
Volume – 1, August 2026, issue – 5,
సమర్పణ (D.O.S): 05-07 – 2026 ఎంపిక (D.O.A): 16– 07 – 2026 ప్రచురణ (D.O.P) : 01-08-2026
వ్యాస సంగ్రహం :
శ్రీకాకుళం జిల్లా సంచార జాతులు ఆ ప్రాంత జానపద సంస్కృతికి, సాంస్కృతిక వారసత్వానికి అవిభాజ్య భాగంగా నిలిచాయి. వీరి సంప్రదాయ వృత్తులు, మౌఖిక సాహిత్యం, ఆచారాలు, విశ్వాసాలు, కళారూపాలు, భక్తి సంప్రదాయాలు గ్రామీణ జీవన విధానంతో ముడిపడి ఉన్నాయి. ఈ పరిశోధనా వ్యాసంలో గంగిరెద్దులవాండ్లు, చెంచులు, జంగం దేవరలు, నక్కజంగాలు, ఎరుకులవారు, భట్రాజులు, హరిదాసులు వంటి సంచార జాతుల సామాజిక, సాంస్కృతిక, మతపరమైన, వృత్తిపరమైన విశిష్టతలను పరిశీలించడం జరిగింది. వీరి జీవన విధానం, ప్రజలతో ఉన్న అనుబంధం, మౌఖిక సంప్రదాయాలు, జానపద కళారూపాలు, సేవాధర్మం, వంశపారంపర్య వృత్తులు, కాలానుగుణంగా సంభవించిన మార్పులను విశ్లేషించడం ద్వారా వీరి జానపద వారసత్వ ప్రాముఖ్యతను ఈ వ్యాసం వివరిస్తుంది. ఆధునికీకరణ, పట్టణీకరణ, జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ సంచార జాతుల సంప్రదాయ వృత్తులు, కళలు, సాంస్కృతిక ఆచారాలు క్రమంగా కనుమరుగవుతున్న పరిస్థితిని ఈ అధ్యయనం గుర్తిస్తుంది. అందువల్ల వీరి జానపద సంపదను శాస్త్రీయంగా నమోదు చేయడం, పరిరక్షించడం, భావితరాలకు అందించడం అత్యంత అవసరమని ఈ పరిశోధన ప్రతిపాదిస్తుంది. ఈ వ్యాసం శ్రీకాకుళం జిల్లా జానపద సంస్కృతి వైవిధ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక ప్రామాణిక ఆధారంగా నిలుస్తుంది.
కీలక పదాలు :
శ్రీకాకుళం జిల్లా, సంచార జాతులు, జానపద సంస్కృతి, గంగిరెద్దులవాండ్లు, చెంచులు, జంగం దేవరలు, నక్కజంగాలు, ఎరుకులవారు, భట్రాజులు, హరిదాసులు, మౌఖిక సాహిత్యం, సాంస్కృతిక వారసత్వం.
1.ఉపోద్ఘాతం :
శ్రీకాకుళంలో సంచారజాతులలో చాలా మంది జానపదులున్నారు. వీరిని వృత్తిగాయకులు, బిక్షువులు, యాచకులుగా వివిధ కళారూపాలు ప్రదర్శిస్తుంటారు. వీరు సంచారజీవులు వీరిలో హరిదాసులు, గంగిరెద్దులవాండ్లు, మల్లికార్జునులు, ఎరుకులవారు, బుడియావారు, కొమ్మదాసరి, తురకలు, నక్క జంగాలు, బుడబుక్కలవాళ్ళు, మటియావాళ్ళు, వీధిగాయక బృందాలు,పాములవాండ్లు మొదలగువారు ముఖ్యులు. జానపదమంటే పల్లేటూరు అని అర్థం. అ జానపదాలలో నివసించే జనసముదాయమే జానపదులు. అలాంటి జానపదులకు సంబందించిన సాహిత్యమే జానపదసాహిత్యం. అయితే గ్రామీణులు విద్యావిహీనులు మాత్రమే. జానపదులనే అభిప్రాయం పాతది. ఏదైనా ఒక్క విషయంలోనైనా భావస్వామ్యం కలిగిన జనసముదాయాన్ని జానపదులని విజ్ఞులు నిశ్వసించి జానపద శబ్దానికి విస్తృతిని కలిగించారు.
