
సంపుటి – 1, ఏప్రిల్ 2026, సంచిక – 1,
సమర్పణ (D.O.S): 12 -03 – 2026 ఎంపిక (D.O.A): 20 – 03 – 2026 ప్రచురణ (D.O.P) : 01-04-2026
వ్యాస సంగ్రహం:
వస్తువు యొక్క మూలార్థాలను నిఘంటువు సహాయంతో వివేచన చేశాను.“మనిషి, మానవ సంబంధాలు, సామాజిక జీవితం, దానిలోని సమస్త వైరుధ్యాలు వీటన్నింటి యొక్క కళాత్మక ప్రతిఫలనం సాహిత్యంలో వస్తువు అవుతుందని”పెర్కో పాపినేని శివశంకర్ గారి మాటలను ప్రమాణికంగా స్వీకరించాను. 2001 కాలంలో ప్రతిఫలించిన వస్తు వైవిధ్యాన్నీ పరిశీలించి స్థూలంగా చర్చించాను. కాలమాన పరిస్థితుల ప్రతిఫలనాలు ఈ కవితలో కనిపిస్తాయి. వ్యక్తుల వైయుక్తిక అనుభూతి, అనుభవాలు, సహానుభూతి వలన వచ్చిన కవితలున్నాయి. స్ర్తీవాద ధోరణితో ఆర్థిక దైన్యంలో ఉన్న గిరిజన మహిళలు తమ బిడ్డలను అమ్ముకోవడం కవిత్వీకరించారు కవయిత్రి డా. చల్లపల్లి స్వరూపరాణి. ప్రపంచీకరణ నేపథ్యంలో నష్టపోయిన చేనేత నేతన్నాల బాధలు, వ్యవసాయ రంగంలోని నష్టాలు, రైతుల అప్పుల బాధలు, పత్తి రైతుల ఆవేదనలు కవితలయ్యాయి. అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో చేసిన మరియు చేస్తున్నగల్ఫ్ యుద్ధాలు, డాలర్ విన్యాసాలు, అమెరికా ఆయుధ వ్యాపారాలువంటివికవితా వస్తువులయ్యాయి.
చారిత్రాత్మక బుద్ధ విగ్రహాలను తాలిబన్లు మార్చి 2001లో ధ్వంసం చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ, శాంతి కామకుడైన కవి ద్వేషాన్ని మాని, ప్రేమను పంచుకొని, శాంతితో బ్రతకమని మానవాళికి సందేశం ఇచ్చారు.వచన కవిత్వంలో కవులు ఈ సంవత్సరాల కాలంలో అనేక వస్తువులపై తమ అభివ్యక్తీకరణ నైపుణ్యంతో కవిత్వ రచన చేశారు. ఈ విధంగా 2001 వచన కవిత్వలో వస్తువైవిధ్యం శీర్షిక ద్వారా ప్రముఖంగా నిలిచిన కవితా వస్తువును విశ్లేషించాను.
కీలక పదాలు–
వచన కవిత – వస్తు వైవిధ్యం- సాహిత్యం- వస్తువు-శీతాకాలం రాత్రి- కొంచెం స్వప్నం … కొంచెం సత్యం-కన్నీటి సవ్వడి- మహాబోధి-విరిగిన మగ్గం- టైం-అండ్-స్పెస్- బిడ్డ సంచులు- గది- మూడు దృశ్యాలు-డాలర్ పాఠాలు- మహోగ్ర ప్రతిఘటన- డాలర్ యుద్ధం- మరణించాక కూడా – ఐనవాళ్ళం-దృష్టి మాత్రమే.
వ్యాస వివరణ :
- ఉపోద్ఘాతం-
“కదిలేది కదిలించేదీ,మారేది మార్పించేదీ,పాడేదీ పాడించేదీ,పెనునిద్దుర వదిలించేదీ, మునుముందుకు సాగించేదీ,పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీకావాలోయ్ నవకవనానికి”(నవ కవిత-మహాప్రస్థానం) అంటూ శ్రీశ్రీగారు వస్తు నిర్దేశం చేశారు. “కుక్కపిల్లా,అగ్గిపుల్లా,సబ్బుబిళ్లా-హీనంగా చూడకు దేన్నీ!కవితామయమేనోయ్ అన్నీ!రొట్టెముక్కా,అరటితొక్కా,బల్లచెక్కా-నీవైపే చూస్తూ ఉంటాయ్!తమ లోతు కనుక్కోమంటాయ్!తలుపుగొళ్లెం,హారతిపళ్లెం,గుర్రపుకళ్లెం-కాదేదీ కవిత కనర్హం!ఔనౌను శిల్పమనర్ఘం!ఉండాలోయ్ కవితావేశం!కానీవోయ్ రస నిర్దేశం!దొరకదటోయ్ శోభాలేశం!కళ్లంటూ ఉంటే చూసి,వాక్కుంటే వ్రాసి!ప్రపంచమొక పద్మవ్యూహం!కవిత్వమొకతీరని దాహం!”(ఋక్కులు-మహాప్రస్థానం) – అంటూ శ్రీశ్రీ గారు మన ముందు ఉన్న ప్రతి అంశంలోనూ కవితా వస్తువు దాగి ఉంటుందనీ కవితాత్మక హృదయంతో స్పందించి రసాత్మకంగా కవిత్వీకరించాలనీ ఎంతో హృద్యంగా చెప్పారు.కవులు వారి సృజన శక్తిని కేవలం వారి ఆనందం కోసం కాకుండా సామాజిక చైతన్యం కలిగించాడానికి వియోగిస్తారు. అందుకే పాపినేని వారు “మానవజాతి సృజించిన సాహిత్యం ప్రధానంగా మానవకేంద్ర సాహిత్యమే(man – centered – literature)అంటారు. మానవసంబంధాలు, వ్యక్తి అంతర్లోకాలు, సామాజిక సంఘర్షణలు, ఉద్యమాలు- ఇటువంటివే ముఖ్య రచనా వస్తువులయ్యాయి.” (ఈ తరం కోసం గేయ కవిత-సంపాదకులు- పాపినేని శివశంకర్- ఆంధ్రప్రదేశ్ -అభ్యుదయ రచయితల సంఘం- ప్రచురణ-అక్టోబరు,2018) ఈ నేపథ్యంలో కవితా వస్తువును నిర్వచించుకొని, 2001 సంవత్సరంలో కవులు స్వీకరించిన ప్రముఖ కవితా వస్తువును పరిశీలించడమే ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం.
- వస్తువు శబ్దార్థ చర్చ:
వస్తువుకి నింఘటువులలో ఉన్న అర్థాలను తెలుసుకోవటం అవసరం. శబ్దరత్నాకరంలో వస్తువు అంటే పదార్ధం, బండము అనే అర్థాల్నిచ్చారు.1 వస్తువుని ఆంగ్లంలో content అంటారు.బూదరాజ రాధాకృష్ణ రాసిన ఆధునిక వ్యవహార కోశంలో వస్తువుకి భావం, విషయం అనే అర్థాలు చెప్పారు2. అలాగే తెలుగు అకాడమీ వాళ్ళు ప్రచురించిన తెలుగు – తెలుగు నిఘంటువులో వస్తువుని పదార్ధం, ఇతివృత్తం, కథాంశం, విషయం అనే అర్థాలు చెప్పారు.3 శంకర నారాయణ తెలుగు – ఇంగ్లీషు నిఘంటువులో వస్తువుని ఇలా చెప్పారు.
“Any really existing or aboding substance: a thing an object,an article,substance, commodity: material essential properly: the main plot or subject of poem or play.Ex.A poetic form adequate to poetic content అని ఆంగ్ల నిఘంటువు పేర్కొంటుంది.4వీటిని బట్టి content అంటే విషయం, వస్తువు, ఇతివృత్తం అనేవి పర్యాయ పదాలు.
విమర్శ పదాల డిక్షనరీలో వస్తువు అంటే ఏమిటో ఇలా వివరించారు.సాహిత్య రచన గురించి చర్చించేటప్పుడు రెండు అంశాలు ప్రధానంగా ముందుకు వస్తాయి. ఈ రచన ఏం చెబుతోంది. దానిని వ్యక్తీకరించడానికి అనుసరించిన పద్ధతి ఏమిటి? అదే ఆ రచనా వస్తువు అవుతుంది. ప్రత్యేకంగా వస్తువూ,రూపము అంటూ పూర్తిగా విడిగా ఏమి ఉండదని? ఒక వస్తువును తీసుకుని చెప్పుతున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా చెయ్యాల్సిందేమీ లేకుండానే దానికదే ఒక రూపం వచ్చేస్తుందని ఒక అభిప్రాయం.5 రచనలో ఉద్దేశించబడింది లేదా రచన ద్వారా చెప్పాలనుకున్నది వస్తువు అవుతుంది.
- సాహిత్యం – వస్తువు:
- మనిషి, మానవ సంబంధాలు, సామాజిక జీవితం, దానిలోని సమస్త వైరుధ్యాలు వీటన్నింటి యొక్క కళాత్మక ప్రతిఫలనం సాహిత్యంలో వస్తువు అవుతుందని పాపినేని శివశంకర్ పేర్కొన్నారు.6
- కవిలేదారచయితతీసుకునేవస్తువుస్థలకాలాలను, వయస్సును, ఇంద్రియానుభూతులను బట్టి రూపొందే అవకాశం ఉంది. ఇది వస్తువును చూసే మరొక కోణం.6 ఈ రెండు కోణాలు పరిశోధనకు స్వీకరించిన కవిత్వంలో ఉన్నాయి.
