Volume – 1, May 2026, issue – 2,
సమర్పణ (D.O.S): 05 -04 – 2026 ఎంపిక (D.O.A): 19 – 04 – 2026 ప్రచురణ (D.O.P) : 01-05-2026
వ్యాస సంగ్రహం :
శాసనబద్ధమైన విషయము ప్రపంచమంతటా ప్రమాణముగా స్వీకరించబడుచున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, శ్రీకూర్మమందున్న కూర్మేశ్వరాలయమున తూర్పు చాళుక్య రాజవంశీయులు వేయించిన నాల్గు స్తంభశాసనములలో 1195వ శక సం॥ములో రెండవ విజయాదిత్యునిచే మొదటి శాసనము వేయించబడినది. దానిలో ఆలయమున నిత్య దీపారాధనకై 25 ఆవులను దానము చేయుట చెప్పబడినది. రాజమహేంద్ర పట్టణమున నుండి తన తేజస్సుచే భూమండలమంతటా ప్రకాశించిన రాజరాజనరేంద్రుడు విద్వాంసులతోకూడి ధర్మశాస్త్రగ్రంథ సమÖహమంతటి సారమైనది, శ్రేష్ఠమైనది అగు భారత వంశ చరిత్రను అనగా వేదవ్యాసమహర్షి రచించిన సంస్కృత మహాభారతమును ఆంధ్రీకరించెను అను విషయమును తెలుపుట ఈ శాసనముయొక్క వైశిష్ట్యము. ఇచట రాజరాజనరేంద్రుడు మహాభారతమును ఆంధ్రీకరించెను అనుటకు ఆంధ్రీకరింపచేసెను అను భావము గ్రహింపతగినది. విద్వాంసులతో కూడి ఆ కార్యమునతడు చక్కబెట్టినట్లు ఈ శాసనము తెలుపుటచే మనమట్లు గ్రహించవచ్చును. అనగా ఆ రాజు నన్నయ్యను ఆంధ్రీకరింపుమని కోరి, విడిచిపెట్టక తాను ఆ కార్యమును స్వయముగా పర్యవేక్షించినట్లుగా ఊహించవచ్చును.
కీలక పదాలు :
ఆంధ్ర ప్రదేశ్ , శాసనాలు , పురావస్తు శాఖ , రాజరాజనరేంద్ర, మహాభారతం, వంశ చరిత్ర, నన్నయ్య,తెలుగు , భాష,
విషయ వివరణ :
రాజరాజ నరేంద్రుడు ` “జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థ మేర్పడ దెనుగున రచియింపు మధిక ధీయుక్తి మెయిన” అని చెప్పినట్లు నన్నయ్య తన మహాభారత అవతారికలో చెప్ప్పుకొనినాడు.
ఈ విధముగా రాజరాజనరేంద్రుడు` తెలుగుభాషకు ఒక స్థిరరూపమునొసంగి, సంస్కృతం పదములను తత్సమములుగా వాడుకొనుటకు తగిన నియమములు ఏర్పరచి, సంస్కృతం నుండి ప్రశస్తములైన, ధారాశుద్ధిగల వృత్తములను గ్రహించి, దేశి మార్గ పద్ధతులను రెండిటిని ఆదరించి విస్తృతము , ఉదాత్త వస్తుకము, లాక్షణికము అయిన మహాకావ్యమును తెలుగులో ప్రప్రథమముగా నిర్మింపబూని కృతకృత్యుడైన ప్రతిభాపాండితీ సంపన్నుడైన నన్నయ్య భట్టారకుని మనకు అందించినాడని స్పష్టమగుచున్నది.
శాసన పాఠము
స్వస్తి = శుభమగుగాక!
- శ్రీమానభూత్ పురా కశ్చిత్సోమవంశే మహా యశా: ।
చాళుక్య విమలాదిత్య చక్రవర్తీ నృపాగ్రణీ: ॥
పూర్వము చంద్రవంశమున శ్రీమంతుడు, గొప్పకీర్తి కలవాడు, రాజులలో అగ్రగణ్యుడు అయిన చాళుక్య విమలా దిత్యుడను చక్రవర్తి ఉండెను.
- ఏక ఏవ నభోదేశే యథా చంద్ర: శ్రియాయుత: ।
నమయన్ శత్రుపద్మాని తథా స క్షితిమండలే ॥
ఆకాశమున శోభతో కూడిన ఒక్క చంద్రునివలె అతడు భూమండలమున శత్రువులను పద్మములను అణచివేసెను.
- తస్మాదభూత్ క్షితిపతి ప్రణతాంఘ్రిపద్మ:
శ్రీరాజరాజనృపతి: ప్రవిశాలకీర్తి: ।
యస్సూరిభిస్సహకిల స్మృతితిజాలసార
మంధ్రీచకార వరభారతవంశ వృత్తమ్ ॥
ఆయనకు, రాజులచే ప్రణమిల్లబడిన పాదపద్మముల కలవాడు, ఎక్కువగా విస్తరించిన కీర్తిగలవాడు అయిన శ్రీరాజ రాజ నరేంద్రుడు జన్మించెను. అతడు ధార్మిక విషయములను అందించు గ్రంథసమÖహమునకు సారమైన దగు, శ్రేష్ఠమైన భారతవంశ చరిత్రను పండితులతో కలసి ఆంధ్రీకరించెను.