2.విషయ వివరణ :
ఈ జనసముదాయం తమవే అని చెప్పుకోదగిన చప్పుకోగలిగిన కొన్ని ప్రత్యేక సాంప్రదాయాలు కలిగి ఉండాలి. జానపదులకు సంబందించిన జానపద సాహిత్యమన్న విషయము విధితము.ఈ జానపద సాహిత్యమే ప్రజావాఙ్మయమని, సామరసాహిత్యమని, దేశీసార స్వతమని అధునాతన వాఙ్మయమని పలు పేర్లుతో పిలిచేవారు. ఏ పేర్లుతో పిలిచిన అది అమాయకమైన నిర్మలమైన మనస్సుతో సృష్టించు కున్నదే జానపదసాహిత్యమని చెప్పవచ్చు. జానపదులనే ఈ ప్రజలంతా వల్లెప్రాంతాలలో నాగరికజీవితాలకు దూరంగా ప్రకృతిమాత ఒడిలో ప్రశాంత జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఈ జానపదులు నిరంతర శ్రమజీవులు తమ శ్రమభారాన్ని తగ్గించుకోవడానికి విజ్ఞానవినోదాలకు సాహిత్య సృష్టిగావించారు. ఈ జానపద సాహిత్యంలో గేయాలు కథాగేయాలు, కథలు, పొడుపుకథలు, సామెతలు మొదలైనరీతిలో అనేక ప్రత్యేక ప్రక్రియలున్నాయి. జానపదులు జానపదసాహిత్యంతోపాటు కొన్ని కళలను కూడా సృష్టించారు. జానపదకళలు మానవ మనోవికాసానికి ప్రతిభానైపుణ్యాలకు విదర్శనమని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ప్రకృతిని అనుకరించడమే కళ అయితే అనుకరణం యదాతధంగా ఉండకూడదు. సృజనాత్మకంగా ఉండాలి. ప్రావీణ్యం ప్రదర్శించబడాలి. జానపదకళలు ప్రదర్శనల ద్వారా మానసిక ఉల్లాసానికి సంతోషాన్ని కలిగించేవిగా ఉంటాయి. అవే ఉత్సవాల సందర్భంగా వేడుకుల సమయాలలో ప్రదర్శించే కళలు కూడా ఉంటాయి. జానపద కళారూపాల పై అనేకమంది పరిశోధనలు చేశారు. వీరిలో రాధాకృష్ణమూర్తి, నేదునూరి గంగాధరం , ఖండవల్లి లక్ష్మీరంజనం, బి.రామరాజు, నాయని కృష్ణకుమారి, ఆచార్య టీ. దోణప్ప మొదలగువారు ఎన్నో పరిశోదనలు చేసారు.