కవి తాను చూసిన, వినిన, విషయాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దితే అది వస్తువు అవుతుంది. వస్తువుకు తొలిరూపం విషయం అని ముదిగొండ వీరభద్రయ్య వివరించారు.7
- దశాబ్దికవిత (2001-2010) సంకలనం:
దశాబ్ది కవిత (2001-2010) కవితా సంకలనం డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ గార్ల సంపాదకత్వంలో విశాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 2014,నవంబరులో ప్రచురించింది. ఈ కవితా సంకలనానికి 2001 నుండి 2010 వరకు గల వివిధ వార్త పత్రికల్లో నుండి, వివిధ కవుల కవితా సంపుటాల నుండి, వివిధ కవితా సంకలనాల నుండి ప్రచురించిన వచన కవితలను సేకరించి ఈ దశాబ్ది పరిణామాలను అద్దం పట్టిన సుమారు 200 కవితలు ఈ కవితా సంకలనంలో కూర్చబడ్డాయి.దశాబ్ది కవిత సంకలనంలో కవుల అభివ్యక్తి పాఠవానికిదోహదం చేసిన వస్తువును విశ్లేషించడానికి, ఈ సంకలనం నుండి 2001 సంవత్సరంలో వెలువడిన కవితలను పరిశీలనకు గ్రహించాను.
- వస్తు వైవిధ్య పరిశీలన:
శీతాకాలం రాత్రి:
ప్రపంచీకరణ తర్వాత ఆర్థిక స్వాలంబనకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, సంపాదన తప్ప సహజమైన ప్రేమావేశాలు’ మరుగున పడిపోయాయి. సంపాదనకై ఆరాటపడే వాళ్లంతా యుక్తవయస్సులో ఉన్నవారే. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే వారి పని గంటలు, సెలవులు వేరుగా ఉంటాయి. జీవిత ఔన్నత్యం (కెరియర్) స్వాతంత్య్రం, వ్యక్తిత్వం ఇలా వేరువేరు పేర్లు పెట్టుకొని, ఆ పదాల చాటున ఉండిపోతున్నారు. ఉద్యోగం మానుకొని వాస్తవ జీవితంలో ఉండే అనుభూతులు పొందడానికి ఆశపడటం లేదు. ఒకరు పనికి వెళ్లి రెండవవారు ఇంటి దగ్గర ఉంటే పనిలో ఉన్న వాళ్లకు అనుభూతులు ఆలోచనలు రావు. ఇంటి దగ్గర ఉన్న వ్యక్తికి చలికాలం నాటి ఉద్ధీపనాలు తోడైతే ఆ బాధ చెప్పలేము.
శీతాకాలం రాత్రి అనే ఈ కవితలో ప్రేమ అనుభవించే వారు, ప్రేమకు దూరం అయినవారు అనే రెండు భాగాలు వర్ణించింది రచయిత్రి. ఆధునిక జీవితాలలోని నిస్సారతను సూచిస్తారు. మొదటి చరణంలో శీతాకాలం రెండింటికి సమానమే. రెండవ చరణంలో గువ్వల జంట ప్రేమికులు. అనుభూతులు కోరిన వారు ఆర్థిక స్థిరత్వానికి రాజీపడి మనస్సులు దృఢం చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో లగ్నం అయిన మనస్సుల్లోంచి ఏదో ఒక మూల ఉన్న కోర్కె బాధపెడుతూ ఉంటుంది. కోర్కె మాత్రం తీరదు. ఏదో వేదాంతంతో కోర్కెను సరిపుచ్చుకుంటే అది మనిషినే బూడిద చేస్తాయి. కాని ఆలోచనలలో నిండిపోయిన ప్రేమికులకు పంపుతున్న సందేశాలు వ్యర్థమైపోయి ఉంటాయి.
“ఎప్పుడెప్పుడా అన్నట్లు/చలి పరదా కప్పుకొని
రాత్రి రంగ ప్రవేశం చేస్తుంది/ముక్కు ముక్కు రాసుకుంటూ
ప్రేమ కావ్యం రచిస్తుంది గువ్వల జంట/చుక్కల కౌగిట్లో
పారవశ్య గీతమౌతాడు చంద్రుడు/మనో జవనాశ్వాన్ని
వేదాంతం గాటకు కట్టేసినాక/అణగారిన కోర్కెలు
బూడిద కమ్మిన అగరొత్తులౌతాయి/తెల్లారి లేచి చూస్తే
గది నిండా గొంతు నులిమి పడేసిన/
కపోతాల సమూహాలు” 8
(దశాబ్ది కవిత (2001 – 2010) -సం-డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ- పుట – 13-14)
కొంచెం స్వప్నం … కొంచెం సత్యం:
మనిషి జీవితం ఎన్నో సంఘటనలకు, అనుభూతులకు అలవాలమై ఉంటుంది.ఏ విషయానికైన గతంతో పోల్చి చూసుకోవటం మనిషికి అలవాటు. విజయం సాధిస్తే అది సత్యం లేకపోతే అది కల. కొన్ని తీరని, అందుకోలేని కోర్కెలు ఉంటాయి. అది సాధించాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. నిద్రపట్టక ఆలోచన ఉంటే అది ‘కల’ అవుతుంది. మేలుకొని ఆలోచిస్తుంటే నిద్ర దూరమౌతుంది. మనిషి కల నెరవేరకపోతే అతడికి మిగిలేది యావజ్జీవ నిర్వేదమే. కొంత కల, కొంత నిజమని శీర్షిక ద్వారా కవి మనిషి తాను అనుకొన్నదాన్ని పాక్షికంగా మాత్రమే సాధించగలడు అని సూచిస్తాడు. కాని కలలు కనటం మాత్రం మానడు మనిషి.
ఏదో సాధించాలి అనే ఆలోచనతో ప్రయత్నించటం జరిగిన ఘటననే ఇంకా మెరుగు పడుతుందేమో అని మంచి చెడులను గురించి ఆలోచించటం, ఇతరులతో చర్చించటం.ఈ విధంగా వెనుకటి రోజులను తలుచుకొనటంలో కొన్ని ఎడబాట్లు, చెడిపోయిన కొన్ని పనులు చేదు జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఎవరైనా తన అనుభూతులనే ఇతరులతో పంచుకొంటారు. కలలు కనమని ప్రోత్సహిస్తారు. అలాంటి కలే లేకపోతే మనిషి ఉనికే ఉండదు. జీవితం నిరాశతో నిండిపోతుంది కాబట్టి ఆశపడట్టం మానవద్దు, అని ఆశించినవన్ని జరిగి తీరాలనే ఆశ పెట్టుకోవద్దు అని, పాక్షికంగా అనుకొన్నది జరిగిన ఆశలు ఫలించినట్లే అని సందేశం ఇస్తారు. అభ్యుదయ భావాలతో నిత్యాకాంక్షలతో ఉత్సాహంగా ముందుకు అడుగు వేయాలనే భావనను తెలుపుతుందీ కవిత కాబట్టి అభ్యుదయ కవితగా భావించవచ్చు.
“ఇవాళ నేను నిద్రను నిషేధించాను/కలలుకనే కళ్ళను కాలానికి కాపలా పెట్టాను
కాలాన్ని తవ్వుతూనే ఉన్నాను …/వెర్రిగా విభజిస్తూనే ఉన్నాను
దాచుకున్న కల అది!/కాసింత పాత కలనే/ప్రవాహంలో సంజీవనిలా వొదిలి పెడుతున్నాను
అవును … ఒక పురాతన స్వప్నాన్నే/మీ దోసిట్లో పొయ్యగలను
ఒకానొక కలనే దాచి పెట్టాను/
దానికి మనిషని పేరు పెట్టాను!” 9
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ-పుట – 15)
కన్నీటి సవ్వడి:
కన్నీళ్లకు శబ్దం ఉండదు. కాని శబ్దం అంటే ఉనికిని చాటే ప్రయత్నం. నాలో దుఃఖం ఉందని ఇతరులకు తెలియజెప్పడానికి చేసే ప్రయత్నమే కన్నీటి సవ్వడి. నాకు ఉగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు, నేను హేమంత కృష్ణానంత శార్వాణి అని కృష్ణశాస్త్రి చెప్పినట్లుగానే సుఖమనేదే లేదని నన్ను మనసారా ఏడ్వనీయండి అని చెప్పిన భావన ఈ కవితలో కన్పిస్తుంది. కాని జీవితంలో తిన్న దెబ్బలు భరించలేక, ఆధునిక జీవనానికి అలవాటు పడలేక అల్లాడుతున్న వ్యక్తి శోకం ఇది.
ఈ శోకం అనుభూతులు లేకపోవటం వల్ల వచ్చింది. ఆర్థిక సమస్యలు కారణం అనిపించవు. ఒక విహారం, సంగీతం లాంటి వినోదం లేకుండా మనస్సులో దుఃఖం ఆక్రమిస్తే, నగర జీవనంలో కంప్యూటర్మయమై యాంత్రిక జీవనమే తప్ప అనుభూతి లేకపోతే, సంపన్నమైన ఇంట్లో నిర్జీవంగా కాలం గడుపుతున్నారు. అమృతం రావల్సిన చోట కన్నీళ్లు ఎదురవుతున్నాయి. చిన్ననాటి మధుర అనుభవాలు గుర్తు వచ్చి ఆ రోజులు ఏమి అయ్యాయి అని మనస్సును బాధ పెడుతున్నాయి. ఉద్యోగాలను వెతుక్కొంటూ హైదరాబాదులో తిరుగుతుంటే పిడికెడు ప్రేమ కూడా దొరకలేదు. ఆప్యాయతానురాగాలు పైతడుపులే తప్ప ప్రేమ లేదు. నగర సంస్కృతి అనుభూతుల్ని మింగేస్తే, అనుభవాల్ని వెతుక్కుంటూ బాధ పడుతున్న ఆధునిక జీవి మనోగతం ఈ కవితలో వర్ణించబడింది.
