sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

ఆదిభట్ల నారాయణదాసుగారి సారంగధర నాటకం – పరిశీలన – డా॥ వై.వి.సిహెచ్‌. లీలాపద్మజ

Volume – 1,                                                      August  2026,                                          issue – 5,

సమర్పణ (D.O.S): 02-07 – 2026               ఎంపిక (D.O.A): 14– 07 – 2026          ప్రచురణ (D.O.P) :  01-08-2026  

వ్యాస సంగ్రహం:

తెలుగు సాహిత్య చరిత్రలో హరికథా పితామహుడిగా ప్రసిద్ధి చెందిన ఆదిభట్ల నారాయణదాసు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన రచించిన సారంగధర నాటకం సాంప్రదాయ కథావస్తువును ఆధారంగా చేసుకొని నాటకీయత, పాత్రల చిత్రణ, సంభాషణా వైదుష్యం, భాషా సౌందర్యం, రసపోషణ, సంగీతాభిరుచి వంటి విశిష్ట లక్షణాలతో రూపుదిద్దుకుంది. ఈ పరిశోధనాత్మక వ్యాసంలో సారంగధర నాటకంలోని కథా నిర్మాణం, ప్రధాన పాత్రల స్వభావ చిత్రణ, నాటక శిల్పం, భాషా శైలి, రసపోషణ, నైతిక విలువలు, సామాజిక సందేశం వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించబడింది. అలాగే ఆదిభట్ల నారాయణదాసు నాటక రచయితగా ప్రదర్శించిన సృజనాత్మక దృష్టి, సంప్రదాయం–నవ్యతల సమన్వయం, తెలుగు నాటక సాహిత్యంలో సారంగధర నాటకానికి ఉన్న విశిష్ట స్థానాన్ని ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది. ఈ పరిశీలన ద్వారా నాటకంలోని సాహిత్య, సాంస్కృతిక, నాటకీయ విశేషాలు వెలుగులోకి రావడంతో పాటు తెలుగు నాటక వికాసంలో ఈ కృతి ప్రాముఖ్యతను నిర్ధారించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.

కీలకపదాలు :

ఆదిభట్ల నారాయణదాసు, సారంగధర నాటకం, తెలుగు నాటక సాహిత్యం, పాత్ర చిత్రణ,  నాటక శిల్పం, రసపోషణ,  భాషా శైలి కథా నిర్మాణం,సాంప్రదాయం–నవ్యత, సాహిత్య పరిశీలన

పరిచయం:

విశ్వశ్రేయః కావ్యమ్‌ అనే నానుడి జగద్వితమే. కావ్యం దృశం కావ్యం శ్రవ్య కావ్యం అని రెండు విధాలుగా కూడా విశ్వం యొక్క శ్రేయస్సును కోరుతూ ఔపదేశికత్వాన్నందిస్తుంది. అయితే దృశ్య కావ్యంగా తన ప్రభావాన్ని త్వరితంగా గాఢంగా చూపించడంలో కావ్యం – ఒక రకంగా ఎక్కువ సఫలీకృతమైౖందనవచ్చు. ‘‘కావ్యేషు నాటకం రమ్యం’’ అనే లోకోక్తి దీనికి బుజువుగా చెప్పవచ్చు. అట్లా కవులు అనేక ఇతి వృత్తాలలో వ్రాసిన నాటకాలు ప్రదర్శనల ద్వారా కూడా లోక కళ్యాణాన్ని సాంధించాయి. సమాజానికి తమదైన ధోరణిలో హితవు గరిపాయి.

