sahithivani

sahithivani

సాహితీ వాణి

(A Monthly Peer-Reviewed Online Multidisciplinary Telugu Research Journal)

Literature & Language | Linguistics | Arts & Humanities | History

ISSN: 3139-6283 (Online)

Publishing by.. Dr.lakshmanarao adimulam, Sri Mayuri Fine arts Association Regd No : 90/2024 H.No : 5-227, Sriram puram, school Veedhi, Rajanagaram, East Godavari - 533296, Andhra Pradesh. India. Cell;: 8522967827.

బోయి భీమన్న నాటక రచనలు – కుల నిర్మూలన , భారతీయ సమైక్యతా భావం -వెంకట్ కట్టూరి ఏం,ఏ తెలుగు, ఏం.ఫిల్

Volume – 1,                                                      July  2026,                                          issue – 4,

సమర్పణ (D.O.S): 11-06 – 2026               ఎంపిక (D.O.A): 25– 06 – 2026          ప్రచురణ (D.O.P) :  01-07-2026

వ్యాస సంగ్రహం :
తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని, సమానత్వ భావనను తన రచనల ద్వారా బలంగా ప్రతిపాదించిన ప్రముఖ రచయిత బోయి భీమన్న. ఆయన నాటకాలు కేవలం కళాత్మక ప్రక్రియలుగానే కాకుండా, సమాజ సంస్కరణకు దోహదపడే శక్తివంతమైన సాధనాలుగా నిలిచాయి. ముఖ్యంగా కులవ్యవస్థ వల్ల ఏర్పడిన అసమానతలు, అంటరానితనం, సామాజిక వివక్ష వంటి సమస్యలను ఆయన తన నాటకాల్లో వాస్తవికంగా చిత్రిస్తూ, వాటి నిర్మూలన అవసరాన్ని స్పష్టంగా ప్రతిపాదించారు.
ఈ వ్యాసంలో బోయి భీమన్న నాటకాల్లో ప్రతిఫలించిన కుల నిర్మూలన భావన, మానవ సమానత్వ దృక్పథం, భారతీయ సమైక్యతా సిద్ధాంతం వంటి అంశాలను విశ్లేషించడం ప్రధాన లక్ష్యంగా తీసుకోబడింది. కుల, మత, వర్గ, ప్రాంత భేదాలకు అతీతంగా మానవతా విలువలను స్థాపించాలనే ఆయన సంకల్పం నాటక పాత్రలు, సంభాషణలు, సంఘటనల ద్వారా ఎలా వ్యక్తమైందో పరిశీలించబడింది. అదేవిధంగా రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సోదరభావం, జాతీయ సమైక్యత వంటి ఆదర్శాలను ఆయన నాటకాలు ఎలా ప్రతిబింబించాయో కూడా ఈ వ్యాసం తెలియజేస్తుంది..
కీలకపదాలు :
బోయి భీమన్న , నాటకాలు , కుల, మత , వర్గ, ప్రాంత,భారతీయ, సమైక్యత,నాటక పాత్రలు,సామాజిక న్యాయం,వాస్తవికం,అంటరానితనం
పరిచయం:
సమాజాన్ని చైతన్యపరచి, కొత్తతరానికి బాటలు వేసి, తనవాణిని జాతి జనులు పఠించే మంత్రంగా రచించి, పీడిత జనానికి బాసటగా నిల్చి, తెలుగు కవిత్వంలో నిలువెత్తు సంతకంగా నిలిచిన నాటక కర్త బోయి భీమన్న.
“నాటకాంతం హి సాహిత్యం” అని పెద్దలు సెలవిచ్చిరి. “సందర్భేషు దశరూపకం శ్రేయః” అని వామనుడు అభిప్రాయపడెను. భరతుడు నాట్య శాస్త్రమున నాట్యము మనది యజ్ఞముతో సమానమైనదని పేర్కొనెను. విభిన్న రుచులు కలిగిన జనావళికి ఏక పత్ర సమారాధన చేసేది నాటకం. అనితెలుగు నాట నాటకానికున్న లక్షణాలను వివరించారు మన సాహితీకారులు. ఒక అంకము మొదలు పది అంకముల వరకు గల రూపకములు పది. వానినే దశ విధ రూపకములు అని పిలిచిరి. కప్పటి స్వభావము, నాయక లక్షణములు, రస స్వరూపమును ఆధారంగా చేసుకొని ఈ దశవిధి రూపకములు వెలసినవి. నాటకము.
రచయిత ఎవరైనా సరే సమకాలీన జీవితాన్ని, సాంఘీకాచారాల్ని తమ రచనల్లో ప్రతిఫలింపచేయకుండా ఉండలేరు. ఎటువంటి రచన అయినాసరే, పౌరాణిక, చారిత్రకాల్లో కూడా ఇది అసాధ్యం. రామాయణాది కావ్యాలే తెలుగులో అవాల్మీకాలకు తావు ఇచ్చాయంటే న మిగిలిన కథల గురించి చెప్పనక్కర్లేదు. అందులోనూ కథ సాంఘిక ఇతివృత్తమైతే అందులో సమకాలీన జీవనమేకాదు, సంఘంలోని వంచి చెడ్డలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. కవి ప్రతి విషయానికి సాధారణ మానవుడికన్నా అధికంగా స్పందిస్తాడు. ఆ స్పందన వల్ల ఆతని లో చెలరేగే భావాలన్నీ అతని రచనల్లో ప్రతిబింబిస్తాయి. సాధారణంగా కవి మనస్సు సగటు వ్యక్తి మనస్సు కన్నా ఎక్కువ సంచలనం చెందుతుంది. మంచిచెడు కాని, ఎగుడుదిగుళ్ళు కాని, సుఖదుఃఖాలు కాని, ఆనందం, విషాదం, ఆశ్చర్యం ఏదైనా కాని కవి స్పందన ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ భావాల ప్రభావం అతని రచనలమీద పడుతుంది. అందుకే కవుల రచనల్లో మంచికీ చెడుకీ ఎల్లవేళల ఘర్షణే ! అయితే ప్రతివ్యక్తి కోరుకునేలాగే కవి కూడా మంచి గెలవాలని న్యాయధర్మాలు వర్ధిల్లాలని కోరుకుంటాడు. ఆ కోరిక రచనల్లో కూడా కన్పిస్తుంది. అందువల్ల ధర్మానిదే తుది నిర్ణయం.

