించారు.

రక్త బంధం కూడా

రాజకీయమైతే

రాగ బంధాలు

రచ్చ బండ పాలే “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 51)  ప్రస్తుత కాలంలో బంధాలు , అనుబంధాలపై నమ్మకం సన్నగిల్లుతుంది.ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ బలంగా లేకపోవడమొక ప్రధాన కారణం కావచ్చు. రాజకీయాలు వాలే రక్త సంబంధాలు కూడా మారిపోతున్నాయని రచయిత్రి ఈ నానీలో వివరించారు.

2.4.సమాజం – మానవ సంబంధాలు :

మానవ సంబంధాలు అంటే  మనిషికీ మనిషికీ మధ్య ఉండే సంబంధం. ఈ సంబంధాలు అనేవి మనిషి జన్మించిన కుటుంబంతోనూ , సంఘంతోను ముడిపడి ఉంటాయి. నేటి కాలంలో మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక విలువలు, హోదా, పరపతి వంటి వాటితోనే నిర్ణయించబడుతున్నాయి.

“కరెన్సీ కాలానికి

స్పష్టమే

లబ్ డబ్ ల  మధ్య

డబ్బు శబ్దమే “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట 46) డబ్బు నేడు ప్రపంచాన్నే కాదు మానవ సంబంధాలను కూడా శాసిస్తుంది. ఆ విషయాన్నే రచయిత్రి ఈ నానీలో తెలియజేసారు.

“మనిషిని

నిద్రపుచ్చేది

మత్తుమందు కాదు

మత తత్వం “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట -38) మతం అనేది నేడు మత్తు మందులా మారుతుంది. మతం పేరుతో చేస్తున్న వికృత చేష్టలు ఎందరికో ఇబ్బందులను కలుగుతున్నాయి.

పస్తులుండే వాడిని

పట్టించుకోరు

ప్రభువుకు మాత్రం

పదియవ వంతు “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –42) అంటూ మతం మత్తులో చేస్తున్న దోపిడీలను , మత సంస్కరణలకు  మార్గాలను రచయిత్రి వివరించారు.

“పెదవి పలకరింత

నుదిటి వెక్కిరింత

ఇది

సర్వమానవ క్రీడా “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం,  పుట –43) సమాజంలో మనుషులు ప్రవర్తన, ద్వేషాలు గురించి వివరించారు.

సూర్యుని చుట్టూ భూమి

డబ్బు చుట్టూ మనిషి

యిదే మరి

గ్రహ (ఆ)రచారం  “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం,  పుట –52) నేటి సమాజంలో మనుషులు కూడా డబ్బు ఉన్న వాళ్ళతోనే సంబంధాలు కొనసాగిస్తారు. డబ్బు లేని వాళ్ళ వైపు కనీసం చూడరు.

2.5.ఆధునికత – ఫ్యాషన్ :

ఆధునికత పేరుతో ఫ్యాషన్ ముసుగులో నేటి యువత చేస్తున్న పనులు , పద్దతులు ఎన్నో పర్యవసానాలకు దారి తీస్తున్నాయి. మారుతున్నా పరిస్థితుల్లో యివత మానసికత పై కూడా ప్రభావం చూపిస్తున్నాయి. తరం మారుతున్న కొద్దీ ఈ అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి. వాటిని వివరమా చెబుతూ రచయిత్రి ఈ నానీలను రాసారు.

పొందికగా

ఉండడమే అందం

అర్ధ నగ్నం

అనర్ధం అసహ్యం “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –42)  నిండుగా, పొందికగా ఉండటం ఎదుటి వారికి మన పై ఒక అభిప్రాయం కలిగేలా చేస్తుంది. కానీ నేడు అర్ధ నగ్నంగా దుస్తులు ధరించి విపరీత పోకడలు పోవడంతో ఎన్నో ఆఘాయిత్యాలు జరుగుతున్నాయి.

అండర్ వేర్ కి

షేవింగ్ బ్లేడుకి

అమ్మాయే కావాలా

మోడల్ “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –43) ఆధునికత పేరుతో స్త్రీల అంగాంగ ప్రదర్శన ఎక్కువుగా జరుగుతుంది. ముఖ్యంగా పురుషులను హుందాతనంగా చూపిస్తూ మహిళలను తక్కువ చేసి చెప్పడం , చూపించడం ప్రస్తుత సర్వసాధారణం అయిపొయింది.  మగ వారు వేసుకునే అండర్ వేర్ , షేవింగ్ బ్లేడ్ లకు అమ్మాయిలతో  ప్రచారం చేయించడం దీనికి నిదర్శనం ఆ చెప్పవచ్చు.

