sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

తెలుగు సాహిత్యంలో భక్తి యోగం – డా.తాటికాయల భోజన్న

Volume – 1,                       April 2026                                issue –  1                      ISSN: 3139-6283

సమర్పణ (D.O.S): 05 -03 – 2026        ఎంపిక (D.O.A): 15 – 03 – 2026                   ప్రచురణ (D.O.P)01-04-2026  

వ్యాస సంగ్రహం :

‘సహితస్య భావ: సాహిత్యం’’ హితేన సహితం సాహిత్యం’. సాహిత్యం అంటే సమాజానికి మంచి చేసేది. తెలుగు సాహిత్యం నన్నయ కాలం నుండి చిగురులు తొడిగి నేటి  వరకు కొత్త పుంతలు తొక్కుతూ సెలయేరులా గల గల పారుతూనే ఉంది. ‘శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో’ అనే మొదటి పద్యంలో లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఇష్ట దేవత స్తుతితో తెలుగు సాహిత్యాన్ని 11 శతాబ్దంలో ఆరంభించాడు నన్నయ.  12 శతాబ్దం శివ కవి యుగంలో నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, పాల్కురికి సోమనాథుడు శివుడే పరమాత్ముడని, ఆత్మ సమర్పణ ద్వారానే మోక్షం వస్తుందని, కుల, మత భేదాలు లేకుండా శివ భక్తిలో అందరు సమానమని సంఘ సంస్కరణ దృష్టితో దేశి ఛందస్సులో (సరళమైన తెలుగు) రచనలు చేశారు. తిక్కన 13 శతాబ్దంలో శివుడు, విష్ణువు ఒక్కడేనని హరిహరనాథ తత్వాన్ని శక్తి, శాంతి, భక్తి మార్గాలను సూచిస్తూ సమాజానికి గొప్ప మేలు చేశాడు. 14 శతాబ్దంలో ఎర్రన భక్తి ఉద్యమానికి పునాది వేశాడు. 15 శతాబ్దంలో శ్రీనాథుడు కాశీ ఖండం మూడవ ఆశ్వాసంలో పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అనే వాగ్దేవీ స్వరూప తత్తాలను, భక్తి, యోగ శాస్త్రాలను, పోతన వైష్ణవ భక్తి ఆధారంగా దేవుడే సర్వస్వం అని, నిష్కామ భక్తి మోక్షానికి దగ్గర చేస్తుందని గజేంద్రుడిలో మానవుడిని, అరిషడ్ వర్గాలను మొసలిలో దూర్చి జాగ్రత్తగా జీవించాలని జ్ఞాన బోధ చేశారు. 16 శతాబ్దం ప్రబంధ యుగంలో అల్లసాని పెద్దన మను చరిత్ర(విష్ణు), ధూర్జటి కాళహస్తీశ్వర శతకం (శివ), తెనాలి రామకృష్ణ (విష్ణు), నంది తిమ్మన పారిజాతపహరణం (విష్ణు) మొదలైన వారి రచనల్లో శృంగారం ప్రధాన వస్తువైనా, భక్తిని కూడా అంతర్భాగంగా నడిపించారు. 17 శతాబ్దంలో కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంలో వ్యాజ స్తుతి (నిందా స్తుతి)లో భక్తిని పండించారు. క్షేత్రయ్య, త్యాగయ్య, భద్రాచల రామదాసు, రంగాజమ్మ, ముద్దుపళని, నారాయణ తీర్థులు భక్తి, గానం, నృత్యం మొదలైన వాటి ద్వారా భక్తిని తెలియజేశారు. సాహిత్యంలో ఈ భక్తి తత్వాన్ని విశ్లేషించడం నా వ్యాస ఉద్దేశం.

