sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

ఎండ్లూరి సుధాకర్ వర్గీకరణీయం – వస్తు వైవిద్యం – షేక్ వలీ అహ్మద్

Volume – 1,                                                      August  2026,                                          issue – 5,

సమర్పణ (D.O.S): 0807 – 2026               ఎంపిక (D.O.A): 17– 07 – 2026          ప్రచురణ (D.O.P) :  01-08-2026  

వ్యాస సంగ్రహం :

డా॥ ఎండ్లూరి సుధాకర్ రచించిన వర్గీకరణీయం” దళిత సాహిత్యంలో ఉద్యమ చైతన్యాన్ని ప్రతిబింబించిన ప్రముఖ దీర్ఘకావ్యం. షెడ్యూల్డ్ కులాల ఉపవర్గీకరణ (A, B, C, D) నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉద్భవించిన సామాజిక, రాజకీయ, న్యాయపరమైన పరిణామాలను ఈ కావ్యం కవితాత్మకంగా ఆవిష్కరిస్తుంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం, దళిత రాజకీయాల అంతర్గత వైరుధ్యాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాన అవకాశాల వంటి అంశాలను కవి తీవ్ర భావోద్వేగంతో వ్యక్తీకరించారు. పురాణ, ఇతిహాస, బైబిలు ప్రతీకలు, వ్యంగ్యం, ప్రతిఘటన, ఉద్యమ భాషలను సమన్వయపరుస్తూ తన వాదనను బలంగా వినిపించారు. అయితే ఈ కావ్యంలో ఉద్యమ ఆవేశం కారణంగా కొన్ని సందర్భాల్లో వర్గ విభేదాలు, కుల వైరుధ్యాలు, వ్యక్తిగత విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఫలితంగా ఈ రచన ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంది. అయినప్పటికీ వర్గీకరణీయం దళిత ఉద్యమ సాహిత్యంలో ఒక చారిత్రక పత్రంగా, సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించిన ఉద్యమ కావ్యంగా విశిష్ట స్థానాన్ని సంపాదించిందని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

కీలక పదాలు :

డా॥ ఎండ్లూరి సుధాకర్ , వర్గీకరణీయం, దళిత సాహిత్యం, ఉపవర్గీకరణ , మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,

దళిత ఉద్యమం, సామాజిక న్యాయం , ఆత్మగౌరవం, ఉద్యమ కవిత్వం, దళిత రాజకీయాలు , ప్రతిఘటన సాహిత్యం, వర్గీకరణ ఉద్యమం.

పరిచయం :

ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలువడుతున్న వచన కవితా ప్రక్రియ దీర్ఘకవిత లేక దీర్ఘకావ్యం. “ఆంగ్లంలోని ‘Long poem’ నే మాటకు సమానార్థకంగా తెలుగులో దీర్ఘకవిత్వం లేదా దీర్ఘకావ్యం అని వ్యవహరిస్తున్నారు. వచన కవితలాగే దీర్ఘకవితకు కూడా పునాదులు ఆంగ్ల సాహిత్యంలోను ఉన్నాయి. Free verse మీద జరిగిన ఒకానొక ‘Long poem “( సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు జి.వి.సుబ్రహ్మణ్యం: పుట, 679)

“ఒక ప్రధాన వస్తువును తీసుకొని ప్రత్యేక ఆలోచనా దృక్పథంతో సందేన్నిస్తూ, అనేక భావాలను ముందుచుంతూ వాటన్నింటినీ కలిపి ఒక నిర్మాణ బంధాన్ని కలిగి తగినంత విస్తీర్ణం కలిగి ఉండే కవితను దీర్ఘకవితగా పిలుస్తారని సాహిత్య నిఘంటువులు పేర్కొన్నాయి.”( సాహిత్య విమర్శపదాల డిక్షనరీ ఎస్.ఎస్.నళిని : పుట, 81)

