
Volume – 1, June 2026, issue – 3,
సమర్పణ (D.O.S): 14 -05 – 2026 ఎంపిక (D.O.A): 25– 05 – 2026 ప్రచురణ (D.O.P) : 01-06-2026
వ్యాస సంగ్రహం :
పోలవరం మండలంలోని గిరిజన సమాజ జీవన విధానంలో పండుగలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. వారి ఆచారాలు, సంప్రదాయాలు, ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనా భావం, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఈ పండుగల ద్వారా ప్రతిఫలిస్తాయి. ఈ వ్యాసంలో భూదేవి పండగ, తాదిచేయ్యు పండగ, కొత్తల పండగ, కడకు పండోయ్, జీడి–మామిడి పూతల పండగ, భీమ పూజ, నాగులచవితి, శ్రీరామగిరి ఉత్సవాలు, చింతకాయల పండగ వంటి గిరిజనుల ముఖ్య ఉత్సవాలను పరిశీలించాం. ఈ పండుగల ఆవిర్భావం, నిర్వహణ విధానం, వాటికి సంబంధించిన విశ్వాసాలు, సామాజిక మరియు సాంస్కృతిక ప్రాధాన్యతలను విశ్లేషించాం. గిరిజనుల పండుగలు ప్రకృతి, భూమి, పంటలు, గ్రామదేవతలు మరియు సమాజ ఐక్యతతో ముడిపడి ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. ఈ ఉత్సవాలు గిరిజనుల సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు, భవిష్యత్ తరాల వారికి తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.
కీలక పదాలు :
పోలవరం, గిరిజనులు, పండగలు, గండి పోచమ్మ, భూదేవి పండుగ, మామిడి పండుగ, కొత్తల పండుగ, తాటి చెట్టుపండుగ, జీడిమామిడి పండుగ, ముత్తెలమ్మ పండుగ, కడకు పండోయి, గండి పోచమ్మ తల్లి ఉత్సవాలు, నాగుల చవితి పండుగ, రెడ్డి గణపవరం ఉత్సవాలు, భీమ పూజ, దారి పండుగ
ప్రవేశిక :
పోలవరం మండలంలో ముఖ్యంగా కోయ , కొండరెడ్డి తెగలు ముఖ్యమైనవి . వీరితోపాటు లంబాడీలు కూడా కొత్త కొమ్ము, పాత కొమ్ము గూడెం గ్రామాల్లో నివసించడం జరుగుతుంది. కొండ దొరలు , కోయ దొరలు అనేవి కొన్ని ఉప గిరిజన తెగలుగా వ్యవహరించబడుతున్నాయి.
కోయ తెగలు ఆంద్ర ప్రదేశ్ లోని అత్యంత ప్రధానమైన తెగలో కోయ తెగ ఒకటి. వీరికి దొరల చుట్టం కోయంటారు , పుట్టకోయ ,పుట్ట దొర అనే పర్యాయపదాలున్నాయి.వీరిలో గుట్ట కోయ లేక కొర్ర రాజులు లేక రాచకోయ లేక కొండరాజులు , కొమ్ము , ముసర అనే ఉప తెగలున్నాయి.
కొండరెడ్లు అనేది ఒక గిరిజన తెగపేరు. వీరు ఆంద్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చుమగోదావరి , విశాఖపట్టణం జిల్లలో ఎక్కువుగా ఉంటారు. 1971 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా 40 వేలు ప్రస్తుతం వీరి జనాభా లెక్కకు మించి పెరిగింది.
కోయ తెగలలో ఉపతేగా అయిన కోయ దొరలు కూడా వారి మాతృభాష వేరే అయినా అందరిలో ఉన్నప్పుడు తెలుగులోనూ , వారితో వారు మాత్రం వారి మాతృభాషలో మాట్లాడుకుంటారు.వీరికి కూడా వారి ప్రధాన ఆహారపంట , పోడు వ్యవసాయ పద్దతిలో కన్డుల్ని పండిస్తారు.వీరు మాంసాహార ప్రియులు, వీరు ఎక్కువుగా సేవించేది జీలుగుకల్లు , యిప్పసారా, నాటుసారా .