కీలక పదాలు :

తెలుగు, సాహిత్యం, భక్తి, యోగం, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం, అజ్ఞానం, అపనమ్మకం, మిడిమిడి జ్ఞానం, మబ్బులు, సూర్యుడు, మనిషి, ఆరాధన, అనుబంధం,  విశ్వాసం, మోక్షం,

ప్రవేశిక :    

‘‘శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం’’

(తెలుగు సాహిత్య చరిత్ర,పుట:168)

పోతనాది కవులు భక్తి తత్వాన్ని చెప్పారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు దీనస్థితిని చెబుతూ ‘‘నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్; రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా! (కావ్య మందారం, పుట : 22, 2010). ఆర్తితో నాకు నీవు తప్ప ఇతరులెవ్వరు తెలియదు నన్ను ఆదుకోమని వేడుకోవడం అహంకారం పోయిన తరువాత కలిగే స్థితికి నిదర్శనం. నన్నయ్య ఆదిపర్వం సావిత్రోపాఖ్యానంలో పతిభక్తి గొప్పతనం తెలుస్తుంది. ధర్మపురి శేషప్ప నృసింహ శతకంలో వైరాగ్యం, భక్తి కనిపిస్తాయి.

విషయ వివరణ :

భక్తి అనగా జ్ఞానం. ఆత్మను, పరమాత్మను చూపిస్తూ జ్ఞానం దిశగా అడుగులు వేస్తూ జీవితంలో వెలుగులు నింపుకోవడానికి చేసే ప్రక్రియ. మనిషి జీవితంలో నిరంతరంచీకటి వెంటాడుతూనే ఉంటుంది. ఆ చీకటి నుండి వెలుగునిచ్చి, ప్రశాంతనిచ్చేది కేవలం భక్తి మాత్రమే.ఈ విషయాన్ని మన ప్రాచీనులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే బయట ప్రపంచాన్ని వదిలి అంతరంగిక ప్రపంచంలోకి  వెళ్లి తెలుసుకుని, భక్తి తత్వాన్నినేరుగా అందించడం వల్ల ఏ లాభము ఉండదని, ఏదో ఒక వస్తువుని సహాయంగా తీసుకుంటేనే తనలోకి తాను చేసే ప్రయాణం సులభమవుతుందని చెప్పారు. వ్యక్తిత్వమే దైవత్వమని చెప్పవచ్చు. ఈ వ్యక్తిత్వం అంత సులభంగా సిద్ధించేది కాదు. ఎంతో కఠోర శ్రమతో తమను తాము తెలుసుకుంటూ జీవితంలో మార్పులు చేసుకుంటూ ఉంటే తప్ప ఈ అద్భుతమైన జ్ఞాన సంపదను అందుకోలేరు

‘‘మామేకం శరణం వ్రజ’’ శ్రీకృష్ణుడు అర్జునుడికికర్తవ్య బోధ చేసిన మాటలో అన్ని వదిలి నన్నే స్మరించు, నన్నే నమ్ముకో, నేనే సర్వం, నేనే దారి చూపే వాడిననడం భక్తితో దేవుని నమ్ముకుంటే అన్ని తానై చూసుకుంటాడు. ‘‘ ఈ మానవ దేహం ఆత్మను, పరమ సత్యమును అన్వేషించడానికై ఉద్దేశించబడింది’’(కృష్ణ చైతన్యమే సర్వోత్తమ యోగం, పుట : 04, 1991). పురాణాలలో ప్రహ్లాదుడు, దృవుడు, గజేంద్రుడు మొదలైన వారు తమ భక్తిని లోకానికి చాటారు. తండ్రి  ఎన్ని కష్టాలు పెట్టిన చివరికి మరణం వచ్చినా విష్ణునామం వదలడు. చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు ఎంత లోతైన ఆధ్యాత్మిక భావజాలంలో ఉన్నాడో తెలుస్తోంది. మోక్షమంటే అతీతమైన భక్తితో దేవుని చేరడం. మరీ  దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్తూ…

‘‘ఇందుగలఁడందులేఁడని

సందేహము వలదు చక్రి సర్వోపగతుం

డెందెందు వెదకి చూచిన

నందందే కలఁడు దానవాగ్రణి! వింటే.’’(గజేంద్ర మోక్షం,23)

విష్ణువు (చక్రి) ప్రతి చోట ఉంటాడు. అతని ఉనికిని అన్వేషించడానికి అవసరం లేదు, ఎందుకంటే ఆయన సర్వవ్యాపకుడంటూ పోతన ప్రౌఢ భక్తి చాటాడు.