            సారంగధర నాటకం వాస్తవంగా చారిత్రకము కాదన్నారు పెద్దలు. 1480 ప్రాంతంలో ఈ కథను నవనాథ చరిత్రలో ద్విపదగా చెప్పాడు. 1549 సంవత్సరంలో దోనూరి కోనేరునాథుడు ద్విపదగా వ్రాసాడు. 1620 ప్రాంతంలో చేమకూర వెంకట కవి ఒక ప్రబంధంగా వ్రాసాడు. తరువాత ధర్మవరము కృష్ణమాచార్యులు విషాద సారంగధరగా వ్రాసారు. అయితే వీరంతా కొన్ని కొన్ని మార్పులతో ఈ కథను వ్రాయడం జరిగింది. ఇక అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసుగారు ఈ కథను మరింత వినూత్నంగా, ప్రదర్శనకనుకూలంగా శృంగార, వీర, హస్య, కరుణా రసములు చక్కగా పోషించుకుంటూ తన కవితా పఠిమను చాటుతూ తెలుగుదనం ఉట్టిపడేలా వ్రాసారు. ధార్మిక హితోపదేశాలతో సత్యశీలురను ఎట్లా సత్యదేవత కాపాడుతుందో చెబుతూ కథను మరీ దుఃఖంతో కాకుండా కొంతవరకు సుఖాంతంగా ముగించారు. సమాజంలో వుండే పరిస్థితులను చక్కదిద్దేది సాహిత్యమే గనుక ఈ సారంగధర నాటకం ఆనాటి సమాజానికి ఎంతో హితవు గరిపింది. అలాగే ఉత్తమ సాహిత్యానికి కాలపరిమితి లేదు గనుక ఇలాంటి నాటకం దాని సందేశం ఏనాటి సమాజానికైనా సార్వకాలిక సందేశాన్నందించేదే. కనుక దీని ఆయువు అనంతం.

విషయ పరిశీలన:

               ఇక ఈ సారంగధర నాటకం ఆద్యంతం పరిశీలిస్తే అది హరికథా పితామహ బిరుదాంకితులైన నారాయణదాసుగారి సర్వతోముఖమైన జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని తెలియచేసేదిగా వుంది. 5 అంకాలుగా తీర్చబడిన ఈ నాటకంలో ముందుగా నాందీ ప్రస్తావనలతో ప్రారంభింపబడిరది. కొన్ని ఔచితీవంతమైన మార్పులతో కథను నడిపించారు దాసుగారు. స్థూలంగా కథయితే ఇది రాజరాజు నరేంద్రుని మొదటి భార్య రత్నాంగి, నిజంగా కథయితే ఇది ` రత్నాల వంటి గుణగణాల ప్రోది ఆమె. ఆమె బిడ్డ సారంగధరుడు. ఆతని కోసం చిత్రాంగి అనే యవ్వనవతిని, అతిసుందరాంగిని సంబంధం చూస్తారు. కానీ తనకే నచ్చడంతో రాజుగారే ఆమెను చిన్న భార్యగా వివాహం చేసుకొంటాడు. ఇక్కడే వచ్చింది, చిక్కు. ఇక్కడ వయసులో పెద్దవాడైనప్పటికీ రాజుగారి మోహమే రాబోవు కష్టాలకు కారణమయింది. అసంబద్ధమైన మోహం వుండరాదు. రెండవ భార్యగా వచ్చిన చిత్రాంగి మనస్సులో సారంగధరుడే నిండుగా వున్నాడు. ముసలి భర్త వేటకువెళ్ళినప్పుడు అతడిని రమ్మంటూ ఆమె ఒక ఉత్తరం వ్రాస్తుంది. పూర్తి శృంగారభరితంగా తన మనసును తెలియచేసే ఆ వుత్తరం తమ చెలికత్తె అంటింత అనే ఆమెకిస్తుంది. ఆమె ఆ ఉత్తరాన్ని అతనికి చేర్చకముందే అనుకోకుండా సారంగధరుడు ఎగుర వేసే పావురం చిత్రాంగి  మేడ పైకి చేరడం గిలిగింత అనే పేడి అయిన తన సేవకుడిని పంపడం దానికామె. అతడికి ఆ పావురం ఇవ్వకుండా సారంగధరుడినే రమ్మను తల్లి వద్దకు బిడ్డ రావడానికి అభ్యంతరం ఏమిటి అని అంటింతతో చెప్పించడం జరిగింది. దానికి గిలిగింత మనసులో కీడు శంకించాడు. సరే వార్త  తెలుసుకున్న సారంగధరుడు వెళ్ళ వద్దని వారిస్తున్న తన ప్రాణమిత్రుడైన సుబుద్దిని తిట్టుకుంటూ తల్లి దగ్గరకు వెళ్ళడానికి తప్పేమిటనుకొని వచ్చాడు.  అంటే మన మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు, శంక లేెనప్పుడు మరో విధమైన జంకు కలుగదు. కష్టాలు వచ్చే సమయం వచ్చినప్పుడు జ్ఞానుల మనస్సు కూడా మలినమవుతుంది. ఎట్లా అంటే ‘‘అసంభవం హేమ మృగస్య జన్మ తధాపి రామో లులుభే మృగాయా ప్రాయస్సమాపాన్న విపత్తికాలే థియోపి పుంసాం మలినాభవన్‌ తి’’ అన్నట్లు, బంగారు లేడి ఉనికి ఆసాధ్యం అని తెలిసినా ఆక్షణానికి రాముడు ఆ లేడిని తెచ్చి జానకివ్వాలనే లోభానికి గురి అయినాడు. కష్ట కాలానికి విజ్ఞుల మనసు కూడా మలినం కాకతప్పదు అని పెద్దలు చెప్పినది సారంగధరుడి దగ్గర తనవలసు చేష్టలు చూపింది చిత్రాంగి. వలదు వలదు అని ఎంతగా చెప్పిన ఆమెను తప్పించుకొచ్చాడు, సారంగధరుడు. అయితే ఆమె ప్రణయభంగం ఆమెలో కసిని  రేపి రేపు నీ రక్తంతో బొట్టు పెట్టుకొంటానని అనడు. మరుసటి రోజు ఆమె కపట సాక్ష్యాలతో భర్తకు తన సారంగధరుడిపై లేనివన్నీ చెప్పడం అత్యాచారం జరిగిందని తెలిసిన రాజు అందరి సమక్షంలో అతడి కాళ్ళు, చేతులు, నరికించాలని తీర్పు నివ్వడం జరింగింది. ఇక్కడ దాసుగారు ఒకట్విస్ట్‌ చేసారు. అంటింత కూడా ముసలి భర్తకు భార్య. ఇద్దరి జీవితాలు ఒకలా వుండడంతో చిత్రాంగికి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. ముందురోజు రాత్రి ఆమె అనుకోకుండా భర్తతో విషయం చెప్పడం అది ఆరుగు మీదే పడుకునే తలారి అంటే రాజుగారు వేసే శిక్షలను అమలు జరిపేవాడు వినడం దానితో చిత్రాంగి మోసం తెలియడం జరిగింది. అందువల్ల సారంగధరుడిని రాజుగారు అన్నట్లు శిక్షించలేదు. అయితే ఈ లోపుగా చిత్రాంగి సారంగధరుడు లేని జీవితం తనకు వద్దనుకొని వజ్రాల పొడి మింగి మరణించడం జరింగింది. అంటింత ఏదో మింగుతుండడం చూసి అందరూ దాన్ని గద్దించి అడిగితే మింగబోతున్న ఉత్తరాన్ని చూపింది. అది సారంగధరుడికిమ్మని చిత్రాంగి ఇచ్చిన లేఖ. ఇక అది చూచి అంటింత చెప్పిన యదార్ధం విన్నాక రాజు గారిలో పశ్చాతాపం అయ్యో కొడుకును అకారణంగా చంపుకున్నానన్న వ్యథ కల్గినప్పుడు కొడుకును అకారణంగా ప్రాణాలతో వున్న కొడుకును చూసాడు. ఆప్పుడు రాజుగారు అంటాడు. రోగం వదిలిని శరీరంలా వుంది, నా ప్రాణం. అలాగే నీటిలో మునలేస్తునప్పుడు కలిగే ఉక్కిరి బిక్కిరి తనం నీటిపైన తలపెడితే పోయినట్లు హాయిగా వుంది అంటాడు. ‘‘ఉపమా కాళిదాసస్య’’ అని ప్రఖ్యాతి. కానీ దాసుగారు సందర్భోచితంగా ఈ నాటకంలో వాడిన ఉపమలు చూస్తే ‘‘ఉపమానారాయణస్య’’ అని అనకుండా వుండలేమేమో. అయితే బ్రతికిన సారంగధరుడి నిర్ణయం వింటే వారి తల్లిదండ్రులతో పాటు మనమూ హతాశులమవుతాము. ఆయన మంచి యవ్వనంలో వుండి కూడా యతిని కావాలని, దానికి అనుమతి అడుగుతాడు. అతడితో పాటు సుబుద్ధి తండ్రి అయిన మంత్రిగారు అలానే అనుకొంటాడు. అప్పుడు రాజుగారు తాను కూడా వానప్రస్ధం స్వీకరిస్తాని, సారంగధరుడు పుట్టక మునుపు పెంచుకున్న కొడుకుకి రాజ్యం కట్టబెడదామని మంత్రిగారి పెద్దకొడుకుని మంత్రిగా నియమిద్దామని అనడం చంద్రచూడుడు రాజు కార్యదర్శిని మంత్రిగా చేయబడినారు. దీనితో నాటకం ముగుస్తుంది. భరత వాక్యం వీరందరిచే చెప్పబడిరది. అది కూడా ఎంత అర్ధవంతంగా కథకు సంబంధించి వుందో చూడండి. వైరములేక  యెల్ల ప్రజవర్ధిల్లాలని, విద్యలు వెలుగొందాలని, సత్యముతో న్యాయపతుల చరించాలని ఈశ్వరుడు చల్లగా చూడాలని కోరారు.

