ఆముక్త మాల్యద – ఆదికవుల ప్రభావము -డా. ఆరాల లింగమల్లయ్య

సంపుటి – 1,                                                                       ఏప్రిల్ 2026                                            సంచిక – 1.

సమర్పణ (D.O.S): 15  – 03 – 2026              ఎంపిక (D.O.A):  27  – 03 – 2026                      ప్రచురణ (D.O.P) :  01-04-2026

 

వ్యాస సంగ్రహం:

శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద అనే ప్రబంధంలో ఇష్టదేవతా స్తుతిలో అనేక విషయములను తెలిపియున్నారు. వాటిల్లో కొన్ని పద్యములలో ఆదికవి నన్నయ, ఎఱ్ఱనల ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది. రామాయణం, శ్రీమదాంధ్ర మహాభారతములలోని అనేక అంశములు కూడా ఆముక్తమాల్యదపై అధికమైన ప్రభావాన్ని చూపించున్నవి. అలా పూర్వకవుల ప్రభావము, పూర్వకవుల కవిత్వరచన కూడా తనపైన, తన ప్రబంధకావ్యంపైన యున్నదని తెలుపుటయే  ఈ వ్యాసానికి ప్రధాన భూమికగా నిలుస్తుంది.

కీలకపదములు:

ఆముక్తమాల్యద, శ్రీకృష్ణదేవరాయల రచనా విధానం, ఇష్టదేవతా స్తుతి, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో కనిపించే సందర్భం పద్యములు, వాల్మీకి రామాయణంలోని వర్ణనలు, ఆదికవి నన్నయ, ఎఱ్ఱనల జంట కవిత్వము, ముగింపు.

సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు కళింగదేశమును జయింప దండయాత్ర సాగించు సందర్భమునందు విజయవాడలో కొన్ని రోజులు ఉండి ఆప్రాంతమునందలి శ్రీకాకుళములోకల ఆంధ్ర మధుమధనుని సేవించి ఏకాదశి అక్కడ గడపినాడు. ఆనాటి రాత్రి నాల్గవ జామున శ్రీమహావిష్ణువు కలలో కనపడి

“ఎన్ని గూర్తునన్న విను మేమును దాల్చిన మాల్యమిచ్చున

ప్పిన్నద దండ రంగమందయిన పెండిలిసెప్పుము మున్నుగొంటినే

వన్నన దండ నొక్కమగవాడిడ నేను తెలుంగు రాయడ

న్గన్నడ రాయ! యక్కొదు వదగప్పు ప్రియాపరిభుక్త భాక్కధన” (ఆముక్తమాల్యద 1 ` 14) అని అభ్యర్థించినాడు. ఆ ఆంధ్ర మధుమధునుని కోరిక ననుసరించి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద ఆంధ్ర ప్రబంధ మణిహారమునకు నాయకమణి.

తమిళ వాజ్ఞయమునందు గోదా శ్రీరంగనాథుల కళ్యాణగాధ అత్యంత ప్రసిద్ధము. ఆగాధ ఆంధ్రమున అంతరింపకపోయినందు వలన స్వామికి చాల బాధ కలిగినది. ఆ కొదువను తీర్పగల సమర్ధుడెవరాయని యెదురు చూచు సందర్భమున కృష్ణరాయలు ఆ స్వామికి గోచరించినాడు. తనంతటి వాడడుగుల కర్హుడు లభింప వలయును గదా! కృష్ణరాయలా స్వామినెట్లు భావించెనోకాని స్వామి మాత్రము.

“ఎన్నిను గూర్తునన్న వినుము’ అని మొదలు పెట్టినాడు. ఈ త్రికసంధి స్వామికి రాయలయెడ కల వాత్సల్య స్నిగ్థతను తెలియచేయుచున్నది. నా అవతారములు ఆంధ్రమున లోకమున వ్యాప్తములైనవి. ఆంధ్రమున వ్యాప్తము కావలసినది ఆముక్తమాల్యదయే అని తానే స్వయముగా చెప్పినాడు.

‘ఆముక్త మాల్యద’ యనగా ఆముక్త = తాను ధరించి విడచిన, మాల్య = మాలికను ద= ఇచ్చునది అని అర్థము. స్వామి ‘మును దాల్చిన మాల్యమిచ్చు నప్పిన్నది’ అనిన మాటకు ఈ పదము సంస్కృతము  స్వామి తెనుంగురాయడు. శ్రీకృష్ణదేవరాయలు కన్నడ రాయడు. ఈ ఇరువురియందు ఈ రాయ అనునది తాల్యమును సూచించుచున్నది . (ఆముక్తమాల్యద ` సంజీవని వాఖ్య, పుట :19).

