sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

సర్పయాగ కథ – వ్యక్తిత్వ వికాసం -డా.బూర్ల చంద్రశేఖర్,

Volume – 1,                                    April 2026                                               issue –  1                            ISSN: 3139-6283

సమర్పణ (D.O.S): 08 -03 – 2026           ఎంపిక (D.O.A): 16 – 03 – 2026                 ప్రచురణ (D.O.P) :  01-04-2026             

 

వ్యాస సంగ్రహం:

భారతీయ వాఙ్మయంలో ఆధునిక కాలానికి పనికివచ్చే ఎన్నో విషయాలున్నాయి. అందులో ముఖ్యంగా వ్యక్తి జీవన విలువలు, వికాసం, సార్థకతకు సంబంధించిన ఎన్నో సూక్తినిధులు మన సాహిత్యంలో నిక్షప్తం చేయబడినాయి. వాటిని నేటి తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ వ్యాసాంశం తీసుకున్నాను. మహాభారతంలో చాలా ఉపాఖ్యానాలున్నాయి. అందులో సర్పయాగ ఘట్టం చాలా కీలకమైంది. ఆ ఘట్టంలోని పాత్రల విలక్షణతగల వ్యక్తిత్వాలు పాఠకున్ని ఆలోచింపజేస్తాయి. అలాగే వ్యక్తుల బలహీనతలు, బలాలు పరిస్థితులవల్ల ఎలా ప్రభావితమౌతాయో మనకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. అలాగే మనిషి తన వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందించుకోవాలో, ఎలా ఉండకూడదో పరోక్షబోధ చాలా ఉంటుంది. ఆధునిక కాలపు వ్యక్తిత్వ వికాసపు (Personality Development) కోణంలో ఈ ఘట్టాన్ని పరిశీలించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వ్యాసం రూపొందించాను.

కీలకపదాలు:

 నైమిశారణ్యం, ఉదంకోపాఖ్యానం, సర్పయాగం, ఉదంకుడు, ఆస్తీకుడు, తక్షకుడు, వినత, కద్రువ, శృంగి, శమీకుడు, గరత్మంతుడు, పరీక్షిత్తుడు, వేట, రురు ప్రమద్వర మొ.

 

ఉపోద్ఘాతం:

          మహాభారత కథా ప్రారంభంలో నైమిశారణ్యంలోకి వెళ్ళిన సూతుడు (ఉగ్రశ్రవసుడు) శౌనకాది మునులకు సర్పయాగం గురించి చెబుతాడు. ఉదంకోపాఖ్యానంతో సర్పయాగకథా బీజం ప్రారంభమౌతుంది. అభిమన్యుని కొడుకు, అర్జునుని మనుమడు పరీక్షిత్తు మహారాజు. ఇతని కొడుకే జనమేజయుడు. ఇతను చేసిందే సర్పయాగం. మహాభారతం కథ ప్రారంభంలో ఆది పర్వంలో ఈ వృత్తాంతమంతా ఉంటుంది.

పైలుడు (సంస్కృత భారతంలో వేదుడు) అనే మహర్షి శిష్యుడు ఉదంకుడు. కుండలాల విషయంలో ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారం ఏర్పడుతుంది. అప్పటికే తన తండ్రిని చంపాడని తక్షకునిపై జనమేజేయునికి కోపం ఉంటుంది. ఇదే అదనుగా రాజును సర్పయాగం చేయడానికి ఉసి గొల్పుతాడు ఉదంకుడు. సర్పయాగం జరుగుతుంది. ఆస్తీకుడు దీనిని ఆపుతాడు. కద్రువ కుమారుడైన వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జరత్కారుడు. వారికి ఆస్తీకుడనే వాడు పుడతాడు. అతను తక్షకుడు చనిపోయే సమయానికి ఈ సర్పయాగం ఆగిపోయేలా చేస్తాడు.

మహాభారతంలోని ఈ సర్పయాగ సంఘటన చుట్టూ ఉదంకోపాఖ్యానం, రురుప్రమద్వర కథ, క్షీరసాగరమథన కథ, సుపర్ణోపాఖ్యానం మొదలగు ఎన్నో ఉపాఖ్యానాలు అల్లుకొని ఉంటాయి. ఈ ఉపాఖ్యానాలలోని పాత్రల మనస్తత్వం, వారి జీవితంలో ఏర్పడిన సంఘటనలకు వారెలా ప్రతిస్పందించారు, ఆయా పాత్రల బలాలు బలహీనతలు ఎలా సర్పయాగానికి కారణం అయినాయో ఇక్కడ విశ్లేషించుకుందాం. మహాభారతంలోని చాలా పాత్రల స్వభావాన్ని మనం గమనించినట్లైతే మానవుడు ఎలా జీవించాలి, ఎలా జీవించగూడదు అని మనకు ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ‘‘కావ్యాలు కాంతా సమ్మితాలు’’ అనే కావ్యలక్షణాన్ని బట్టి కావ్యాల పరమ ప్రయోజనం ప్రబోధాత్మకతనే.   