బోయి భీమన్న పద్య కవిగా, గేయ కవిగా, నాటక కర్తగా సాహిత్య సృజనలో తనదైన ముద్రను నిలుపుకున్నారు.
పేదరికం, అంటరానితనం, అవమానాల స్వానుభవాలతో అక్షరాలే ఆయుధంగా, అనుక్షణం ఉద్యమించిన ఈ సాహితీవేత్త, సెప్టెంబరు 19, 1911న జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు ఆయన స్వస్థలం. తలిదండ్రులు నాగమ్మ.పుల్లయ్య. వీరికి అయిదుగురు కొడుకులు వారిలో రెండవ సంతానం డా. బోయి భీమన్న.డిసెంబరు 16, 2005 న ఆయన సాహితీలోకాన్ని విడిచి వెళ్ళారు. తెలుగు సాహిత్యంలో భీమన్న సృష్టించిన ఒరవడి అద్వితీయం. ఆయన రచనలన్నింటిలోనూ అంతర్లీనంగా ఉన్న విషయం ఒక్కటే అదే “భారతజాతి ఏకత్వం”.సమాజంలో చెడ్డవాళ్ళే కాదు, అనేకులు మంచివాళ్ళుంటారని తెలియజేయటం భీమన్న రచనల్లోని విశిష్టగుణం. సమాజంలో సంఘర్షణలకు కారణమైన కుల, మత, వర్గ విభేదాలను అధిగమించాలంటే, అందరూ విద్యావంతులు కావాలంటారు భీమన్న. “సామాజిక సమరసత, సాహితీ సమర్చన రెండు కళ్ళుగా జీవించారు బోయి భీమన్న” అంటారు ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు. కులంలేని జాతి కోసం భీమన్న కలలు గన్నాడు. కవి భావాలు సత్యగుణ ప్రధానం అయితే స్వచ్ఛ సమాజ స్థాపన జరుగుతుందని ఆయన విశ్వసించారు. పాఠకులను తనవెంట పరుగులు తీయించే ‘వాక్య నిర్మాణ శైలీ,భాషా పటిమ, చెప్పదలుచుకున్న విషయాన్ని సహేతుకంగా, తర్క బద్దంగా వివేచనతో నిరూపించే విషయ పరిజ్ఞానం భీమన్న రచనల్లోని గుణాలు’. విద్య ద్వారానే మన దేశం లోని దళిత బహుజనులకు విముక్తి కలుగుతుందని చెప్పిన అంబెడ్కర్ సిద్ధాంతాన్ని, దృక్పథాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పారు భీమన్న.
డా.బి ఆర్ అంబెడ్కర్ గారన్నట్లు సమాజంలోని మానవులందరి మధ్యా సాంఘిక సోదరత్వం ఉండాలి. అదే సౌభ్రాతృత్వం, సౌభ్రాతృత్వం అంటే, ప్రజాస్వామికానికి మరొక పేరు. ప్రజాస్వామికమంటే ఒకరకమైన ప్రభుత్వం మాత్రమే కాదు. పరస్పరాను బంధం గల ఒక పద్ధతి. జీవిత విధానం అది. ఒక పద్ధతి సంయుక్త సంసర్గ సౌమ్యానుభవ మది. తోటి మానవులపట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించడం ప్రజాస్వామిక జీవిత విధానంలో అత్యంత ప్రధాన విషయం, కనుక సమాజంలో సౌభ్రాతృత్వం తప్పని సరిగా ఉండాలనడంలో ఎవ్వరికీ ఏ విధమైన అభ్యంతరము ఉండదనుకుంటాను.