2.1. గంగిరెద్దులవాండ్లు :
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో పాడిపంటలకు కొదవలేదు. గ్రామీణ ప్రాంతాలలో పశుసంపద తప్పనిసరి. ఒక వ్యక్తికి ఉన్న పశుసంపదను బట్టి ఆ వ్యక్తి ఆర్ధిక స్థితిగతులు పరిగణిస్తారు. పశువులే ప్రజల సంపద అందువల్ల పాడిపశువులంటే పల్లెప్రజలకు ప్రాణం కొన్నిలోపాలతో వికారాలతో పుట్టిన మగలేగలను ప్రజలు గంగిరెద్దుల వాళ్ళకిస్తారు.వాటిని తీసుకుపోయి ఎంతో ఓపికతో శిక్షణ ఇచ్చి ఆ పశువులచేత చెప్పినట్లు చేయిస్తారు. గంగిరెద్దులవారు యాదవులలో ఒక తెగ అంటారు. వికారాల్లతో పుట్టిన దూడలనే కాకుండా పోట్లగిత్తలనుకూడా మచ్చిక చేసి గంగిరెద్దులుగా ఉపయోగిస్తారు. అందుకే” ఎగిరిన ఎద్దు గంత మోసింది” అనే సామెత పుట్టింది. ఇక్కడ గంత అంటే పాతగుడ్డలతో కుట్టిన పరుపు(బొంత) లాంటిది, దీన్ని దురుసుగా ప్రవర్తించే వాళ్ళపట్ల కూడా అన్వయిస్తారు. గంగిరెద్దుల వాండ్లు సంక్రాంతి ధనుర్మాసం ఆరంభం నుండి పల్లె పల్లెకి తిరిగి పాటలు పాడుతూ పౌరాణిక కధను తెలుపుతూ యాచన చేస్తారు. సన్నాయి, డోలు వంటి వాయిద్యాలతో చక్కని పాటలు పాడుతూ బిళ్ళగంట వాగిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి జానపదాలను ప్రదర్శిస్తూ ఉంటారు. గంగిరెద్దుల మేళం గురించి ఒక పౌరాణిక గౌధ ప్రచారంలో ఉంది.
“పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు శివుని ఎల్లప్పుడు తన ఉదరంలో ఉండమని ప్రార్ధించగా శివుడు గజాసుర గర్భంలో ప్రవేశిస్తాడు. కైలాసంలో
పార్వతీదేవి తన భర్తజాడ తెలియక చివరకు గజాసుర గర్భంలో ఉన్నాడని తెలుసుకొని విష్ణుమూర్తిని దర్శించి తన భర్తను రక్షించమని వేడుకొన్నది. అప్పుడు విష్ణుమూర్తి బ్రహది దేవతలను పిలిచి గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే సరైనదని భావించి దేవతలచే విచిత్రమైన వేషాలను దరింపజేసి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించి తాను చిరుగంటలు సన్నాయి దొల్చి చిత్రవిచిత్ర రీతిలో గజాసురుని ముందు ఆడించారట. అప్పటినుండి గంగిరెద్దులవాండ్లు సాక్షాత్తు విష్ణుమూర్తియే గంగిరెద్దుల మేళం ఆడించారని గొప్పగా చెప్పుకుంటారు.”
“అమ్మగారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు,
విశ్వనాథుని వాహనమండి, పప్పుబియ్యం పట్టుకురండి, బసవయ్య దీవెనలు అందుకోండి….. ” అని పాటలు పాడుతూ విన్యాసాలు చేసి యాచన చేస్తూంటారు. గంగిరెద్దులవాండ్లు శ్రీకాకుళం జిల్లా బసవరిజు పేట, కొత్తూరు మండలం, ఆకులతంపరకొలనీ, గులుమూరులో నివసిస్తుంటారు.
శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలోని గంగిరెద్దుల వారి కొన్ని బాణీలను ఉత్తరాంధ్ర జానపద కళలు గ్రంధంలో పేర్కొన్నారు బద్రి కూర్మారావు .
ప్రపంచంలో మార్పులు ఏ విధంగా వస్తున్నాయో గంగిరెద్దుల వారి పాటలో వివరించారు.