  1. ఉదంకుడు:

వేదుడు అనేవాడు అయోదధౌమ్యుడు అనే గురువు దగ్గర విద్య నేర్చుకుంటాడు. అయితే తన గురువు తనకు చాలా కఠినంగా శిక్షణ ఇచ్చాడని తన శిష్యుడైన ఉదంకునికి అలాంటి కష్టం ఉండకూడదని ఏమీ కష్టపెట్టకుండా సులభంగా విద్య నేర్పుతాడు. అయితే విద్య పూర్తి అయిన తరువాత ఉదంకుడు గురుదక్షణ ఇస్తానంటాడు. నిష్కామ కర్మసాధకుడైన గురువు తనకు ఏమీ వద్దని అంటాడు. చివరికి ఉదంకుడు పట్టు పట్టడంతో గురుపత్నినకి ఏమైనా గురుదక్షిణ కావాలో అడుగుమంటాడు. అప్పుడామెను అడుగగా తనకు పౌష్యమహారాణి చెవి కుండలాలు కావాలని అడుగుతుంది. ఈ సందర్భంలో ఉదంకుని మొండి పట్టుదల, అలాగే కార్యసాధకుని లక్షణాలు కనబడుతాయి. అయితే ఉదంకుడు గురువుకున్న నిష్కామ కర్మ లక్షణాన్ని ఒంటబట్టించుకోలేదని ముందుముందు కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఉదంకుడు నేర్చుకున్న విద్యలన్నీ కూడా ‘‘గురుదయ నణిమాదికాష్టగుణములతోడన్‌….’’ – (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-1- 92) అని చెప్పినట్టు భౌతికనికే సంబంధించిన అణిమ, గరిమాది విద్యలే.

ఆధ్యాత్మిక ఇంద్రియనిగ్రహాది విద్యలు కావు. పౌష్య మహారాజుకు శాపమిచ్చిన సమయంలో, తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న సమయంలో ఇంద్రియ నిగ్రహం లేని విషయం మనకు తెలుస్తుంది. వ్యక్తిగత కార్యసాధన మాత్రమే ముఖ్యంగా అతను అణుకుంటాడు. లోకానికి మేలు జరిగే పనులు చేయాలనేది సత్పురుషుని లక్షణం.  ఈ గుణం తనకి లేదని మనకు తెలుస్తుంది.   ‘‘భూవినుత! నిన్నుద్రిభువన – పావను నశుచి వని యెట్లు పలుకఁగ నగు? న….’’ – (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-1- 96) అనే సందర్భంలో పౌష్య మహారాజు ఉదంకుడికి ఆచమనాన్ని, శుభ్రతను మరచిన విషయం చెబుతాడు. నిజానికి బ్రాహ్మణులే సంస్కారాలు ఇతరులకి తెలుపాలి కాని ఇక్కడ వ్యతిరేకంగా కనిపిస్తుంది. అలాగే ఇంకో సందర్భంలో

‘‘గుడుచుచో నన్నంబు కేశదుష్టం బైన రోసి, కరం బలిగి

 ‘యిట్ల పరీక్షితం బైన యశుద్ధాన్నంబు పెట్టినవాడ వంధుండ వగు’ మని

శాపం బిచ్చిన, నల్గి ‘యల్పదోషంబున నాకు శాపం బిచ్చినవాడవు

నీ వనపత్యుండ వగు’ మని ప్రతిశాపం బిచ్చిన,….’’  – (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-1- 99) 