ఆదిమానవుల కోసం

అడవికి పోకు

ఉన్నాయి టి.వి.లో

ఫాషన్ షోలు “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –43)  నేటి సమాజంలో  ఆధునికత పేరుతో మనుషులు తమ వేషం , భాషా  మార్చుకుంటున్నారో నిలదీస్తూ పూర్వ కాలంలో ఆదిమానవుల ఎలా ఉండేవారో తెలుసుకోవడానికి అడవికి వెళ్ళకుండానే టి.వి లో నేటి యువత చేస్తున్న ప్యాషన్ షో చూస్తే సరిపోతుంది అని ఈ నానీ భావం.

2.6.దళిత సమస్యలు :

కులవ్యవస్థ అనేది భారతదేశంలో పురాణ కాలం నుంచి అమలులో ఉంటున్నదే. వర్గం అనే భావన మొత్తం ప్రపంచ విజ్ఞానం నుంచి భారతేదేశానికి వచ్చింది. కులం అంటే సామాజిక అసమానతల ఆధారంగా గుర్తించబడిందని , వర్గం అంటే ఆర్ధిక సమానతల ఆధారంగా గుర్తించబడిందని స్థూలంగా చెప్పవచ్చు.

దళితుడు

నీ కాలికింద చెప్పుకాదు

వాడిక

నీ చెప్పులో తేలు “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట – 44)  మన దేశంలో ఇప్పటికి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన వివక్ష కుల వ్యవస్థ ఒకటి.దళితుడి పై నేటికి జరుగుతున్నా అరాచకాలు, ఆఘాత్యాలే ఇందుకు నిదర్శనం.దళితులు ఇప్పటికైనా మారాలని కాలి కింద సెప్పులా కాకుండా చెప్పులో తేలులా ఉండాలి ఆశిస్తున్నారు రచయిత్రి.

గోదారి గుండెలో

గుడిసెలు

కులాల కుంపట్లో

దళితులు ఒక్కటే “(లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –45) నేటికి దళితుల పై జరుగుతున్న దౌర్జన్యాలణు చూస్తే గోదావరి నది మధ్య గుడిసెలు వేసుకుని ఉంటున్న వారి జీవనానికి , కులాలు అంటూ దళితులణు చూస్తున్న వివక్షత ఒక్కటిగానే కన్పిస్తున్నాయి అనడంలో రచయిత్రి ఆలోచనా దృక్పధం తెలుస్తుంది.

మనిషే కాదు

మల్లెల్నీ వెలేసారు

పూజకు

పనికి రావని “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –45)  కుల వ్యవస్థను  అడ్డుపెట్టుకుని చాలా విషయాలలో వెలి వేయడం జరుగుతుంది. ముఖ్యంగా దళితులకి ఆలయ ప్రవేశం నిషిద్ధం వంటి కనిపిస్తాయి.అలాగే పువ్వులలో కొన్ని రకాల పువ్వులను పూజకు వినియోగించరు . అదే విషయాన్ని రచయిత్రి స్పష్టంగా సూటిగా నానీలో పేర్కొన్నారు.

“దళిత జాతి

విముక్తికి

ఉద్యమాలు కావాలి

ఉత్తుత్తి కబుర్లు కాదు “ (లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం ,  పుట –49 ) ఇప్పటికి దళితుల పై ఎన్నెన్నో అకృత్యాలు , అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. దళిత జాతి విముక్తి కోసం కావాల్సింది కేవలం మాటలు కాదు ఉద్యమాలు చేపట్టాలి అనిదిశా నిర్దేశం నానీలో కన్పిస్తుంది.

3.ముగింపు :

దళిత సాహిత్యంలో ఎందరో కవులు, కవియిత్రులు ఉన్నారు. కానీ నానీలు, పాటలు, కవితలు రాసిన వారు  చాలా తక్కువ అనే చెప్పాలి.విషయ నైపుణ్యంతో పాటు శిల్ప సౌందర్యంతో రచనలు చేసిన రచయిత్రి గొల్లపల్లి లక్ష్మి అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. నేటి కాలంలో ప్రతిరోజూ మన కోస్తున , వింటున్న సంఘటనలు, సమస్యలును  వస్తువుగా తీసుకుని ఈ నానీలు రచించారు గొల్లపల్లి లక్ష్మి.

ఆధార గ్రంధాలు :

గోపి .ఎన్ – జలగీతం

గోపి .ఎన్ – నానీలు

నాగేశ్వర శాస్త్రి ద్వాదశ – తెలుగు సాహిత్య చరిత్ర

లక్ష్మి గొల్లపల్లి – నిశ్శబ్ద శబ్దం

శ్రీనివాసరావు శ్రీరంగం – మహాప్రస్థానం

 

-డా.మల్లె భాగ్యలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top