“అమ్మ పాడిన లాలిపాటొకటి/పచ్చని బాల్యం మీదుగా తెలుసుకుంటూ
వచ్చి గుండెల్ని తన్ని పోతుంటుంది!/భిక్షాపాత్ర పట్టుకొని
తిరుగుతున్నాను/చార్మినార్ గల్లీల్లో
పిడికెడు ప్రేమకై/పెదవులైనా తడపలేని పాదరసపు ప్రేమలే
అంతా!/రాక్షస నగరోన్మాదంలో/క్షుద్ర దేవతకు బలవుతున్న
బికారి స్వప్నాల నేరుకుంటూ/కోల్పోయిన నన్ను నేను
/ వెతుక్కుంటున్నా వెర్రిగా !!” 10–
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 16 – 17)
మహాబోధి:
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో మధ్య ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ ప్రావిన్స్‌లో ఉన్న అపూర్వమైన ప్రాచీన బుద్ధ విగ్రహాల్నీ అప్పటి తాలిబన్ నాయకుడు ముల్లా మొహమ్మద్ ఒమర్ ఆదేశాల మేరకు, ఈ విగ్రహాలను “విగ్రహారాధన”గా పరిగణించి పగలకొట్టారు.ఈచారిత్రాత్మక బుద్ధ విగ్రహాలను తాలిబన్లు మార్చి 2001లో డైనమైట్లు, ట్యాంకులు మరియు విమాన విధ్వంసక గన్లతో ధ్వంసం చేశారు. శాంతి కామకుడైన కవి ద్వేషాన్ని మాని, ప్రేమను పంచుకొని శాంతితో బ్రతకమని మానవాళికి సందేశం ఇస్తున్నారు. శాంతి ప్రియత్వం, అభ్యుదయ కవిత్వంలో ఒక భాగం. కవి అభ్యుదయ రచయితల సంఘంలో సభ్యుడు, హైందవంలో పుట్టినా, కొంత బౌద్ధ ధర్మ ప్రియత్వం ఉన్నది. అది బౌద్ధమే కానవసరం లేదు. కళ్ల ముందు అందమైన, పవిత్రమైన, ఉపయోగకరమైన ఏ వస్తువు పాడైపోతున్న మానవత్వం ఉన్న ఏ మతం వారైనా స్పందించాలి. తాలిబన్లకు బుద్ధుని విగ్రహం పవిత్రం కాకపోవచ్చు. కాని ఆ విగ్రహం కొందరికి పవిత్రమైనది. కొందరికి అందమైనది ఎందరికో పూజ్యమైనది. అలాంటి దాన్ని ధ్వంసం చేయడం మనసున్న ఎవరికైనా కష్టం కలిగిస్తుంది. మనసును కష్టపెట్టే సంఘటనలు ఇలా ప్రపంచంలో ఏ మూల జరిగిన అభ్యుదయ కవులు వెంటనే స్పందిస్తారు. బుద్ధుడి దయా గుణాన్ని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని గుర్తు చేసి ఆ మహానుభావుడి మహిమలను స్మరిస్తున్నారు.
ఏదైనా నిర్మాణం చేయటం చాలా కష్టం. నిర్మించడానికి కాలం, సమయం, శ్రమను సద్వినియోగం చేయడం అవసరం. విధ్వంసానికి ఇవి ఏవీ అవసరం లేదు. అసహనం ఒక్కటి చాలు. ఈ రెండింటిలో ఉన్న అంతరాన్ని రెండు చరణాలలో కవి చూపించారు.
మొదటి భాగంలో నిర్మాణానికి మనిషిపడ్డ కష్టం, ఆ నిర్మాణం ఏ రూపంగానైనా ఉండవచ్చు. ప్రకృతి, చిత్రం, పంట, యంత్రం, ప్రాణి ఏదైనా కావచ్చు. కాని విధ్వంసం దేనివల్ల వస్తుందో చెప్పలేము. సృష్టిని తెలిపే అనేక చారిత్రక విషయాలు నిర్మాణాలలో ఉంటాయి. విధ్వంసం ఆ చరిత్రను ధ్వంసం చేస్తుంది. ఇక మూడవ భాగంలో బుద్ధుడి విగ్రహం ధ్వంసం చేసిన తాలిబన్ల దుర్మార్గాన్ని నిరశిస్తుంది. ఇక నాల్గవ భాగం అంతా బుద్ధుడి మహిమను వర్ణించి, నువ్వు ధ్వంసం చేసినంత మాత్రాన మహాత్ముల ఆశయాలు, చరిత్రలు ధ్వంసం కావు అని, వారు ఎప్పటికి శాశ్వితులు, శక్తివంతులే అని, విధ్వంసకుడు, అశాశ్వితుడు అపకీర్తి మూటకట్టుకొన్నవాడు అయ్యాడు అని అతనిపట్ల జాలి చూపిస్తున్నాడు.
మానవ జాతిని ఉద్ధరించటానికి, ఓదార్చడానికి తన జీవితమంతా బుద్ధుడు ధారపోశాడు. అంగుళిపాలుని బందిగపోటు వృత్తిని మాన్పించి, శాంతిని బోధించి దమ్మపథం వైపు నడిపించాడు. దారినపోయే ప్రయాణికులను చంపి తాను ఎంతమందిని చంపాడో గుర్తు చేసుకోవటం కోసం వారి వ్రేళ్లు నరికి మాలగా వేసుకొనేవాడు. కాబట్టే అతనికి అంగుళిమాలుడు అనే పేరు వచ్చింది. ఆ దొంగ ఒకసారి బుద్ధునికి కూడా ఎదురుపడ్డాడు. అప్పుడు అతనికి జ్ఞాన బోధ చేసి అతనికి దయ, శాంతిని బోధించి ఆ వృత్తిని మాన్పించి, బౌద్ధ భిక్షువును చేశాడు. ఇలా బుద్ధునికి సంబంధించిన మహిమలు ఎన్నో బౌద్ధ సాహిత్యంలో వర్ణించబడ్డాయి.అవి వర్ణించిన కవి శాంతి మాత్రమే మిగులుతుంది అని సందేశం ఇస్తారు.
“దైవాన్ని నిర్లిప్త ప్రేక్షకుడిగా నిలిపిన స్వేచ్ఛా సంకేతం/అది మనిషి రవ్వంత కొరికి వదిలేసిన అమృతఫలం
విగ్రహాలు విరిగిపోతాయి/విగ్రహ విధ్వంసకులు ఒరిగిపోతారు
రూపాలన్నీ అరూపాలవుతాయి/ఆయుధాలన్నీ చివరికి శిధిలమవుతాయి
శిథిలం కాని ఏకైక సమ్యక్ సంకల్పమూర్తి సాక్షిగా/మానవాత్మ ఎన్నటికైనా ఒకే అందమైన వాక్యాన్ని నిర్మిస్తుంది/శాంతి – శాంతి – శాంతి” 11
(దశాబ్ది కవిత (2001 – 2010) సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట -18-19 – 20)
విరిగిన మగ్గం:
సిరిసిల్ల చేనేత కార్మికుల మీద చాలా కవితలు వచ్చాయి. కాని ప్రతిదీ ప్రత్యేకతను, దాని అస్తిత్వాన్ని నిలబెట్టుకొన్నదే. అలాంటి కవితలో ఇది ఒక్కటి. సిరిసిల్లలో 2001 ఏప్రిల్ 3వ తేదీన ఒక చేనేత కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొంది. ఆ కుటుంబ సంస్మరణగా వ్రాసిన కవిత ఇది. చేతిపని నేర్పు సంపాదించుకుంటే పనితనానికి పదిరూపాయలు ఎక్కువ ఇవ్వాలి. కాని నైపుణ్యం వల్ల పనివాడు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి ఎందుకు వచ్చింది? అని కవి ప్రశ్నిస్తాడు. చేనేత ఖద్దర్ వాడిన రోజులలో దేశంలో కరువు తెలియదు. దేశీయంగా తయారైన వస్త్రమే వాడటం వల్ల చేనేత పనివారి అందరికి పని, తిండి లభించేవి. యాంత్రీకరణ వల్ల ఉత్పత్తిలో వేగం పెరిగింది. ఉత్పత్తి ఖర్చు తగ్గింది. వేగం కూడా పెరగటం వల్ల యంత్రాన్ని నడపటానికి మనుషులు తక్కువ మంది అవసరం అయ్యారు. అలా మరబట్ట చౌక కావటంతో దేశీయంగా తయారైన వస్త్రానికి గిరాకీ తగ్గింది. లక్షల సంఖ్యలో ఉన్న చేనేత పనివారు క్రమంగా వృత్తిని కోల్పోయారు. ఇది అంతా వంద – నూటయాభై సంవత్సరాల లోపు జరిగిన పరిణామం. ప్రతి విషయంలోను యంత్రాలు ప్రవేశించాయి. ఒక్కొక్క రంగం ఉపాధి కోల్పోయింది. తిండి దొరకనివారు ఆత్మహత్య చేసుకొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, చేనేత రంగాలు. ఈ రెండు రంగాలలోనే ఆత్మహత్యలు ఎక్కువ అయినాయి. దీనికి తోడు ఆర్థిక సంస్కరణలు వల్ల కూడా విశేషంగా మార్పులు వచ్చేశాయి. నేతన్నలకు ఆత్మహత్యే దిక్కు అయిందని చెప్పటానికి మగ్గం విరిగింది అనే శీర్షిక సంకేతం.
పోని నాణ్యమైన వస్తువు తయారు చేయలేక దెబ్బ తిన్నాడా అంటే కాదనే చెప్పాలి. తాను నేసిన వస్త్రం లాంటిది వాడే స్థోమత తన కుటుంబం వారికి కలగాలి అనుకొన్నాడు. కాని మగ్గం ఆ పని నెరవేర్చలేకపోయింది. విదేశీ వస్త్రం మోజులో చేనేత పూర్తిగా దిక్కు లేనిదై నేతన్న ఆత్మహత్య చేసుకొన్నాడు. నేటికి చేనేత రంగ పరిస్థితి అంతగా బాగుపడలేదు. చేనేత పరిశ్రమలు నిలబెట్టి, కార్మికులకు సరైన కూలి లభించాలి. పనికి తగిన ఫలితం ఇవ్వాలి. వారి అభివృద్ధి ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది. చేనేత రంగాన్ని ప్రపంచీకరణ ప్రభావం నుండి బయటకు తీసుకొనిరావాలి.
