sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

హెచ్.ఆర్.చంద్రం రాజకీయ మిత్ర శతకం – డా.కొలిపాక అరుణ

Volume – 1,                                     May  2026,                                             issue – 2,

సమర్పణ (D.O.S): 07 -04 – 2026                 ఎంపిక (D.O.A): 15 – 04 – 2026                       ప్రచురణ (D.O.P) :  01-05-2026  

వ్యాస సంగ్రహం :-
తెలుగు సాహిత్యంలో ప్రత్యేకమైన ప్రక్రియ శతకం. శతక రచనలో వస్తువులో ఎంత వైవిధ్యం ఉంది. అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ కవితకు కాదేదికనర్హం అని శ్రీ శ్రీ అన్నట్టుగా శతక రచనకు వస్తువు కూడా సంప్రదాయం నుంచి ఆధునికం వరకు ఏదైనా వస్తువుగా తీసుకుని శతక లక్షణాలను పాటిస్తూ శతకం రచన సాగింది. తెలుగు శతకాలలో విభిన్నమైనది మకుటం అనడంలో ఎంటువంటి సందేహం లేదు. అటువంటి శతకం సాహిత్యంలో హెచ్ .ఆర్. చంద్రం రాసిన శతకం రాజకీయ మిత్ర శతకం. వర్తమాన సమాజంలో రాజకీయాలు, వాటి పై ప్రజలకు ఉన్న అభిప్రాయం , దైనందిన జీవితమలో రాజకీయాలు సామాన్య ప్రజలను ఎలా శాసిస్తున్నాయో వంటి ఎన్నో విషయాలతో ఈ శతకంలో రచయిత విశ్లేషించారు. వాటిని వివరించడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం.

కీలక పదాలు:

చంద్రం, మిత్ర శతకం, రాజకీయాలు, అతివాదులు, జాతిపిత, ఆధునికం, శ్రీ శ్రీ, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ,రచయిత,ఆదికవి , నన్నయ్య ,తెలుగు సాహిత్యం, శతకం , మకుటం, ఛందస్సు, 
ప్రవేశిక :
రచయిత హెచ్.ఆర్. చంద్రం రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి, అవకాశవాదం, నేతల ప్రవర్తనను గమనించి “రాజకీయ మిత్ర శతకం”ను రచించారు. ఇందులో “మిత్రా!” అనే మకుటంతో పద్యాలు రాసి, రాజకీయ వ్యవస్థలోని లోపాలను వెల్లడించారు.
“అవకాశవాదులైన నేతల వ్యవహారాలు చూస్తూ పట్టనట్లు రచయితలు ఎలా ఊరుకోగలరు? “అందుకే అది అవసరంగా భావించి శతకం రాసాను” అంటూ ఈ ‘రాజకీయ మిత్ర శతకం’ రాయడానికి గల కారణాలు చెబుతూ శతకం ప్రారంభించారు రచయిత చంద్రం.”
ఈ రాజకీయ మిత్ర శతకం నిదానంగా చూస్తే కొన్ని నిజాలు జ్ఞాలు తెలుస్తాయి. సాధారణ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ శతకం రాసారు. కేవలం రాజకీయ సంగతులు మాత్రమే ఈ శతకంలో చెప్పారు. “మిత్రా!” అనే మకుటంతో ఈ శతకం రాసారు. పద్యాలు అకారాది క్రమంలో కూర్చబడడం ఈ శతకంలోని ప్రత్యేకత.
అతివాదులు; శ్రుతిమించిన
ప్రతిపక్షులు పక్కలోని బల్లెము లగుచో
ధృతి సెడిన మంత్రిగారికి
గతి తోచని స్థితి, దినదిన గండము మిత్రా (రాజకీయ మిత్ర శతకం – 3వ పద్యం)