“దేవా ! ఏమి జరుగుతున్నది ప్రపంచం
అహు ! ఏం చిత్రం గున్నది ప్రపంచం
పసుపురాత తగ్గిపోయ
పౌడరు రాతలెక్కువాయ
వాసనూనె లెక్కువాయ ప్రపంచం
ఆహా ఏమి జరుగుతున్నది ప్రపంచం
చిన్న చిన్న మీసాలాయ
చీపురుపుల్ల మీసాలాయ
ముక్కు మీద మూడెంటుకులాయె ప్రపంచం
ఆహా ఏమి జరుగుతున్నది ప్రపంచం “ యిలా ప్రపంచంలో రోజు రోజుకు ఎలా మార్పు చెందుతుందో పాట ద్వారా వివరిస్తారు . “ ( ఉత్తరాంధ్ర జానపద కళలు – బద్రి కూర్మారావు , పుట – 9 8 )
2.2.చెంచులు :
ఏజెన్సీ ప్రాంతాల నుండి వేసవి కాలంలో సంక్రాంతి కాలంలో కోయలు చెంచులు పల్లెప్రాంతాలకు రావడం పరిపాటి, చెంచుల వేషాధారణ చాలా విచిత్రంగా ఉంటుంది. నెత్తిమీద నెమలి ఈకలు, తలగుడ్డ, రంగురంగుల పంచెకట్టు, మెడలో పూసలు మొదలైనరీతిలో ఆకర్షణీయంగా ఉంటుంది. చేతిలో పిల్లనగ్రోవి, మధురమైన సంగీతాన్ని అందిస్తారు. డప్పువాయిద్యాలు కూడా వాయిస్తూ కమ్మని జానపదొలు పాడుతారు. వీరి ప్రదర్శన ఆకర్షణీయంగా ఉంటుంది. యాచన చేస్తూ కళను ప్రదర్శించడం చాలా గొప్ప సాంప్రదాయం.ఈ విధంగా గిరిజనులలో ఒక శాఖ అయిన చెంచుల యొక్క ప్రదర్శనలు పల్లెప్రజలకు ఒక పక్క విజ్ఞానం మరో పక్క వినోదం అందిస్తుంది. చెంచులక్ష్మి కథను పాట రూపంలో పాడుతూ వాళ్ళ కళను ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట దగ్గర, గుండివిల్లి పేటలో దాదాపు 20 కుటుంబాలు నివశిస్తున్నారు.
చెంచులు చెప్పే శ్రీరంగ నీతులు :
ఏ వూరు ఏ భామ ||నందానా ||
ఎవ్వారి భామవేవై భామా ||నందానా ||
వినరోరి నరసిమ్మ ||నందానా ||
ఉండు గూడెం మాది ||నందానా ||
చేతిడే ముద్దమ్మ ||నందానా ||
చెయ్యెత్తి దానాలు ||నందానా ||
వడ్డిచ్చే తల్లి వడ్డిచ్చే తల్లి “ అంటూ సాగుతుంది .( తెలుగువారి జానపద కళారూపాలు – మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి , పుట – 402 )
2.3.జంగం దేవరలు :
జంగం దేవరలు శైవులు. శైవభక్తి నిష్టాగరిష్టులు అయిన వీరు సంచార జీవనం చేస్తూ శైవక్షేత్రాల మహాత్యాన్ని శైవభక్తుల చరిత్రలను శివుని గొప్పదనాన్ని కీర్తిస్తారు. “దేవాంగుల చిత్తం జంగాల పాలు” అనే సామెతను బట్టి దేవాంగులను జంగందేవరలు ఆశ్రయించి బ్రతికేవారని గ్రహించవచ్చు.అంటే దేవాంగులు, జంగొల పోషకులుగా చెప్పవచ్చు. జంగమ దేవరల జీవనవిధానాన్ని నిశితంగా పరిశీలించిన పగటి వేషకళాకారులు జంగమ దేవర వేషాన్ని ధరించేవారు. నొసటన విభూతి బొట్టు, తలపాగ, కుడి భుజాన సంచి (జోలె), ఎడమ భుజాన శంఖం ధరించి పొడుగు చేతుల చొక్కా, పంచెలు పాతవి అయినా శుభ్రంగా ఉతికి కట్టుకొని జంగమదేవర కనిపిస్తాడు. సరిగ్గా ఇదే వేషాన్ని పగటి వేషదారులు ధరించి వ్యంగ్యంగా ఇలా పాటలు పాడేవారు.
“ఏమి సేతురాలింగ ఏమి సేతురానీదు.
మతము ఎవరికి తెలియరాదు….
గంగ ఉదకము తెచ్చి నీకు
లింగ పూజలు సేతమంటే
గంగలోని కప్ప చేప లెంగిలుంటున్నాయి లింగా…
అచ్చ ఆవుపాలు దెచ్చి అరిపితంబు సేతమంటే
అచ్చ ఆవుల లేగదూడ లైంగిలుంటున్నాయి లింగా….