            ఇక నాటక రచనలో దాసుగారి రచనా వైభవం ఎలావుందో చూద్దాం – ప్రదర్శించబోవు కథకు అనుగుణంగా సూత్రధారి, నటి మధ్య సంభాషణ మలిచారు. నాందీ పద్యంలో సభాసదులకు కళ్యాణంబు చేయవలెనని వివిధ రకాలుగా ఆశీస్సులందించారు.

               పగలు పలుతెఱగుల పనులందు అలసి పోయిన మనసు సేదతీరడానికి ఈ నాట్యశాల ఒక చలివేంద్రంలా వుండాలని అభిలషించారు. పసిప్రాయం నుండి వీనులకు జ్ఞానిన్నందించే తీయని మాటలే పలకాలి అని సూత్రధారితో దాసుగారు పల్కించడం వెనుక ఆయన సహృదయత దుగ్గోచరమౌతుంది.

               వచ్చిన ప్రేక్షకులకు మన నాటకము వేడుక చేయ వలెనను. సుత్రధారుడు పాట పాడమనగా నటి వసంత ఋతువు గూర్చి పాడగా సూత్రధారుడు తెలివిగా దానిని ప్రదర్శించబోతున్న నాటకమునకు ముడిపెడుతూ మీ గానాధికారం మా రాజరాజనరేంద్రుని మాటవలె సభను సద్దడగించెను అనెను. తదుపరి ప్రథమాంకం ప్రారంభించబడెను.

ఆశ్రితులకు ఏలిక సందర్శనము ఆంభోజములకు సూర్య ప్రకాశమనే ఉపమానం అద్భుతం. అలాంటి రాజు తన సభలో మంత్రి నడిగిన ప్రశ్నలు చూడండి. ఈ ఏడు పంటలెలా పండాయి. విద్యార్థిల చదువులెట్లా సాగుతున్నాయి లాంటి తదితర ప్రశ్నలు వేసినాడు. దీన్ని బట్టి ఏలిక అనేవాడు ఎట్లుండాలో తెలుస్తుంది. రాజు యొక్క సమగ్ర స్వరూపం మంత్రి మాటల్లో తెలిపారు దాసుగారు. అయితే ఎలాంటి ప్రజారంజకుడు అయిన రాజు అయినప్పుటికీ తెలివిమాలి మోహానికి గురి అయితే ఏమవుతుందో అదే అయింది. ఇక రాజుగా రాజ్యం గురించిన కుశల ప్రశ్నలు అయినాక తండ్రిగా రాజరాజనరేంద్రుడు తన కుమారుడైన సారంగధరుడి విద్యాపారంగతా, సంగీత శాస్త్ర అభినివేశం మొదలగునవి తెలుసుకున్నాడు. సంతానం లేని ఆ రాజు పరమేశ్వరుని వరం చేత పొందిన వరప్రసాదం సారంగధరుడు. అతడంటే మిక్కిలి ప్రేమ రాజుకి అయితే చెప్పుడు మాటలు ఆ రాజును ఏ దశకు చేర్చాయో, ఎన్ని   శుభలక్షణాలు కలిగిన వాడైనా రాజు నిప్పు కలిక వంటి అపనమ్మకంతో ఎట్లా పతనమయినాడో మనకు తెలుస్తుంది. జరగబోవు కథలో సారంగధరుని సత్యసంధతే అతని పాలిట రక్షా కవచం అవుతుంది. ‘‘ధర్మోరక్షితి రక్షితః’’ అన్నట్లు అయింది. ప్రథమాంకంలో మంత్రిగారు ధర్మరాజైనా అశ్వత్ధామ హతః కుంజరః అని కొంత అసత్యమైనా ఆడాడు గాని ఈశ్వర వరప్రసాదియగు సారంగధరుడు అదియును ఎరుగడు అని అన్నాడు.