దానం స్వీకరించడానికి వచ్చిన వాడు కృతజ్ఞుడిగా ఉండవలసింది పోయి చిన్న కారణానికే ఉదంకుడు పౌష్యమహారాజుకు శాపం ఇస్తాడు. ప్రతిశాపం పొందుతాడు. అంటే దీని ద్వారా చంచల  మనస్తత్వం, ఇంద్రియ నిగ్రహంలేని వాడుగా ఇక్కడ కనిపిస్తాడు. భగవద్గీత సాంఖ్యాయోగంలో ‘‘ధ్యాయతో విషయాంపుసః…’’ శ్లోకాలలో చెప్పినట్టు తన కోపమె తన శత్రువు అయి, బుద్ధి నాశనం జరిగి, వ్యక్తిత్వంలో అధమ స్థాయికి వెళ్ళిపోతాడు. ‘‘నిండుమనంబు నవ్యనవనీతసమానము….’’ – (శ్రీమదాంధ్రమహాభారతం-ఆది-1-100) అన్నట్టు నవ్యనవనీతంగా ఉంచుకోవలసిన మనసును కోపాగ్నితో నింపుకోవడం ఎంత అనర్దదాయకమో, తన వేలితో తన కంటినే పొడుచుకున్న ఉదంకుని కథ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే తక్షకునిపై తనుకున్న వ్యక్తిగత ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి జనమేజేయ మహారాజును కూడా పావులా వాడుకుంటాడు. అలాగే నిషేదితమైన, ప్రకృతి వినాశకరమైన, అమానవీయమైన సర్పయాగాన్ని తలపెడుతాడు. తన శక్తితో దైవ సృష్టికే విఘాతం కలిగిస్తాడు. ఇతనికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఆలోచించేవాడు, లోకకళ్యాణాన్ని కాంక్షించే వాడు ఆస్తీకుడు.

  1. ఆస్తీకుడు :

    తన మాతృ, పితృ వంశాలను ఉద్ధరించడానికి పుట్టిన వాడు. అందరితో సౌమ్యంగా ప్రవర్తిస్తాడు. చాలా చాకచక్యంగా జనమేజేయ మహారాజుతో సంభాషణ జరిపి సర్పయాగం ఆగిపోయేలా చేస్తాడు. ఇతనిలో వ్యవహారదక్షత, సంభాషణా నైపుణ్యతా అనే గుణాలు కనిపిస్తాయి.

  1. తక్షకుడు :

‘‘ప్రల్లదుఁ డైన యొక్కకులపాంసను చేసినదానఁ దత్కులం

బెల్లను దూషితం బగుట యేమి యపూర్వము?…’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-1- 125)

అని ఉదంకుడు అన్నట్లు వంశంలో ఒక్కడు హీనుడున్నా ఆ వంశం మొత్తం నాశనమవుతుంది అనే దానికి ప్రతీక తక్షకుని పాత్ర.  తక్షకుడు కపటి, చోరుడు, తన కార్యం నెరవేర్చుకోవడానికి లంచం ఎరగా చూపేవాడుగా మనకు కనిపిస్తాడు. (పరీక్షిత్తును కాపాడడానికి వెళుతున్న కశ్యపునికి ధనం ఇచ్చి వెనక్కు పంపిస్తాడు) అలాగే తన జాతి మొత్తం తన కారణంగా చనిపోతున్నా కూడా తను మాత్రం తన ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తాడు.

  1. శమీకుడు:

పరీక్షిత్తు మహారాజు తన పట్ల ప్రవర్తించిన అనుచిత ప్రవర్తనను కూడా క్షమా గుణంతో సహించిన వాడు. అలాగే కొడుకు శృంగికి కూడా క్రోదం ఉండకూడదని చెబుతాడు. తన మాటను విని శాపం ఉపసంహరించుకోమని చెబుతాడు. కాని తన కొడుకు అందుకు అంగీకరించకపోవడంతో రాజుకు తన శిష్యుడైన గౌరముఖుడితో కబురు పంపి ప్రాణాలను రక్షించుకోమని చెబుతాడు. అంటే తనని అవమానించిన రాజును కూడా కాపాడాలనే ఉన్నత వ్యక్తిత్వం గల మహర్షిగా మనకు కనబడతాడు.

ఈ సందర్భంలోని కోపం ఉండ కూడదని చెప్పే రెండు కంద పద్యాలు మహాభారతంలో సూక్తి రత్నాలు.

‘‘క్రోధమ తపముం జెఱుచును; –గ్రోధమ యణిమాదు లైన గుణములఁ బాపుం:

గ్రోధమ ధర్మక్రియలకు– బాధ యగుం; గ్రోధిగాఁ దపస్వికిఁ జన్నే?      (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 171)

క్షమ లేని తపసితపమును, — బ్రమత్తుసంపదయు, ధర్మబాహ్యప్రభురా

జ్యము భిన్నకుంభమున తో –| యములట్టుల యధ్రువంబు లగు నివి యెల్లన్‌.’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 172)

  1. శృంగి:

తన తండ్రికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని పరీక్షిత్ మహారాజుకు శాపం పెడతాడు. తన తండ్రి చెప్పే మాటలను కూడా వినడు. తొందరపాటు వ్యక్తిత్వంతో ఉంటాడు. 