దీర్ఘకవిత అంటే ‘లాంగ్ పోయెమ్’ అనే ఆంగ్ల సాహిత్య పారిభాషిక పదానికి తర్జుమాగా మాత్రమే మనం గ్రహించాలనా? లేదా ఆధునిక ప్రయోగాలతో తెలుగు కవులు వెలువరిస్తున్న, వ్యవహరిస్తున్న రూపస్వభావాలను పరిగణనలోనికి తీసుకొని వారు రూఢికెక్కించిన అక్షరంలోనే మనం గ్రహించాలనా అని. ప్రభవ పరిశీలన దృష్ట్యా కానీ, దేశీయ ప్రయోగ విధానం దృష్ట్యా కానీ, ప్రక్రియ వివేచనం చేయబూనినపుడు ఏ పాశ్చాత్య ప్రక్రియా స్వరూప స్వభావాలనైనా తెలుగు కవి దర్శించి అర్థం చేసుకొని ఆవిష్క రించిన పద్ధతికే ప్రాధాన్యత ఇస్తాం కానీ పాశ్చాత్య ప్రక్రియకు కాదు.

ఆంగ్లంలో ప్రసిద్ధిగాంచిన టి.ఎస్. ఇలియట్ గారి ‘వేస్టాండ్’ దీర్ఘకవిత గురించి ఇలియట్ గురువు ఎర్రీపౌండ్ దీర్ఘకావ్యాన్ని, దీర్ఘకవితను ఈ విధంగా పేర్కొన్నాడు.”The Thing turns from ‘April. to ‘Shantin’ without a break that is 19 pages forther”( అసుపత్రి గీతం, వస్తువు- సంవిధానం సిద్ధాంత గ్రంథం ఉదారి నారాయణ పుట, 40) నిర్వచనం కేవలం రూపపరంగా ఉంది. “వ్యక్తీకరణలో ఆధునికత A కోసం ఇంగ్లీషు ‘ఫ్రీవర్స్’ అనే వచన కవితారూపం తెలుగులో బాగా ప్రాచుర్యమయ్యింది.”( కొయ్యగుర్రం : సగ్నముని : పుట,13)

అదేవిధంగా జి.వి. సుబ్రహ్మణ్యం తమ సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథంలో “దీర్ఘకవిత భారతీయ భావనలో కావ్యత్వం పొందని ఒకానొక ప్రక్రియ ఇంగ్లీషులో దానికి కావ్యత్వస్ఫూర్తి ఉంటుంది. ఈ అంతరాన్ని గమనిస్తే ‘దీర్ఘకవితను’ ఒక ప్రక్రియగా లఘుకావ్యానికి, ఖండ కావ్యానికి నడుమ గుర్తించక తప్పదు.” (సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు జి.వి. సుబ్రహ్మణ్యం: పుట, 679)అని అన్నారు.

 ఆధునిక తెలుగు సాహిత్యంలో చాలా దీర్ఘకవితలు కావ్యాలుగా అవత రించాయి. “నగ్నముని కొయ్యగుర్రంను రూపాన్ని బట్టి దీర్ఘకవితగా గుర్తించి, గుణాన్ని బట్టి మహాకావ్యంగా పరిశీలించరు” (కొయ్యగుర్రం: నగ్నముని పుట, 15)అని కొయ్యగుర్రం పీఠికలో చేకూరి రామారావుగారు అన్నారు. ఈ విధంగా ఎన్నో దీర్ఘకవితలు మహాకావ్యాలు కావలసివస్తాయి. అందువలన దీర్ఘకవితలను ఒక ప్రత్యేకరూపంగా కావ్యప్రయోగం సంభవించడం సముచితమని” జి.వి. సుబ్రహ్మణ్యం అన్నారు.