 గిలిగింత పెడి రూపమున వున్న సేవకుడు. అతని పాత్ర ద్వారా కూడా హాస్యం పండిరచారు. రాజుగారు ఒకనాడు చెంచుదొర కుటుంబాన్ని పరామర్శించి చెంచు భార్య సింగిని నీకేమీ కావాలో కోరుకొమ్మని అడిగినపుడు నాతోడుగాడు వీడు చల్లగ నుండ దీవించు స్వామి అని అడిగినదట. మంత్రాగారు నగరవాసులను ఎమైనా కోరుకొమ్మంటే ఏకంగా గద్దెను అడిగెదరు అంటూ అడవి వాసుల నిష్కల్మషత్వాన్ని కొనియాడారు.

అలాగే అంటింత ఏమి చదువుకోనిదయినా ఆమెకున్న పరిజ్ఞానం గొప్పది. చిత్రాంగి    ఉత్తరమిచ్చి సారంగధరునికిమ్మంటే ఆమె లిఖితమెన్నటికీ గూడదు అన్నది. చదువు కొన్నవారికంటే చాకలివారు మేలు అన్న సామెత ఒకప్పుడు వుండేది. వీరు తమ వృత్తిధర్మంలో అనేకానేక గుమ్మములు ఎక్కీదిగీ ఎన్నో లౌకిక విషయములు కనిపెట్టేవారు. లిఖితంగా దొరకకూడనని చాలామంది చదివిన వాళ్లు అంటారు. నేడష్టమి కదా ఈరోజు పేడి ముఖము వానిని చూడమి ఆమె వ్రతమున్నదని గిలిగింతకు అంటింతతో చెప్పించింది చిత్రాంగి. అప్పుడు అతని దోషము, దానినణచుకుంటూ అతడు సుపన్నాందులు వరుల మనసువొచ్చుకునేమోయని తలచరుగదా అని అతడున్న తీరు అతడి లోకజ్ఞతను చూపెడుతాయి.

 రాజాగారి పెద్ద భార్య రత్నాంగితో అరణపు దాసిగా వచ్చిన ఆమె ఆ రాణి గారి తల్లిగారు కూతురికి కాపురంలో ఎట్లుండాలో చేసిన హితభోద వుత్తరం రూపంలో ఇచ్చినది. అందులోని ప్రతి అంశము స్త్రీజాతికి ఏనాటికీ తలమానికము. ఆమాటలలోని ఔచిత్యాన్ని  రత్నాంగి గ్రహించింది. ఆమె సౌశీల్యత అక్కడే కనబడుతుంది. అలాగే కుమారునికి శిక్ష విధించిన రాజు పశ్చాతాపంతో చావడానికి సిద్ధమైనపుడు ఆమె తల్లిగా తన భాదను పక్కన పెట్టి భార్యగా భర్తను రక్షించుకొనే ప్రయత్నం చేసి ఓదార్చింది. ఇక్కడ సతులకు ఎట్టిది కర్తవ్వము అనే సందేశం దాసుగారు నాటి సామాజిక స్థితి గతులను బట్టి ఇచ్చారు.

               దాసుగారు ప్రయోగించిన లోకోక్తులు, సామెతలు కోకొల్లలు. వాటి ప్రయోగం వెనుక వారి లోకజ్ఞత కనిపించుచున్నది. వంట మనం ఎంత ప్రేమతో వండినా కొసరి కొసరి వడ్డించినపుడే ఆ ప్రేమ తెలుస్తుంది. అంతేగాని వండినవన్నా ఒక చోట వేసి మొత్తంగా కలిపి ముద్దల్ని క్యాచ్‌ ఇట్‌ అంటూ విసిరితే ఆ ప్రేమ ఒప్పదు కాదా. కవి ఎంతటి పాండిత్యం వున్నవాడైనా ప్రజా బాహుళ్యంలో వున్న లోకోక్తులు, సామెతలు వాటి ద్వారా తాను కవితా భావాన్నిందించినపుడే అతడు కవిగా ప్రజల మధ్య మనగలడు. కనుక దాసుగారు వాడిన లోకోక్తులు, సామెతలను ఇక్కడ క్రమముగా ఇవ్వడమైనది.