  1. పరీక్షిత్తు:

వేట వ్యసనంతో విచక్షణను కోల్పోతాడు. ఆలోచన నశించి అసహనానికి లోనై ప్రాణం మీదికి తెచ్చుకుంటాడు. అందుకే పెద్దలు సప్త వ్యసనాలలో వేట ఒకటి అని చెప్పారు. ‘‘మృగయావ్యసనంబున నపరిమితక్షుత్పిపాసాపరిశ్రాంతుం డయి… ’’(శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 176) శమీకుడనే మహా తపస్విని అవమాన పరుస్తాడు. తత్ఫలితం అనుభవిస్తాడు.

  1. కద్రువ

కశ్యపుని భార్యలలో ఒకరు. నాగులకు తల్లి. ఈమె కుంచితమైన మనస్తత్వం కలది. పాల సముద్రంలో పుట్టిన  పరిపూర్ణంగా తెల్లగా ఉన్న ఉచ్చైశ్శ్రవం అనే గుర్రాన్ని చూసి ‘‘…చూడవె యల్ల యతిధవళంబైన యశ్వంబునందు సంపూర్ణచంద్రునందు నల్లయుంబోలె వాలప్రదేశంబునందు నల్లయై యున్నది’..’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 30) నల్లని మచ్చ ఉన్నదని తన సవతి వినతతో చెబుతుంది. ఇలా లేనిది ఉన్నట్లు అనడం, రధ్రాన్వేషణ జరపడం దానికోసం అవినీతిగా ప్రవర్తించడం బట్టి చూస్తే, ఆమె తను గెలవడం కోసం ఎంతకైనా తెగిస్తుందనేది తెలుస్తుంది. చివరకు తన మాట వినని తన సొంత కొడుకులని మరణించాలని శాపం పెడుతుంది. ఇంత దుర్మార్గ ప్రవర్తన ఉన్నది కనుకనే చివరిదాకా దుఃఖంతో, అభద్రతా భావంతో జీవిస్తుంది.    

  1. వినత

          ‘‘…వినత గోరె సుపుత్త్రులన్‌ భుజవీర్యవంతుల, వారికంటెను బలాధికు లైన వారిఁ, గడిందివీరుల, నిద్దఱన్‌..’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 03), ‘‘ కద్రూ పుత్రాధికౌ బలే…’’ (సంస్కృత మహాభారతం -ఆది-16- 09) కశ్యపుని మరో భార్యవినత. వినత తన సవతి అయిన కద్రువ కొడుకులకంటే బలవంతులైన ఇద్ధరు కొడుకులు కావాలని భర్తను వరమడుగుతుంది. ఇలా అనడంలోనే, పోల్చుకోవడంలోనే ఆమె ఈర్ష్యా స్వభావం మనకు కనబడుతుంది. ఈర్షాలువు సుఖంగా ఉండడు కనుక తన సవతికి బానిసలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే కద్రువకు వేయిమంది పుత్రులు కలుగగానే తన రెండు అండములలో ఒక అండాన్ని బ్రద్దలుకొడుతుంది. అందులో నుండి ఊరువులు రూపొందని అనూరుడు జన్మించి తన వైకల్యానికి కారణమైన తల్లికి శాపం పెడతాడు. ఇక్కడ వినతలో ఆత్మన్యూనత భావం, ఆత్మధైర్యం లేకపోవడం, అలాగే ఓపిక, సహనం, తనపై తనకు నమ్మకం లేకపోవడం అనే మనోదౌర్బల్యాలు కనబడతాయి. హృదయ దౌర్బల్యం ఉన్నవారు దుఃఖాన్ని అనుభవిస్తారని మనకీ పాత్ర ద్వారా తెలుస్తుంది. 

  1. గరుత్మంతుడు:

          ‘‘..కొడుకులు సమర్థులైనం దల్లిదండ్రులయిడుమలు వాయుట యెందునుంగలయది’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02-51) తన తల్లికి దాస్య విముక్తి కలిగించిన సమర్థుడు, వజ్రాయుధాన్ని ఎదిరించే ధీరుడైనా తల్లి మాట జవదాటని వాడు, విశ్వమంత శక్తి ఉన్నా వినమ్రత కలిగిన విష్ణు భక్తుడు.

          తల్లి దాస్య విముక్తి కోసం ఇంద్రునితో పోరాడి సాధించుకున్న అమృతాన్ని ఒక్క చుక్క కూడా తాగక పోవడంతో విష్ణువు గరత్మతున్ని మొచ్చుకొని తన జెండా గుర్తుగా, వాహనంగా తనతోనే నిరంతరం ఉండమంటాడు. ఐహిక సుఖాల మీద అనాసక్తి ఉన్న వారికి నిరంతర దైవ సాన్నిధ్యం దొరుకుతుంది అనే దానికి ప్రతీక గరుత్మంతుడు కనబడతాడు. 