“ఇంతటి అపురూప కళాకారుడికి/గుప్పెడు మెతుకులు దొరక్కపోవడం
ఒక మోసం/ఇంతటి అద్భుత సృష్టికర్తకు
బతికేదారి కనిపించకపోవడం/ఒక ద్రోహం/రోజూ
నూలు కొంటున్నట్టు బట్టలు అమ్ముతున్నట్టు/అప్పు చేయడం తీర్చడం సజావుగా సాగిపోవాలి గానీ
ఇది ఎందుకు ఉరితాడవుతోంది/ఇప్పుడు నాకు బట్టలు కట్టుకున్న ప్రతి మనిషీ
వాడి శవాన్ని మోస్తున్న ఉరి కొయ్యలా కనిపిస్తున్నాడు” 12
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 22 – 23)
టైం అండ్ స్పేస్:
స్త్రీవాద కవిత్వానికి చెందినది ఈ కవిత. స్వేచ్ఛ, శృంగారాన్ని హద్దులో ఉంచటం ఎందుకని రచయిత్రి ప్రశ్నిస్తుంది. క్షేత్రం స్త్రీకి, బీజం. పురుషునికి ప్రతినిధులుగా పురాణాలు దగ్గర నుండి ప్రసిద్ధమైనదే. సాధారణంగా క్షేత్రం పై అధికారం యజమానికే ఉంటుంది. ఇది ఒక సాంకేతికమైన భాష. పొలం ఒకరిదైన కౌలుకు తీసుకుంటారు. సొంతంగా వ్యవసాయం చేసేవాళ్ళు అయిన కూలీలతోనే విత్తనాలు నాటిస్తారు. పంట కౌలుదారులు పండిస్తారు. ఇలా క్షేత్రస్థాయి కృషి లేకుండా పంట ఇల్లు చేరవచ్చు. అలా కట్టుకొన్న వాడికే కట్టుబడి ఉండాలనే నియమంలో అర్ధం లేనిదని రచయిత్రి తెలుపుతారు.
కాలము సాన్నిహిత్యము, అనుబంధాలకు కారణం అవుతుంది. కాని సంబంధమునకు ఒక్కటే కారణం కాదు అని సూచించడానికే టైం అండ్ స్పేస్ శీర్షిక పెట్టారు. వెండి వెన్నెల్లో, గుడిసెల్లో ఉండేవాళ్ళు కొంత స్వేచ్ఛను ఉపయోగించుకొంటారని, నాగరీకులకు ఎందుకు లేనట్లు, రాళ్ళ క్రింద కీచు రాయిలాగా మనసు కోరుకున్న వారిపై ఆరాటపడుతుంది. చెట్లు పుట్టలు ఆధారంగా దేవత విగ్రహాలున్న రహస్యంగా ఉన్న ప్రాంతంలో కూడా స్వేచ్ఛ విహారాలు సాగుతున్నాయి.
స్త్రీ వాదం సమర్ధించే రచయితులు కొందరు ఈ విషయాలను వర్ణించారు. ”ఊహాగానం” అనే శీర్షికను కొన్ని సంవత్సరాలు నిర్వహించిన లత ఊహాగానం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆమె రాసిన మోహన రాణిలో హెలేన్ తన కంటే చిన్న వాడైన భర్త తనను సుఖ పెట్టలేకపోతే తప్పించుకొని వచ్చి, జూలీయిస్ సీజర్‌ను వరించిన షేక్ స్పియర్ నాటకం కథ విశ్వప్రసిద్థం కదా!
క్షేత్రం బీజవాదం కుతర్కం అంటేనే పురుష వీర్యం కాదు, సుఖానికి మూలం కారణం స్త్రీ. అయినా స్త్రీ మీద పురుషుడు చాలా ఆంక్షలు పెట్టాడు. స్త్రీకి దూరంగా ఉండమనే నీతి కథలు వ్రాసుకొన్నాడు. స్త్రీకి సహజ వాంఛలను తీర్చుకొనే హక్కు లేకుండా చేశాడు. నడుముకు లాగు పెద్దలు చెప్పినట్లు ఇనుపకచ్చడం కట్టలేడు కాబట్టి హృదయానికి ఇనుప కచ్చడం తొడుకోమంటున్నాడు. స్త్రీ ని దగ్గరకు రానిస్తే స్త్రీకి వశమైపోతాననే దిగులే అతనిని అలా చేసింది. ఇంట్లో స్త్రీకి స్వాతంత్య్రం లేకుండా చేసిన అతడు స్వేచ్ఛ జీవిగా బయట తన కోర్కెని తీర్చుకొంటాడు. పగలు కోర్కెలు ఆపుకొన్న రాత్రి ఆపలేము కదా! పాతివ్రత్యాని చెప్పే కాలాలకు, వేదాంతాలకు, కాలం చెల్లింది అని రచయిత్రి అంటారు.పతివ్రత పురాణాలు, వేదాంతాలు చెప్పకుండా కోర్కెలను తీర్చుకోమని, రాత్రి తీరని కోర్కెలు పగలు తీర్చుకోవచ్చు అన్నట్లుగా ప్రతి చరణం చివర అది వ్రాసిన సమయము ఆ ఘట్టం జరిగిన సమయం పేర్కొనబడింది.
“వెండి వెన్నెల్లో మెరిసిపోతున్నా పూరి గుడెసె/నీడల్లో రాళ్ళకింద రోద చేస్తున్న కీచురాయి నా మనసు
బీజవాదం అతని కుతర్కం/అజ్ఞానంతో నరకాని విస్తరించుకున్న పేటి యార్క్!
ఆత్మ జైలులో శరీరం జీవిత ఖైదు/ సహజ వాంచలు మాధుర్యం నిషిద్ధం
ఆడది గుండులోకి దూసుకుపోతుందని భయం/ మెత్తని గుండె చుట్టూ బిగించుకున్నాడు/ఇనుపకచ్చడం./ పగలు తెల్లని సున్నం వేసుకొని నగ్నమైన గోడ/రాత్రి నినాదాలు రాసుకొని ముస్తాబయింది
/మహా కథనాలకే కాదు మహా వాక్యాలకు కాలం చెల్లింది./
ముగింపు తెలియని మాటలు అవిశ్వాస ప్రకటనలు” 13
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 24 – 25)
బిడ్డ సంచులు:
పల్నాడు, నల్గొండ జిల్లాలోను పసిబిడ్డలను అమ్ముకొన్న సందర్భాలు గురించి వేల కొద్ది వార్తలు వార్తాపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా లంబాడివారే ఇలా పిల్లలను అమ్ముతున్నారు. ఈ విధంగా అమ్ముకోవడానికి కారణాలు రచయిత్రి వివరంగా వర్ణించారు. ఆర్ధిక పరిస్థితులు ముఖ్యంగా ఇలాంటి పనులకు ప్రోత్సాహిస్తాయి. సరైన ఉపాధి దొరకకపోతే ‘అకార్యాలకు’ కూడా వెనుకాడరు. మొదట్లో లంబాడిలు కష్టపడి బ్రతికారు. ఆ కష్టం ప్రపంచీకరణతో వ్యర్థమై కూడు పెట్టలేదు. తరువాత బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం అమ్ముకున్నారు, కిడ్నీలు అమ్ముకున్నారు. ఇలా ఒకొక్కటి అమ్మి కడుపున పుట్టిన పసరం కూడా అమ్ముకున్నారు. దీనికి కారణం ఓపిక ఉన్నంతకాలం సంతానం కనవచ్చు కాబట్టి ‘సరోగసీ’ పేరుతో పిల్లలను కనేస్తే సరిపడ డబ్బులు వస్తాయనే ఆశతో ఆపనికి కూడా సిద్ధపడ్డారు. దీనికి ఆర్ధిక సమస్యలే కారణంగా రచయిత్రి చూపిస్తారు. అణగారిన షెడ్యులు తెగలలో పరిస్థితి మరీ క్షీణించిపోయిందని, ముఖ్యంగా స్త్రీలకు ఉపాధి కరువైనది సూచనలతో పాటు దుర్మార్గంగా పిల్లల అమ్మకానికి, అద్దెగర్భాలకు ‘స్త్రీలను’ ఉపయోగించుకు పోతున్నారని ఆవేదన వ్యక్తపరచిన స్త్రీవాద కవిత.
“నాలుగు వేళ్ళు లోపలకు పోవడానికి/మొన్న బండేడు కష్టాన్ని అమ్ముకుంటున్నాం…
నిన్న చెంబు, చేట తాకట్టు పెట్టుకున్నాం…/గుక్కెడు గంజినీళ్ళకోసం
ఒంట్లో నెత్తురుని అమ్ముకున్నాం…/కిడ్నీలు అమ్ముకున్నాము…
పిడికెడు ఖాళీని కూడా పూడ్చడానికి/రోజూ గుండెని తాకట్టు పెట్టుకుంటున్నాం…
కడుపుకూటి కోసం/కడుపుతీపిని కిలోల లెక్కన అమ్ముకుంటున్నాం…
కడుపున కాసిన ఆడపిందలు తప్ప అమ్ముకోడానికి/ ఏమి మిగుల్చుకోలేని వాళ్ళం నాయనా!
అమ్మతనాన్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి సిద్ధం చేసిన
లంబాడీ తల్లులలారా!రండి ” 14
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 26 – 20)
ఈ కవితలో కవయిత్రి అటు స్త్రీవాద గళంతోనూ ఇటు ప్రపంచీకరణ ప్రభావంతో నష్టపోయిన చేనేత కార్మికుల, పత్తిరైతుల సమస్యలను కూడా ప్రస్తావించారు. దీనికి కారణం ప్రపంచీకరణ ద్వారా వ్యాపారతత్త్వం పెరిగిపోయి కార్మికుల, రైతుల పక్షంగా ఆలోచించకుండా కేవలం డబ్బు సంపాదన, లాభాల కోణంతోనే జరుగుతుందని, దీనికోసం నూతన ఆర్ధిక విధానం రావాలని కవయిత్రి కోరుతున్నారు, దానికి వ్యంగ్యంగా ”సారవంతంమయిన బిడ్డసంచులుంటే చాలు! దేవుడా! రక్షించు, మా బిడ్డసంచుల్ని….” అంటూ ముగించారు.
“అమ్మి అక్కరు తీర్చుకోడానికి/మా దగ్గర
పత్తి రైతుల, నేత కార్మికుల /ప్రాణాలు లేవు సారూ!