విషయ వివరణ :
అతుకుల బొంత ప్రభుత్వం ఎప్పటికీ బితుకు బితుకుమంటూనే ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు దాటింది. ఇప్పటికీ పాత రాజకీయాలే మేలు అనే పరిస్థితి ఉంది. అనుభవం నేటి రాజకీయాలకు పనికిరాదు. డబ్బు, కులం, ప్రాంతం, మతం ఇవి మాత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నాయి.
స్వాతంత్ర్యం వచ్చి వత్రోత్సవాలు జరుపుకోవడానికి దగ్గరలో ఉన్నాం కానీ అవినీతి, పేదరికం ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు, వారి కుటుంబాల వారు చేసే తప్పులు అవినీతి కప్పబడతాయి, పైకిరావు. అదే సామాన్య మానవుడు చిన్న తప్పు చేసినప్పటికీ దానికి పెద్ద పెద్ద శిక్షలు, చట్టాలు ఇవన్నీ చూపెడతారు. మరి ఇవన్నీ బడాబాబుల విషయంలో ఎందుకు’ అమలు కావు అని రచయిత ప్రశ్నిస్తున్నారు.
అర్చకుని చిన్న తప్పుకు
దుర్భరమగు శిక్ష పదును; దుర్ణయ వృత్తిన్
దుర్భరపు పనులు చేతురు
నిర్భయముగ కొంతమంది నేతలు మిత్రా! (రాజకీయ మిత్ర శతకం -12వ పద్యం)
“నువ్వు అవినీతి పరుడవంటే కాదు, నువ్వే అవినీతి పరుడవని” అనేక మార్లు ఉభయపక్షాలు దుయ్యబట్టుకోవడం పరిపాటి, పార్టీల అవినీతులు లెక్కతేల్చి చెప్పడం ఎవరితరం కాదు సుమా! ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు తిట్టుకోవడం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నిరసన ప్రదర్శనల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం వంటి బహిరంగ చర్చలన్నీ ప్రజలకు పెద్ద ప్రహసనాలుగా కనిపిస్తున్నాయి.
ఈనాటి రాజకీయము
నానాటికి తీసికట్టు, నవ్వులపాలౌ
దీనావస్థకు చేరెను!
దీనిని సరిదిద్దు నెట్టి ధీరుడు మిత్రా? (రాజకీయ మిత్ర శతకం -17వ పద్యం)
అని రచయిత ప్రశ్నిస్తున్నారు. ఎందుకూ కొరవారు అనుకొన్నవారు కూడా తమ పంథాను హుందాగా మార్చుకొని రాజకీయాలలోకి వచ్చి రాణిస్తున్నారు. ఎగువ, దిగువ సభలు అనే బేధంలేదు. దొందుకు దొందే. పార్టీ సభ్యులు శత్రువుల్లా ఉంటారు. సిగపట్లకు కూడా వెనుకాడరేమో అన్నట్లు వారి వ్యవహారం ఉంటుంది.
‘ ఎన్నికలలో ఎంతటి ఖర్చుకైనా వెనుకాడనివారే విజేతలవుతారు. అలా ఖర్చుపెట్టలేని వారికి గెలుపు అసాధ్యమే. అందుకే సామాన్యులలో ఎంతమంది సమర్థులు ఉన్నప్పటికీ సంపన్నులు మాత్రమే నేతలౌతున్నారు. నాయకులు తమ పాలనలో కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అనేక వునాది రాళ్ళను కూడా పాతి. శంకుస్థావనలు కూడా చేస్తారు. ఇలా వేలం వెట్టిగా పాతిన రాళ్ళకు ముందు మోక్షం కలిగితే బాగుంటుంది. అంటే ఆ పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజలు లబ్ది పొందుతారు కదా!.