నటి – వేడి యొక రుచి కొత్త ఒక వింత అనే సామెత. చిత్రాంగి ` బూడిదలో పోసిన పన్నీరు సారంగధరునికి దక్కని సౌందర్యం అన్న సందర్భంలో అన్నది. నిప్పుదావున వెన్న ఎట్లు కరగకుండును. తన కలిమి యింద్ర భోగమిన్నట్లు అంటూ సారంగధరుడు సుబుద్ధినంటాడు. మొక్కు కొంటయే లేదన్న నొక్క బ్రాహ్మణునికికయినా బెట్టుమన్నట్లు అన్న సామెత గిలిగింత వాడాడు.

సారంగధరుడు చిత్రాంగితో తప్పుచేయుటకు ఇష్టపడని సందర్భంలో చెప్పిన మాటుల. తనువులు పోయినగాని మాట శాశ్వతముగాగా నుండును. జారగా మంట కన్నను జావు మేలు. (జారగా మనుటకున్న చావుమేలు) చిత్రాంగి ` వేడి నీళ్లు కిండ్లు కాలునా.

సారంగధరుడు ` నేడిరటిలో రేపుమంటిలో అరగడియ తుచ్ఛ సుఖం తప్పుచేయాలను కొనేవారు. ఈ మాటలు స్మరిస్తే చాలు వారు తప్పు చేయజాలరు కదా అని మనం గ్రహించాలి. చావునకు విచారించను కానీ అపవారునకు చింతించెదను అంటాడు సారంగధరుడు. మన నోట వెంట మాటయే మన మనసును పట్టిచ్చాను. అలాగే సారంగధరుడి నోటి ప్రతి మాట సత్య ప్రకాశమై గోచరించినది.

సారంగధరుడికి సుబుద్దిని మంచి స్నేహితుడు. తల్లడిల్లుతున్న సారంగధురునికి మంచి ఓదార్పు మాటలాడిన సుబుద్ధిని చూసి విజ్ఞాని స్నేహితుడుగా దొరుకుట కన్న భాగ్యము వేరే వున్నదా అన్నాడు సారంగధరుడు. దీని ద్వారా స్నేహం విలువను చాటారా దాసుగారు. బిడ్డలోని తెలివి బీజములోని వృక్షమువలే క్రమంగా క్రమంగా వ్యక్తపడును అన్న సుబుద్ధి మాటలు అక్షర సత్యాలు. పేరుకు తగట్టు సుబుద్ధి నాటకం ఆద్యంతం మంచి లక్షణాలు కలిగిన వాడుగా వున్నాడు. చివరికి భరత వాక్యము చెప్పునపుడు కూడా చిన్నప్పటి నుండీ ఒక్కటిగా మసలిన సారంగధరుడితో అతను కూడా యతిగా మారుటకు నిశ్చయించుకున్నాడు.

ముగింపు :

మంగళా దేవి మంగళ మధ్యాని మంగళ అంతాని అంటే శుభంతో ప్రారంభించి శుభంతో కొనసాగించి శుభంతో ముగించే సంస్కృతి మన రచనలకుండేది. ఆంగ్లపద్ధతిలో కొంతట్రాజెడీ నాటకాలు కూడా వున్నాయి. అయితే సారంగధర శుభంతో ప్రారంభించబడినప్పటికీ మధ్యలో కొంత విషాదం చోటు చేసుకున్నప్పటికి చివరికి ఎవరూ ఊహించని శుభంతో ముగించారు. ఇది లోకకళ్యాణానికి దారి తీసేదిగా దాసుగారిచ్చిన ముగింపు సాహితి లోకంలో ఔచితవంతంగానే భాసించిందని చెప్పవచ్చు. 

కాలం ఏదయినా ఇందలి సంఘటనలు తిరుగాడుతూనే ఉంటాయి. అలాగే కాలం ఏదయినా సార్వం కాలిక హితం ఇందులో చెప్పబడిరది.

ఉపయుక్త గ్రంధాలు :

  1. సాహిత్యదర్శనం – కె.వి.ఆర్‌.గారు.
  2. సాహిత్యసోపానము – ఆచార్య దివాకర్ల వెంకటావధాని.
  3. ఆదిభట్ల నారాయణదాసుగారి – సారంగధర నాటకం.
-డా॥ వై.వి.సిహెచ్‌. లీలాపద్మజ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top