మొలకెత్తిన విత్తనాల్ని నమ్ముకుని/ అగచాట్ల మూటల్ని తలకెత్తుకునే
పత్తి రైతులారా!/
అప్పుల దిగుడు బావుల్లో దిగబడిపోయిన
చేనేత కార్మికులారా!” 14
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 26 – 27)
గది:
చదువుల గొప్పతనాన్ని చెప్పిన గొప్ప కవిత ఇది. ఉపాధ్యాయుడు విద్యావంతుల్ని తీర్చిదిద్ది సంస్కారవంతులను చేసేది తరగతి గది అని, చదువు గొప్పతనం చెప్పిన అభ్యుదయ కవిత. ఉపాధ్యాయుడు చాక్‌పీస్ (సుద్దముక్క) చేతపట్టి మంత్రాక్షరాలు లాంటి అక్షరాలు పోసుకువస్తాడు. మంత్రం చక్కగా వినియోగపడాలి అంటే, శక్తిమంతమవ్వాలన్నా బీజాక్షరాలు కలిపి చేయాలి. కాబట్టి విద్య మొదలు పెట్టడానికి ప్రాధమిక విద్య చాలా అవసరం అని ‘బీజాక్షరాలు కోసుకొస్తాడని’ సూచించారు. ధాన్యం ఆరితేనే తినటానికో, మొలకెత్తటానికో పనికి వస్తుంది. అలాగే చదువుకొన్న ఉపాధ్యాయుడి చదువు సార్ధకం కావాలి అంటే పాఠం చెప్పాలి. ఆసక్తి, చదువుకోవటం బోధ, అర్ధం చేసుకోవటం, ఆచరణం, చదివినదాన్ని ఆచరణలో పెట్టడం, ప్రచారం తెలిసినదాని నలుగురికి తెలియజెప్పటం. ఈ నాలుగు ఉంటేనే విద్య పరిపూర్ణం అవుతుంది. ఉపాధ్యాయుడు తరగతిగదికి వచ్చేటప్పటికి మొదట రెండు దశలు మాత్రమే అతడు దాటి ఉంటాడు. తాను చెప్పింది. చదివింది ఆచరణలో చూపటానికి సాధనం విద్యార్ధి కాబట్టి తన చదువుకి సురక్షితమైన స్థానంగా తరగతిగదిని అధ్యాపకుడు భావిస్తాడు. విద్యార్ధులకు చెప్పే కొద్ది ఉపాధ్యాయుడి తెలివి పెరుగుతుంది. చదువు సార్ధకం అవుతుంది. పక్షులు తినటానికి ఆ గింజలు ఉపయోగిస్తాయి. పక్షులతో బీజా వ్యాప్తి జరిగినట్లే విద్యార్ధులలో కొంతమంది ఉపాధ్యాయులై మా ఉపాధ్యాయులు పలాన వారని పేరు చెప్తారు. ఆ గది కడుపు నింపుతుంది. ఆశ్రయమిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుండి బయట పడినవాళ్ళు ఇంకా ఎదుగుతూ వెళ్తారు అలా ప్రపంచంలో వారు వీరు అని తేడా లేకుండా బడి ఒక్కటే చూపదగిన యాత్రా స్థలం అని బడి ఉదాత్తను కవి వర్ణించారు.
“ఒక విద్యార్ధి సరళం నుండి/సంక్లిష్ట విషయాల వైపు మరులుతాడు
ఒక్క గ్రాపు కింది నుండి పైకి ఎదుగుతుంది/మనుషులు మొత్తంగా చీకటి నుండి
వెలుతురు వైపు మళ్ళుతారు./అవును/ఎప్పటికయినా/ప్రపంచ మానవాళికే కాదు
చుట్టపుచూపుగా వచ్చే గ్రహాంతర వాసులు క్కూడా/
ఏకైక లోకైక దర్శనీయస్థలం బడి” 15
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట –29)
మూడు దృశ్యాలు:
దృశ్యం అంటే చూడదగినది, చూడబడేది. అదృశ్యం కనిపించనిది, చూడలేనిది. శిల్పి రెండు బొమ్మలను ఒకేసారి చేయడం మొదలు పెట్టాడు. ఒకటి అచ్చుపోశాడు. ఒకటి చేతితో చేశాడు. అచ్చుపోసింది బాగా వచ్చింది. చేతితో చేసింది సరిగా రాలేదు. చేసింది తానేనని నీటిలో ప్రతిబింబం చూస్తూ ఆ ప్రతిబింబాన్ని గిళ్ళాడు. స్పర్శ తెలియలేదు. నీటి తాలుకు తడి, రుచి తెలిసాయి. ఈ రెండు బొమ్మలు ఒకటి నిన్నటి అనుభవం వారి జ్ఞాపకం, రెండవది అనుభూతి లేని యాత్రికమైన అనుభవం. మొదటి అదృశ్యం, రెండవది యాంత్రికం జీవితంలో అన్ని యాంత్రికంగానే జరిగిపోతూ ఉంటాయి. మనుషులు నిత్యకృత్యాలు శారీరక అవసరాలు కూడా యాత్రికంగానే గడిచిపోతుంటాయి. కోర్కె తీరుతుంది కాని అనుభూతి తెలియదు. ఉద్యోగపు పనులు, సంసారపు పనులు అవుతాయి. అప్పుడు అనుభూతులో ఆర్థ్రత కోసం అన్వేషిస్తే గుండె కూడా పాస్వర్డ్ ఉంటే కాని తెరచుకోను అన్నది. ఇది ఒక అదృశ్యం. భాషా శాస్త్రజ్ఞులు వాక్య నిర్మాణం చేసే పదాన్ని, పదాంశాన్ని విడగొడతారు. ఒక సామాన్యుడు ఆ ‘అమ్మాయి చాలా అందంగా ఉంది’ అన్నాడు. భాషాశాస్త్ర వేత్త అందం గురించి ఆలోచించకుండా వెంటనే వ్యాకరణం వెతికాడు,ఆ అమ్మాయి అందంగా ఉంటుంది. ఈ వాక్యంలో ‘చాలా’ పదం అవసవరం లేదు అన్నాడు. భావకుడు అందం మాత్రమే చూస్తాడు. అందం ఒక్కటే కావాలి. ఇక మనస్తత్వ శాస్త్రవేత్త అమ్మాయి అందం ఒక్కటే వాటిని వేరు చేయలేము కాబట్టి ఒక పదం చాలు అన్నాడు. వేదాంతి కేవలం మనిషి నిమిత్తమాత్రుడు వాడికి కర్మానుభవం తప్ప మరేమి ఉండదు. కావున అమ్మాయి అందం కూడా అవసరం లేదు అన్నాడు. ఇలా వాక్యం అంతా అదృశ్యమైపోయింది. మూడు ఆదృశ్యాలు ఒక చోట చేరాయి. ప్రపంచీకరణలో ఆర్థిక సంబంధాలు ప్రధానమై యాత్రికమైన పనే తప్ప అందాన్ని వర్ణించటం, కాని అందం గురించి ఆలోచించటం, అనుభవించటం ఈ మూడు కనిపించకుండా పోయాయి అనే వ్యంగ్యభావం వ్యక్తీకరిచబడింది.
“నీళ్ళలో నీడను గిల్లాను/ నొప్పి లేదు గాటు లేదు
రవ్వంత స్పర్శాలేదు/ఒకటి నిన్నటి అనుభవం
ఇంకోటి వాని జ్ఞాపకం నీడ!/మనసున మల్లెల మాలలాగానే/మైక్రోసాఫ్ట్ మజ్జిగన్నం/బుజ్జగింపు ప్రోగ్రామింగ్
వానజల్లులల దోలలూగెను/గుండె కింద తడి కోసం వెతికితే/పాస్ వర్డ్ అడిగింది!/
అమ్మాయి, అందం పునరుక్తి కాదూ/అన్నాడు మనస్తత్వజ్ఞుడు/ అంతా విని తాత్వికుడన్నాడూ /
అనుభవించేవాడు కోరికలు పేరు పెట్టడం అని!”16
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 32 – 33)
డాలర్ పాఠాలు:
యుద్ధమూ మార్కెట్ ‘వ్యాపారానికి అనువైన ప్రదేశం’ ఈ రెండింటి వల్ల అగ్రరాజ్యాలకు ఎప్పుడు లాభం ఉంటుందని సూచించటానికి ‘డాలర్ పాఠాలు’ అనే శీర్షికను కవి పెట్టారు. అవకాశాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలో అమెరికాను చూచి తెలుసుకోవాలని ఈ కవిత సూచిస్తుంది. సంపాదన మార్గం, యుద్ధానికి కారణం. యుద్ధం తీవ్రత, యుద్ధఫలితం, యుద్ధానికి గల ఉద్దేశం అనే ఐదు భాగాలుగా ఈ కవితలో ఉన్న విభాగాలను గుర్తించవచ్చు. డాలర్ అమెరికా కరెన్సీ. యుద్ధంలో ఆయుధాలు అమ్మి డబ్బు సంపాదించడం అవతలి దేశాలపై ఆంక్షలు విధించి తమకు కావలసిన వారికి సరుకు అమ్మించి వారి నుంచి లాభం పొందడానికై, మార్కెట్ కొరకు యుద్ధం చేస్తుంది.
యుద్ధ సమయంలో ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకోవటం తమ దగ్గర మిగిలిపోయిన గోధుమలు వగైరా అమ్ముకోవడం యుద్ధంలోనే మార్కెట్‌ను చూడటం. ఇలా రెండు ముఖాలుగా అమెరికా లాభపడుతుంది. ఇరాక్‌ను చమురు అమ్మకుండా చేసి, కువైట్ నుంచి తక్కువ ధరకు చమురు కొని ఎక్కువ ధరకు విదేశాలకు అమ్మటం, ఇరాక్ అమెరికా యుద్ధంలో అందరికి తెలిసిందే. కువైట్‌కు ఇవ్వవలసిన సొమ్ము కూడా పూర్తిగా చెల్లించలేదని తనకు అప్పు ఇచ్చినట్లుగా అమెరికా చెప్పిందని వార్తలు వచ్చాయి.