ఎంతటి వారి కొదువను అంతటి వాడే తీర్ప సమర్థుడు. ఆ వివాహముతో తీరిపోలేదా? ఇంకనున్నదా? అందువేమా వివాహము చేత సయితము తీరని ఆ కొదువ నీ చేయు సత్కథా వర్ణనము చేత తీరును. అని స్వామి భావనగా వేదం వారి తీర్పు.

మరియొక అంశమేమనగా  కావ్యమును కన్యతో పోల్చి కావ్యకన్య అందురు. ఎవరైనను అడుగనిదే కావ్య కన్యనీయరాదు. అయ్యా నీ పుత్రికనిచ్చి మా పుత్రుని గృహస్థుని చేసి వంశమును నిలుపుమని వరుని తండ్రి వధువు తండ్రి నడుగవలయును అని శాస్త్రము.

“తన్నడుగ రాని శివునకు

గన్నియ నెట్లిత్తు నతని కారుణ్యమునా

కెన్నడు సిద్ధించు నొయని

యన్నగపతి యాత్మ తలచె నౌత్సుక్యమునన”(హరవిలాసము `3`28) అని హిమవంతుడు కూడా

పరమేశ్వరాభ్యర్థనమున కెదురు చూచినాడు. ఆధర్మము నెరిగిన ఆంధ్ర మహా విష్ణువు తమ గోదాశ్రీ రంగనాథుల కళ్యాణ గాథను ప్రంబధీకరించి తనకే అంకితమిమ్మని నాడు. అడిగిన వాడు ఆంధ్ర మహావిష్ణువు అంకితమిచ్చినది శ్రీ వేంకటేశ్వర స్వామియే చెప్పినాడు.

“అంకితమో యన నీకల

వేంకటపతి యిష్టమైన వేల్పగుట తదీ

యాంకితము చేయ మొక్కొక్క

సంకేతముగా కతడు రసన్నేగానే” (ఆముక్తమాల్యద 1`16, పుట21.)

అని కలియుగమునందు కలౌవేంకటనాయక: అని సుప్రసిద్ధిని పొందిన ఆస్వామి నేను ఒక్కటే కదా! ఆ స్వామికే అంకితమిమ్మని చెప్పినాడు.

ఈ విధముగా స్వామి స్వయముగా కోరి వ్రాయించుకొని కృతి నందిన ఈ ప్రబంధమనందు ఇష్ట దేవతాస్తుతి విలక్షణముగా నున్నది. అందలి

ఖనటత్పయోబ్ధి వీక్ష్య రసాతలాన్యోన్య

పిండీ కృతాంగ భీతాండజములు

ధృత కులాయార్థఖండిత సమిల్లవరూప

చరణాంతిక భ్రామత్తరు వరములు

ఘనగుహా ఘటిత ఝూంకరణలోకైక ద్వి

దుందుభీకృత మేర మందరములు

చటుల ఝంపాతరస్వనగరీ విపరీత

పాతితాశాకోణ పరిబృఢములు

ప్రబలతర బాడబీకృతే రమ్మదములు

భాస్వరేరమ్మరదీ కృత బాడబములు

పతగ సమ్రాట్ పతత్ర ప్రభంజనములు

వృజిన తూలైఘముల  దూల విసరుగాత. (ఆముక్తమాల్యద 1`3, పుటలు4,5)అని గరుత్మంతుని ప్రార్థించినాడు. ఈ పద్యము నందలి ఆదికవుల ప్రభావమును తెలుపుతున్నాను.

గరుత్మంతుని రెక్కల గాలికి సముద్రమునందలి నీరంతయు నింగికెగయగా పాతాళమునందలి సర్పములు గరుత్మంతుని చూచి భయపడి ఒకదానితో నొకటి పెనవేసుకొనగా వాని శరీరమునందలి అవయవములు ఆగాఢతకు నుగ్గునుగ్గుయినవి.

ఆ వేగము యొక్క సవ్వడి గుహల యందు మారు మ్రోగగా మేరు మేరు మందర పర్వతములు రెండు లోకమునందు రెండు దుందుభులుగా చేయబడినవి. ఆ వేగమునకు పెళ్ళ గిల్లిన దిక్పాల పురములు తారుమారుగా ఒక దిక్కున నుండ వలసినవి మరియొక దిక్కున పడినవి.