10.రురు ప్రమద్వర ప్రేమ వృత్తాంతం:

 ‘‘మమ ప్రాణ సమా భార్య దష్టాసీద్ భుజంగేన హ…’’ – (సంస్కృత మహాభారతం -ఆది-10- 01). రురుడు అనే వాడు తన ప్రేయసిని పాము కరచిందని సర్పాలనన్నీ సంహరిస్తూ ఉంటాడు.  అతనికి ఒకసారి ముసలిదైన విషరహిత డుండుభజాతి పాము కనిపిస్తుంది. దానిని చంపబోతున్నప్పుడు రురుకు తన పూర్వ జన్మ వృత్తాంత చెబుతూ అహింస గురించి తెలుపుతాడు.   

 ‘‘ఇదం చో వాచ వచనం రురుమ ప్రతి మౌజసం

అహింసా పరమోధర్మ: సర్వ ప్రాణభృతాం వర’’ – (సంస్కృత మహాభారతం -ఆది-11- 03).

ఆస్తీకుడు ఎలాగైతే సర్పయాగం ఆపించాడో అలాగే సర్పాలను చంపే రురుడిని సహస్రపాదుడు (డుండుభుడు) ఆపిస్తాడు.  

తన భార్య (ప్రమద్వర) ను పాము కరచినప్పుడు విలపిస్తూ తనను బ్రతికించిన వారికి తన తఫః ఫలాన్ని వేదాధ్యయన ఫలాన్ని, దాన ఫలాన్ని ఇస్తానంటాడు. తన ఆయుస్సును సగం ఆమెకు దారపోస్తాడు. ‘‘నా తపముఫలంబు నధ్యయనదానఫలంబులు నిత్తు వారికిన్‌.’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-1- 149)

 ఒకరకంగా చూస్తే రురుడు చాలా ఆదర్శవంతమైన ప్రేమికుడుగా కనబడతాడు కాని లోకకళ్యాణం కోసం వినియోగించాల్సిన తన శక్తిని కేవలం ఒక్క తన భార్యను కాపాడడం కోసం వాడడంలో అతని బలహీనత కనబడుతుంది. అంతేకాక ఒక్క పాము కరచిందని లోకంలో ఉన్న పాములన్నింటిని చంపుతానని బయలుదేరడంలో అతని అజ్ఞానం మనకు తెలుస్తుంది. 

ముగింపు :

          ‘‘నీలాంబరపరిధానులును, ధూమసంరక్తనయనులు నై యాజ్ఞికు లగ్నిముఖంబు సేసి వేల్వం దొడంగిన.’’ (శ్రీమదాంధ్రమహాభారతం -ఆది-02- 208)  సర్పయాగ వర్ణనలో నల్లదనం చెడుకు ప్రతీకగా, రక్తనయనాలు రాక్షసత్వ భావాలకు ప్రతీకగా, పాములు అగ్నిలో పడి మరణించడాన్ని సృష్టి వ్యతిరేక చర్యగా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రకృతి సహజంగా లయం చెందాలి కాని స్వార్థపరుల చేతిలో కృత్రిమంగా నశించకూడదు అనే విషయం ఇందులో ధ్వని గర్భితం. మానవుడు ప్రకృతి శక్తులను సకారాత్మక (పాజిటివ్) దృష్టితో చూడాలే తప్ప నకారాత్మక (నెగటివ్) దృష్టితో చూడగూడదు. ఒకవేళ చూస్తే అతని జీవితం అస్తవ్యస్తంగా తయారై తననే కాదు తన జాతి మొత్తాన్ని దుఃఖసాగరంలో ముంచేస్తుంది అనే పరమ సత్యాన్ని ఈ సర్పయాగం ద్వారా తెలుసుకోవచ్చు. 

ఉపయుక్త గ్రంథ సూచి :

  1. శ్రీమదాంధ్ర మహాభారతం – తిరుపతి దేవస్థానం. 2008
  2. శ్రీమహాభారతం. (సంస్కృతం) – గీతాప్రెస్, గోరఖ్ పూర్. 2021

-డా.బూర్ల చంద్రశేఖర్,

అసోసియేట్ ఫ్రొపెసర్, తెలుగు విభాగం,

శ్రీరాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (స్వ), కరీంనగర్.

చరవాణి : 9849582926

విద్యుల్లేఖ: chandu.dmpboorla2023@gmail.com

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top