పద్మశ్రీ డా.బోయి భీమన్న విరచిత పాలేరు నాటకం సమాజంలో అతి ముఖ్యమైన విజ్ఞానోద్యమానికి బీజం వేసింది నాటకం.కుల నిర్మూలన అంశంతో వచ్చిన కథాంశంతో అనేక సార్లు ప్రదర్శించబడినది. మాలలు అనేకులు పాలేర్లుగా పని చేస్తే యువకులు తాము కూడా చదువుకుని వెంకన్నలా, ఉన్నతోద్యోగం సాధించవచ్చు అని ఒక నమ్మకం ఆత్మ విశ్వాసం కలిగించింది ఈ పాలేరు నాటకం.
బానితసనుము – బాపుమురా
భారత భూమికి – భాగ్యము తేరా
సకల దేశముల – సర్వ మానవుల
సామ్యము – సాధింపుమురా ?” అంటూ ప్రాంభించిన ఈ పాలేరు నాటకం నిరుపేద బ్రతుకుల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేయడంలో దృష్టి కనిపిస్తుంది.(పాలేరు నాటకం – బోయి భీమన్న , పుట – 9 )
కుల రహిత సమాజం భీమన్నకి ఆదర్శం. దానికి ఆయన పదే పదే ప్రచారం చేసే మార్గం కులాంతర వివాహాలే. ప్రేమకుమార్ కు, పరంజ్యోతికి జరగవలసిన పెళ్లి గురించి మిత్రా ద్వారా సూచించి కూలిరాజు నాటకంలోనూ ఆయన దానిని వాస్తవీకరించే ఉత్సాహం చూపాడు. ఆ తరువాతి నాటకాలలో కూడా ఈ ధోరణి కనబడుతుంది. భీమన్నకు తన రచనలలో కల్పన చాలా ఇష్టం. ఇతివృత్తాన్నీ, పాత్రల స్వభావాలను సూచించేట్లు పేర్లు నిర్ణయిస్తాడు ఆయన.
‘కూలిరాజు ‘నాటకంలోనూ సమానతా సూత్రమే కీలకం. కుల సమానత కన్నా ఆర్థిక సమానతపై దృష్టి ఎక్కువ. ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే గారన్నట్లు “పురాణ కథలను, అందరికీ తెలిసిన కథలను తీసుకొని అందులోని మాయను అభవం చేస్తూ వాటిద్వారా వాళ్లకు తెలియని వర్తమాన సామాజిక అంశాలపై ఒక అవగాహన కలిగించటానికి ప్రక్రియను, ఉద్దేశాన్ని కూడా మారుస్తూ పునర్నిర్మించటం ఆధునిక సాహిత్యంలోని విశిష్టత”. వాటి స్వభావాన్ని, ప్రయోజనాన్ని అర్ధం చేసుకొనటానికి రాగవాశిష్టం ఒక్కటి పరిశీలిస్తే సరిపోతుంది.
“కూలివాడు రాజ్యమేలినప్పుడు గానీ
సంఘ బాధలెల్ల చక్కబడవు
సరగనట్టి రాజ్య ప్రస్తాపనమునకై
బ్రతుకు ధారవోసి పాటుపడదు “ (కూలిరాజు నాటకం – బోయిభీమన్న , పుట – 25 )అంటూ భూస్వాముల చేతుల్లో చిక్కిశల్యమైపోతున్న సమానత్వాన్ని రక్షించాలంటే కూలివాడు రాజ్యాధినేతగా ఎదిగి , సమాజంలో పేరుకుపోయిన బాధలను సమస్యలను నివారించాలని నొక్కి చెబుతారు భీమన్న.