సినీ నటులు రాజకీయాలలోకి రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ వారిలో ఎందరు విజేతలుగా నిలుస్తున్నారు.
ఒక నటుడు రాజకీయము
నకు మారి ‘విజేత’ యగుట నటు లెందరికో
సెక పుట్టించుట సహజము:
నికరముగా నెంద రుండ నేర్తురు మిత్రా? (రాజకీయ మిత్ర శతకం -26న పద్యం)
సామాన్యులు తప్పు చేస్తే నిలదీసే నాయకులు సంపన్నులు తప్పు చేస్తే నిబడియలేరు. ఎందుకంటే “కలవరమే! కలిమి బలిమి గాంచితె మిత్రా?” అని చంద్రం అంటారు. రాజకీయాలలోకి రావాలన్నా గెలవాలన్నా
కులం, అంగబలం, అర్థబలం ఉంటే చాలు. వారికి పార్టీ పిలిచి పీట వేస్తుంది. ప్రజాస్వామ్యం గతి తప్పి అతలాకుతలం అవుతుంది. అదే అదను అనుకొని ప్రతిపక్షం స్వార్ధంతో వ్యతిరేక శక్తులను చేరి అరాచకాలను
సృష్టిస్తుంది. ఇది భావ్యమా? కాదు కదా!.
గుణమేల కులము గలిగిన?
గుణ మెవ్వదు చూచు నేదు? కులము రిజర్వే
షను సౌకర్యము గూర్చును!
గుణమొక్కటె యున్న నది కుదురదు మిత్రా!- (రాజకీయ మిత్ర శతకం – 36వ పద్యం)
రిజర్వేషన్ సౌకర్యమొచ్చాక గుణం కన్నా కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ రిజర్వేన్. ప్రాతిపదికన ఒక వ్యక్తిని ఎంచుకొని వారిని పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఓట్లు దండుకుంటున్నారు. పోని ఆ పార్టీనే నమ్ముకొని కార్యకర్తగా కష్టపడి పార్టీకి వెన్నంటి ఉన్నవారికే పార్టీ టికెట్టు ఇస్తారా? అంటే అదీ అనుమానమే. ఎందుకంటే ఆ సమయానికి పార్టీ అభ్యర్థిగా తనఘ’ నిలబెట్టమని ఎవరైనా భారీ మొత్తం అప్పజెప్పితే వారికే సీటు ఇస్తారు. ఒక మాట మీద నిలబడే తత్వం లేనివారే రాజకీయాలలో రాణిస్తారు. కొంతమంది కార్యకర్తలు గోడమీద పిల్లి వాట్టంగా ఉండి అనుకూల పార్టీలోకి మారిపోతూ ఉంటారు.
జాతిపిత నూరిపోసెను
స్వాతంత్ర్యోద్యమము నందు పరహిత బుద్ధిను
నేత లది మరచి రెపుడో!
ఖ్యాతి వహించినది నేడు స్వార్ధము మిత్రా! (రాజకీయ మిత్ర శతకం – 47వ పద్యం)
రాజకీయనాయకులలో అధికులు వారి ఆస్థిపాస్తులు పెంచుకోవడానికే తహతహలాడుతూ ఉంటారు. ధనకాంక్షతో ఊగిసలాడే ఇటువంటి వారికి లక్ష్యశుద్ధి, ప్రజాక్షేమం ఏ మాత్రమైనా పడుతుందా? అంటే అనుమానమే. త్వరితగతిని మురికివాడలు అభివృద్ధి చేస్తాం, మీ వాడలో అది చేస్తాం. ఇది చేస్తాం. ఏవేవో అభివృద్ధి పనులు చేస్తామంటూ అనేక వాగ్దానాలు చేస్తారు. కానీ అవి అమలు అయ్యే సరికి అడ్డంకులెన్నో. ఎన్నెన్నో.
పదవిలో ఉన్నప్పుడు మంత్రిగారిచేత కొత్తకొత్త వ్యాపారాలకు ప్రారంభోత్సవాలు చేయిస్తూ ఉంటారు. నేను కాబట్టి రోజుకొక రిబ్బన్ కట్టింగ్ చేస్తున్నాను, నాకు మరింకెవ్వరూ సాటిలేరు అని విర్రవీగేవాడు అల్పుడు సుమా అంటారు రచయిత. ఇపత్రికి
మన రాజకీయవేత్తలు