దీర్ఘకవిత్వం గురించి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ నిర్వచిస్తూ” ఏదయినా ఒక ప్రధాన వస్తువును తీసుకొని, ప్రజలకు సామాజికపరంగా ఆలోచనలు రేకెత్తించి, మార్పును సూచించే రచనను ఐదారు వందల పదాలతో రచించే కావ్యాన్ని దీర్ఘకావ్యం” అంటారు అని నిర్వచించారు. ‘దీర్ఘకవిత వికాసం’ పుస్తకంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి తన ముందుమాటలో దీర్ఘకవిత వచన కవిత్వం యొక్క పరిణామ రూపం ఈనాడు దీర్ఘకవితను ఒక ప్రక్రియగా భావిస్తున్నప్పటికీ అది వచన కవిత్వంలో భాగమే. ఎటువంటి ఛందో నియమాలు దీర్ఘకవితకు వర్తించవు అని అన్నారు. “ఎంచుకున్న వస్తువును సమగ్రంగా ఆవిష్కరించడానికి వస్తువులోని విభిన్న పార్శ్వాలను కవితామయం చేయడానికి కవి హృదయం తనివి తీరేవరకూ అనివార్యంగా పెరిగిన వచన కవితను దీర్ఘ(కావ్యం) కవిత” అంటారని ఆచార్య చంద్రశేఖరరెడ్డి నిర్వచించారు.

దీర్ఘకవితా లక్షణాల్లో ఒకే వస్తువు ఉండటం ప్రాథమికమైనది. ఒక కవితా వస్తువును అనేక కోణాల్లోంచి దర్శించడానికి దీర్ఘకవిత అనువైనది. దీర్ఘకవితకు ప్రవాహగుణం ఉండాలి. ఎక్కడికక్కడ ఆగిపోయినట్లు కాకుండా మొదటి నుండి చివరి వరకు నదిలా ప్రవహించాలి. తెలుగులో వెలువడిన కవితలలో ఎక్కువ భాగం అలా ప్రవహించినవే. చిన్న కవితలో ఇమడకుండా మహాకావ్యంగా విస్తరించాక ఒక సంఘటననో, సామాజిక సమస్యనో విస్తరించే ప్రక్రియను దీర్ఘకావ్యంగా లేదా దీర్ఘకవితగా పేర్కొనవచ్చు.

1970వ దశకంలో ముఖ్యంగా ఎమర్జెన్సీ చీకటి రోజుల తర్వాత తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితలు ఒక ప్రధాన ప్రక్రియగా నిలదొక్కుకున్నాయి. కుందుర్తి ‘తెలంగాణా’, ‘నగ్నముని ‘కొయ్యగుర్రం’, శేషేంద్ర ‘నా దేశం నా ప్రజలు’, ఛాయారాజ్ ‘శ్రీకాకుళం’, సి. నారాయణరెడ్డి ‘మట్టిమనిషి, ఆకాశం’, శివారెడ్డి ‘ఆసుపత్రి గీతం’, ఆరుద్ర ‘త్వమేవాహం’, సినారె ‘విశ్వంభర’, ఎన్. గోపి ‘జలగీతం’, ఎండ్లూరి సుధాకర్ ‘కొత్త గబ్బిలం’, ‘గోసంగి’, ‘వర్గీకరణీయం’, వరవరరావు ‘సముద్రం’, అఫ్సర్ ‘సంయుక్త కవిత’, ఖాదర్ ‘పుట్టుమచ్చ’, సుధేరా ‘పొలికేక’ వంటి ఎన్నో దీర్ఘకావ్యాలు (దీర్ఘకవితలు) నేటికీ వస్తూనేఉన్నాయి.

విషయ వివరణ :