తుమ్మి పూవులు చెచ్చి నీకు తృప్తిగా పూజ సేతుమంటే
కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద లెంగిలుంటున్నాయి లింగా…. “(తెలుగు జానపద గేయ సాహిత్యం – బి.రామరాజు , పుట -305 )
వీళ్ళు ఎక్కువగా తత్వాలు పాడుతూ ఇంటింటికి మకర సంక్రాంతి పర్వదినాల సందర్భంగా వస్తుంటారు. పితృదేవతలను కీర్తిస్తూ తద్వారా బియ్యం. జొన్యం సంభావనగా తీసుకుంటారు. మిగతా సమయంలో శివాలయాలకు పూజారులుగా ఉంటారు.
2.4.నక్కజంగాలు :
నక్క జంగాలు కూడా సంచారజాతులలో ఒక తెగ. వీరుకూడా వేకువజామునే గ్రామాలలో తిరుగుతూ వీరగాధలు, బాలనాగమ్మ కథలు, రామాయణం భారతం పాటలు పాడుతూ గ్రామీణ ప్రజలకు వినోదం పంచుతుంటారు. చిడతలు ధరించి భుజాన తుంబుర వేసుకుని వాయిస్తు గానాన్ని రక్తికట్టిస్తుంటారు. కొళ్ళకు గజ్జెలు కట్టుకొని తుంబుర తీగలను ఎడమ చేతితో వాయిస్తు, కుడిచేతితో అందెలు పట్టుకొని నృత్యాలు చేస్తుంటారు. పురాణగాథలను వీరి కథలలో నిత్య జీవితంలో జరిగే సంఘటనలను,సంఘర్షణలు, వినోదాలు, విలాశాలు కథలలో ఇమిడ్చి గ్రామీణ ప్రజలకందిస్తారు.ఈ కథావస్తువులు దైనందిన జీవిత ప్రతిబింబాలు కావడం వలన ప్రజలు ఈ కథను ఎంతో మక్కువగా వింటారు.
2.5.ఎరుకులవారు :
పల్లె ప్రాంతాలలో ప్రజలు జీవనం సాగించటానికి రకరకాల వృత్తుల్ని ఆశ్రయిస్తారు. పరంపరగా వస్తూన్న వ్యవసాయాన్నో లేక ఇంకా ఇతర వృత్తులను అవలంబించి జీవనం సాగిస్తారు. మరికొంతమంది ప్రధాన వృత్తిగా ఏదో ఒకటి చేసుకుంటూ కొలానుగుణంగా ఉపవృత్తులు చేసుకుంటూ ఉంటారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎరుకుల వారు ప్రధాన వృత్తిగా బుట్టలు అల్లటం,తడికలు అల్లటం, మొదలైన పనులు చేస్తూ అప్పుడప్పుడు ముఖ్యంగా పండగ సమయాల్లో పంటలు ఇళ్ళకు చేరిన సందర్భంలో ఒక తంబూరాను తీసుకొని భిక్షాటనకు బయలుదేరుతారు. సితారు లేక తంబూరా తంత్రీవాద్యం, సొరకాయ బుర్రకు ఒకచిన్న వెదురుబొంగు అమర్చబడి దానికి ఒకతినె ఉంటుంది.దాన్ని చేతితో పట్టుకొని చేతివ్రేళ్లతో, గోళ్లతో మీటుతూ బాలనాగమ్మ, బొబ్బిలి యుద్ధం, కుశలవులకథ మొదలైనవి పాటలు గా పాడుతూ ఉంటారు. గోదావరి జిల్లాలో కూడా ” తంబుర కథ లేక సితార కథ” ప్రచారంలో ఉన్నది. కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. తంబుర లేదా సితారు పాటలు మాత్రమే. తంబుర కథల్ని ఒకేచోట కూర్చొని గానం చేస్తే తంబుర లేదా సితారు పాటల్ని భిక్షాటన చేస్తూ అంటే ఇంటింటికి తిరుగుతూ గౌసం చేస్తారు. దాసరులు, మాలలు, యాదవులు, జంగౌలు మొదలైనవారు అనేక కళారూపాలను ప్రదర్శిస్తూ కథాగానం చేసినట్లే ఈ సితారు పాటల్ని ఎరుకుల వారుపాడుతూ ఉంటారు. వీరిలో వప్పంగి వాస్తవ్యుడు గేదెల సత్యం అయిదారు రాత్రుల్లో సంపూర్ణ రామాయణం లోకర్ణామాయణం పాడతాడు. రాజాం తాలూకా మందరాడ గ్రామస్తుడు గొర్రె బావాజీ బృందం రామదాసు బందిఖానా, సుందరకొండ, ఆరణ్యకొండ పాడుతుంది.