కాస్పియన్ సముద్రంలో ఇరాన్ – ఇరాక్‌లకు యుద్ధం కలుగజేసి సహజంగా మిత్రుత్వం ఉన్న ఆ రెండు దేశాలు తలపడేటట్లు చేసి ఇద్దరికి ఆయుధాలు అమ్మింది. ఇరాక్ రసాయనక దాడులకు పాల్పడుతుందని (ఆంత్రాక్స్ గొర్రె వాపు వ్యాధి పౌడర్) ప్రచారం చేసింది. ఇరాన్‌ను నాశనం చేశాక, రసాయనక దాడులు జరిపే సామర్థ్యం ఇరాక్‌కి లేదని, అనవసరంగా దాడి చేశాము అని, నిస్సంకోచంగా ఒప్పుకొంది. ఆప్ఘనిస్థాన్‌లో కూడా వేళ్ళు పెట్టి ఆ దేశాన్ని ధ్వంసం చేసింది. క్లస్టర్లూ సముదాయక నిర్మాణాలు అని కూడా ఆప్ఘనిస్థాన్‌లో లేకుండా చేసింది. మినార్ మినారై కూలటం ఇస్లామ్ దేశ నాశనానికి సంకేతం. యూరప్ అమెరికా వల్ల ఎక్కువ బాధలు పడింది. యూరోపియన్ యూనియన్‌గా ఏర్పడి ‘యూరో’ ను డాలర్‌కు పోటీగా నిలిపి అమెరికా పెత్తనాన్ని అడ్డుకోగల్గింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ను వేరు చేసి యూనియన్ నష్టపోయేట్టుగా ‘బ్రెజిల్’ ప్రయత్నంతో అమెరికా సఫలం అయింది.
“ఆయుధాలు అమ్మకాల్లోయ/తయారైన నిన్నటి వ్యూహం
కాస్పియన్ ఆయిల్ లైన్లో/ నిద్రలేచిన మార్కెట్ ఉగ్రవాదం
మిత్రుల్ని శత్రువుల్ని చేసింది/యోధుల్ని ఉగ్రవాదుల్ని చేసింది
డాలర్ రక్తదాహపు ఆకలి క్రౌర్యాన్ని చిమ్ముతోంది/ఒక చెత్తో దీవిస్తూ ఒక కాలితో మట్టగిస్తూ
రెక్కల చాటున/ రొట్టెలే కాదు క్లస్టర్లూ రాలతాయి
శిధిలాలతో పాటు శిభిరాలు వెలుస్తాయి/దేశం వలసపోతుంది
జీవితం మీనారై కూలుతుంది/రెప్పలమాటున పసితనం జారుతుంది
తూర్పున కన్నీరు సుడులు తిరుగుతోంది/ఏకధ్రువాన్ని ముంచెత్తే ఉప్పెన వ్యూహం రచిస్తోంది.
మట్టి కాళ్ళను కరిగించే/గాలివాన రూపుదిద్దుకుంటుంది” 17
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 34 – 35)
మహోగ్ర ప్రతిఘటన:
అమెరికా యుద్ధోన్మాదాన్ని వర్ణించిన కవిత. నిరంకుశత్వంతో, ఏకదృవ ప్రపంచంతో అమెరికా ఆగడాలు పెరిగిపోయాయి. స్వాతంత్ర ఆలోచన పాదర్శకత అనేది లేనంత కాలం సోవియట్ రష్యా కూడా బలవంతపు శక్తిగా ప్రతిఘటించి నిలిచింది. ‘గోర్భచెవ్’ పాలనతో పై రెండు స్వేచ్ఛలు ప్రజలు చవిచూశారు. 1985 నుండి సోవియట్ వ్యవస్థలో ఉదారవాద సంస్కరణలను అమలు చేయాలని ప్రయత్నించిన చివరి సోవియెట్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్ ఆర్థిక స్తబ్దత కాలం ముగిసే ప్రయత్నం, ప్రభుత్వ ప్రజాస్వామ్యం కొరకు గ్లస్నోస్ట్ (ఓపెన్నెస్), పెరెస్ట్రోయిక (పునర్నిర్మాణ) విధానాలను ప్రవేశపెట్టాడు. తర్వాత సోవియట్ యూనియన్ అనేక చిన్న దేశాలుగా విడిపోయింది. ఏకధృవ ప్రపంచం అమెరికా చుట్టూ ఏర్పడింది. అది బలహీన దేశాలను నెమ్మదిగా నాశనం చేయటం మొదలు పెట్టింది. జార్జ్‌బుష్ (సినియర్) ఇరాక్ యుద్ధం మొదలు పెట్టారు. అప్పటినుండి ముస్లిము దేశాలను క్రమంగా దుర్భలం చేశాడు. ఇజ్రాయేల్‌కు శక్తి సమకూర్చి లెబనాన్, పాలస్తీన ఉద్యమాలను అణగద్రోక్కి ముస్లిమ్‌లకు అపకారం చేశారు. ఆప్ఘనిస్తాన్‌లో సాంప్రదాయ ముస్లిమువాదం తలెత్తితే ఆ ప్రాంతాన్ని నాశనం చేశాడు. ఇలా ఎన్నో పేదదేశాలు, ముస్లిము దేశాలు అమెరికా చేతిలో దెబ్బతిన్నాయి. కాని ప్రతిఘటనలో కొన్ని చోట్ల గట్టి తిరుగుబాటులో అమెరికా వెనుకకు తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు అమెరికా నుంచి ముస్లింలను సీనియర్ బుష్ బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత దేవుడిదే అని కవితలో కవి తెలియజేశాడు.
“మంచుగడ్డ మహాసౌధంలో/ మట్టి పెళ్ళలా నేలకూలింది
ఆకాశ హర్మానాల్లో రొమ్ము విరిచిన కొండ చిలువ/ సొమ్మసిల్లి విలవిలా తన్నుకుంటోంది
తెల్లజాతి దుర్భేద్యపు చేపన్ను పెంటగాన్/కీళ్ళు విరిగిన కుక్క పిల్లలా మూలుగుతోంది
బక్క ప్రపంచపు పక్కటెముకల్ని ఆరగించి/ బలిసిన ఏకధ్రువ ప్రపంచం
తోక చుక్కలా రాలిపడింది/విజయగర్వ వికటాట్టహాసాలతో ఎగిరిన శ్వేత జాతీయ పతాకం
రెక్క తెగిన పక్షిలా రక్తమోరుతూ గిరికీలు కొడుతోంది/దేవుడా!
దిమ్మదిరిగిన అమెరికా యుద్ధోన్మాదం నుంచి/ఆఫ్ఘానిస్తాన్ కాపాడు. ముసల్మాన్లను కాపాడు,
అన్నిటికన్నా జార్జిబుష్ నుంచి అమెరికా ప్రజలను కాపాడు”18.
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 38 -39)
డాలర్ యుద్ధం:
డాలర్ కొరకు మార్కెట్ సృష్టించుకోవటానికి ముస్లిము వ్యతిరేకత చూపటానికి అమెరికా దుర్మార్గానికి పకారాష్ఠ ఆఫ్ఘాన్ పై దాడి. ఏ ఆయుధము ప్రయోగం తెలిసిన సైన్యం లేని ఆఫ్ఘాన్ పేదదేశాన్ని కూడా అమెరికా కరుణించ లేదు. రష్యా పరపతి పెరగడానికి ఆఫ్ఘానిస్తాన్ కారణం అవుతుందేమో అని అనుమానం, ఒక ప్రక్క బాధిస్తుంటే లాడెన్ తలదాచుకొన్నాడనే అనుమానం కూడా అమెరికాను వెంటాడి ఆఫ్ఘాన్ పై దాడి చేయించింది. ఆఫ్ఘానిస్తాన్‌లో ఏమి తెలియని అమాయకులే ఎక్కువమంది గాయపడ్డారు. మరణించిన వారి కంటే గాయపడిన వారి పరిస్థితి దీనంగా ఉంటుంది. వికలాంగులు కావటం, వైద్యం చేయించుకొనే స్థోమత, వసతులు లేకపోవటం కారణంగా క్షతగాత్రుల కష్టాలు పెరుగుతాయి. బాధతో మరణిస్తే కొంత వరకు అదృష్టవంతుడనే చెప్పాలి. కవికి ఈ క్షతగాత్రులు బాధలు కవి మనసుకు కష్టాన్ని కల్గించాయి. అమెరికా కులం, మతం అని ఏదేదో పేరు పెట్టి తన పెత్తనాన్ని, వ్యాపారాన్ని పెంచుకొంటూ పోతుంది. మానవ జాతే కాకుండా కరుణ, ప్రేమ కూడా ధ్వంసమైపోతుంది. డాలర్‌తో యుద్ధం మనసుల్ని చంపుకోక తప్పదు. ఇప్పుడు ఎవరు ఎవరిపై యుద్ధంచేసిన చివరికి ప్రపంచ యుద్ధం వస్తుందో తెలియదు.కాని శాంతి కాములకు ఇక్కడ చోటు ఉండదు.
“అనంతమైన స్వేచ్ఛ కోసమే కాదా! / యుద్ధ క్షేత్రంలో డాలర్ కత్తుల నుండి రక్తం కారుతున్నది!
నిద్రరాని ఈ నులక మంచంలో/అప్ఘనిస్తాన్‌లో కూలిన మట్టిగోడలా మనసు
భూగోళం మీద మరణించిన మనుషులకన్నా/చావబోయే క్షత్రగొంతుల్ని రక్షింమచమని
కొంగుచాపి యే తుపాకి తూటానడగాలో తెలయదు/నా లోలోపల జీవించే
విశ్వమానవుని తలమీద నర్తిస్తున్నది బీభత్స హింసాశూలమే/అనంతమైన స్వేచ్ఛ కోసమే కదా!
ప్రపంచ ప్రజల చెరువులో వలలు వేస్తున్నది/ఇప్పుడు యే దేశాం వల్ల గండమో తెలియదు కానీ
జలచరాలకు జలగండాలు తప్పవు/ విశ్వమానవ స్వాప్నికులారా!
యుద్ధ చెరసాలకు పట్టుబడకుండా బతకండి/
పట్టుబడకుండా బతకండి” 19.