డా॥ ఎండ్లూరి సుధాకర్ రాసిన మరొక దళిత దీర్ఘకావ్యం వర్గీకరణీయం. ఇది జాతి అభిమానం, ఆత్మాభిమానంతో వచ్చిన కావ్యం. దీనికి కొంత చారిత్రాక నేపధ్యం ఉంది. కొంతజాతి జనఘోష కూడ వుంది. షెడ్యూల్డ్ కులాలుగా రాజ్యంగం కొన్ని కులాలను చేర్చింది. అణగారిన బ్రతుకులకు అవమానాలకు గురి అవుతున్న వారికి సమాజంలో ఒక స్థానంకల్పించి వారిని సాంఘికంగా, రాజ కీయంగా, ఆర్థికంగా, విద్య, వైద్య ఇలా ఎన్నో విషయాలను ప్రధానంగా చేసుకుని చేయూత నివ్వాలనే దృక్పధంతో అందరిని కలిపి షెడ్యూల్కాస్ట్ లేక షెడ్యూల్డ్ కులాలు అనే పేరుతో రాజ్యంగం అహక్కుల ను కొన్ని ప్రకటించింది. ఆంధ్ర దేశంలో 2004 లో ఈ వర్గీకరణసమస్య పెద్ద సమస్యగా తయారైంది. ఎప్పుడైతే మాల, మాదిగలను వర్గీకరించే ప్రయత్నంలో చట్టసమ్మతంగా జీ.ఓ జారీ చేసిందో అప్పుడే ప్రభుత్వం పై పెద్ద తిరుగుబా టు వచ్చింది. ఆ నేపథ్యంలోనే మాలలు ఛలో అసెంబ్లీ ముట్టడి పెట్టారు. అది ఆంధ్ర పోరాటాల్లో చరి త్రగా నిలిచిపోయింది. చంద్రబాబు గుర్రాలచేత తొక్కించడం, లాఠీలు ఘుళిపించడం, కాల్పులు జరప డం ఇవన్నీ తెలుగు దేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి సహకరించాయి. ఆ తర్వాత పి.వి.రావు సారధ్యం లో కోర్టుకు వెళ్ళడం అది కొట్టివేయడం తర్వాత సుప్రీం కోర్టులో కూడ వర్గీకరణను కొట్టివేయడం జరిగాయి. ఇంత నేపధ్యాన్ని సంతరించుకున్న ఈ వర్గీకరణీయం అనే దీర్ఘకావ్యం కేవలం 3 రోజుల్లో సుధాకర్ రాయడం మరొక విశేషం. సుధాకర్ 3-12-2004 న మొదలు పెట్టి 6-12-2004 లో ముగించి ఘనత సాధించారు. దీనిలో వస్తువు వర్గీకరణ, షెడ్యూల్ కులాలను 4 రకాలుగా వర్గీకరించా రు. అదే ఏ,బి,సి,డి వర్గీకరణ. అందు దీన్ని 34 ఖండికలుగా చేసి ఏ, బి,సి,డి అనే శీర్షికతోనే  డా||సుధాకర్ వర్గీకరణను రచించారు. మొదటిగా శీర్షిక ‘ఏ’ ఇది వర్గీకరణలో మొదటి విభాగం, షెడ్యూల్ కుల జాబితాలో ‘ఏ’ వర్గానికి సంబంధించిన విషయాల ప్రస్థావన ఇందులో ఉంది. దీనికి ముందు దాసులొ ధాకర్ ఈ కావ్యాన్ని చండాల చాటింపు కవికి, గుండె పోటుకు గురైన గూటందెబ్బ కవికి, మధ్యలోనే వెళ్లిపోయిన మద్దెల శాంతయ్యకు, ఇంకా అనేక దండోర సోదరులకు అంకితంగా ఇచ్చారు. దీని ప్రా రంభంలో ఒక పౌరణిక నేపధ్యాన్ని ఎన్నుకున్నారు సుధాకర్. అందుకే

“మహభారత కథ

 మళ్ళీ మొదలైంది

 కులాల కురుక్షేత్ర కుంపటి

రంగంమీద రగులుకుంది”(డా॥ ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట 5).