రామాయణం అనగానే పితృభక్తి గుర్తుకు వస్తుంది అదే విధంగా భ్రాతృ భక్తికి సాటి లేదని చెప్పే ఎన్నో అంశాలు రామాయణంలో కనిపిస్తాయి. రాముడు లేని రాజ్యంలో తాను కూడా ఉండాలని తల్లి చేసిన తప్పుకు బాధపడుతూ అడవిలో ఉన్న రాముని చేరి తిరిగి పట్టాభిషిక్తుడివి కమ్మని వేడుకున్న భరతుడు భ్రాతృ భక్తి రామాయణంలో మరిచిపోలేనిది.

భరత లక్ష్మణ శత్రఘ్ను ధరణి సుతల

గూడి దుఃఖించి దుఃఖించి కొంత వడికి

నాప్త వర్ణంబుచే మానె నంత మీద

భరతుడిట్లనె శ్రీరామ భద్రతోడ –   (మొల్ల రామాయణం, 38)

అడవికి వెళ్ళి నార వస్త్రాల్లో ఉన్న రామలక్ష్మణులను చూసి చలించిపోయిన మనసుతో భరతుడు ఏడ్చి ఏడ్చి చివరికి తనను తాను  ఓదార్చుకొని రామున్ని తిరిగి రాజ్యానికి రమ్మని వేడుకుంటాడు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్యని తానూ అక్కడే ఉండి, నువ్వు రాకపోతే నాకు అయోధ్య అవసరం లేదంటూ తన భక్తి చాటుకుంటాడు.

ఈ ప్రపంచం అంతా మాయలో ఉంది భార్య, పిల్లలు, డబ్బు ఇహపర సుఖాలలో తేలుతూ నిజమైన తత్వమేమిటో, జీవిత పరమార్ధమేమిటో తెలుసుకోలేకపోతున్నాడు. సంసార సుఖాల్లో తెలియాడే జనులకు రామనామము చల్లటి హాయిని, ఓదార్పునిస్తుంది, పాప కడలిని దాటిస్తుందంటూ రామదాసు చెప్పిన ఈ పద్యం…

“దారుణపాతకాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తిని

స్తారదవానలార్చికి సుధారసద్రుష్టి దుర్త దుర్మతా

చారభయంకరాటవికి జండకఠోరకుఠారధార నీ

తారకనామ మెన్నుకొన  దాశరథీకరుణాపయోనిధి”       (దాశరథీశతకం,17)

తారక రామ నామము బడబాగ్ని సముద్రమును పేల్చినట్లు,భయంకరమైన పాతకాలను పోగొట్టును. అమృత వర్షము కారుచిచ్చును చల్లార్చినట్టు, సంసార బాధలను తగ్గిచును. పదునైన గొడ్డలి భయంకర అడవిని నరుకునట్టు మితిమీరిన చెడు ఆలోచనలు నిర్మూలము చేయును

‘‘ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది

అంతా మిధ్య తలంచి చిన నరుండట్లౌ టెరంగిన్ సదా

కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు  మోహార్ణవ

భ్రాంతిం జెంది చరించు గాని పరమార్ధంబైన నీయందు దా

చింతాకంతయు చింతనిల్పడు  కదా! శ్రీ కాళహస్తీశ్వరా! (పద్యం, 03) ఈశ్వరా!  ఈ లోకమంతా మిథ్య అని తెలిసి కూడా మానవుడు  భార్యా బిడ్డలు, ధనము, దేహము అనే భ్రమలో పడి ప్రవర్తిస్తాడే కాని ముక్తి ఇచ్చే నీయందు మనస్సును నిలపడు కదా అంటూ లౌకిక విషయాలన్ని ఉట్టివే అంటాడు.