‘రాగవాసిష్ఠం’ ఈ నాటకాన్ని బోయి భీమన్న గారు 1959లో రాశారు. 12రంగాలు గల ఈ నాటకం రావడం వెనుక కుల సమస్యను, దళితుల సంస్కృతీ పరమైన విషయాలను చర్చించాలనే లక్ష్యం కనిపిస్తుంది. భారతదేశంలో ఆర్య-ద్రావిడ జాతుల పుట్టుకకు సంబంధించిన చారిత్రక లోతులెన్నో ఈ నాటకంలో ఉన్నాయి. పౌరాణిక ఇతివృత్తాన్ని తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల సమస్యను లోతుగా చర్చించి, “భారతీయులంతా ఒక్కటే” అనే జాతీయతా వాదాన్ని స్థాపించే నాటకంగా దీన్ని మనం చూడవచ్చు.
రాగ వాశిష్టం నాటకతత్వం గురించి ఆచార్య. దార్ల వెంకటేశ్వరరావు అన్నట్లుగా “నిష్కల్మషమైన జీవనానికి మానవుల మధ్య వర్ణ భేదాలు అవసరం లేదు. అవన్నీ కొంతమంది స్వార్థంకోసం, తమ ఆధిక్యం కోసం సృష్టించుకొన్నవి. వాటిని ఎంత త్వరగా విస్మరించి నిర్మూలించగలిగితే, అంత త్వరగా భారతీయత సమైక్యంగా బలపడుతుందనేది ఈ నాటకం ఇచ్చే సందేశం.
అంబేడ్కర్ రాసిన ‘ఎనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ ‘ గ్రంథాన్ని ‘కుల నిర్మూలన’గా తెలుగుకె లోన్న అనువదించారు. అంతే త్రికరణశుద్ధితో అంబేడ్కర్ సిద్ధాంతవాదాన్ని అనుసరించి, ప్రచారం చేశారు.. అంబేద్కర్, భీమన్న ఇరువురు చదువుకోవటంవల్లనే సమాజానికి ఆదర్శం కాగలిగారు. యాదృచ్ఛికంగా ఇద్దరూ కులాంతర వివాహమే చేసుకున్నారు. తాము చెప్పిన వాటిని జీవితాంతం ఆచరించి చూపి మహానుభావులయ్యారు.
‘జానపదుని జాబుల్లో’ దళిత, రైతు కూలీలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా యాసలో సాగిన ఈ రచనలో కోససీమ ప్రకృతి అందాలు, సంఘం, గ్రామ నిర్మాణం, పాలేరు తనం నిర్మూలన వంటి అంశాలపై నిశిత పరిశీలన వుంది. ‘జానపదుని జాబుల్లో’ దళిత, రైతు కూలీలకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి. తూర్పు గోదావరి జిల్లా యాసలో సాగిన ఈ రచనలో కోససీమ ప్రకృతి అందాలు, సంఘం, గ్రామ నిర్మాణం, పాలేరు తనం నిర్మూలన వంటి అంశాలపై నిశిత పరిశీలన వుంది.
‘భీమన్న హృదయం ప్రేమ చుట్టూ పరిభ్రమిస్తే బుద్ధి జాతీయోద్యమం వైపు ప్రసరించింది. ఆయనకు ప్రకృతి, ప్రేయసి ఎంత ప్రేమ పాత్రమైనవో దేశంఅంత కన్నా ఎక్కువ ప్రేమ పాత్రమైనది. వ్యక్తి స్వేఛ్ఛను ఎంత ఆకాంక్షిస్తాడో సమిష్టి స్వాతంత్యం కోసం అంత పరితపించాడు. ప్రకృతిలోనూ సాధారణ మానవప్రవృత్తిని అన్వేషిస్తాడు. ఆవిష్కరించి ఆనందిస్తాడు. అందువల్లనే ఆయన కావ్యాలు జాతీయోద్యమం నుండి జీవనం వరకు అనేకవిషయాలను పరామర్శిస్తాయి’.
ముగింపు :