ఆ సముద్రము నందలి బడబాగ్ని మెరుపు తీగలైనవి. మెరుపు తీగలు బగబాగ్నులైనవి. ఈ విధముగా ప్రపంచముల అల్లకల్లోలము చేయగల ఆపక్షేంద్రుని పక్షమారుతము పాప సముదాయములను దూది పింజలవలె దూరముగా తొలగి పోవునట్లు చేయుగాక అని భావము.

ఈ పద్యమునందు కవిత్రయ ప్రభావమెట్లున్నదనగా`

సముత్పతతి తస్మింస్తు వేగాత్తే నగరోహిణ:

సంహృత్యవిటపాన్ సర్వాన్ సముత్సేతు స్సమంతత:

ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే

ఊరు వేగోద్ధతా వృక్షా ముహుర్తం కపిమన్వయు”

ఇత్యాదిగా వృక్షములు కొమ్మలతో సహ పెళ్ళగిలి ఆకాశ మార్గములో ఒక్క క్షణకాలము ఆ ఆంజనేయస్వామిని  అనుసరించిన విని వాల్మీకి మహర్షి వర్ణించినాడు.

ఆ హనుమల్లంఘనమును భావించిన శ్రీకృష్ణదేవరాయలు ఈగరుడు పత్ర ప్రభంజనము చేత వృక్షములు గూడు కట్టుకొనుటకు తీసుకుని వెళ్ళుచున్న పుల్లలవలె నున్నవని ప్రస్తుత వర్ణనమునకు అనుకూలముగా మలచినాడు.

మరియొక విశేషము కిష్కిందాకాండలో సంపాతి వాన వీరులకు సీత జాడను తెలియచేయు సందర్భము నందు పక్షులగమనమును వివరించినాడు. ‘ఆద్య: పంథాకులంగానాం’ అని పిచ్చుకలతో మొదలుపెట్టి ‘వైనతేయ గతి:పరా ’ అని పరిసమాప్తము చేసినాడు అనగా అంతకంటే ఎత్తు ఎగురగలవి లేవని కవి భావన.

పిచ్చుకల కంటే కాకులు, కాకుల కంటె గోరువంకలు, గోరు వంకల కంటె డేగలు, డేగల కంటె గ్రద్ధలు, గ్రద్ధల కంటె వైనతేయుడు ఎత్తుగా ఎగురుననినాడు. ‘పరా’ అత్యున్నతము. ఆ ఔన్నత్యమును సూచించుటకు రాయలు ఈ సుదీర్ఘ సీస పద్యమును స్వీకరించి యుండును.

ఆంధ్ర మహాభారతమునందు ఆదికవియగు నన్నయ భట్టు గరుత్మంతుని జనన సమయమునందు

ఆతతపక్ష మారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల

వ్రాత మహార్ణవుండు బలవన్నిజ దేహ సముజ్జ్వల ప్రభా

ధూత పతంగతేజుడు దితుండయి……….”అని వర్ణించినాడు. ఇందులో ప్రప్రథముగా వర్ణింపబడి నది గరుడ పక్ష మారుతమే. ఆ గాలి వేగమునకు సముద్రములు కొండలు ఘూర్ణిల్లినది అని మాత్రమే నన్నయ భట్టు ఒక్క సమాసమునందు పేర్కొనినాడు. ఆ భావము సూత్రప్రాయముకాగా రాయల ఈ సీస పద్యము వ్యాఖ్యాప్రాయము.

తెలుగున గల ఛందస్సులలో సీస పద్యము సుదీర్ఘము. ఆ గరుత్మంతుని పక్ష సుదీర్ఘతను తెలియచేయుటకు ఈసీస పద్యమును వర్ణించినాడు. ఈ గ్రంథమును కోరినవాడు తెలుంగురాయడగుట వలన కూడ కవి తెలుగు ఛందమును గ్రహించుట మరియొక కవి శేషముగా కూడ భావింపవచ్చును.

ఆపతగ సమ్రాట్ పక్షౌద్ధత్యమును తెలియచేయుటకు ఓజో గుణ భూయిష్టములు, నారికేళ పాక సమన్వితములు అయిన సంస్కృత సమాసములను కవి సంఘటించినాడు.