పూస తెగ వీరు గిరిజనేతర గ్రామాలలో నివసిస్తూ ప్రతిరోజు తలపై ఒక పెద్ద బుట్టను, రెండు చేతులకు రెండు సంచులు వాటిలో కొన్ని పిన్నులు , దువ్వెనలు, పూసల దండలు, రిబ్బన్ బాండ్ లు , జడ క్లిప్పులు ఇంకా మరెన్నో వస్తువులు వేసుకునిఊరంతా తిరుగుతూ అమ్ముకుంటారు.
లంబాడీలు లేదా నాయక లు లేదా సుగాలీలు పోలవరం మండలంలో కొమ్ము గూడెం అనే గ్రామంలో మాత్రం కోయ దొర తెగ వారితో కలిసి నివసిస్తున్నారు. బ్వీరు చూడటానికి చక్కని ముఖ కవలికలతో అందంగా మంచి రంగుతో ఉంటారు. వారి మెడలో ధరించే వివిధ రకాల పూసదండలు నిండు దానమైన రంగులతో అక్కడక్కడ అద్దాలు కుట్టబడిన బట్టలు ప్రదాన ఆకర్షణ. యివే పోలవరం మండలంలో నివసించే గిరిజన తెగలు.
విషయ వివరణ:
గిరిజనుల ఆచార వ్యవహారాలలో పండుగలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా వీరు చైత్రమాసంలో ‘ఉగాది పండుగ’ను వారి భాషలో ‘ఇసి పండుగ’ అంటారు. దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి మొదలైన పండుగలను జానపదులు ఆచరించినట్లే వీరు ఆచరిస్తారు.
ఇవిగాక వీరు ఆచరించే మరికొన్ని ప్రత్యేకమైన పండుగలున్నాయి. వీటిని వీరు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు.
అవి:- 1. భూదేవి పండుగ 2. మామిడి పండుగ (పూస పండుగ) 3.కొత్తల పండుగ 4. తాటి చెట్టుపండుగ
5. జీడిమామిడి పండుగ 6. ముత్తెలమ్మ పండుగ 7. కడకు పండోయి 8.గండి పోచమ్మ తల్లి ఉత్సవాలు
- నాగుల చవితి పండుగ 10.రెడ్డి గణపవరం ఉత్సవాలు 11. భీమ పూజ 12.దారి పండుగ.
1.భూదేవి పండగ :
ఈ భూదేవి పండుగను మేనెల చివరికాలంలో తొలకరి జల్లులు పడిన తర్వాత గిరిజనులు ఆచరిస్తారు. ముందుగా ఆయా గ్రామంలోని గిరిజన ఆడపడుచులు కొంతమంది ఒక గుంపుగా గుమిగూడి ఆ గ్రామానికి దగ్గరలోని రోడుపై ఒక పెద్ద వెదురు కర్రను పట్టుకుని బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు మొదలైన వాహనాలపై వెళ్ళే వారి దగ్గరినుండి ఎంతోకొంత డబ్బును పోగుచేసుకుంటారు. ఈ విధానం 5రోజులపాటు కొనసాగుతుంది. అలా పోగుచేసిన డబ్బుతో ఈ భూదేవి పండుగ (భూం పండుగ)ను ఆచరిస్తారు.
గిరిజన దేవతలైన కొండదేవతలను, గంగానమ్మ తల్లి, ముత్తెలమ్మ తల్లి, గండిపోచమ్మ తల్లులను గత సంవత్సరమంతా చల్లగా కాపాడావు. ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా కురిపించి మా పాడి పంటలను సమృద్ధిగా ఉండేలా కాపాడుతల్లి అని వేడుకుంటారు. ఆ తర్వాత కొత్త భూమిలో విత్తనాలు చల్లి పంటలు బాగా పండాలని, మేము కలకాలం క్షమంగా బతకాలని కోరుకుంటారు.