ఘనకార్యము లెల్ల చేయగల సత్తా క
‘ల్గిన వార మని వర్ణింతురు,
జను లది నమ్మెదరు సారెసారెకు మిత్రా! (రాజకీయ మిత్ర శతకం -113వ పద్యం)
వయస్సు పైబడి సరిగా నిలబడలేరు. గట్టిగా నాలుగు అడుగులు నడవలేనివారు కూడా రాజకీయాలలో కొనసాగుతూ ఉంటారు. “విడువరహో రాజకీయ పీఠము మిత్రా!” అని “నడువడు నాల్గదుగులు” పద్యంలో చెప్పారు. నిజమైన దేశ భక్తులు, సేవా తత్పరులు ఈ రాజకీయాలలోకి వెళ్ళలేరు. పోనీ వెళ్ళినా సాదరంగా ఆహ్వానించి పార్టీలో చేర్చుకొనేవారూ ఉండరు. ఆ నోటితోనే పోకిరీ మూకను, దేశద్రోహులను, గూండాలను ఆహ్వానించే పార్టీ “రాజకీయ రాక్షసి” అంటారు చంద్రం.
నీతులకు చెల్లె రోజులు,
గోతుల పడదోయగల్గు కొత్త కిటుకులన్
ప్రీతిగ చూతురు, కుహనా
నేతలు ముఖ్యముగ వాని నేర్తురు మిత్రా! (రాజకీయ మిత్ర శతకం – 69వ పద్యం)
పదవిలో ఉన్నప్పుడే గౌరవంగానీ, డబ్బుగానీ ఆర్జించడానికి వీలౌతుంది. కాబట్టే నేతలు ఆ పదవిని నిలుపుకోవడానికి ఆత్రుత పడుతూ ఉంటారు. పదవిలో ఉన్నప్పుడు నేతలు నోటికి ఏదివస్తే అది మాట్లాడకూడదు. పదిమందీ మెచ్చేవిధంగానే మాట్లాడాలి. ఏ మాత్రం నోరు జారినా పదిమందీ నిలదీసి అడుగుతారు అన్న భయం ఉండాలి. పదవిని ప్రాణప్రదంగా కాపాడుకోవడమే పరమార్ధంగా బ్రతికే నేతకు పదే పదే పదవిని కట్టబెట్టడం వలన ఏం ప్రయోజనం ఉంటుందా? ఉండదు కదా!.
పదవీ వ్యామోహమ్మున
పదుగురు తన చర్య గాంచి పడిపడి నవ్వన్
వదలదు కుర్చీ వదల మ
రెదియైనను పదవి కొరకు హీనుడు మిత్రా! (రాజకీయ మిత్ర శతకం – 82వ పద్యం)
మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చంకలు గుద్దుకొని గంతులు వేయవలసిన పని లేదు. అణుమాత్రమైనా ఓటు విలువ తెలియకుండా నోటుకు ఓటు అమ్ముకునే మన దేశం నిజమైన ప్రజాస్వామ్యం
ఎలా అవుతుంది. మన రాజకీయ నేతలు మేము ఎన్నికలలో గెలిస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం ఎన్నో మేలైన పథకాలు ప్రవేశపెడతాం అంటూ ప్రజలను మభ్య పెడుతూ ఉంటారు. ప్రతీసారీ ప్రజలు నమ్ముతూనే ఉంటారు. నాయకుల వెంట ఉండే కార్యకర్తలు తమ నాయకులను సంతోష పెట్టడం కోసం ఇతర నాయకులను అసభ్య పదజాలంతో దూషించడం, విరుచుకుపడడం చేస్తుంటారు. అని కార్యకర్తల తీరుతెన్నులను “మురిపించగ తమ నేతల” పద్యంలో వివరించారు.
రాజకీయనాయకులు సభలు నిర్వహించినప్పుడు వేలం వెర్రిగా గుంపులు గుంపులుగా కూలీకి జనాలను తీసుకువచ్చి సభలలో కూర్చోబెడుతుంటారు. చాలా వరకూ ఇప్పుడు పార్టీ సభలలో జరుగుతున్న తంతు ఇదే. నాయకులు శాసనసభల్లో హుందాగా ప్రవర్తిస్తారేమో అని ఎదురుచూసే ప్రజలకు ఎదురయ్యే పరిస్థితి..
శాసన సభలో హుందా
గా సభ్యులు మెలగుచుంద గాంచెదమని మే
మాసించి యుండగా, అడి-
