
సంపుటి – 1, ఏప్రిల్ 2026, సంచిక – 1,
తెలుగు భాషా సాహిత్యాలకు సుదీర్ఘమైన చరిత్ర, సమృద్ధమైన సంపద ఉన్నప్పటికీ, ఆధునిక పరిశోధనా రంగంలో ఇంకా విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో “సాహితీవాణి” అనే పరిశోధనాత్మక మాస పత్రికను 2026 ఏప్రిల్ నెల నుండి అంతర్జాల వేదికగా ప్రారంభిస్తున్నాము అని ప్రకటించడంలో సంతోషిస్తున్నాము.
“సాహితీవాణి” పత్రిక యొక్క ప్రధాన లక్ష్యం తెలుగులో పరిశోధనా స్థాయిని మెరుగుపరచడం. ముఖ్యంగా యువ పరిశోధకులు, అధ్యాపకులు, పరిశోధనలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఒక ప్రమాణబద్ధమైన వేదికను అందించడం మా లక్ష్యం . ఈ పరిశోధనాత్మక మాస పత్రిక ద్వారా వారు తమ ఆలోచనలు, పరిశోధనా ఫలితాలు, సృజనాత్మక విశ్లేషణలను సమాజానికి పరిచయం చేయగలరని మేము ఆశిస్తున్నాము.
ఈ పత్రికలో ప్రచురించబడే అన్ని వ్యాసాలు యూజీసీ (UGC) మార్గదర్శకాల ప్రకారం సమీక్షించబడతాయి. నిష్పాక్షికత, నాణ్యత, ప్రమాణం అనే మూడు సూత్రాలను ఆధారంగా చేసుకుని peer-reviewed విధానాన్ని అనుసరించి అమలు చేస్తాము. దీని ద్వారా పరిశోధనలో విశ్వసనీయతను, ప్రామాణికతను కాపాడటమే మా ధ్యేయం .
“సాహితీవాణి” భాష, సాహిత్యం, నాట్యం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, చరిత్ర వంటి విభిన్న రంగాలకు చెందిన పరిశోధన వ్యాసాలను ఆహ్వానిస్తుంది. ఈ విభాగాలు తెలుగు సంస్కృతికి అద్దం పట్టే రంగాలు. ఈ రంగాలలో కొత్త దృక్కోణాలు, అంతర్ శాస్త్రీయ పరిశోధనలు వెలుగులోకి రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము.
ప్రస్తుతం ప్రపంచం డిజిటల్ దిశగా వేగంగా పయనిస్తోంది. ఇప్పటికి పూర్తి స్థాయి తెలుగు పరిశోధనాత్మక మాస పత్రికలు అంతర్జాలంలో అరకొర గానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు పరిశోధనాత్మక అంతర్జాల మాస పత్రికగా “సాహితీవాణి” అందుబాటులో ఉండటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పరిశోధకులకు ఒక వేదికణు కల్పించడమే ఈ ప్రయత్నం యొక్క సంకల్పం. భౌగోళిక పరిమితులను దాటి జ్ఞానాన్ని పంచుకోవడం ఈ పత్రిక యొక్క ప్రత్యేకతగా నిలుస్తుంది.
యువ పరిశోధకులలో పరిశోధనా ఆసక్తిని పెంపొందించడం, నూతన ఆలోచనలను ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే పరిశోధనను ముందుకు తీసుకురావడం “సాహితీవాణి” లక్ష్యాలు. ఈ ప్రయాణంలో పండితులు, అధ్యాపకులు, పరిశోధకులు అందరూ భాగస్వాములవుతారని ఆశిస్తున్నాము.
మీ అందరి సహకారం, సూచనలు, వ్యాసాలు ఈ పత్రికను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని మేము నమ్ముతున్నాము.
ప్రధాన సంపాదకులు,
-డా.లక్ష్మణరావు ఆదిమూలం (అరసి శ్రీ ).
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~