పాల్కురికి సోమన బసవ పురాణంలో పాత్రలు ముగ్దలు. దేవునిపై భక్తికి వయసుతో సంబంధం లేదని నిరూపించినదే గొడగూచి కథ. శివుడు స్వయంగా వచ్చి పాలు తాగడని తెలియని గొడగూచి అమాయకత్వంతో, పాలు తాగక పోవడానికి కారణాలను అడుగుతూ ఉంటుంది. చివరికి చనిపోవడానికి సిద్ధమైన ఆమె భక్తికి మెచ్చి శివుడు పాలు తాగుతాడు. ప్రతిరోజు ఇలాగే జరుగగా ఒక రోజు పాలేవని తండ్రి అడిగి, శివుడు పాలు తాగడమేంటని కోపగించి ఆమెను కొట్టబోవుగా శివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు.

బాలవాపోవుచు బలివిడినేగి

హాలింగ హాలింగా హాలింగా యనుచు….

హరుడోడకు మనుచు నా క్షణమ

వరదయామతి ధన వక్షంబు దె  ఱవ

జగదభినుతి కరడిగ భోగనాథు…

బాల నిచ్చల ముక్త భావసంపదకు…

నడరె దా నా ముగ్ధ యదియునుగాక (గొడగూచి కథ, 13)

తనపై అపార భక్తిని చూపించిన గొడగూచిని తనలో కలుపుకుని ప్రపంచానికి భక్తి గొప్పతనం చాటాడు శివుడు.  సోమన రచించిన ఈ కథలో భక్తికి పరాకాష్ట రూపం గొడగూచి.

ముగింపు :

భక్తి అనేది ఏ సమాజంలోనైన కొన్ని వర్గాలకి భుక్తిని సమకూర్చే సాధనంగా కొందరు చూస్తున్నారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, ప్రబంధాలు భక్తిని తెలియజేస్తూనే ఉన్నాయి. ఎన్నోవిషయాలను తనలో మిళితం చేసుకున్న సాహిత్యంలోని ప్రాచీన కావ్యాలలో ప్రధానంగా కనిపించే అంశం భక్తి. మనసా, వాచా, కర్మణా దేవునికి దగ్గర కావడమే భక్తి. ప్రాచీన కవులు చాలా మంది ఈ భక్తి తత్వాన్ని తమదైన ప్రత్యేక కోణంలో నిర్వచించారు. పాల్కురికి సోమన  భక్తిని ఒక  సాహిత్య ఉద్యమంగా తీసుకుని వచ్చాడంటే ప్రాచీన సాహిత్యంలో భక్తికున్న ప్రాధాన్యత తెలుస్తుంది. మొల్ల రామాయణంలో శబరి మధుర  భక్తి అనిర్వచనీయమైనది. దైవభక్తి, స్నేహభక్తి, పతిభక్తి, మాతృభక్తి అని భక్తి వివిధ రూపాలలో చెప్పబడింది.

ఆధార గ్రంథాలు :

  1. భక్తి వేదాంత స్వామి – కృష్ణ చైతన్యమే సర్వోత్తమ యోగం, 2011, భక్తి వేదాంత బుక్ ట్రస్ట్, హైదరాబాద్.

2 భోజన్న తాటికాయల- ధర్మపురి మండల జానపదకథలు, 2015, ధర్మపురి ప్రచురణలు, హైదరాబాద్..

  1. మంజులత ఆవుల- తెలుగులో కవిత్వోద్యమాలు , 2003, తెలుగు అకాడమి, హైదరాబాద్.
  2. వీరన్న గుమ్మ- భారతీయ సంస్కృతి -తత్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
  3. 5. వీర వెంకయ్య కొండపల్లి – దాశరథి శతకం, 1937, శ్రీ సత్యనారాయణ బుక్ డిపో, రాజమండ్రి.
  4. వేంకటరామ శాస్త్రి కొంపెల్లి – .శ్రీకాళహస్తీశ్వర శతకం, 2008, రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి.

-డా.తాటికాయల భోజన్న

                                      చరవాణి : 9704383592

                                       విద్యుల్లత: bhojanna87@gmail.com

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top