బావాజీ రామదాసు పాత్రలో లీనమై” ఎటు బోయితివో రామా ఎటుబోయితివో” అని తన్మయత్వంతో పాడతాడు.ఇంకా పొందూరు, లోలుగు, భీమవరం, రణస్థలం, పాతర్లపల్లి, గౌర, సాలిహుండం ప్రాంతాలలో “సితారు లేదా తంబుర ” పాటల్ని పాడేవారున్నారు. ఎరుకుల వారు సంచారజాతులలో ఒక భాగము వీరిలో కొందరు వల్లెప్రాంతాలకు వస్తూ వేకువజామున 4 గంటలకు డమరుకం వాయిస్తూ పల్లెప్రాంతాలలో ప్రజలను మేల్కోల్పుతూ “శకున పక్షి” వచ్చిందని “అంబపలికింది. జగదాంబవలికింది” అంటూ భవిష్యత్తును, ఆ ఇంట్లో జరగబోయే విషయాలను వివరిస్తూ పాటలు పాడుతారు. సంక్రాంతికి ఇచ్చిన పాతవస్త్రాలు, బియ్యం, డబ్బులు ఇంటింటికి వెళ్ళి తీసుకుంటారు. ఒక ఊరిలో అయిదు రోజులుంటూ తర్వాత వేరే ఊరికి వెళ్తుంటారు. ఇలా మరి రాత్రిపూట ఎరుకుల పాట తుంబుర మీటుతూ పాడి వినిపిస్తారు. ఎరుకుల పాటలో రామాయణ, మహాభారతాలను హాస్యంగా వినిపిస్తూ కరెంటు లేని రోజుల్లో దీనిటీల లో ప్రజలకు పాడి వినిపిస్తూ సంతోషాన్ని కలుగజేసేవారు. ఈ విధంగా జానపద సాంప్రదాయ కళలకు అద్దం పట్టేది ఎరుకులపాట. ఎరుకుల పాటలు అక్షరరూపంలో ఉండవు. జ్ఞాపకశక్తితోనే పాడుతారు. ఎరుకులువారు కూడా ఎరుకుల భాష మాట్లాడుతారు. ఈ భాషకులా ప్రజలకు వాడే ఎనివస్తూ ఎంతషాన్ని కలుగజ నెవారు. ఈ విధరిగా జానవేద సాంప్రదాయ కళలకు అద్దం ఎట్టిది ఎరుకులపాట. ఎరుకుల పాటలు అక్షరరూపంలో ఉండవు. జ్ఞాపకశక్తితోనే పాడుతారు. ఎరుకులువారు కూడా ఎరుకుల భాష మాట్లాడుతారు.ఈ భాషకు కూడా లిపి లేదు. వీరు పక్షులను కూడా బాగా వేటాడుతారు.
ఎరుక , సోదో పదాలు సమానార్ధకాలుగా వాడతారు. నెత్తి మీద ఒక బుట్ట పెట్టుకుని ఊరూరా తిరుగుతారు. ఆ బుట్టలో నాలుగు పలకలుగల గవ్వలతో కుట్టిన ఒక వస్తువుంటుంది . దానినే వాక్కునిచ్చే దేవతగా ఆరాధిస్తారు. ఆ దేవతను పసుపుకుంకాలతో అలంకరిస్తారు.