మందకృష్ణ దీనికి అధ్యక్షుడు. ఆరంభం అతనితోనే అందుకే సుధాకర్ “కృష్ణ రాయభారం కొత్తమలుపు లు తిరుగుతుందని” అంటారు. ఐదూళ్ళు అడిగినట్టు ఏ, బి, సి, డిలు అడుగుతుంటే దృతరాష్ట్రుడి చట్టం ఒప్పుకోవడం లేదంటు వ్యంగ్య బాణాలు సందిస్తారు. అంతేకాదు స్పీకర్గా ఉన్న బాలయోగిని ఎస్సీ సుయోధనుడు అని ఘాటైన విమర్శ చేస్తారు. ఇది సుధాకర్ని కాస్త నిలదీసే ప్రశ్నగా మారింది. సుధా కర్ని కవిగా గౌరవించిన సమాజం ఈ వర్గీకరణ గొడుగును భుజాన వేసుకోవడం వల్ల కొంత ఉనికి కోల్పోయారు. అంతేకాదు వర్గీకరణ జరిగి తీరుతుందంటూ

“ఎన్ని కుట్రలు జరిగిన

 ఎందరు సైంధవులడ్డు తగిలినా

 వర్గీకరణ విశ్వరూపం

 ఎప్పటికైన అనివార్యం” (డా॥ ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 6)

మహభారత కథంటే మాల, మాదిగల కథే అంటాడు. పాండవు ఎవరు? కౌరవు లెవరు? అంటే వ్యం గ్యంగా న్యాయంగా పోరాటం చేస్తున్న దండోర సోదరులు పాండవులని అతని భావన. ఈ భావన తీర్పు వెలువడిన తరువాత తప్పని తెలిసింది. అప్పటి నుండి సుధాకర్లో కాస్త హేళన గుణం తగిందని కొందరి భావన, మరల రామ కథను గుర్తుచేస్తాడు సుధాకర్. అయోధ్య వదిలి మరలా హస్తి నకు వస్తాడు. ఆవేశంతో రాసింది కాబట్టి అయోధ్యే కాదు, హస్తినా కూడ తిప్పుతాడు సుధాకర్.

అందుకే………

“వాలీ సుగ్రీవుల్లా

 రాజకీయ రాముడితో జాగ్రత్త

 వాడు చెట్టు చాటు నుంచి కాదు

చెప్పుచాటు నుంచి బాణం వేస్తాడు”( డా॥ ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 7)

అంటూ చమత్కరిస్తూ దండోర జనాన్ని జాగ్రత్తపడమంటాడు. మాల మాదిగలను మరలా ఇక్కడ వాలి సుగ్రీవుల్లా మార్చి వర్ణిస్తాడు. అంతేకాదు “ఏ, బి,సి,డి” లు అంటే కొత్త నిర్వచనం ఇస్తాడు.

‘ఏ’ అంటే ఆకలిని

 ‘బి’ అంటే బువ్వని

 ఇంత మాత్రమే తెలుసుగాని

సరమైతే పంచాయితీ పెట్టి నిగ్గు తేల్చమంటాడు. అధిక సంఖ్యలో ఉద్యోగులెవ్వరో విద్యార్ధులెవ్వరో, లబ్ది రాజులెవ్వరో నష్టజాతకు లెవ్వరో సరిచూడమంటారు. అంతేకాదు

మా తలరాతలు మార్చిన

 జాబితాలు కావాలిప్పుడు

 పాత చెప్పుల్లా విసిరేసిన జీవితాలు కావలసినప్పుడు “.అంటాడు.( డా||ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 11)

అక్కడితో సరిపెట్టుకోకుండా తమ జాతి కోల్పోయినవన్నీ కావాలంటారు. గతకాలపు కథలన్నీ వ్యథ లన్నీ గుర్తు చేసుకుంటారు. ఇంత వెనుకబడి పోయామా! అని బుర్రబద్దలు కొట్టుకుంటారు సుధాకర్.