ఈ ఊరి గ్రామ పెద్దకాపు భార్య కోడిగుడ్డును బాణంతో కొడతారు. ఆ తర్వాత ‘కొల్లేరు వేట… కొల్లేరు వేట… కూ…’ అని దేవతను తలచి వారికి వరసైనవారికి పేడతో మీద జల్లుతారు. తర్వాత మగవారు వేటకు అడవికి వెళ్ళి కొండ దుప్పిని గాని, ఏదైనా మృగాన్ని గాని కొట్టుకొచ్చి దానిపేడను వరసైనవారికి రాయడానికి వారిని తరుముతారు. ఆ తర్వాత ఆ తెచ్చిన జంతువు మాంసాన్ని వండుకుని ఆ ఊరివారందరూ ఒక చోట చేరి బంతి భోజనం చేస్తారు. ఆ రాత్రంతా తమదైన నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు.
ఈ భూదేవి పండుగను గిరిజనులు పొలంలో విత్తనాలు చల్లేముందు పంట దిగుబడి బాగుండాలని తమ ఇల వేల్పును కోరుకుంటూ విధిగా ఆచరిస్తారు.
భూదేవి పండుగ పాట :-
“రేరేలయో రేలా రేలా రేలా రేరేలయో రేలా రేలా రేరేలాయో కూ…. కూ…. మాకు ఇచ్చే ఐదు రూపాలు మాకు ఇచ్చే ఐదు రూపాలు ఏ బొడ్డులో ఉన్నాయో.. ఏ జేబులో ఉన్నాయో…. రేరేలయో రేలా రేలా రేలా రేరేలయో రేలా రేలా రేరేలాయో కూ….కూ…. పూల్వ గుమ్మొడి పూల గుమ్మాడే లారీ మీద బావగారూ పూల్వ గుమ్మాడే కూ….కూ…. కొల్లేరి వేట కొల్లేరి వేట కూ….
భావం:
భూదేవి పండుగ చేసుకునే రోజులలో మాకు ఇచ్చే ఐదు రూపాయలు ఏ బొడ్డులో ఉన్నాయో, ఏ జేబులో ఉన్నాయో అని రొడ్డుమీద కర్ర అడ్డం పెట్టి దారిలో వెళ్ళే ప్రయాణికులను ఉద్దేశించి వారివద్ద దేవుడి చందా వసూలు చేయడం. ‘పూల్వ గుమ్మోడి, పూల్వ గుమ్మోడి’ అని గ్రామదేవతని కొలుస్తూ చందాలు వసూలు చేయడం. ఆ వసూలు చేసిన డబ్బుతో వారు పండుగను జరుపుకుంటూరు.” (ఈ వివరాలు ఇచ్చినది పి. రాజ్కుమార్ (కోయిందప్ప) ముద్దప్పగూడెం) ( ముద్దప్పగూడెంకు చెందిన కోయిందప్పగారు ఈ పండుగ పాట ఇచ్చారు)
మామిడి పండుగ:-
“సంక్రాంతి పండుగ రోజున మామిడి పువ్వును గ్రామదేవతల ముందు ఉంచి పూజ చేస్తారు. ఆ తర్వాత ఉగాది పండుగ అయ్యేంత వరకూ ‘మామిడి పండుగ’ చేయకుండా ఒక్క మామిడి కాయ కూడా తినరు. ఆ రోజు ఊరు ఊరంతా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆహారపదార్ధాన్ని పోగుచేసుకుని తమ దేవతకు మొక్కును సమర్పించి, ఆ రాత్రంతా మద్యం సేవించి, మాంసాహారం తిని పండుగను ఆచరిస్తారు. ఆ తర్వాతి రోజునుంచి మామిడికాయలను కోయడం, తినడం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగకు ముందు చిక్కుడుకాయలు కాచినా తినరు పండుగ తర్వాతే తింటారు.