“ఎరుకోయమ్మా ఎరుక…
ఎరుక చెప్పెదమ్మా ఎరుక…
గతము చెబుతా…
రాబోయేది చెబుతా…
అమ్మవారి అనుగ్రహంతో ఎరుక చెబుతా…” అంటూ సాగుతుంది. “తెలుగు వారి జానపద కళారూపాలు – మిక్కిలిన్ర్ని రాధాకృష్ణమూర్తి , పుట -383 ).
2.6.భట్రాజులు :
రాజ స్థానాలలో రాజు గుణగణాలను వంశ ఔనత్యాన్ని కీర్తించడానికి భట్రాజులుండేవారు. వీరు ఎదుటివారు గొప్పవారైనా, కాకపోయినా వారు ఉన్నత వంశంలో పుట్టినవారని అంతకంటే ఉత్తములెవరూలేరని ప్రశంసిస్తూ ఉంటారు. భట్రాజులు సాధారణంగా పొడుగు చేతులచొక్కా, పంచె ధరించి తలకు పెద్దపాగా చుట్టుకుంటారు. చేతిలో తాటాకుల గ్రంధాలు పట్టుకొని ఉంటారు. వంశచరిత్రలు బిరుదులు చదివే భట్రాజులు ఆశుకవులని చెప్పవచ్చు. ఎదుటివారిని చూసి వారిగూర్చి వెంటనే పద్యాలో, పాటలో, గద్యమో ఆశువుగా, మధురంగా చదువుతారు. వీరి పేర్ల చివర భట్టు, రాజు, మూర్తి అనే పదాలను చేర్చుకుంటారు. వీరు కాకతీయుల కొలం నుంచి ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ సామ్రాజ్యం నశించిన తర్వాత వెలమ, కమ్మ, కొపు తదితర కులాలను ఆశ్రయించారు.మన తెలుగు వారి వాస్తవ చరిత్రను పద్యరూపంలో భధ్రపరచిన ఘనత భట్రాజులదే.
“కాకతి గణపతి దేవా చక్రవర్తి కాలమ్లో వీరిని భట్టులనే పిలిచేవారు. అందుకు ఉండాహరణ కోపలవెన్ను కాకతి గణపతి శాసనంలో కనబడుతూ ఉంది. ఆ శాసనంలో దాదాపు 60 పేర్లున్నాయి. వాటిలో అన్నంభట్టు, నారాయణభట్టు, జగదేవభట్టు ఈ విధంగా ఉన్నాయి “ (తెలుగువారి జానపద కళారూపాలు – మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి , పుట – 587)
తెలుగులో అధ్బుతమైన కావ్యాన్ని (వసుచరిత్ర) సృష్టించిన రామరాజు భూషణుడు భట్రాజు అంటారు. భట్రాజుల వేషభాషల్ని బాగా గమనించిన పగటి వేషకళాకారులు వారిని బాగా అనుకరించారు. వేషదారణం అంత కష్టమైనది కాదు. సాధారణ వేషమే దరిస్తారు. అయితే ఆశువుగా ఎదుటివారిని గురించి చెప్పగలిగిన సామర్థ్యం ఉంటే ఈ కళాకారులు బాగా రాణిస్తారు. లేకపోతే పూర్వం వారు చెప్పిన పద్యాలను వచనాలనే వల్లిస్తూ ఉంటారు. హాస్యపూరితమైన పలుకులుతో జానపదుల్ని రంజింపజేస్తూ పగటి వేషకళాకారుల వలే ప్రజలను ఆనందింపజేశారనటానికి ఇలాంటి వేషాలే ప్రత్యక్ష సాక్ష్యాలు.