- సేవాగతనృపాకీర్ణే రాజమాహేంద్రపట్టణే ।
స్థితోÊపి తేజసాక్రాంతే రరాజ వసుధాతలే ॥
తనను సేవించుటకు వచ్చిన రాజులచే నిండిన రాజ మహేంద్ర పట్టణముననున్నవాడైనను, అతడు తన తేజస్సుచే ఆక్రమించబడిన భూతలమున(అంతటా) ప్రకాశించెను.
- శంకామన్యమహోదధౌ చ విదధే నాకౌకసాం సేనయా
యస్తత్ప్రోత్థ రజోవితాన వితతే: పాథోదబృందే నృణామ్ ।
ఆసారే తదిభోరుగండ విలుఠద్దానాంబుభి: స్రోతసామ్
ప్రత్యర్థి క్షితిపాల మౌళి మణిరుఙÙ నీరాజితాంఘ్రిద్వయ: ॥
తనసైన్యముచే దేవతలకు మరియొక సముద్రమా అను శంకను, ఆసైన్యముచే పైకి లేపబడిన దుమ్ముచే చూచే జనులకు ఎగసిపడుతున్న సముద్రమా అను శంకను, ఆ సైన్య మందలి ఏనుగుల విశాలమైన గండస్థలముల (చెక్కిళ్ళ) నుండి జారుతున్న మదజలధారలచే నదులకు జడివానయేమో అను శంకను కలిగించు, ఆ రాజరాజనరేంద్రుడు శత్రురాజుల శిరస్సులపై అలంకరింపబడిన మణులకాంతులచే తన పాదపద్మముల జంటకు నీరాజనములనందుకొనుచున్నాడు.
- తద్వంశే విజయాదిత్య ఇతి ఖ్యాతో నృపోÊభవత్ ।
మానవ్యస సుగోత్రీయో విజయశ్రీనికేతన: ॥
అతని వంశమున మానవ్యస గోత్రమువాడు, విజయ లక్క్ష్మికి నెలవు అయిన విజయాదిత్యుడని కీర్తిబడసిన రాజు ఉండెను.
- తస్మా జ్జాతశ్చ రాజేందూ రాజరాజ ఇతి స్మ ృత: ।
మంత్రీ వీరనృసింహస్య వాచస్పతి మహామతి: ॥
- తస్య సూనుస్సురాధీశ తులితోద్దామవిక్రమ: ।
జానాతి విదుషాం యోర్థం గుణై: రత్నాకరోపమ: ॥
అతని వలన కలిగిన రాజచంద్రుడు రాజరాజుగా తలచ బడినాడు. ఆ వీరనృసింహునికి బృహస్పతియంత బుద్ధిశాలి యైన మంత్రి కుమారుడు గలడు. అతడు ఇంద్రునితో సాటియైన పరాక్రమము గలవాడు. గుణ సముద్రుడనదగినవాడు. విద్వాంసులకు ప్రయోజన కరమైనదేదో ఎరిగినవాడు.
- స్వస్తి శ్రీ శక వర్షే శర నిధి శశి భూ సమ్మితేర్కే తులాస్థే
రుద్రాహే సౌమ్యవారే సితయుజి మహత:
కూర్మ నాథŠస్య నిత్యం ।
ప్రాదాద్దీపస్య పంచోత్తర దశయుగ గా: వాంఛితార్థస్య సిద్ధెí్య
సో యం చాళుక్య వంశాంబుధి శశి విజయాదిత్య
సచ్ఛక్రవర్తీ ॥
శుభమగుగాక, శర(5) నిధి (9) శశి(1) భూ(1) సమ్మితమైన శకవర్షంబున అనగా శక సంవత్సరం 1195 నందు, తులారాశిలో సూర్యుడుండగా (కార్తీకమాసమున) శుక్ల ఏకాదశీ బుధవారమునాడు చాళుక్యవంశ సముద్రమునుండి వెలసిన చంద్రుడైన ఆ విజయాదిత్య చక్రవర్తి తనకోర్కె నెరవేరుటకు సర్వోన్నతుడైన కూర్మనాథునకు నిత్యదీపారాధŠనకై ఇరవైఐదు గోవులను సమర్పించెను.
- నిత్యం నిర్మలచేతస్కై ర్వైష్ణవై ర్నీతివేదిభి: ।
గ్రామీణై రపి ధర్మోÊయం పాలనీయ: ప్రయత్నత: ॥
ఎల్లప్ప్పుడూ శుద్ధమైన హృదయములు కలవారు. నీతి వేత్తలు అయిన వైష్ణవులచే, అట్లే గ్రామస్థులచేతను ప్రయత్న పూర్వకముగా ఈ ధర్మము పాలింపతగినది.
ఉపయుక్త గ్రంథము:
డా.ధూళిపాళ రామకృష్ణ, పుటల సంఖ్య : 17`76,77;
A Study of Sanskrit Inscriptions on AndhraPradesh
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము, తిరుపతి.2009
– డా. ధూళిపాళ రామకృష్ణ,
ఆచార్యులు, సంస్కృత శాఖాధ్యక్షులు,
మారిస్ స్టెల్లా కళాశాల, విజయవాడ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