చింతకాయల పండుగ :-
ఊరిలో ఉన్న చింత చెట్లను దులిపి ఆ ఊర్లో ఎన్నికుటుంబాలు ఉన్నాయో అని కుప్పలు పోస్తారు.. ఆ తర్వాత తమ గ్రామదేవతకు పూజలుచేసి, ఆ తర్వాత ఆ చింతకాయలను ఎవరి పోగును వారు తీసుకుంటారు.
కొత్తల పండగ :
సామలు కోసి పాలాకుతో నైవేద్యం చేస్తారు. గోంగూర, బచ్చలికూర, పాలకూర మొదలైన ఆకు కూరలను పూజచేసిన తర్వాతే తింటారు.
తాటిచెట్టు పండుగ :-
తాడికి మూడు రేఖలు కట్టి పసుపు, కుంకుమ, సాంబ్రాణి, అగరుబత్తి, వెలిగించి మూడు డొక్కుల కల్లు, మూడు తాటి రేకులకు పూసి పూజచేసి అప్పుడు కల్లుతాగుతారు.” (ముద్దప్పగూడెంకు చెందిన పి. రాజ్కుమార్ గారు ఇచ్చిన వివరాలు.)
జీడిమామిడి పూతల పండుగ :-
“ఈ జీడిమామిడి పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇది కొన్ని స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో గిరిజనులు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా లాభాలు ఏ విధంగా పొందవచ్చునో వివరించడం జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజన, గిరిజనేతర రైతులు పాల్గొని, తమ తమ అభిప్రాయాలను అనుమానాలను నివృతి చేసుకోవడం జరుగుతుంది.” (సాక్షి ,దినపత్రిక ,ది.29 – 03 – 2013 )
కడకు పండోయి :
“కొండదొరలకు ముఖ్యమైనది ‘కడకుపండోయి’ అనే పండుగ. దీనినే సాధారణంగా ఏప్రియల్ నెలలో జరుపుతారు. ఈ పండుగలో మొదటిరోజున వారికున్న వ్యవసాయపు పనిముట్లను శుభ్రంచేసి, కోడినొక దానిని బలిచేసి ఈ రక్తాన్ని పనిముట్లపై చల్లుతారు.
ఆ రోజు సాయంత్రం గ్రామస్థులందరూ, గ్రామదేవత ఆలయంవద్ద గుమిగూడి వారు పట్టుకువచ్చిన ఆ యా రకాల ధాన్యపు విత్తనాలను ఎర్రటి కోడిపుంజు రక్తంలో కలిపి ఎత్తయిన స్థలంనుండి ఆ గ్రామ పూజారి పైకి విసురుతాడు. ఈ గింజలను ఆ గ్రామస్థులు పట్టుకుంటారు. ఎవరికి ఏ ధాన్యపు గింజలు ఎక్కువగా దొరికితే వారికి ఆ పంట బాగా పండుతుందని అర్ధం. దానినిబట్టి ఆ యా రకపు పంటలను ఆ గ్రామస్థులు పండిస్తారు.” (తెలుగువారి చరిత్ర 7000 ఏండ్ల క్రిందటే ఆరంభమైనది (వ్యాసం), భారతిపత్రిక, పుట-52)
ముత్తెలమ్మ తల్లి పండుగ :-
ఈ పండుగను ఎక్కువగా కొండరెడ్లు ఆచరిస్తారు. తమ కోర్కెలు తీర్చమని, తమ కుటుంబాలు, పంటలు, పాడి మొదలైనవాటిని చల్లగా చూడమని ముత్తెలమ్మని కోరుకుంటారు. ఈ సమయంలో ఆ యా గుడులని అలంకరించి పాటలతో, నృత్యాలతో ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో ఊరంతా జాతరచేస్తారు.