అంతేకాదు

“తప్పు జరిగిందా

 తల వంచుకుంటాం

 కుట్ర జరిగిందా

 ఎలా ఊరుకుంటాం”( డా|| ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 11 ) అంటూ డా॥సుధాకర్ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. డా॥సుధాకర్లో ఒక అద్భుతమైన కవితాశైలి ఉంది. చురకలు వేయడంలోను ఛలోక్తులు విసరడంలోను సవ్యసాచి. కాని ఇక్కడ ఈ కావ్యంలో వేడి నెత్తురు ఉరకలు వేసే కుర్రాడిలా దూసుకుపోవడం ఆశ్చర్యం. జాతి మీద ప్రీతి ప్రజల మీద తనకున్న ఆర్ద్రత, ఆవేదన కనిపిస్తుంది. అప్పుడే పొగిడి, అప్పుడే తెగడి అప్పుడే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలినట్లు

“అన్నలారా

 షరాఫత్ గా చెబుతున్నాం

మమ్మల్ని అరాఫత్లుగా మార్చొద్దు

 బతిమాలి అడుగుతున్నాం

 మమ్మల్ని పంచాగ్నుల్ని చెయ్యొద్దు” అంటారు.( డా|| ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 12)

అంతేకాదు తలమీద ముళ్ళకిరీటాలు, మా ఆకలిమీద మేకులు కొట్టొద్దు అంటారు. మా పోరాటాల మీద అవమానాల బురద జల్లొద్దంటారు. అంతటితో ఆగలేదు మాల మహనాడు అధ్యక్షుణ్ణి నిలదీస్తూ

” చేతనైతే

 స్వామి మెడలో

చెప్పుల దండలు పడకుండా

పూజరిలా కాపలా కాయండి

 జాతి గౌరవాన్ని నిలబెట్టండి” అంటారు.( డా||ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 13)

ఇక్కడితో ‘ఏ’ విభాగం ముగిస్తారు. తర్వాత ‘బి’ విభాగంలోకి వస్తారు. ఇది దండోర కులాలకు చెందిన ఉపవిభాగం. దండోరాలో ఉన్న కొన్ని ఉపకులాలు ఈ విభజనలోకి వస్తాయి. ఇది అతనికి ప్రధానమైన విభాగం అందుకే

“మాకెవరు నేర్పారు

పోరాటపాఠాలు” అంటూ ప్రారంభిస్తారు.

ఇప్పటి వరకు వచ్చినఉద్యమాలు వేరు. ఇప్పుడు నడుస్తున్న వర్గీకరణ ఉద్యమం వేరు. ఈ ఉద్య మంలో తాడోపేడో తేల్చుకోవడానికి వచ్చినట్టుగా భావిస్తారు సుధాకర్. చెప్పులు, డప్పులు కూడ ఉద్య మ బాట పట్టాయని చెబుతూ

“చిల్లరగొడుగు కింద

తలవంచుకుని

 చెప్పులు కుట్టడమేకాని తలెత్తి మాట్లాడిందెపుడు“………… అని ప్రశ్నిస్తారు.( డా॥ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 14)

పాకీపని చేసినా, పెంటపని చేసినా, పాచిపనులు చేసినా, చచ్చరి పనిచేసినా ఎప్పుడైన హక్కుల కోసం అడిగామా అంటారు. మా నినాదంలో న్యాయం లేదా? అని ప్రశ్నిస్తారు. జగతి కంటే ముందు పుట్టిన మా తాత జాంబవంతుడని చెబుతారు. కులవృత్తి కళా సంపదను గుర్తుచేస్తారు. చిలుకలుగా, హంస లుగా చిత్ర చిత్ర వర్ణాలతో ఒక ప్రాచీన చర్మకళా సౌందర్యంతో మా ముఖ్యుల తోళ్ళ బంగారు పూల చెప్పులను గుర్తుచేస్తాడు. మా కిర్రు చెప్పుల సోయగాలకు ముగ్ధులైపోయి ముద్దు పెట్టుకొనే వాళ్లు. ఇప్పుడు మాదుస్థితిని చూసి మీకు మా పోరాటంలో న్యాయం ఉందని తెలియడం లేదా? అంటారు. శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ చదివి చూడండి చర్మకారుడి పొగరు తెలుస్తుంది. మేము బతికి చెడిన వాళ్ళమే కాని చెరిపి బ్రతికి నోళ్ళం కాదు అంటారు. ఈ విభాగంలో చర్మకారవృత్తుల విధానాలు, ఆ నాటి పరిస్థితులు, నేటి దుస్థితిని చక్కగా వివరించారు సుధాకర్. తర్వాత ‘సి’ విభాగం. ఇది అత్యంత కీలకమైన విభాగం, డా॥సుధాకర్ జాతి ప్రజలను విరోధ భావంతో చూస్తు ‘సి’ కేటగిరి అంటే మాలలగూర్చి ఎక్కువగా ప్రస్తావించిన విభాగం ఇది. దీనిలో సుధాకర్ పదునైన పదజలాన్ని ప్రయోగించి అక్కసువెలిబుచ్చారు. ప్రారంభంలోనే …………..