బోయి భీమన్న నాటకాలు కేవలం రంగస్థల ప్రదర్శనల కోసం రచించబడిన సాహిత్య ప్రక్రియలు మాత్రమే కాకుండా, సామాజిక మార్పును లక్ష్యంగా చేసుకున్న చైతన్య గ్రంథాలుగా నిలిచాయి. పాలేరులో అణగారిన వర్గాల ఆత్మగౌరవం, విద్య, సామాజిక చైతన్యం ద్వారా విముక్తి సాధ్యమనే సందేశం ప్రతిధ్వనిస్తుంది. కూలీరాజులో శ్రమజీవుల గౌరవం, సమాన హక్కులు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం వంటి అంశాలు ప్రధానంగా ప్రతిఫలిస్తాయి. రాగ వాశిష్టంలో జన్మాధారిత కుల వివక్షను నిరసిస్తూ, గుణం, మానవత్వం, ధర్మమే వ్యక్తి గొప్పతనానికి నిజమైన ప్రమాణాలని రచయిత బలంగా ప్రతిపాదించారు.
ఈ మూడు నాటకాలలోనూ కుల వ్యవస్థ వల్ల ఏర్పడిన అసమానతలను భీమన్న ధైర్యంగా ప్రశ్నించారు. అంటరానితనం, సామాజిక వివక్ష, వర్గ విభేదాలు వంటి అన్యాయాలను ఖండిస్తూ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవతావాదం ఆధారంగా సమాజ నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం వంటి విలువలకు ఆయన నాటకాలు సాహిత్యరూపంలో బలమైన మద్దతును అందిస్తాయి.
ఆధార గ్రంథాలు:
1.. ఆధునిక భాష:తెలుగు ప్రచురణ :(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)
2. ఆధునికాంధ్ర కవితాధోరణులు ప్రచురణ : (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)
3. తెలుగు సాహిత్య చరిత్ర – ఆధునిక భాష ప్రచురణ :(ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)
5. జ్ఞానానందకవి యస్.టి,1997, షెడ్యూలు కులాలు అంటరానివా! కాకినాడ: సురగాలి ప్రచురణలు
6.జగన్నాధం నములకంటి. 1968, ఆరుంథతీదేవి చరిత్రము. హైదరాబాద్: వైదిక గ్రంథప్రచారమండలి ప్రచురణలు
7.నారాయణరెడ్డి, సి,(ప్రధాన సంపాదకుడు) 1992, బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు 7వ సంపుటి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణలు
8. భీమన్న బోయి. 1959, రాగ వాశిష్టం . హైదరాబాదు: సుఖేలానికేతన్ ప్రచురణలు
9.బోయి భీమన్న సమగ్ర సాహిత్యం-సంపుటి 2 ప్రచురణ:తెలుగు విశ్వవిద్యాలయం.
10.మూర్తి .బి.బి.యస్,1992, దళిత కథామంజరి రాజమండ్రి: త్రివేణి ప్రింటర్స్ ప్రచురణలు
11. హైమవతి, 1982, ద్వితీయ ముద్రణ, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న, (ప్రథమ ముద్రణ ,1978), హైదరాబాదు : సుఖేలానికేతన్ ప్రచురణలు.

 

-వెంకట్ కట్టూరి ఏం,ఏ తెలుగు, ఏం.ఫిల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top