ఈ జాతరకు తమ దూరపు బంధువులను ఆహ్వానిస్తారు. ఈ ముత్తెలమ్మ జాతర ప్రారంభానికి 24 గంటలముందే అందరూ ఊర్లోకి చేరుకోవాలి లేదా ఆ జాతర అయ్యేంతవరకు వారు ఊరి పొలిమేరలోనే ఆగిపోవలసి ఉంటుంది. ఆ దేవిని ఊరేగించే సమయంలో ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు. చూస్తే అరిష్టం అని ఒక నమ్మకం.
పాట 1:-
ఓ గోగుల పూడి ముత్యాలమ్మ తల్లీ నీ కొలువు చేస్తున్నాము తల్లీ కొండలు, కొండదేవతలు దిగిరావాలి తల్లీ భూమిలో ఉండే నేల తల్లి నువ్వు దయచేయాలి ధన ధాన్యాలని తీరం కొండ చిన్నమ్మ తల్లి నువ్వు తప్పకరావాలి గురుపర్తి కోండారు మరాజీ నువ్వురావాలి రాజు కొండరాజు కూతురా నువ్వు రావాలమ్మ పంది కొండ కన్నాతీ రాజూ నువ్వు తప్పక రావాలి….
కోవెల కండకన్న మారాజూ నువ్వు తప్పక రావాలి….
–అంటూ కొండరెడ్లు ముత్తెలమ్మని వేడుకుంటారు.
భీమపూజ :
“భీముడు తన జాతి స్త్రీనే పెళ్ళాడాడని గిరిజనుల గట్టి నమ్మకము. అందుకే వాళ్ళలో చాలామంది భీముడని, ధర్మరాజనే పేర్లు కలవాళ్లు ఎక్కువ మంది కనిపిస్తారు. పాండవులు ఉన్నచోట అనావృష్టి ఉండదని వాళ్లనమ్మకం. అందుచేతనే వర్షాభావం ఏర్పడినపుడు భీమపూజని చేస్తారు. హిడింబి, ఘటోత్కచులు తమజాతి వాళ్ళు అనే గిరిజనుల అభిప్రాయము. ఈ భీమ పూజనాడు గూడెమంతా కలిసి పెద్దమొత్తంలో అన్నం, జొన్నలతోకాని బియ్యంతోకాని వండి ఒక చోట కుప్పలుగా పోసి తమ సంప్రదాయ నృత్యం చేస్తూ వర్షాలు కురవాలంటూ పాటలు పాడతారు. ఈ పండుగ సమయంలో మొత్తం గూడెంలోని వారంతా తాటికల్లు, విప్పసారా, జీలుగు కల్లు మొదలైన మద్య పానీయాలు సేవించి, మాంసాహారం భుజించి, సంప్రదాయ బద్ధమైన నృత్యాలు చేసుకుంటూ ఆ రాత్రంతా ఆనందంగా గడుపుతారు.” (డా||అనప్పిండి సూర్యనారాయణమూర్తి, పాపికొండల నుండి పర్ణశాలదాక, పుట-85)
నాగులచవితి :
ఈ పండుగను కొండరెడ్లు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఆ రోజు తలంటుస్నానం చేసి, పుట్టలదగ్గరికి వెళ్ళి, ఆ పుట్ట ఉన్న ప్రదేశాన్ని శుభ్రంచేసి, ఆ పుట్టలో పాలు పోసి, గుడ్లను నైవేద్యంగా పెడతారు, ఈ విధానం నాగరికులను పోలి ఉంటుంది. ఆ తర్వాత ఆ పుట్టదగ్గర తమదైన నృత్యాలను చేస్తూ పాటలు పాడుతూ ఆ రోజంతా ఆనందంగా గుడుపుతారు.
పాట:
“నాగుల చమితికీ నాగేంద్ర నీకూ
పుట్టనిండిక పాలు పోసెదము తండ్రీ
ఇది కొండ అది కొండ
మద్యనున్నది కొండా, విది కొండ అదికొండ
మధ్యనున్నది కొండ
కొండల్లో ఉండేటి కోడె నాగన్నా ॥నాగులా॥
శ్రీరామగిరి సీతారాముల కళ్యాణ ఉత్సవం :
పోలవరం నుండి గోదావరిలో లాంచీమీద ప్రయాణించిగాని, ఆటోమీదగాని ఈ ‘శ్రీరామగిరి’కి చేరుకోవచ్చు.