“మాదిగలకు మేము తప్ప

 మరో గత్యంతరం లేదని

ఎన్నటికైనా మేమే దిక్కుని

మా కాళ్ళ దగ్గరికి రావాలని’ ‘  డా॥ ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట- 20) అంటూ మాలల ఆధిపత్యాన్ని సహంచబోమన్నట్లు తూటాలు పేల్చారు. అంతేకాదు తూర్పు గోదావరి మాండలికాన్ని ప్రయోగిస్తు “ఆయ్” అనే మాటలను వ్యగ్యంగా ప్రస్థావించారు. దేశ విభజనలో ఇండి యా, పాకిస్తాన్ లాగ విభజనలో ఇద్దరము నష్టపోయామని మీరెందుకనరని ప్రశ్నిస్తారు. అంతేకాదు హిందు మతాన్ని శాసిస్తున్న మతోన్మాదిగా పేరు పొందిన బలరామ్గాకరే ని పోలుస్తూ “మాల్గాకరే” లా అని కఠిన పదజలాన్ని ప్రయోగించి మరి కొంత మాలల కోపాగ్నికి కారకుడయ్యారు. రెచ్చగొట్టే ధోరణిలో ఈ కవిత్వం రోడ్డున పడిందని సుధాకర్ కులతత్వ విలువను జీర్ణించుకున్న కులపుటోళ్ళ కవని పేరు తెచ్చుకున్నాడని అనేక మందిచే విమర్శలకు గురి అయ్యాడనేది సుస్పష్టం. అందుకే “మామాధిపతి” అనేపదాన్ని ప్రయోగించారు. మామలు అంటే మాల, మాదిగలు వారికి అధిపతి జాషు వ అంటారు. అప్పటి వరకు జాషువ దళితకవిగా ఉంటే సుధాకర్ మాలల అధిపతి అని అనడంలో కొంత బాధను మిగిల్చిందని కొందరి అభిప్రాయం. “రద్దులరావు” అనే పదాన్ని ప్రయోగించి మరి కొంత రచ్చకెక్కినట్లు సుధాకర్ తీరు గమనించవచ్చు.వ మహనాడు అధ్యక్షులు పి.వి రావుపై అటు వంటి విమర్శలుచేసి అప్పట్లో అనేక నిరసనలకు గురి అయ్యాడు డా॥సుధాకర్. గోదావరి తీరానికి ఉద్యోగం కోసం వచ్చి గోదావరి నీళ్లు రుచిమరిగి, ఇంత పొగరు పట్టి మాట్లడతాడా అనే విమర్శలు రావడం మనం గమనించవచ్చు.డా||సుధాకర్ క్రైస్తవ సాహిత్యాన్ని మతగ్రంథాన్ని బాగా అధ్యయనం చేయడం వల్ల అక్కడక్కడ క్రైస్తవ మత గ్రంథంలోని కథలు పదప్రయోగాలు సందర్భోచితంగా ప్రయోగించి కవితకు వన్నెతెస్తాడు.

మా యన్నలారా !