యాసగ మారినది నేటి కయ్యది మిత్రా! (రాజకీయ మిత్ర శతకం -127వ పద్యం)
శాసవసభ అంటే నిజంగా ప్రజాప్రతినిథులు హుందాగా ప్రవర్తించే సభలాగా జరుగుతుండా అంటే జరగదు. శాసనసభ్యులు సభలో చేసే రభసకు సభావతి కూడా సహనం కోల్పోతాడు. సొమ్ములు ఇచ్చి ఓటు కొనుక్కోవడం రాజకీయనేతల తంతు, నోటుకు ఓటు అమ్ముకోవడం ఓటరు వంతు. ఎన్నికలలో డబ్బు తల దూర్చాక “ఎన్నికలు అమ్మకముల నంత వింతలాయెను” అంటారు చంద్రం.
హామీలు గుప్పి, తదుపరి
ఏమియు తామెరుగనట్టు లెవ రుందురో, ఆ
‘ధీమంతులు’ నాయకులై
సామాన్యులు నేలుదు! రిది సత్యము మిత్రా! (రాజకీయ మిత్ర శతకం -134వ పద్యం)
‘ప్రజల కష్టసుఖాలు వట్టించుకొని వారి క్షేమాన్ని ఆశించే నాయకత్వం అరుదైపోతుంది.
పుట్టగొడుగుల్లా పార్టీలు వుట్టుకొస్తున్నాయి. నాయకులకు కొదువ లేదు. ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజల వలన పారిమాలింపబడే ప్రభుత్వం కాస్త డబ్బు కొరకు, డబ్బుచేత, డబ్బువలన పరిపాలింపబడే ప్రభుత్వంగా మారిపోతుంది. రానురాను దేశరాజకీయాలు సంక్లిష్టమౌతున్నాయి. భ్రష్టుపడుతున్నాయి. సగటు మనిషి బ్రతకలేని దుస్థితి ఏర్పడుతుంది.
ముగింపు:
‘ ప్రజలు పార్టీని చూసి కాకుండా పనిచేసే నేతను ఎన్నుకోవడం మొదలుపెట్టాలి. ఏ రోజు అయితే ఓటరు నోటుకు అమ్ముడుపోతున్నాడో. ప్రలోభాలకు లొంగిపోతున్నాడో ఆ రోజే ఓటరు ప్రశ్నించే హక్కు కోల్పోతున్నాడు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు ప్రశ్నించే హక్కును కోల్పోకూడదంటే వారు ప్రలోభాలకు లొంగకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల్లో మార్పురావాలి.
ఇది రాజకీయ దుస్థితి!
పదే పదే చెప్పుకొనుచు వగచిన ఇది మా
రదు; చైతన్యము ఓటరు
మదిలో ఉదయించ గలుగు మార్పులు మిత్రా! (రాజకీయ మిత్ర శతకం – పుట – 26)
రాజకీయ దుస్థితి ఇలా ఉంది. అయినా నిజంగా ప్రజాసేవ చేయాలి. ప్రజలను ఉద్దరించాలి. అనుకుంటే రాజకీయాలే అవసరం లేదు. ఏ విధంగానయినా ప్రజాసేవ చేయవచ్చు. ఈ విధంగా ప్రజలు, రాజకీయనాయకులు ఇరువురిలో మార్పు వస్తే చక్కటీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని మనం చూడవచ్చు. ఈ ఆశావహ దృక్పథాన్ని రచయిత చంద్రం ‘రాజకీయ మిత్ర శతకం’లో వ్యక్తంచేసారు.

ఆధార గ్రంథాలు:
1. గోపాలకృష్ణరావు.కె – అధిక్షేప శతకములు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. 1982
2. ఆదికవి నన్నయ – ఆంధ్ర శబ్ద చింతామణి- కాకినాడ ముద్రాక్షరశాల 1932
3. డాక్టర్ ద్వానా శాస్త్రి – తెలుగు సాహిత్య చరిత్ర ప్రగతి పబ్లిషర్స్ 1998

 

-డా.కొలిపాక అరుణ
సి. హెచ్.ఎస్.డి. సెయింట్ థెరిస్సా కళాశాల, ఏలూరు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top