ఈ ‘శ్రీరామగిరి’ని గిరిజన, గిరిజనేతరులు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు.
శ్రీరాముని సీతాలక్ష్మణ సమేతంగా ఒక ఎత్తైన గుట్టపై ప్రతిష్ఠిండచంచేత ఈ క్షేత్రానికి ‘శ్రీరామగిరి’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం భద్రాచలం దేవాలయంకంటే ప్రాచీనమైనదని చెప్తారు. ఈ ఆలయంలో సీతారామ, లక్ష్మణ విగ్రహాలను మతంగముని ప్రతిష్ఠించాడని ఒక నమ్మకం. అందుచేత మాతంగ మహాముని విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహప్రతిరూపం పొట్టిగా ఒకింత కుండబొజ్జను కలిగి ఉంటుంది. ఈ ఆలయం భద్రాద్రి ఆలయంకంటే ప్రాచీనమైనది అని చెప్తారు. దాదాపు 500 సంవత్సరాలక్రితం కట్టబడిందని ఒక విలేకరి (వార్త- ఖమ్మం- ఏప్రిల్ 9,2003) దినపత్రికలో రాసారు. ఇది అవాస్తవ విషయమని పరిశీలకులు తేల్చారు.
శ్రీరామగిరిలో భద్రాచలంలో మాదిరిగానే ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన మహోత్సవాన్ని చైత్ర శుద్ధ నవమినాడు శ్రీ సీతారాముల కళ్యాణాన్ని భారీ ఎత్తున చేస్తారు. ఈ రెండు ఉత్సవాలలో కూడా ఈ రెండు తెగల గిరిజనులు అధికసంఖ్యలో పాల్గొంటారు. భక్తితో ముడుపులు చెల్లిస్తారు. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు అయిదు రోజులపాటు జరుగును. దేవుడు నగలను దొంగలు దోచుకెళ్లి గోదావరి తీరంలో ఇసుకతిన్నెలో దాస్తారు. వాటిని వెతికి తీసుకొచ్చి తిరిగి ధర్మకర్తలు విగ్రహాలకి అలంకరిస్తారు. ఈ ఉత్సవంలో గిరిజనులు విశేష సంఖ్యలో పాల్గొని కల్లు, సారాయి వంటి మత్తు పానీయాలను తాగి తెల్లవార్లు ఆనందంగా గడుపుతారు. ఈ అయిదురోజులు గిరిజనేతరులు దుకాణాలను ఏర్పాటుచేసి గిరిజనులను ఆకర్షింపచేస్తారు. ఈ విధంగా ఈ జాతర ప్రతి సంవత్సరం వైభవంగా జరుగును.
రెడ్డిగణపవరం ఉత్సవాలు :-
బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపవరం గ్రామంలో జరిగే ఉత్సవాలు గిరిజనులకు చాలా ప్రత్యేకమైనవి. ఇవి ఫిబ్రవరి నెలాఖరునుండి మొదలై 5రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు బుట్టాయిగూడెం చుట్టు ప్రక్కల మండలాలైన పోలవరం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెంల నుండి గిరిజన, గిరిజనేతర ప్రజలు అశేషంగా పాల్గొంటారు.
చరిత్రపరంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో రెడ్డిరాజులు పరిపాలించారని అనడానికి ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం, ప్రక్కనే ఉన్న నాలుగు కాళ్ళ మండపం, సమీపంలోని తటాకం. ఇంకా వారి గుర్తులుగా మిగిలిపోయాయి. రెడ్డిరాజులు పరిపాలనవల్లనే ఈ ప్రాంతానికి రెడ్డిగణపవరం అనే పేరు వచ్చినట్టు తెలుస్తుంది.