సీస పద్యము ఎత్తుగీతియందొక విశేషము గలదు. దీనికి మూలము ఎఱ్ఱాప్రగడ ఆరణ్యపర్వమునందలి

“విశద శారదాంబుద పరివేష్టనమున

బొలుచు గగనంబు ప్రతిబింబ మోయనంగ

వికచకాశవనీ పరివేష్టనమున

నతిశయిల్లె నిర్మల కమలాకరములు” (శ్రీమదాంధ్రమహాభారతము 3`4, పద్యము 147) అని శరదృతువును వర్ణించినాడు. తెల్లని స్వచ్ఛమైన మేఘములతో ఆవరింపబడిన ఆకాశమునకు ప్రతిబింబమో అన్నట్లుగా, విచ్చిన రెల్లిపూల నెడి ఆచ్చాదనలతో మలినరహితములైన పద్మాకరములు ఒప్పుచున్నవి. ఆకాశమునకు ప్రతిబింబమోయను నట్లున్నదని సహేతముగా కవి ఉత్రేక్షించినాడు. రాయలు సముద్రము నందలి బడబాగ్ని మెరుపుతీగెలుగా, మెరుపు తీగలు బడబాగ్ని పరస్పరములు చేయబడినవని మలచినాడు.

ఎఱ్ఱన ఆదికవియా? అను సంధియము కలుగవచ్చును. ఇట్లు భావించుటకు కారణములు

ఎఱ్ఱన ఆంధ్రమహాభారత ఆరణ్య పర్వశేష పూరణములు నన్నయ పేర, రాజరాజనరేంద్రుని అంకితమిచ్చుట. పద్యము లెఱ్ఱనవి యైనను నన్నయ పేర వ్రాయబడినవి. కావున నన్నయ ఆదికవి అగుట వలన దీనికి ఆ గౌరవము సంభావించుట తాను వ్రాసిన కవిత్వము మరియొకని పేరుతో ప్రచారము పొందుట అంగీకరించిన కవులలో ఆద్యుడు ఎఱ్ఱన.

అసలు జంట కవిత్వము ఎఱ్ఱన తోడనే ప్రారంభము. జంట కవిత్వము అనగా ఇరువురి కవుల కవిత్వము. నన్నయ, ఎఱ్ఱన, తిక్కన. ఎఱ్ఱనల కవిత్వము ఎఱ్ఱన, నన్నయవలె పద్యరచన ప్రారంభించి తిక్కన రచనలతో ఆ పర్వమును పూరించినందువలన జంట కవిత్వమునకు ఆద్యుడని ఆచార్య పి.వెంకటరాజుగారి అభిప్రాయం.

ఈ మహాలక్షణమును గుర్తించిన ఎర్రపోతసూరి ‘ఎన్నికమై ప్రబంధ పరమేశ్వరుడనంగా నరణ్యపర్వశేషము నందు యాంధ్రభాష సుజనోత్సవ మోప్పగా నిర్వహించితి’ అని తెలిపాడు. (నృసింహ పురాణము, 1`17) ఇందలి సుజనపదమునచే నన్నయ ధ్వనించుచున్నాడు.

ప్రబంధ మనగా కూర్పు. రెండు విడి విడిభాగములను కలిపి బంధించుట ప్రబంధము. ప్రకృష్టమైన బంధము అనగా అదుకు అదుకువలెకాక ఏకాకారముగా భాసించినట్లు చేయుట. ఈవిషయమును భూషణభట్టు వ్రాసిన  ‘దేహ ద్వయార్థ ఘటనా రచనా శరీరమేకం యయా వను పలక్షిత సంధి భేదౌ’ అను శ్లోకమునకు వ్యాఖ్యానమునందు వ్యాఖ్యాత వివరించినాడు. అనుపలక్షిత సంధి భేదమనగా శరీర ద్వయమును ఏక శరీరముగా భాసింపజేయుట. ఇది పార్వతి పరమేశ్వరులు ఐక్యము వంటిది. దేవతలలో దేహద్వయమును ఏక శరీరములుగా భాసింపజేయు పరమేశ్వరుని వలె కవులలో ఇరువురి కవిత్వ లక్షణములు అతికిన ఎఱ్ఱన ప్రబంధపరమేశ్వరుడు అయినాడు. మరియెక విశేషమనగా     “శబ్ధ జాత మశేషంతు ధత్తే శర్వస్యవల్లభా అర్థ జాత మశేషంతు ధత్తే బాలేందు శేఖర:” అని శబ్ధ స్వరూపమును పార్వతి అర్థ స్వరూపమునకు పరమేశ్వరుని ప్రతీకలుగా పెద్దలు భావించినారు. నన్నయ కవిత్వము శబ్ధప్రధానము. తిక్కన కవిత్వము అర్థ ప్రధానము. పరస్పర భిన్నములైన ఈ భాగముల అతికిన ఎఱ్ఱన ప్రబంధపరమేశ్వరుడైనాడు.