2.7.హరిదాసులు :
హరినామ కీర్తనలు పాడుకుంటూ ఇంటింటికి వెళ్ళి యాచన చేయువారే హరిదాసులు. వీరి వేషధారణ సాక్షాత్తు “నారదుడు” పాత్రలా ఉంటుంది. ఈ వేషంలో ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రచారం చేస్తు గురుశిష్యులు పరమ పదంబిది శ్రీరంగ భద్రాచల మదిగో శ్రీరంగ అంటూ’ వైష్ణపక్షేత్ర మహాత్యాన్ని పొగుడుతూ భక్తిని ప్రభోదిస్తారు. వీరు ఎక్కువగా వైష్ణవులు, శ్రీవైష్ణవులు, సాతాని వైష్ణవులు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు.
ధనుర్మాసంలో ఇంటింటికి తిరుగుతూ అక్షయపాత్రను తలపై ధరించి చేతిలో చిడతలు, భుజం పై తంబుర ధరించి తలకు నిలువు నామాలు పెట్టుకొని వైష్ణవనామసంకీర్తనం చేయడం ప్రతీ పల్లెలోను కనిపించే పరమ సత్యం.
“పలుకే బంగారమాయెనా
కొదందపాణి ! పలుకే బంగారామాయేనా
పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి
కలలో ణీ నామ స్మరణ, మరువ చక్కని తండ్రి …..ఇలా భక్తి తన్మయత్వంతో పాటలు పాడుతూ గ్రామ వీధుల్లో తిరుగుతారు.” ( తెలుగు వారి జానపద కళారూపాలు – మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి , పుట 442 )
వీరు గ్రామాలలో తిరుగుతూ ఉంటే సంక్రాంతి శోభ కొట్టువచ్చినట్లు ఉంటుంది. హిందు సాంప్రదాయాలు ధర్మాలు తత్వాలుగా చక్కని కీర్తనలు పల్లెవాసులను ఆకర్శించి మంత్రముగ్ధులనుజేస్తుంటాయి. వీరి అలంకరణ ఆకర్షణీయంగా ఉంటుంది. హరిదాసులు ఎక్కువగా సవరవిల్లి లో నివశిస్తుంటారు. వీరంతా గ్రామాలలో సేకరించిన బియ్యం, బట్టలు, నగదు లో కొంత భాగం భద్రాది శ్రీరామ గుడికి శ్రీరామనవమి రోజు చేరుకొని అందరూ సామూహికంగా వనభోజనం చేస్తూ నగదును సమానంగా పంచుకుంటారు.
3.ముగింపు :
యాచకులు లేదా బిక్షాటనం చేయువారు కూడా జానపదకళారూపాలు ప్రదర్శిస్తూ తమ జానపద సంగీతాన్ని వాయిద్యాల ప్రదర్శన వీనులవిందుగా పల్లెప్రజలకందిస్తున్నారు. తరతరాలుగా వారి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.నేటి ఆధునిక ప్రపంచంలో ఇటువంటి వారికి ఆదరణ తగ్గిపోయింది. “సోషల్ మీడియా” ప్రభావం ఎక్కువగా వీరి వృత్తి జీవనం పై ప్రభావం చూపించింది.జనాలను ఎక్కువగా ఆకర్షించే టి.వి, ఫోన్లతో పోటీపడలేకపోతున్నారు. వీరిలో చాలామంది చదువుకొని వేరువేరు వృత్తులలో స్థిరపడిపోతున్నారు. ఇటువంటి జానపద కళలు అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. అందువల్లప్రభుత్వాలు, సోషల్ మీడియా వాళ్ళు, రెడియో మరియు టివి ఛానల్ వారు ఇలాంటి కళలను రికార్డు చేసి నిక్షిప్తపరిచి అప్పుడప్పుడు ప్రదర్శిస్తే భావితరాలకు ఇటువంటి కళలను అందించినవారమవుతాము.
ఆధార గ్రంధాలు :
1.అక్కలనాయుడు గొర్రె – శ్రీకాకుళం జిల్లా జానపద గేయాలు
2.కూర్మారావు బద్రి- ఉత్తరాంధ్ర జానపదకళలు
3 .రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని – తెలుగువారి జానపద కళారూపాలు
4.రామరాజు.బి. – తెలుగు జానపద గేయ సాహిత్యము
-మణిపాత్రుని నాగేశ్వరరావు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~