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 40 – 41)
మరణించాక కూడా:
ప్లాబో నెరుడా కమ్యూనిస్టు ఉద్యమాన్ని బోధించిన రష్యాకవి. విదేశంలో పుట్టిన రష్యన్ గడ్డపై పెరిగి ఉద్యమ కవిత్వం రాసి నోబుల్ బహుమతి పొందిన రచయిత.20వ శతాబ్దం నాటికి చెందిన అతడి భావాలు ఆదర్శంగా తీసుకొని కవి ఈ కవిత రచించినట్లు కవితలో నెరుడా కవితా పంక్తులను ప్రమాణంగా తెల్పడాన్ని బట్టి తెలుస్తుంది. తిరిగి పుట్టడానికే జన్మించాను అనే నెరుడా కవిత వాక్యంతో కవిత మొదలవుతుంది. ఒక జన్మ ఉన్నా తిరిగి పుట్టడం ఏమిటి ఇక్కడ తిరిగి పుట్టడానికి భారతీయ విశ్వాసానికి రావాలి. మరణించినవాడు తిరిగి పుడతాడు కాబట్టి మరణించడానికే పుడుతున్నాడని భావం. ఎప్పుడు ఎలా మరణిస్తారో ఎవరికి తెలియదు. కాని ధైర్యంగా ఎప్పుడైన చావును స్వాగతించడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు ఇద్దరే ఒక్కడు సైనికుడు, రెండవవాడు పరిపక్వత పొందిన వేదాంతి. ఇక్కడ వేదాంతి అవసరం లేదు. కాబట్టి విప్లవకారుడి నినాదమే ఇది. కవి విప్లవ యోధుల్ని ఉద్దేశించి ఈ వాక్యాలు చెప్పుతున్నారు. చైతన్యవంతులువారి ఆశయం సాధించాలనే బలమైన సంకల్పంతో ముందుకు వేళ్ళాలనీ, వారు వివిధ ప్రాంతాలలో విస్తరించి పల్లెలలో కలిసిపోయి కాగడాలు చేతపట్టి వెళ్తున్నారు. ఈ పోరాటంలో వీరులు ఎవరైన మరణిస్తే ముందుగానే చెప్పినట్లుగా మళ్ళీ జన్మించటానికే. ఇలా ఒక్కొక్క వీరుడు మరణించిన ప్రతిసారి ఈ సత్యం రుజువు అవుతుంది. ఇక విప్లవం ఎలా కదులుతుందో, విప్లవకారులు ఎంత స్వేచ్ఛగా వెళ్తున్నారో చెప్పటానికి రైతులు, రైతు కూలీలు, నీటికాలువులు, పాడి పశువులు అన్ని సాక్షులే.
విప్లవ విశ్వాసాన్ని వ్యాప్తి చేసే మీ సాక్ష్యం గొప్పది. ఉద్యమంలో చేరినప్పుడే మరణానికి సిద్ధపడ్డారు అని ప్రపంచీకరణలో దాస్యం చేసే భావం పెరిగిపోయింది. అలాంటి బ్రతుకులు బ్రతుకుకాదని, చైతన్యవంతులు చిందించిన ప్రతి రక్తపు బొట్టు తొలకరి విత్తనాల గింజలు లాగా అనేక మంది చైతన్యవంతులు పుట్టుకకు కారణం అవుతుందనీ, తిరిగి వీరికి బ్రతుకునిస్తుందనే, నెరుడా మాట దీనికి ఉద్ధరణగా కవి చూపాడు. విప్లవంలో చేరిన నాటినుండి వీరుడు మార్పునే కోరుకొంటాడు. చివరికి తన సొంత గుర్తింపు చిహ్నం అయిన పేరును త్యాగం చేసి ఉద్యమానికి అనుకూలమైన పేర్లు పెట్టుకొంటారు. అలాంటి వారి చావుకైన గర్వపడాల్సిందే అని కవి నెరుడా కవితను ప్రమాణంగా చూపిస్తారు.
“I was born to be born” Neruda
పూవుల్లో కూడుకుంటున్న/తేనంత నిశ్శబ్దంగా మధురంగా/మీరు ప్రజల్లో యిమిడిపోయారు.
ఆ ఆకులు మీద చినుకులు రాలుతున్నంత/సౌందర్యభరితంగా,
ఆర్థ్రంగా అమేయంగా అల్లుకుపోయారు./ ఓ నా స్వప్న ఖచిత కిరీట ధారుల్లారా!
ఓ నా వీర యోధుల్లారా! నా వర్ణ ప్రపంచంల్లారా!/విరిగి పడటమంటే పైకి లేవడమనీ
మరణించటమంటే జన్మించటమనీ/ఎన్నెన్నిసార్లు, ఎన్నెన్ని తీర్లు రుజువు చేశారు
దృష్టాంతం చేశారు. దృశ్యమానం చేశారు….
“A Drop of Blood has fallen on these lines
will remain living upon them of Love”- Neruda
పరివర్తన, పరివర్తన/అంతా పరివర్తన పరిణామం
పరిణామం పరిపక్వమౌతుంది/యుద్ధం అనివార్య మౌవుతుంది.
“I am proud of their death/
I am proud of their Live’sNeruda”20
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట:42,43, 45)
ఐనవాళ్ళం:
స్త్రీజీవితంలో ఎన్ని విధాలుగా అవమానాలను భరిస్తుందో, ఎన్ని కష్టాలను పడుతుంతో, సమాజానికి ఎలా ఉపయోగపడుతుందో, అంతే సమాజం నుంచి నిరాదరణకు గురౌతుందని విమర్శించే స్త్రీ వాద కవిత ఇది. అన్ని దశల్లో స్త్రీ అనుభవించే కష్టాలను కవితలో కవయిత్రి విపులంగా వర్ణించారు. పెళ్ళి అయి నాలుగు గోడలు మధ్య పరిమితం అయితే, పురుషులు స్త్రీ మనోభావాలను గుర్తించకుండా కామ ప్రవృత్తిని చూపితే దేహం మాత్రం మిగిలిన కోరికగా స్త్రీ మిగిలింది. అలాగే ఇల్లు కాస్త సర్దినట్లు కన్నపడకపోయిన దోషం ఇళ్లాలిది అనే సామెతలు పుట్టాయి. పనుల్లో నలుగురు ఉన్నప్పుడు కాలకృత్యాలకు వేళాల్సి వచ్చిన మోహమాటానికి కూర్చునే ఓర్పు కలిగినది అని ప్రసంసలు పొందింది. పిల్లలను కనే శారీరక బాధలను అనుభవించి దొడ్డ ఇల్లాలు అయింది. భర్తదే లోపం అయినా గొడ్రాలు అనే నిందను భరించింది. పెద్దయ్యాక పిల్లలు పోషించలేక వదిలివేస్తే వృద్ధాశ్రమంలో గడపటానికి కూడా సిద్ధపడింది.
ముస్లిములలో తాలిబన్లు పెట్టిన హింసలకు ఆంక్షలకు అంతే లేదు. ఒక ఇల్లాలిగా చేసే చాకిరికి అంతులేదు. వారిని ప్రేమించలేదని కోపంతో యువతులపై యాసిడ్‌ను పోసిన వాళ్ళున్నారు. ఇది ఇలా ఇంట్లోనే కాదు ప్రభుత్వం కూడా చిన్న చూపు చూసింది. చట్ట సభలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశ పెట్టకుండా పార్టీలే అడ్డుకొన్నాయి. కనీసం మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తాము అని ఎన్నికల మానిఫేస్టోలలో కూడా చెప్పలేక పోతున్నారు. ఇలా తల్లిగా, భార్యగా మాత్రమే స్త్రీకి గుర్తింపు ఉన్నదని దీనిని తిరుగుబాటు చేసి తొలగించుకోవాలి అని స్త్రీకి ఇంట, బయట, ప్రభుత్వ పరంగా సర్వరంగాలలో తన ఉనికినికి గుర్తింపు పనికి, సేవకి ధైర్యానికి, గౌరవం ఇవ్వాలని రచయిత్రి బోధిస్తారు.
“ఆస్తి హక్కుల్ని, మహిళా బిల్లుల్ని కోరి/అపహాస్యం చేయబడే ఆకాశంలో సగాలమయ్యాం
నేతల్ని గెలిపించే ఓటర్ల మయ్యాం/నరకాన్ని అనుభవించి
సుఖానిచ్చిన ధర్మపత్నులమాయ్యాం/కనిపెంచిన సంతాన జనన పట్టికలో
‘మదర్ ఆఫ్’ అని లేని అనామక తల్లులమయ్యాం/సంఘర్షణల్లో అవిశ్రాంత తీరాల మయ్యాం
జన్యు సందేశం కదిపిన వేర్లలోకి మళ్ళీ వెళదాం/ఎరుపు, తెలుపు, నలుపు
జాతి, మతం, కులం లేని అసలు జ్ఞానంలోకి చొరబడతాం/ఆధిక్యతల వలయాలల్లో
విరిగిన శోక ఆకాశాలు, శోకించిన నేల/
ఉప్పొంగిన సముద్రాల వైపుకు మళ్ళీ దృష్టిని మరల్చుదాం” 21
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 47 – 48)
దృష్టి మాత్రమే :
ఈ కవిత తాత్త్విక దృష్టితో రచించిన కవిత. మరణతత్వం అంటే ఏమిటి? మరణిస్తాను అనే భయం లేకపోవడమే. సాదాగా బ్రతికే వాడికి ఏ కొంచెం కష్టం వచ్చినా, రోగం వచ్చినా మరణభయం పట్టుకుంటుంది. మరణించటం కంటే మరణభయం అనే ఆలోచనే భయంకరమయినది. బ్రతుకు దుర్భరమయినప్పుడు ఇక బ్రతకలేరేమో అని, ఈ కష్టాలకు విముక్తి కలుగుతుందేమో అని ఆశ పుడుతుంది. ఇలా బ్రతికేవాడు చావుకి, బ్రతుకుకి కూడా భయపడతాడు. ఈ భయం అనేది దృష్టిలో భేదం మాత్రమే అని, నీ ప్రమేయం లేకుండా కాలమే అంతా జరిపిస్తుందని, దాని కోసం భయపడవలసిన అవసరం లేదునీ, భయాన్ని వదలడమే అమృతత్వం అని, భయమే మృత్యువు అని, భయాన్ని జయించినవాడు మృత్యుంజయుడు అని వేదాంత సందేశాన్ని కవి ఈ కవితలో సూచిస్తారు.