ఈ విధంగా జంటకవిత్వమున ఆద్యుడైన ఎఱ్ఱన, ఆంధ్ర సారస్వతమున కాద్యుడైన నన్నయ సంస్కృతమున  లౌకిక వాజ్ఞయమునకు ఆద్యుడైన వాల్మీకుల యొక్క ప్రభావము శ్రీకృష్ణదేవరాయల పద్యమునందు ప్రస్పుతముగా ఉన్నదని పై విధముగా నిరూపించబడినది.

ప్రభావ పదమునకు ఒక కవి పద్యరచన విన్యాసమును, సన్నివేశమును, వర్ణనమును, భావించి దానిని మరియొక సన్నివేశము నందు ప్రకృతార్థమునకు ఉపకారకముగా మలుచుటయని అర్థము.

అటైనచో శ్రీకృష్ణదేవరాయలు రామాయణ భారతములు చదివి మనసునందు ఉంచుకొని పద్యములు రచించెనా? అనేక వివిధ సాహిత్యప్రక్రియలు వెలువడిన ఈ రోజులలోనే రామాయణ, భారత పఠనములు ప్రత్యక్ష ప్రయాణములు కాగా రాయల విషయమున అసంభవమగునా? ‘రాయలకు రామాయణ, మహాభారతములు హృత్కవిలయే’ అని శ్రీతుమ్మపూడి వారి వచనము. మరియు ‘పరాంకవీనా మాధార ’మను బ్రహ్మర్షుల మంగళాశాసనము వ్యర్థమగునా?

ఏయే పూర్వకవుల గ్రంథములనైనను తదేకముగా అనంతర కవులు భావింతురో ఆ భావ ప్రతిఫలనము గురువుల లక్షణములు శిష్యుల యందు తల్లిదండ్రుల లక్షణములు, సంతానమునందు ప్రతిఫలించుటను ప్రభావముగా భావించినచో హనుమ సముద్ర లంఖన ఆధారముగా నన్నయ పద్యపాదము సూత్రముగా ఎఱ్ఱన ప్రతిబింబసామ్యము ప్రబల తర బాడ బీ కృతములుగా పరిఢవిల్లిన ఈ ‘ఖనటతృ యోచ్ధి’ పద్యమునందు ఆ ఆది కవుల ప్రభావము ప్రస్పుటమనుట సత్యదూరము కాదు.

మా దృశాంకించినత్రాణ బద్ధ కంకణ పాణమే

విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళమ’

ముగింపు:

ఈ విధంగా శీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాల్యద అనే ప్రబంధంలో ఇష్టదేవతా స్తుతి పద్యములలో ఆదికవుల ప్రభావము ఎక్కువగానే కనిపిస్తుంది. సంస్కృత ఆదికవి వాల్మీకి రచనా వర్ణనలు, తెలుగు ఆదికవి నన్నయ పద్య కవిత్వము, ఎఱ్ఱన వర్ణనా నైపుణ్యలేగాక నన్నయ్యతో కలిసి రాసినట్లుగా ఉన్నటువంటా అరణ్యపర్వ శేషములోని అనేక అంశములు వారిని తొలి జంటకవులుగా అంగీకరించవలసి యున్నదని భావించవచ్చును. అలా ఆముక్త మాల్యద ప్రబంధముపై ఆదికవులు ప్రభావము ఎక్కువగానేయున్నదని తెలుపవచ్చును.

ఉపయుక్త గ్రంధాలు :

  1. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి,2017.
  2. ఎఱ్ఱన, నృసింహపురాణము –  ఆంధ్రసాహిత్య అకాడమి, కళాభవన్, హైద్రాబాద1967.
  3. వేంకటరాయశాస్త్రి  వేదం- శ్రీకృష్ణదేవరాయలు`ఆముక్త మాల్యద, సంజీవని వ్యాఖ్యాసమేతము,                    వి.వి.ఆర్ శాస్త్రి అండ్ బ్రదర్స్, లింగంశెట్టి వీధి, మదరాసు,1964.
  4.  శ్రీనాథుడు, హరవిలాసము, వెంకటేశ్వర అండ్ కో, ఆనందముద్రాక్షరశాల, మద్రాసు,1939.
  5. శ్రీమద్రామాయణము వాల్మీకి ఆంధ్రతాత్పర్య సహితము, వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, 1953.

-డా. ఆరాల లింగమల్లయ్య

తెలుగు అధ్యాపకులు,

హైదరాబాద్, తెలంగాణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top