ముఖ్యంగా రెడ్డి గణపవరం ఉత్సవాల్లో పూజించే ప్రధాన దేవత కనకదుర్గమ్మ అమ్మవారు. ఈ ఉత్సవాల్లో గిరిజనుల ప్రత్యేక నృత్యాలు, బుఱ్ఱకథలు, గరగనృత్యాలు అలాగే గిరిజనులు తయారు చేసిన ప్రత్యేక వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గిరిజనుడే పూజారిగా వ్యవహరిస్తాడు.
గండిపోచమ్మతల్లి ఉత్సవాలు :-
గోదావరినదిని ఆనుకుని ఉన్న గండిపోచమ్మతల్లి ఆలయం. అటు తూర్పుగోదావరి ఇటు పశ్చిమగోదావరి జిల్లాల గిరిజన, గిరిజనేతరులకు ముఖ్యమైనదే. ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత జరిగే 5రోజుల ఉత్సవాలకు ఇరుప్రాంతాల నుండి గిరిజనులు, గిరిజనేతరులు అశేషంగా హాజరై ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఇక్కడ మేకపోతుల బలి విశిష్టంగా జరుగుతుంది.
చరిత్రపరంగా చూసుకుంటే ఒక గిరిజన ఆడపడుచు మేకలను మేపడానికి అడవికి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరి బంగారంకోసం కొంతమంది దొంగలు ఆమెను వెంబడించారని ఆ సమయంలో ఆమె వారినుండి తప్పించుకుని గండిలో దూకిందని, కొంతకాలం తర్వాత ఒక ముసలామెకు కనిపించి, ఈ గండిదగ్గర నాకు ఒక ఆలయం నిర్మించి, ఘనంగా పూజించాలని చెప్పినట్టు కుంజె వీర్రాజుగారు తెలిపారు.
అమ్మవారికి మంగళవారం, ఆదివారం బాగా ఇష్టమైన రోజులని ఆ రోజుల్లో పూజలు ఎక్కువగా జరుగుతాయని ఒక భక్తుడు వివరించారు. పూజారిగా గిరిజనుడే వ్యవహరిస్తాడు.
ముగింపు :
పోలవరం మండల గిరిజనుల పండుగలు వారి జీవన విధానం, ప్రకృతి ఆరాధన, వ్యవసాయ సంస్కృతి మరియు సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయి. భూదేవి పండగ, తాదిచేయ్యు పండగ, కొత్తల పండగ, కడకు పండోయ్, జీడి–మామిడి పూతల పండగ, భీమ పూజ, నాగులచవితి, శ్రీరామగిరి ఉత్సవాలు, చింతకాయల పండగ వంటి ఉత్సవాలు గిరిజనుల విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పండుగల ద్వారా వారు ప్రకృతితో తమ అనుబంధాన్ని బలపరుచుకుంటూ, తరతరాలుగా తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటున్నారు. ఆధునికత ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, ఈ పండుగల పరిరక్షణ ద్వారా గిరిజన సంస్కృతి ప్రత్యేకతను భావితరాలకు అందించవచ్చు. అందువల్ల పోలవరం గిరిజనుల పండుగలు కేవలం ఆచారాల సమాహారం మాత్రమే కాక, వారి సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితానికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.
ఆధారా గ్రంధాలు :
కోయిందప్పగారు చెందిన ముద్దప్పగూడెంకు
సూర్యనారాయణమూర్తి అనప్పిండి. డా , పాపికొండల నుండి పర్ణశాలదాక
భారతిపత్రిక – తెలుగువారి చరిత్ర 7000 ఏండ్ల క్రిందటే ఆరంభమైనది (వ్యాసం), , పుట-52
వార్త- ఖమ్మం- ఏప్రిల్ 9,2003
సాక్షి ,దినపత్రిక ,ది.29 – 03 – 2013.
–జోన్నకంటి రవి కిరణ్ ఏం.ఏ , బి.ఇడి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~