పరిక్షిత్తు శృంగి శాపంతో ఏడు రోజులలో మరణిస్తాడు అని భయపడుతూ ఉంటే శ్రీ శుకమహర్షి పరీక్షిత్తు దగ్గరకు వచ్చి, ఏడు రోజులు చాలా ఎక్కువ కాలమే, గట్టిగా మనస్సును ఒక ఘడియ కాలం భగవంతుని మీద లగ్నం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పరీక్షిత్తుడు ఏడు రోజులు నిశ్చింతగా భాగవతం విని, కైవల్యం పొందాడు. అలాంటి తత్త్వ ధైర్యమే ఈ కవితలో కనిపిస్తుంది. వసంతం వచ్చినా మళ్ళీ శిశిరం రాగానే మోడు అయిపోతుంది. చావు పుట్టుకలు కేవలం భయాలు మాత్రమే. ఈ ఆత్మను, శరీరాన్ని ఒకటని భ్రమింప చేసి మోక్షానికి దూరం చేస్తాయి. కాని జనన మరణాలను సమ దృష్టితో చూస్తే ఆ జ్ఞానాన్ని ఏ స్పర్శ అడ్డుకోలేదు అనే తాత్త్వికత ఈ కవితలో కనిపిస్తుంది.
“చెట్లు చిగురిస్తాయి పూలు పూస్తాయి/పుష్పదళాలతో, పత్రాలతో చెట్లు వికసించి
వేలస్వరాలతో జీవనోత్సవ సంగీతం పాడతాయి/రుతువులు మారతాయి పుష్పాలు రాలిపోతాయి
పత్రాలు వాడిపోతాయి/ఏదో విషాద స్వరాలు
క్రమంగా ఏదో మహానిశ్వబ్దంలోకి తరలిపోతాయి/ఒకసారి నన్ను జీవితం భయపెడుతుంది
మరోసారి మరణం భయపెడుతుంది/రెండుబయలు ఒకే వలయమై
నన్ను తమలోకి లాగుతుంటాయి/నన్ను, నా నుండి వేరుచేసే ప్రయత్నమేదో చేస్తుంటాయి
చూస్తూ వుండగానే సృష్టి, నేను పొగమంచు వలే కరిగిపోతాము/దృష్టి ఒక్కటే
ఏది తాకలేని ఆకాశంలా/ఆకాశమంత సూర్యునిలా ప్రకాశిస్తుంది…” 22
(దశాబ్ది కవిత (2001 – 2010) – సం- డా.ఎస్వీ. సత్యనారాయణ గారు, డా.పెన్నా శివరామకృష్ణ – పుట – 50 -51)
ముగింపు-
వచన కవిత్వంలో కవులు ఈ సంవత్సరాల కాలంలో అనేక వస్తువులపై తమ అభివ్యక్తీకరణ నైపుణ్యంతో కవిత్వ రచన చేశారు. 2001 వచన కవిత్వలో అనేక ధోరణులు ప్రముఖంగా నిలిచాయి. స్త్రీ సాధికారతపై దృష్టి సారించారు కవులు. స్త్రీ వాద కోణంలో స్త్రీ ఇంటి నుండి సమాజం వరకు అనేక కోణాల నుండి తాను పొందిన అనుభవాలను కవితా వస్తువుగా గ్రహించి పాఠకులను ఆలోచింపచేశారు. అటు స్త్రీవాద కవయిత్రులతో పాటు కవులు కూడ స్త్రీ వాద కవిత్వం వ్రాయటం గమనించవచ్చు. అన్ని రంగాలలో స్త్రీకి గౌరవ స్థానం కల్పించి ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాలలో సమాన స్థాయి కల్పించాలని నిర్ధిష్టంగా తెలియజేసింది ఈ కాలంలోని స్త్రీవాద కవిత్వం.
దేశంలో ఉన్న భిన్న పరిస్థితుల దృష్ట్యా ముస్లింలపై ఉన్న అల్పసంఖ్యాకులు అనే భావన 1991 నుండి బలపడి ముస్లిం, మైనార్టీవాద కవిత్వంగా ముందుకు వచ్చింది. వారి కవిత్వ ధ్యేయం వారి అభివృద్ధి మరియు వారిపై ఉన్న మూల భావనలు తొలిగిపోవాలనేదే, కొంత నెరవేరినప్పటికీ నేటి పరిస్థితుల దృష్ట్యా అది కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రపంచీకరణ మానవ కేంద్రీకృత అన్ని రంగాలలో ప్రభావం చూపింది. విద్య నుండి వ్యవసాయం వరకు దీని పర్యవసానాలకు బలైనవని చెప్పవచ్చు. ఈ నేపథ్యం నుంచి అటు మార్కిస్టు దృక్పథ, సామ్యవాద భావజాల కవులు ఈ ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం ఈ కాలంలో రచించారు. ప్రపంచీకరణ నేపధ్యంలోనే అమెరికా సామ్రాజ్యవాదాలోచనలతో చేసిన, నేటికి చేస్తూన్న యుద్ధాల విధ్వంసంకు వ్యతిరేకంగా ప్రపంచ రక్షణకు, శాంతి చైతన్యాన్నీ మేల్కొపే విధంగా కవిత్వ రచన చేశారు.
ప్రపంచీకరణ దుష్ప్రభావాలతో కుదేలైనా చేనేత పరిశ్రమను తెలిపే కవితలు కూడా ఈ కాలంలో చూశాము. విప్లవ ఉద్యమ నేపథ్యంతోకొంతమంది వ్యక్తులపై స్మృతి కవిత్వం వచ్చింది. ఈ కాలంలోనేపేదరికంతో ఛిద్రమైన జీవనం సాగించే అడవి బిడ్డలైన గిరిజనుల సమస్యలను, వారి జీవనంలోకి అక్రమంగా వచ్చిన ప్రపంచీకరణ, సరోగసి(అద్దెగర్భం) పేరుతో జరిగిన ఒప్పందాలు,గిరిజన మహిళల జీవిత వ్యథనుకవయిత్రి కవితా వస్తువుగా చేసుకొని చేప్పారు. ప్రభుత్వ విస్మరణకు గురై అభివృద్ధికి నోచుకోని ఆదివాసుల గురించి కవిత్వీకరించారు.
పాదసూచికలు-
- బహుజనపల్లిసీతారామాచార్యులు- శబ్ద రత్నాకరము – పుట- 977
- బూదరాజు రాధాకృష్ణ – ఆధునిక వ్యవహార కోశం- పుట – 77
- తెలుగు అకాడమీ ప్రచురణ – తెలుగు – తెలుగు నిఘంటువు–పుట- 238
- శంకర నారాయణ తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు-పుట- 345
- ఎస్.ఎస్.నళిని- సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ – 247
- పాపినేని శివశంకర్ – సాహిత్యమౌలికభావనలు – పుట – 78
- ముదిగొండ వీరభద్రయ్య- విమర్శ, కళాతత్త్వ శాస్త్రాలు – పుట – 201
కవిత పేరు కవి పేరు ప్రచురణ కాలం
- శీతాకాలంరాత్రి మందరపు హైమావతి 11-2-2001
- కొంచెం స్వప్నం – కొంచెం సత్యం యం. యస్. సూర్యనారాయణ25-2-2001
- కన్నీటి సవ్వడి డా.పగడాల నాగేందర్ మార్చి 2001
- మహాబోధి డా.పాపినేని శివశంకర్ మే – 2001
- విరిగిన మగ్గం భగ్వాన్ ఏప్రియల్ 2001
- టైం అండ్ స్పేస్ యస్. జయ 20-5-2001
- బిడ్డ సంచులు డా.చల్లపల్లి స్వరూపారాణి 24-6-2001
- గది డా.నవిమెల భాస్కర్ 08-7-2001
- మూడు అదృశ్యాలు ప్రసేన్ 19-8-2001
- డాలర్ పాఠాలు జి. వెంకటకృష్ణసెప్టెంబర్ 2001
- మహోగ్ర ప్రతిఘటన జె.గౌతమ్ 7-10-2001
- డాలర్ యుద్ధం డా.నాగేశ్వరం శంకర్ అక్టోబర్ 2001
- మరణించాక కూడా కె.శివారెడ్డి నవంబర్ 2001
- ఐనవాళ్ళం శిలాలోలిత 2001
- దృష్టి మాత్రమే బి.వి.వి. ప్రసాద్ 2001
ఉపయుక్త గ్రంథాలు:
- సీతారామాచార్యులు బహుజనపల్లి.శబ్దరత్నాకరం నిఘంటువు.హైదరాబాద్.విశాలాంధ్ర పబ్లికేషన్.1995.
- రాధాకృష్ణ బూదరాజు – ఆధునిక వ్యవహారిక కోశం.హైదరాబాద్. విశాలాంధ్రపబ్లిషింగ్హౌస్.2011.
- నళిని ఎస్.ఎస్ – సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ – నవోదయ బుక్ హౌస్ -2021.
- శివశంకర్పాపినేని – సాహిత్యం- మౌలిక భావనలు.గుంటూరు.పాపినేని ప్రచురణలు.1996
- వీరభద్రయ్య ముదిగొండ.విమర్శ, కళాతత్త్వ శాస్త్రాలు.హైదరాబాద్. తెలుగు అకాడమి.2012.
- ప్రొ. ఎస్వీ సత్యనారాయణ – డా.పెన్నా శివరామకృష్ణ- దశాబ్ది కవిత (2001-2010),
హైదరాబాద్.విశాలాంధ్ర పబ్లికేషన్.2014.
-డా. పోల బాల గణేశ్,
పి.జి.టి. తెలుగు,
ఎ.పి.ఆర్.ఎస్. పులిగడ్డ,అవనిగడ్డ, కృష్ణా జిల్లా.
చరవాణి- 9704555450.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~