మమ్మల్ని యోసేపుల్ని చేశారుగదా

కాసేపైనా మా ఎదుగుదల చూసి

 ఓర్వలేక పోయారు కదా” ! అంటారు.( డా॥ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట, 22)

మా కంటే మాలలైన మీరు మూడు తరాల ముందున్నారని కారాలు నూరాడు. కాని మా బ్రతుకుల్లో అసంతృప్తి, ఆక్రందన, ఆవేదన మిగిలిపోయాయి. అందుకే మా హక్కుల సాధన కోసం ఉద్యమ బావుటా ఎగరవేస్తున్నాం అంటారు.

మోదుగా పువ్వులాంటి

మాదిగ తల్లులు

 మట్టిలో మాణిక్యాలే ఐనా

 పెట్టిలోనే మగ్గిపోయారు పల్లెల్లో ఎల్లమ్మలుగా మిగిలిపోయారు” అంటారు.( డా||ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 23.)

తన జాతి బానిస బ్రతుకుల్ని కళ్లకు కట్టినట్టు చిత్రించి సజీవ పాత్రలుగా మలిచారు డా॥సుధాకర్,అంతేకాదు

ఏ లూథరన్ హైస్కూల్లోనో

 మేమూ చదివుంటే

మా చేతుల్లో బైబిల్ వచ్చుంటే

 ఎలిజిబెతులుగా, మార్తలుగా

ఎస్తేరులుగా విస్తరించి వుండే వాళ్లం

నాజూకుగా పెరిగుండే వాళ్లం”” అంటారు.( డా||ఎండ్లూరి సుధాకర్, వర్గీకరణీయం, పుట – 23)

ముగింపు

“వర్గీకరణీయం కేవలం ఒక ఉద్యమ దీర్ఘకావ్యం మాత్రమే కాదు; దళిత సమాజంలోని అంతర్గత సంఘర్షణలు, సామాజిక న్యాయ సాధనలో ఎదురైన సవాళ్లు, రాజకీయ జోక్యాలు, హక్కుల కోసం జరిగిన పోరాటాలను సాహిత్య రూపంలో నమోదు చేసిన చారిత్రక పత్రం. కవి ఎండ్లూరి సుధాకర్ తన జాతి ఆత్మగౌరవం, బాధ, ఆవేదన, ఆకాంక్షలను తీవ్ర భావోద్వేగంతో వ్యక్తీకరించారు. పురాణ, చారిత్రక, మతపరమైన ప్రతీకల ద్వారా ఉద్యమానికి సాహిత్యాత్మక శక్తిని అందించారు.

అయితే కావ్యంలో కనిపించే తీవ్ర వాదన, ప్రత్యర్థి వర్గాలపై ఘాటైన విమర్శలు, భావోద్వేగ ప్రధాన వ్యక్తీకరణలు పాఠకుల్లో భిన్న స్పందనలను కలిగించాయి. అందువల్ల ఈ రచన దళిత సాహిత్యంలో ప్రశంసలతో పాటు విమర్శలకు కూడా కేంద్రబిందువైంది. అయినప్పటికీ ఉద్యమ సాహిత్య చరిత్రలో, దళిత రాజకీయ చైతన్య వికాసంలో, సామాజిక న్యాయ చర్చలలో వర్గీకరణీయం ఒక ప్రాముఖ్యమైన పాఠ్యంగా నిలిచి, సమకాలీన దళిత సాహిత్య అధ్యయనానికి విలువైన ఆధారగ్రంథంగా గుర్తించబడుతుంది.

ఆధార గ్రంధాలు :

సుధాకర్ ఎండ్లూరి – వర్గీకరణం

సుబ్రహ్మణ్యం. జి.వి – సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు

నగ్నముని – కొయ్యగుర్రం

నళిని ఎస్.ఎస్. – సాహిత్య విమర్శపదాల డిక్షనరీ

నారాయణ ఉదారి –  అసుపత్రి గీతం, వస్తువు- సంవిధానం సిద్ధాంత గ్రంథం

  -షేక్ వలీ అహ్మద్ 

తెలుగు ఉపాధ్యాయులు

స్కూల్ అసిస్టెంట్ . 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top